'జో' (హాట్ స్టార్) మూవీ రివ్యూ

Joe

Movie Name: Joe

Release Date: 2024-01-15
Cast: Rio Raj, Malavika Manoj,Bhavya Trikha, Charle, Shriram, Praveena
Director:Hariharan Ram
Producer: Arulanandhu
Music: Siddhu Kumar
Banner: Vision Cinema House
Rating: 2.50 out of 5
  • తమిళంలో రూపొందిన 'జో'
  • కాలేజ్ క్యాంపస్ లో సాగే లవ్ స్టోరీ 
  • ఫీల్ కి .. ఎమోషన్స్ కి ప్రాధాన్యత  
  • నవంబర్ 24న థియేటర్స్ కి వచ్చిన సినిమా 
  • ఈ నెల 15 నుంచి మొదలైన స్ట్రీమింగ్

యూత్ ను ఎక్కువగా ప్రేమకథలే ఆకట్టుకుంటూ ఉంటాయి. అందువలన ప్రేమకథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కంటెంట్ లో ఫీల్ ఉంటే చాలు, భాషా .. ప్రాంతం అనే భేదాలు లేకుండా ప్రేమకథా చిత్రాలకు భారీ విజయాలను అందించడం ప్రేక్షకులకు అలవాటు. అలాంటి ప్రేక్షకులను అలరించడం కోసం రూపొందిన మరో ప్రేమకథనే 'జో'. తమిళనాట నవంబర్ 24వ తేదీన విడుదలైన ఈ సినిమా, తెలుగు వెర్షన్ తో పాటు నిన్నటి నుంచి 'హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 



కోయంబత్తూర్ కాలేజ్ లో 'జో' ( Rio Raj) చదువుకుంటూ ఉంటాడు. అతనికి ఐదుగురు స్నేహితులు ఉంటారు. ఎక్కడికి వెళ్లినా అంతా కలిసే వెళుతూ ఉంటారు. అదే కాలేజ్ లో కొత్తగా సుచిత్ర (మాళవిక మనోజ్)  జాయిన్ అవుతుంది. ఆ క్లాస్ లో ఆమె ఒక్కతే మలయాళం నుంచి వచ్చిన అమ్మాయి. అందువలన ఆమె ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. తనని లవ్ చేయమంటూ కేరళకి చెందిన ఒక సీనియర్ ఆమెను వేధిస్తూ ఉంటాడు. ఆ విషయంలో అతనికి బుద్ధి చెప్పిన జో, ఆమెకి దగ్గరవుతాడు. 

జో - సుచిత్ర మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి చేరుకుంటారు. ఆ కాలేజ్ లో చదువు పూర్తి కావడంతో, మాస్టర్ డిగ్రీ పూర్తయిన తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే సుచిత్రకి ఆమె పేరెంట్స్ వేరే వ్యక్తినిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. దాంతో ఆమె 'జో'కి కాల్ చేసి విషయం చెబుతుంది. 'జో' దూకుడు గురించి తెలిసిన ఆమె, కోపాన్ని పక్కన పెట్టి వచ్చి, తన తండ్రితో మాట్లాడమని అంటుంది.

 వెంటనే 'జో' ఆమె ఊరికి చేరుకుంటాడు. ఆమె తల్లిదండ్రులతో తన మనసులోని మాటను చెప్పడానికి ప్రయత్నిస్తాడు. దాంతో వాళ్ల దగ్గర బంధువులు 'జో'పై చేయి చేసుకుంటారు. ఆ పెనుగులాటలో సుచిత్ర తండ్రి పడిపోతాడు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన సుచిత్ర 'జో' తొందరపడ్డాడనుకుని అతనిపై సీరియస్ అవుతుంది. ఇకపై తనని కలిసే ప్రయత్నం చేయవద్దని అంటుంది. నిజం చెబుతున్నా ఆమె పట్టించుకోకపోవడంతో అతను వెనుదిరుగుతాడు. 

అలా అతను తన ఊరు తిరిగొచ్చిన కొన్ని రోజులకే, ఆమె పెళ్లి మరొకరితో నిశ్చయమైందని తెలుస్తుంది. ముహూర్తం సమయానికి తనని అక్కడికి చేర్చమని అతను స్నేహితులను కోరతాడు. అక్కడ ఏం జరుగుతుందోననే ఆందోళనని వాళ్లంతా వ్యక్తం చేస్తారు. అయినా అతను వినిపించుకోకపోవడంతో అక్కడికి తీసుకెళతారు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ సంఘటనతో 'జో' లైఫ్ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది మిగతా కథ.

కాలేజ్ నేపథ్యంలోని ప్రేమకథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే 'ప్రేమ' అనే రెండు అక్షరాలు ఎప్పుడూ కొత్తగా కనిపిస్తూనే ఉంటాయి .. వినిపిస్తూనే ఉంటాయి. అందువలన ఈ తరహా కంటెంట్ కి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఈ  కారణంగానే  ఈ జోనర్లో ఎక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల జాబితాలో 'జో' కూడా ఒకటిగానే చెప్పుకోవాలి. ఈ కథలోను అల్లర్లు .. అలకలు .. గొడవలు .. అపార్థాలు .. సారీలు కనిపిస్తాయి.

గతంలోని సినిమాల మాదిరిగానే ఈ సినిమా ఉంటే చూడవలసిన అవసరం ఏముంది? అనే సందేహం తలెత్తడం సహజం. ఈ సినిమాలో ఒక కొత్త పాయింట్ ఉంది. తీపి జ్ఞాపకం మాత్రమే కాదు .. చేదు అనుభవాన్ని కూడా అంత తేలికగా మరిచిపోలేమనేది ఆ పాయింట్. ఈ రెండు అంశాలను పట్టుకునే ప్రధానమైన కథ పరుగులు పెడుతుంది. ఈ రెండు ట్రాకులకు ఎలాంటి ముగింపు ఇచ్చారనేదే ఆసక్తికరమైన విషయం. 

ఈ కథలో ఎక్కడా ఎలాంటి హడావిడి కనిపించదు. సాదాగా .. సాఫీగా అలా సాగిపోతూ ఉంటుంది. చివర్లో కాస్త ఎమోషనల్ ఎక్సర్ సైజ్ ఎక్కువగా కనిపిస్తుందంతే. సహజత్వానికి దగ్గరగా పాత్రలు పరిగెడుతూ ఉంటాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. రాహుల్ విఘ్నేశ్ ఫొటోగ్రఫీ .. సిద్ధూ కుమార్ సంగీతం .. వరుణ్ ఎడిటింగ్ ఈ కథను వాస్తవానికి చాలా దగ్గరగా తీసుకుని వెళతాయి. 

 సన్నివేశానికి తగిన సంభాషణలు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. 'నాన్న .. నీకు నచ్చలేదు గనుక అతనిని వద్దనుకుంటున్నాను .. అతను లేకుండా బ్రతకలేను గనుక ఈ జీవితాన్ని వద్దనుకుంటున్నాను' అనే డైలాగ్ ఎమోషనల్ గా బలంగా తాకుతుంది. 'అప్పుడే పుట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకుని తల్లి మురిపెంగా చూస్తుందే .. అదిరా లవ్ ఎట్ ఫస్టు సైట్' అంటే అనే డైలాగ్ ఈ సినిమా మొత్తానికి హైలైట్.

'స్నేహం చేస్తే ఏ పరిస్థితుల్లోనైనా అండగా నిలబడాలి. ప్రేమిస్తే నమ్మకంతో చేయి పట్టుకోవాలి. పెళ్లి చేసుకుంటే చివరి వరకూ ఆ చేయిని వదిలిపెట్టకుండా ఉండాలి' అనే సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చిన కథ ఇది. ఈ కథలో విలన్ ఉండడు .. పాటలు ఉండవు. కథనంలో వేగం కూడా ఉండదు. దర్శకుడు సహజత్వానికి పెద్ద పీట వేస్తూ తాను చెప్పదలచుకున్న విషయాన్ని తాపీగా చెప్పుకుంటూ వెళ్లాడు. యూత్ కి ఈ సినిమా కనెక్ట్ కావొచ్చునేమో!

Trailer

More Reviews