మలయాళంలో ఈ ఏడాది మమ్ముట్టి నుంచి వచ్చిన సినిమానే 'కాథల్ - ది కోర్'. మమ్ముట్టి సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి 'జియో బేబీ' దర్శకత్వం వహించాడు. 12 ఏళ్ల తరువాత మలయాళంలో జ్యోతిక చేసిన సినిమా ఇది. నవంబర్ 23వ తేదీన విడుదలైన ఈ సినిమా, అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా తాజాగా 'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
మాథ్యూ (మమ్ముట్టి)కి ఆ ఊళ్లో పెద్ద మనిషిగా మంచి పేరు ప్రతిష్ఠలు ఉంటాయి. ఆ ఊళ్లో జరిగే బై ఎలక్షన్స్ లో అతనిని నిలబెట్టడానికి అంతా ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది ఉద్దేశం అదే కావడంతో కాదనలేక అతను అంగీకరిస్తాడు. 'ఓమన' (జ్యోతిక) .. తండ్రి దేవస్సీ (పణికర్) .. కూతురు ఫెమీ (అనఘ) ఇదీ అతని కుటుంబం. కూతురు హాస్టల్లో ఉంటూ వేరే చోట చదువుతూ ఉంటుంది. మిగతా ముగ్గురు మాత్రమే ఆ ఇంట్లో ఉంటూ ఉంటారు.
ఆ ఊళ్లో ఎన్నికలకు సంబంధించిన పనులు జోరందుకుంటాయి. మాథ్యూ ఆ పనుల్లో తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలోనే అతనికి కోర్టు నుంచి నోటీసులు అందుతాయి. విడాకులు కోరుతూ అతని భార్య 'ఓమన' పంపించిన నోటీసులు అవి. తన భర్త 'గే' కావడం వలన .. కొన్నేళ్లుగా అతను తనతో గడిపినది కొన్ని రోజులే కావడం వలన అతని నుంచి విడాకులను కోరుతున్నట్టుగా ఆ నోటీసులతో ఆమె పేర్కొంటుంది. అది చదివిన మాథ్యూ బిత్తరపోతాడు.
ఆ ఊళ్లో డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్న రంగన్న (తంకన్)తో మాథ్యూకి చిన్నప్పటి నుంచి సంబంధం ఉందని ఆమె ఆ నోటీస్ లో పేర్కొంటుంది. దాంతో ఈ వార్త ఆ ఊళ్లో గుప్పుమంటుంది. దాంతో ఆ ఊళ్లో తిరగడం ఇటు మాథ్యూకి .. అటు రంగన్నకి ఇద్దరికీ కూడా ఇబ్బందిగా మారుతుంది. ప్రతిపక్షాల వాళ్లు మాథ్యూని అవహేళన చేయడం మొదలుపెడతారు. దాంతో భార్య ధోరణి పట్ల అతను అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. తన మాటల్లో నిజం లేకపోతే, కోర్టు ద్వారా నిరూపించమని ఆమె సమాధానమిస్తుంది.
దాంతో తన భార్య మాటల్లో నిజం లేదనీ .. ఆమె నుంచి తాను విడాకులు కోరుకోవడం లేదని తన తరఫు లాయర్ ద్వారా మాథ్యూ కోర్టుకి విన్నవిస్తాడు. 20 ఏళ్లలో తన భర్త తనదో కలిసింది నాలుగు సార్లేననీ ... ఆ తరువాత అతను తనకి దూరంగా ఉంటూ వచ్చాడని ఓమన చెబుతుంది. అతను అలా ఉండటానికి గల కారణం ఆ తరువాత తనకి తెలిసిందని అంటుంది. ఈ కేసు విషయంలో ఒకే ఒక సాక్ష్యం ఉందని చెబుతుంది. ఆ సాక్షి ఎవరు? మాథ్యూపై అతని భార్య చేసిన ఆరోపణలు నిజమేనా? అతని నుంచి ఆమెకి విడాకులు లభిస్తాయా? అనేది మిగతా కథ.
ఆదర్శ్ సుకుమారన్ - పాల్సన్ స్కారియా కలిసి తయారు చేసిన కథ ఇది. ఈ కథ చాలా సాదా సీదాగా మొదలవుతుంది. సమస్యను సీరియస్ గా కాకుండా చాలా సింపుల్ గా .. తేలికగా దర్శకుడు తెరపైకి తీసుకుని వస్తాడు. కథానాయకుడు నిజంగానే 'గే'నా? అతనిపై ఈ ఆరోపణ వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా? అనే విషయం తేల్చుకునే పనిలోనే చివరి వరకూ ప్రేక్షకుడు ఉంటాడు. ఆ దిశగానే కథ ముందుకు వెళుతూ ఉంటుంది.
ఈ కథలో కోర్టు రూమ్ డ్రామా ఉన్నప్పటికీ, అనూహ్యమైన మలుపులుగానీ .. నాటకీయ పరిణామాలు గాని ఉండవు. సన్నివేశాలను సాగదీసే సంజాయిషీలు ... సమాధానాలు కనిపించవు. భారీ డైలాగులు వినిపించవు. ప్రధానమైన పాత్రల మధ్య ఫీలింగ్స్ తప్ప డైలాగ్స్ ఎక్కువగా ఉండవు. ఈ కథలో మమ్ముట్టి తండ్రి పాత్ర మౌనంగా ఉండిపోతుంది. చివరిలో అతను మాట్లాడే రెండు మాటలే అప్పటివరకూ ఉన్న చిక్కు ముడులను విప్పుతాయి. చివరివరకూ ఎటూ తేల్చుకోలేపోయిన ప్రేక్షకులకు చివరిలోనే ఒక క్లారిటీ వస్తుంది.
ఒక గ్రామం .. రెండు ప్రధానమైన పాత్రలు .. ఓ అరడజను సపోర్టింగ్ రోల్స్ .. భర్తపై భార్య చేసిన అభియోగం .. అది నిరూపించడానికి చేసిన ప్రయత్నమే ఈ సినిమా. స్క్రీన్ ప్లే పరంగా కూడా దర్శకుడు అద్భుతాలేం చేయలేదు. సహజత్వానికి చాలా దగ్గరగా ఈ కథ నడిపిస్తూ వెళ్లాడంతే. రియల్ లొకేషన్స్ ఈ కథను వాస్తవానికి మరింత దగ్గరగా తీసుకుని వెళతాయి. నిండుగా .. నిబ్బరంగా సాగే తమ పాత్రలకు మమ్ముట్టి - జ్యోతిక జీవం పోశారు. మమ్ముట్టి ఇలాంటి ఒక కథను ఒప్పుకోవడమే సహజంగా చెప్పుకోవాలి.
సాలు కె థామస్ ఫొటోగ్రఫీ సహజత్వాన్ని ఒడిసిపడుతుంది. మాథ్యూస్ పులికాన్ నేపథ్య సంగీతం కథతో కలిసిపోయి సాగుతుంది. ఫ్రాన్సిస్ లూయిస్ ఎడిటింగ్ వర్క్ నీట్ గా అనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న అంశం అంత తేలికైనదేం కానప్పటికీ, అతను ఆ పాయింటును సున్నితంగా టచ్ చేసిన తీరు మెప్పిస్తుంది.