'కీడా కోలా' (ఆహా) మూవీ రివ్యూ

Keedaa Cola

Movie Name: Keedaa Cola

Release Date: 2023-12-29
Cast: Tharun Bhascker, Chaitanya Rao, Brahmanandam, Rag Mayur, Jeevan Kumar, Ravindra Vijay, Vishnu
Director:Tharun Bhascker
Producer: Vivek Sudhanshu - Saikrishna Gadwal
Music: Vivek Sagar
Banner: VG Sainma
Rating: 2.50 out of 5
  • తరుణ్ భాస్కర్ రూపొందించిన 'కీడా కోలా'
  • నిన్నటి నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్ 
  • క్రైమ్ కామెడీ జోనర్లో నడిచే కథ 
  • తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో చేసిన ప్రయోగం
  • అంతగా నవ్వించలేకపోయిన కంటెంట్

తరుణ్ భాస్కర్ ఈ మధ్య కాలంలో ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నటుడిగా తన జోరు చూపిస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'కీడా కోలా' సినిమా, నవంబర్ 3వ తేదీన థియేటర్లకు వచ్చింది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో నడిచే కథ ఇది. తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించాడు కూడా. అలాంటి ఈ సినిమా, నిన్నటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

వరదరాజు (బ్రహ్మానందం) కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ వీల్ చైర్ కి పరిమితమవుతాడు. అతనికి ఆపరేషన్ చేయించాలని మనవడు వాసు (చైతన్యరావు)కి ఉంటుంది. కానీ ప్రధానమైన సమస్య డబ్బు. అతను అమాయకుడు .. పైగా తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పలేని నత్తి. అందువలన తన ఆపరేషన్ గురించి ఆ తాత .. మనవడిని టెన్షన్ పెట్టడు. ఇక వాసూకి ఉన్న ఏకైన స్నేహితుడు కౌశిక్ (రాగ్ మయూర్) అతను ఓ లాయర్. కాకపోతే జీవితంలో అనుకున్నంతగా ఎదగలేకపోయామే అనే ఒక డిప్రెషన్ లో ఉంటాడు. 

ఇక మరో వైపున జీవన్ ( జీవన్ కుమార్) తన రౌడీయిజంతో జనాలను భయపెడుతూ బ్రతికేస్తూ ఉంటాడు. కార్పొరేటర్ రాజన్న తనని అవమానపరచడాన్ని అతను తట్టుకోలేకపోతుంటాడు. రాజన్నను హత్య చేసైనా తాను కార్పొరేటర్ కావాలనేది అతని కోరిక. అలాంటి సమయంలోనే సెంట్రల్ జైలు నుంచి అతని అన్నయ్య  నాయుడు (తరుణ్ భాస్కర్) విడుదలవుతాడు. ఇక తన రౌడీయిజానికి మరింత బలం తోడైనందుకు జీవన్ సంతోషిస్తాడు. 

కథలో మరో వైపుకు వెళితే .. ఒక కూల్ డ్రింక్ సంస్థకి సీఈవోగా రవీంద్ర విజయ్ పనిచేస్తూ ఉంటాడు. బుద్ధిబలం అవసరమైనంత వరకూ తాను బరిలో ఉంటాడు .. భుజబలం అవసరమని భావిస్తే కిరాయి గూండా 'షార్ట్స్' ను రంగంలోకి దింపుతాడు. తన కూల్ డ్రింక్ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లడానికి అతను ట్రై చేస్తుంటాడు. ఆ సంస్థలోనే నాయుడు పనికి చేరతాడు. కార్పొరేటర్ రాజన్న ఇంట్లో రాజకీయపరమైన ఫంక్షన్ కి తనని పిలవకపోవడంతో జీవన్ మరింత రగిలిపోతాడు. అక్కడ తయారు చేస్తున్న వంటలో 'బొద్దింక'ను వేయడానికి ప్రయత్నిస్తాడు.

తన తమ్ముడు కార్పొరేటర్ కావడానికి అవసరమైన డబ్బు కోసం, అదే బొద్దింకను కూల్ డ్రింక్ లో వేయాలని నాయుడు భావిస్తాడు. తాను కూల్ డ్రింక్ కంపెనీలోని పనిచేస్తుండటం వలన, ఎవరికీ తెలియకుండా ఆ పని చేసేస్తాడు. తాను బొద్దింక వేసిన కూల్ డ్రింక్ కేస్ లో .. ఏ షాప్ కి వెళుతుందనే విషయంలో ఓ కన్నేస్తాడు. అతను ఆ షాపుకు వెళ్లేలోగా, వరదరాజు కోసం వాసు ఆ కూల్ డ్రింక్ ను కొనుక్కెళతాడు. దాంతో వాసు ఇంటికి వెళ్లి ఆ కూల్ డ్రింక్ బాటిల్ ఇవ్వమని నాయుడు బ్రదర్స్ అడుగుతారు. 

చివరికీ అందరూ ఒక అవగాహనకి వస్తారు. ఆ కూల్ డ్రింక్ కంపెనీ ఓనర్ కి కాల్ చేసి డబ్బు డిమాండ్ చేయాలనీ .. వచ్చిన దాంట్లో చెరో సగం తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం రవీంద్ర విజయ్ కి కాల్ చేస్తారు. 5 కోట్లు ఇవ్వకపోతే బొద్దింక ఉన్న బాటిల్ ను బయటపెట్టి కంపెనీ మూయిస్తామని బెదిరిస్తారు. ఈ విషయంలో తన బుద్ధిబలంతో పాటు భుజబలం కూడా అవసరమని భావించిన అతను, షార్ట్స్ ను కూడా రంగంలోకి దింపుతాడు. ఫలితంగా ఏం జరుగుతుందనేది కథ. 

ఆర్ధికపరమైన ఇబ్బందుల్లో ఉన్న ఓ తాత - మనవడు, తన తమ్ముడి కోసం ఏమైనా చేసే నేర చరిత్ర కలిగిన ఒక అన్న, తన సంస్థ కోసం ఎంతకైనా తెగించే ఒక సీఈవో. ఈ ఐదు ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఇది చాలా సింపుల్ లైన్ .. బడ్జెట్ పరంగా చూసినా అదే భావన కలుగుతుంది. డబ్బు చుట్టూ తిరిగే ఈ పాత్రల నుంచి కామెడీని రాబట్టడానికి తరుణ్ భాస్కర్ తనవంతు ప్రయత్నం చేశాడు. కాకపోతే అది కొంతవరకూ మాత్రమే ఫలించింది. 

తరుణ్ భాస్కర్ ఎంచుకున్న పాయింట్ ఆసక్తిని కలిగించేదే. కాకపోతే ఆ దిశగా కథను ఇంట్రెస్టింగ్ గా నడిపించడం జరగలేదు. చాలా సాదాసీదా సన్నివేశాలతో కథ ముందుకు వెళుతూ ఉంటుంది. కథ పరంగా హీరోయిన్ కి ఛాన్స్ లేదు. అందువలన లవ్ .. రొమాన్స్ కి కూడా అవకాశం లేదు. యాక్షన్ సీన్స్ కూడా కామెడీ టచ్ తోనే సాగుతాయి. ఒకటి రెండు చోట్ల తప్ప నవ్వు తెప్పించే సందర్భాలు కనిపించవు. సిల్లీ కామేడీ డ్రామాగానే కథ మలుపులు తీసుకుంటుంది. 

అన్నాతమ్ముళ్లుగా తరుణ్ భాస్కర్ - జీవన్ కుమార్ నటన ఆకట్టుకుంటుంది. సీఈవోగా రవీంద్ర విజయ్ యాక్టింగ్ కూడా ఓకే. ఇక వరదరాజు పాత్రకి బ్రహ్మానందం వంటి గొప్పనటుడు అనవసరం అనిపిస్తుంది. వీల్ చైర్ కి మాత్రమే పరిమితమయ్యే ఆ పాత్రను చేయడానికి ఆయన ఒప్పుకోవడమే గొప్ప విషయంగా చెప్పుకోవాలి. చైతన్యరావు పాత్రకి 'నత్తి' ఎందుకు పెట్టారో .. దాని వలన ఒరిగే అదనపు ప్రయోజనం ఏమిటనేది అర్థం కాదు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం .. ఏజే ఆరోన్ ఫొటోగ్రఫీ ఫరవాలేదనిపిస్తాయి.

జీవితంలో ఆశ ఉండటం సహజం .. అత్యాశ మాత్రం ఉండకూడదు. సంతృప్తి స్వేచ్ఛను ఇస్తుంది ..  దురాశ దుఃఖానికి కారణమవుతుంది. బ్రతకడం కోసం భయపడొద్దు ... ఆ భయాన్ని పక్కన పెడితేనే బ్రతుకులోని ఆనందం తెలుస్తుంది అనే ఒక చిన్నపాటి సందేశం మాత్రం ఈ కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది. 

Trailer

More Reviews