'80s బిల్డప్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ
80s Buildup Review
- సంతానం హీరోగా రూపొందిన '80s బిల్డప్'
- ఆయన జోడీగా నటించిన రాధిక ప్రీతి
- 1980 నేపథ్యంలో నడిచే కథాకథనాలు
- కొత్తదనం లేని కంటెంట్
- కామెడీ పేరుతో హడావిడీ .. గందరగోళం
కోలీవుడ్ లో కమెడియన్ గా సంతానం మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఒకానొక దశలో సంతానం లేని సినిమా ఉండేది కాదు. ఆ క్రేజ్ కారణంగానే ఆయన హీరో అయ్యాడు. అలా ఆయన హీరోగా చేసిన సినిమాలలో ఒకటిగా '80s బిల్డప్' కనిపిస్తుంది. నవంబర్ 24వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ ప్రధానంగా సాగే ఈ కంటెంట్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 1980లలో నడుస్తూ ఉంటుంది. కల్యాణ్ (సంతానం) జమీందారీ ఫ్యామిలీకి చెందిన యువకుడు. అతను కమల్ హాసన్ కి వీరాభిమాని. ఆయన సినిమా వచ్చిందంటే చాలు, ఆ ఊళ్లోని థియేటర్ దగ్గర స్నేహితులతో కలిసి అల్లరల్లరి చేస్తూ ఉంటాడు. అతనికీ .. చెల్లెలు పంకజానికి క్షణం పడదు. పందాలు కట్టడం .. తామే గెలవాలని పోటీపడటం వాళ్లిద్దరి మధ్య నడుస్తూ ఉంటుంది. తల్లిలేని ఆ ఇద్దరూ తాతయ్య - నాయనమ్మ దగ్గరే పెరుగుతారు.
కల్యాణ్ - పంకజం తండ్రి ( ఆడుకాలం నరేన్) ఎప్పుడూ తాగుతూ ఆ మైకంలోనే ఉంటూ ఉంటాడు. తాత నాదముని (సుందరరాజన్) మాత్రం ఆరోగ్యంగానే ఉంటాడు. నాదముని పూర్వికులు బ్రిటిష్ వారికి చిక్కకుండా తమ దగ్గరున్న బంగారాన్ని .. వజ్రాలను రహస్యంగా ఒకచోట దాచిపెడతారు. అందుకు సంబంధించిన మ్యాప్ ను ఒక కత్తి 'పిడి'లో దాచిపెడతారు. అయితే ఆ విషయం ఆ కుటుంబ సభ్యులకు తెలియదు. ఒక ముఠాకు ఈ సంగతి తెలుస్తుంది. ఆ ముఠాలో మన్సూర్ అలీఖాన్ .. మనోబాల .. రాజేంద్రన్ సభ్యులు.
ఆ ముగ్గురూ ఓ రోజున జమీందారు బంగ్లాకు వస్తారు. ఆ ఇంట్లో ఉన్న తాతల కాలం నాటి కత్తిని తమకి ఇస్తే, వజ్రాలు ఇస్తామని నాదమునికి ఆశ చూపుతారు. కత్తిని చూపిస్తానని చెప్పిన నాదముని ఆ వజ్రాలను మింగడం .. అదే సమయంలో కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం క్షణంలో జరిగిపోతాయి. యముడు (కేఎస్ రవికుమార్) చిత్రగుప్తుడు (మునీశ్ కాంత్) నాదముని ఆత్మను తీసుకుని వెళ్లడానికి వస్తారు. అతని చివరి కోరికలు ఏమైనా ఉంటే చెప్పమని యముడు అడుగుతాడు.
పంకజంతో తనకి గల లవ్ మేటర్ యముడితో నాదముని చెబుతాడు. ఆమెను మరచిపోలేక అదే పేరును తన మనవరాలికి పెట్టుకున్నానని అంటాడు. ఆమె రాకుండా తన బాడీని అక్కడి నుంచి కదిలించకుండా చూడమని నాదముని కోరతాడు. అందుకు యముడు - చిత్రగుప్తుడు అంగీకరిస్తారు. దూరపు బంధువు అయిన దేవి (రాధిక ప్రీతి) నాదమునిని చూడటానికి వస్తుంది. తొలిచూపులోనే ఆమెపై కల్యాణ్ మనసు పారేసుకుంటాడు. ఆ సాయంత్రంలోగా ఆమెతో 'ఐ లవ్ యూ' చెప్పించుకోవాలని అతనితో చెల్లెలు పందెం కాస్తుంది.
పంకజం వస్తుందా అని నాదముని ఆత్మ ఎదురుచూస్తూ ఉంటుంది. బెంగుళూరు నుంచి రావలసిన అతని పెద్ద కొడుకు కోసం ఊళ్లో వారు ఎదురుచూస్తుంటారు. నాదముని - పంకజం మధ్య సంబంధం గురించి తెలుసుకున్న ఆంటోని గ్యాంగ్ (మన్సూర్ అలీ ఖాన్ - మనోబాల - రాజేంద్రన్ ) పోస్టుమార్టం చేసే గోపాలం ( ఆనంద్ రాజ్) తో ఆడవేషం కట్టించి, పంకజం పేరుతో ఆ ఇంటికి తీసుకొస్తారు. నాదముని మింగేసిన వజ్రాలను తిరిగి తీసుకుని పోవాలనేది వారి ప్లాన్. అన్నాచెల్లెళ్ల పందెంలో ఎవరు గెలుస్తారు? ఆంటోని ముఠా ప్లాన్ పారుతుందా? దేవితో కల్యాణ్ పెళ్లి జరుగుతుందా? నాదముని ఆత్మ శాంతిస్తుందా? అనేది మిగతా కథ.
సాధారణంగా హారర్ సినిమాలు ఒక బంగ్లా చుట్టూ తిరుగుతాయి. కానీ కామెడీ కథను కూడా ఒక బంగ్లా చుట్టూ తిప్పొచ్చని ఈ సినిమా దర్శకుడు కల్యాణ్ నిరూపించాడు. ఒక జమీందారు ఫ్యామిలీ .. ఆ ఇంట్లోని నిధిపై కన్నేసిన ఒక గ్యాంగ్ .. అన్నాచెల్లెళ్ల మధ్య పందెం .. ప్రేమలోపడిన జంట .. తన డెడ్ బాడీని పంకజం చూస్తేనే తప్ప తాను కదిలేది లేదని చెప్పే ఆత్మ .. వీటన్నిటిని కలుపుకుంటూ, శవం చుట్టూ జరిగే నాటకీయ పరిణామాలతో ఈ కథ కామెడీగా నడుస్తుంది.
కథ ఒక బంగ్లాలో ఉంటుంది .. ఆ బంగ్లాలోకి దర్శకుడు ఎక్కువ పాత్రలను ప్రవేశపెట్టాడు. దాంతో అక్కడ గందరగోళం వాతావరణం నెలకొంటుంది. శవం గురించి పట్టించుకోకుండా ఎవరిగోల వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ అంశంలోనే దర్శకుడు కామెడీ పిండాలనుకున్నాడు .. కానీ కుదరలేదు. ఎందుకంటే తమిళంలో కామెడీని తెలుగు డైలాగ్స్ తో పండించడం కష్టమైన విషయమే. పైగా అక్కడ చోటుచేసుకునే నాటకీయ పరిణామాలన్నీ సిల్లీగా అనిపిస్తాయి.
ఇక ఈ కథ 1980లలో నడుస్తూ ఉంటుంది .. అందువలన కాస్ట్యూమ్స్ విషయంలోను దర్శకుడు పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఆయా పాత్రలకు విగ్గులు సెట్ కాకపోయినా .. అది కూడా ఒక కామెడీగానే ఆయన భావించినట్టుగా అర్థమైపోతూ ఉంటుంది. అక్కడక్కడా .. అప్పుడపుడు మాత్రం మనం కాస్త నవ్వుముఖం పెట్టేలా మాత్రమే దర్శకుడు చేయగలిగాడు. మిగతా సన్నివేశాలన్నీ సాదాసీదాగా .. నాసిరకంగానే అనిపిస్తాయి. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి పెద్దగా చెప్పుకోవడానికేం లేదు.
Movie Details
Movie Name: 80s Buildup
Release Date: 2023-12-22
Cast: Santhanam,R. Radhika Preethi, Sundarrajan,K. S. Ravikumar, Anandaraj,Aadukalam Naren
Director: Kalyaan
Music: Ghibran
Banner: Studio Green
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer