'సలార్' - మూవీ రివ్యూ

Salaar

Movie Name: Salaar

Release Date: 2023-12-22
Cast: Prabhas, Sruthi Hassan, Jagapathi Babu, Pruthviraj Sukumaran, Easwari Rao,Bobby Simha
Director:Prashanth Neel
Producer: Vijay Kiragandur
Music: Ravi Basrur
Banner: Hombale Films
Rating: 3.00 out of 5
  • ప్రభాస్ హీరోగా రూపొందిన 'సలార్'
  • స్నేహం చుట్టూ అల్లుకున్న కథ 
  • యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా నడిచే కథనం 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రభాస్ ఫైట్స్
  • కాస్త గందరగోళంగా అనిపించే సెకండాఫ్
  • 'కేజీఎఫ్'ను గుర్తుచేసే భారీతనం   

పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ కి ఉన్న ఇమేజ్ గురించీ .. ఆయన మార్క్ సినిమాలను గురించి కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. వాళ్ల ముచ్చట తీర్చిన సినిమానే 'సలార్'. ఈ రోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

'ఖాన్సార్' ప్రాంతమంతా కూడా రాజమన్నార్ (జగపతిబాబు) అధీనంలో ఉంటుంది. అందరూ ఆయనను 'కర్త' అని పిలుస్తూ ఉంటారు. అధికారం పరంగా ఆయన తరువాత స్థానంలో కొంతమంది 'దొరలు' .. ఆ తరువాత స్థానంలో కొంతమంది 'కాపరులు' ఉంటారు. ఇతర తెగలను సమూలంగా నాశనం చేసిన రాజమన్నార్, తన రెండవ భార్య కొడుకైన వరద రాజమన్నార్ (పృథ్వీ రాజ్ సుకుమారన్) ని 'దొర'గా ప్రకటించాలని అనుకుంటాడు.  

అతని మొదటి భార్య కొడుకైన రుద్ర రాజా మన్నార్ (గరుడ రామ్) కీ .. కూతురు రాధ రాజమన్నార్ (శ్రియా రెడ్డి) కి ఆ నిర్ణయం రుచించదు. రాధ రాజమన్నార్ భర్త 'భారవ' (బాబీ సింహా) కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఒక ముఖ్యమైన పనిపై రాజమన్నార్ తన ప్యాలెస్ దాటుకుని బయటికి వెళతాడు. తాను తిరిగి వచ్చేవరకూ పాలనా బాధ్యతను కూతురుకి అప్పగిస్తాడు. తాను రాగానే వరదరాజా మన్నార్ కి 'దొర'గా బాధ్యతలను అప్పగిస్తానని చెబుతాడు. 

రాజమన్నార్ తిరిగి వచ్చేలోగా వరదరాజ మన్నార్ ను అంతం చేయాలని రుద్ర .. రాధ .. భారవ ఆలోచన చేస్తారు. అందుకోసం ఇతర దొరలను .. కాపరులను తమ వైపుకు తిప్పుకుంటారు. జరుగుతున్న పరిణామాలను గ్రహించిన వరదరాజా మన్నార్ కీ, తన బాల్యమిత్రుడు దేవా (ప్రభాస్) కళ్లముందు కదలాడతాడు. దేవా 'అస్సాం' ప్రాంతంలోని ఒక బొగ్గు గనిలో పనిచేస్తూ ఉంటాడు. తల్లి (ఈశ్వరీ రావు) మాటను జవదాటకుండా .. ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా అతను బుద్ధిగా తన పని చేసుకుంటూ పోతుంటాడు.

ఈ నేపథ్యంలోనే తల్లి అస్థికలను తీసుకుని విదేశాల నుంచి ఆద్య (శ్రుతి హాసన్) వస్తుంది. ఆమెను చంపడానికి ఓబులమ్మ (ఝాన్సీ) ముఠా సభ్యులు రంగంలోకి దిగుతారు. అయితే 'ఆద్య'కి దేవా ఇంట్లో ఆశ్రయం దొరుకుతుంది. ఆద్య  తాను ఎవరనేది బయటికి చెప్పకుండా, అక్కడి పిల్లలకి పాఠాలు చెబుతూ రోజులు గడుపుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే దేవాను వెతుక్కుంటూ వరద రాజమన్నార్ వస్తాడు. తనకి సాయం చేయమని అడుగుతాడు. 


తన స్నేహితుడు ఆశిస్తున్న కుర్చీని అతనికి అప్పగించాలని దేవా నిర్ణయించుకుంటాడు. అతనితో కలిసి ఖాన్సార్ లో అడుగుపెడతాడు. అక్కడ ఏం జరుగుతుంది? దేవా ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? అస్సాం లోని దేవాకీ .. ఖాన్సార్ లోని వరద రాజమన్నార్ కి స్నేహం ఎలా కుదిరింది? 'ఆద్య'ను ఓబులమ్మ మనుషులు ఎందుకు చంపాలనుకుంటున్నారు? స్నేహితుడికి ఇచ్చిన మాటను దేవా నిలబెట్టుకుంటాడా? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ ముందుకు వెళుతుంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, దేవా - వరద చిన్నప్పటి ఎపిసోడ్ తో మొదలవుతుంది. ఆ తరువాత 'ఆద్య' విదేశాల నుంచి ఇండియాకి రావడంతో కథలో హడావిడి కనిపిస్తుంది. బొగ్గుగనుల్లో పనిచేసే కొడుకును కనిపెట్టుకుంటూ దేవా తల్లి బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతూ ఉంటుంది. 'ఆద్య'పై ఓబులమ్మ పగతో రగిలిపోతూ ఉంటుంది. ఈ అంశాలను కలుపుకుంటూ కథ నడుస్తూ ఉంటుంది. అన్నిటికీ కలిపి కామన్ గా ఉన్న లింక్ ఏమిటనేది మాత్రం అర్థం కాదు. ఇంటర్వెల్ వరకూ అదే పరిస్థితి ఉంటుంది. 

ప్రశాంత్ నీల్ తన స్క్రీన్ ప్లేతో ఇలాంటి ఒక మేజిక్ చేశాడు. అయితే సాధారణ ప్రేక్షకులకు ఇది ఒక పజిల్ మాదిరిగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ తరువాతనే ప్రేక్షకులకు కథ అర్థం కావడం మొదలవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. అక్కడి వరకూ నడిచిన కథ పట్ల ఆడియన్స్ సంతృప్తికరంగానే ఉంటారు. ఆ స్థాయిలో సెకండాఫ్ నడిస్తే, సినిమా నెక్స్ట్ లెవెల్ ను అందుకోవడం ఖాయమని అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ ను గందరగోళంగా ప్రశాంత్ నీల్ ప్రారంభించాడు. 

కథ ఒక వెయ్యి సంవంత్సరాలు వెనక్కి వెళుతుంది. అక్కడి నుంచి అనేక దశలను చకచకా దాటుకుంటూ వెళుతుంది. ప్రమాదకరమైన మూడు తెగలు .. ఆధిపత్యం కోసం ఆ తెగల మధ్య పోరాటం. ఒక తెగకి చెందిన నాయకుడిగా రాజమన్నార్ కనిపించడం వరకూ వస్తుంది. ఆధిపత్యం కోసం జరిగే ఈ పోరాటంలో కనిపించేదంతా హింసనే. ఇక రాజమన్నార్ కి ఎసరు పెట్టే శత్రువుల సంఖ్య కూడా పెరిగిపోయి కథలో మరింత గందరగోళం ఏర్పడుతుంది. 

ప్రశాంత్ నీల్ ఈ సినిమా కలర్ టోన్ 'కేజీఎఫ్'ను పోలిన విధంగా ఉండేలా చూసుకున్నాడు. 'కేజీఎఫ్'లో సింహాసనం కోసం అంతా హీరో నడిపిస్తే, ఈ కథలో సింహాసనం కోరుకున్న స్నేహితుడి కోసం హీరో రంగంలోకి దిగుతాడు. ఆ సినిమాలో మదర్ సెంటిమెంట్ ను టచ్ చేస్తే, ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ ను హైలైట్ చేశాడు. వందలమంది ఆర్టిస్టులు .. కత్తులతో .. గొడ్డళ్లతో .. తుపాకీలతో చేసే విన్యాసాల పరంగా కూడా ఈ సినిమా కేజీఎఫ్ ను గుర్తుచేస్తుంది. ఆ సినిమాలో మాదిరిగానే ఇందులోను హీరోయిన్ కి ప్రాధాన్యత ఉండదు. లవ్ .. రొమాన్స్ .. కామెడీలకి చోటు ఉండదు. 

అయితే ప్రభాస్ ను ఎలా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారో అలాగే చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రభాస్ యాక్షన్ లోకి దిగే రెండు మూడు సందర్భాలను ఆయన డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. హీరోయిన్ ను కాపాడే రెండు సందర్భాలు .. ఒక గిరిజన అమ్మాయిపై అత్యాచారానికి ఒక దొర కొడుకు సిద్దపడిన సందర్భాల్లో వచ్చే ఫైట్స్ కి విజిల్స్ పడతాయి. ఇక ప్రీ క్లైమాక్స్ లో ప్రభాస్ - పృథ్వీరాజ్ కలిసి శత్రువులపై చేసే ఫైట్ మాత్రం విసుగెత్తిస్తుంది. 

ప్రభాస్ ఈ సినిమాలో మరోసారి తన మార్క్ చూపించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ - జగపతిబాబు - ఈశ్వరీ రావు తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రుతి హాసన్ లో మాత్రం మునుపటి ఆకర్షణ కనిపించదు. బాబీ సింహా .. దేవరాజ్ .. 'గరుడ' రామ్ .. టినూ ఆనంద్ పాత్రలలో విషయం లేదు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం అక్కడక్కడా రేంజ్ దాటిపోయింది. భువన్ గౌడ కెమెరా పనితనం బాగుంది. అన్బు - అరివు కంపోజ్ చేసిన ఫైట్స్ ఆకట్టుకుంటాయి. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ విషయానికి వస్తే, యాక్షన్ సీన్స్ ను కాస్త ట్రిమ్ చేసుకోవచ్చుననిపిస్తుంది. ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ వరకూ ఆయన అభిమానులను నిరాశపరచవనే చెప్పాలి.  

ప్లస్ పాయింట్స్:
స్నేహం ప్రధానంగా నడిచే లైన్ .. ఫస్టాఫ్ .. ప్రభాస్ పాత్రను డిజైన్ చేసిన తీరు .. ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ .. 

మైనస్ పాయింట్స్: సెకండాఫ్ .. లెక్కకి మించిన పాత్రలు .. ప్రయోజనం లేని పాత్రలు .. ఫ్లాష్ బ్యాక్ ను మరీ వెనక్కి తీసుకెళ్లడం .. లవ్ - రొమాన్స్ ను టచ్ చేయకపోవడం.

Trailer

More Reviews