'వ్యూహం' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ

Vyooham

Movie Name: Vyooham

Release Date: 2023-12-14
Cast: Sai Sushanth Reddy, Chaitanya Krishna, Ravindra Vijay, Shashank, Preethi Asrani, Pavani Gangireddy, Pradeep Rudra
Director:Shashikanth Sri Vaishnav
Producer: Supriya Yarlagadda
Music: Sri Ram Madduri
Banner: Annapurna Studios
Rating: 3.00 out of 5
  • అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'వ్యూహం'
  • ఈ రోజునే మొదలైన స్ట్రీమింగ్ 
  • ఆసక్తికరమైన కథాకథనాలు 
  • పెరిగిపోయిన పాత్రల సంఖ్య .. నిడివి
  • అనవసరమైన ట్రాకులు ... ఫ్లాష్ బ్యాకులు 

ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తరహా కథలకు ఓటీటీల వైపు నుంచి విశేషమైన ఆదరణ లభించడమే అందుకు కారణం. అలా వచ్చిన వెబ్ సిరీస్ గా 'వ్యూహం' కనిపిస్తుంది. 'అమెజాన్ ప్రైమ్' లో ఈ రోజు నుంచే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్, ఏ స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అయిందనేది చూద్దాం.


అర్జున్ రామచంద్ర (సాయి సుశాంత్ రెడ్డి) ఐపీఎస్ పూర్తిచేసి, కొత్తగా డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఐపీఎస్ ఆఫీసర్ గా మంచి పేరు తెచ్చుకున్న వాణి తనయుడు అతను. తన పదేళ్ల వయసులో నక్సలైట్ల తూటాలకు ఆమె నేలకొరగడం ప్రత్యక్షంగా చూసినవాడతను. తల్లి చెప్పిన మాటలే అతణ్ణి ఐపీఎస్ దిశగా నడిపిస్తాయి.  నిజాయతీకి కట్టుబడి ఉండేలా చేస్తాయి. అలాంటి అతని దగ్గరికి మైఖేల్ కేసు వస్తుంది. 

మైఖేల్ (కృష్ణ చైతన్య) భార్య జెస్సికా (పావని గంగిరెడ్డి) గర్భవతిగా ఉంటుంది. ఆమె హెల్త్ చెకప్ కోసం అతను బైక్ పై బయల్దేరతాడు. మార్గ మధ్యంలో ఒకదాని తరువాత ఒకటిగా మూడు బైకులు అతనికి హఠాత్తుగా అడ్డం వస్తాయి. ఎందుకు అలా జరుగుతుందా అని అతను ఆలోచన చేస్తూ ఉండగానే, వేగంగా వచ్చిన ఒక కారు వాళ్లను ఢీ కొడుతుంది. దాంతో ఇద్దరూ గాయపడటమే కాకుండా, ఇకపై తల్లి అయ్యే అవకాశాన్ని జెస్సికా కోల్పోతుంది. 

ఈ కేసు అర్జున్ రామచంద్ర దగ్గరికి వస్తుంది. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా, మైఖేల్ చెప్పింది నిజమేనని అతను భావిస్తాడు. బైక్స్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు .. కారులో వచ్చి ఢీకొట్టిన వ్యక్తిని గుర్తించిన అర్జున్ రామచంద్ర, ఆ నలుగురి ఆచూకీ తెలుసుకుని వాళ్లను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన 'హిట్ అండ్ రన్' కేసు కాదు, దీని మూలాలు చాలా లోతుగా ఉన్నాయనే విషయం అతనికి అర్థమవుతుంది.

ఇక అదే సమయంలో నిర్మలా దీక్షిత్ అనే జర్నలిస్ట్ దారుణ హత్యకి గురవుతుంది. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజల హక్కుల కోసం .. అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ పనులను వ్యతిరేకిస్తూ ఆమె పోరాటం చేస్తూ ఉంటుంది. ఇక ఆ సిటీలో తన రౌడీయిజంతో కొన్ని పనులను చేసే 'రెడ్డెన్న' కూతురు నిహారిక (ప్రీతి అస్రాని) కిడ్నాప్ కి గురవుతుంది. రాంజీ అనే వ్యక్తి ఈ కిడ్నాప్ కి కారకుడనే విషయం తెలుస్తుంది. ఒక వైపున నక్సలిజం .. మరో వైపున టెర్రరిజం అర్జున్ రామచంద్రకి సవాలుగా మారతాయి.      

అప్పుడు అర్జున్ రామచంద్ర ఏం చేస్తాడు? మైఖేల్ ఫ్యామిలీ ప్రమాదానికి కారణమైన ఆ నలుగురు వ్యక్తులు ఎవరు? ఆ నలుగురు వ్యక్తుల నేపథ్యం ఏమిటి? వాళ్ల వెనక ఎవరున్నారు?  అవినీతి అధికారుల వైపు నుంచి ఆటంకాలు ఎదురవుతున్నా, అర్జున్ రామచంద్ర ఈ కేసులను ఎలా పరిష్కరించాడు? అనే ఆసక్తికరమైన మలుపులు మనకి ఈ కథలో కనిపిస్తాయి.

దర్శకుడు శశికాంత్ శ్రీవైష్ణవ్ ఈ కథను తయారు చేసుకున్నాడు. ఆయన విస్తారమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు. నక్సలిజం .. టెర్రరిజం .. రౌడీయిజం .. అవినీతి పోలీస్ అధికారుల ఆగడాలను కథలో నాలుగు వైపుల నుంచి నడిపించాడు. ఇక వీటితో పాటు ఒక సైకో ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అన్నపూర్ణ బ్యానర్ నుంచి వచ్చింది గనుక, నిర్మాణ విలువలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన భారీ వెబ్ సిరీస్ ల జాబితాలో ఈ సిరీస్ కి స్థానం దక్కుతుంది. 

కథా పరంగా చూసుకుంటే ఆసక్తికరమైన మలుపులు .. ట్విస్టులు ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. 8 ఎనిమిది ఎపిసోడ్స్ కూడా కాస్త ఎక్కువ నిడివితోనే సాగుతాయి. అలాగే కథలో పాత్రల సంఖ్య ఎక్కువే. కథ ముందుకు వెళుతున్నకొద్దీ కొత్త పాత్రలు వచ్చి చేరుతూనే ఉంటాయి. ట్రాకులు .. మలుపులు .. పాత్రలు ఎక్కువైపోవడం వలన, ముందు జరిగిన ఎపిసోడ్స్ ను గుర్తుపెట్టుకోవడం కొంతమందికి కష్టమవుతుందని చెప్పాలి. 


కథ .. కథనాల విషయంలో ప్రేక్షకులకు అసంతృప్తి కలగదు. కానీ కథ నిదానంగా సాగడం .. పోలీస్ కథల్లో ఉండవలసిన స్పీడ్ లేకపోవడం .. మొదటి మూడు ఎపిసోడ్స్ లో అసలు ఏం జరుగుతుందనే ఒక అయోమయం ఏర్పడటం .. పాత్రలు ఎక్కువైపోయి గుర్తుపెట్టుకోవడం కష్టంగా మారడం అసంతృప్తిని కలిగిస్తాయి. ఆ తరువాత నుంచి కథ అర్థమవుతూ వెళుతుంది. ఇది స్క్రీన్ ప్లే లో ఒక భాగమైనా, కొంతమందికి పెద్ద పజిల్ లా అనిపిస్తుంది. ఇక ప్రధానమైన పాత్రలకు ప్రత్యేకమైన మేనరిజమ్స్ యాడ్ చేసుంటే బాగుండేదేమో.  

కథలో చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కనిపిస్తారు. కానీ అంతమంది అవసరం లేదు అనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. అలాగే టెర్రరిజం ట్రాక్ అవసరానికి మించి కనిపిస్తుంది. రాంజీకి సంబంధించిన లైన్ .. అలాగే భరత్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్ .. లోకేశ్ ఎంట్రీ .. అనవసరమనే చెప్పాలి. ప్రధానమైన పాత్రలకు .. ట్రాకులకు వాయిస్ ఓవర్ ఇచ్చుకుని, కొన్ని సీన్స్ ను షార్ప్ గా ట్రిమ్ చేసుకుంటే ఈ సిరీస్ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఉండేదేమో.  

శ్రీరామ్ మద్దూరి నేపథ్య సంగీతం అక్కడక్కడా కాస్త డల్ గా అనిపించినా, కొన్ని సన్నివేశాల్లో సందర్భానికి తగినట్టుగా సాగింది. సాయి మురళి ఎడిటింగ్ విషయానికి వస్తే, సన్నివేశాల్లో గందరగోళం లేకుండా చూసుకోవలసింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను .. ప్రస్తుత కథను కలిపి చూపించడం వలన, ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతున్నామో .. ఎప్పుడు బయటికి వస్తున్నామో తెలియకుండా పోతోంది. నిజానికి ఇది మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ .. కాకపోతే మరింత టైట్ చేస్తూ చెప్పాల్సింది. 

ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. నిర్మాణ విలువలు .. ఫొటోగ్రఫీ 

మైనస్ పాయింట్స్: సన్నివేశాల నిడివి .. పాత్రల సంఖ్య ఎక్కువైపోవడం. అనవసరమైన పాత్రలు .. అవసరం లేని ఫ్లాష్ బ్యాకులకు చోటు ఇవ్వడం.

Trailer

More Reviews