'ది విలేజ్' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ

The Village

Movie Name: The Village

Release Date: 2023-11-24
Cast: Arya, Divya Pillai, Baby Aazhiya,Aadukalam Naren,George Maryan, ohn Kokken, Thalaivasal Vijay
Director:Milind Rau
Producer: BS Radhakrishnan
Music: -
Banner: Shakthi Production
Rating: 2.75 out of 5
  • ఆర్య ప్రధాన పాత్రగా రూపొందిన 'ది విలేజ్'
  • 'అవల్' డైరెక్టర్ నుంచి వచ్చిన సిరీస్ 
  • ఆసక్తిని రేకెత్తించే మొదటి 3 ఎపిసోడ్స్ 
  • అక్కడి నుంచి బలహీనపడుతూ వచ్చిన కంటెంట్ 
  • సెకండ్ సీజన్ కి హింట్ ఇచ్చిన డైరెక్టర్   

హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. అందువలన ఈ తరహా కంటెంట్ ను అందించడానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి. అలా అమెజాన్ ప్రైమ్ వేదికపైకి 'ది విలేజ్' సిరీస్ వచ్చింది. ఆర్య కథానాయకుడిగా నటించిన భారీ సిరీస్ ఇది. సీజన్ 1లో భాగంగా 6 ఎపిసోడ్స్ ను వదిలారు. హారర్ థ్రిల్లర్ జోనర్లో 'అవళ్' సినిమాతో మెప్పించిన మిలింద్ రావు ఈ సిరీస్ కి దర్శకుడు. ఈ రోజునే స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

అది తూత్తుకుడి జిల్లాలోని 'కట్టియల్' గ్రామం. ఆ గ్రామంలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయనీ, అటువైపు వెళ్లినవారు తిరిగి వచ్చిన దాఖలాలు లేవని అంతా చెప్పుకుంటూ ఉంటారు. ఒక నిండుచూలాలకి పురిటి నొప్పులు మొదలవుతాయి. రాత్రివేళ .. హోరున వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ వానలోనే ఆమెను తీసుకుని కుటుంబ సభ్యులు వ్యానులో బయల్దేరతారు. 'కట్టియల్' ఊరు దగ్గరికి వచ్చిన ఆ వ్యాన్ ఏమైందనేది ఎవరికీ తెలియదు. 

డాక్టర్ గా పనిచేస్తున్న గౌతమ్ (ఆర్య) అతని భార్య నేహ (దివ్య పిళ్లై) కూతురు మాయ (బేబి ఆగ్జియా) కలిసి సరదాగా రోడ్ ట్రిప్ వేస్తారు. వాళ్లతో పెంపుడు కుక్క 'హెక్టిక్' కూడానా ఉంటుంది. అలా హైవేపై వెళుతున్నవారు, ఒకచోట ట్రాఫిక్ జామ్ కావడంతో కారును 'కట్టియల్' దిశగా మళ్లిస్తారు. శిధిలమై పోయిన 'కట్టియల్' గ్రామంలోకి కారు ప్రవేశించగానే కారు రెండు టైర్లు పంక్చర్ అవుతాయి. అప్పటికే బాగా చీకటి పడుతుంది. ఫోన్లో సిగ్నల్స్ కూడా ఉండవు.  

దాంతో భార్య బిడ్డలను కారులోనే కూర్చోమని చెప్పి, సాయం కోసం గౌతమ్ కొంత దూరం నడుస్తూ వెళతాడు. 'నవమలై' అనే గ్రామంలోని ఒక హోటల్లో పీటర్ (జార్జ్ మరియన్) శక్తి  (ఆడుకాలం నరేన్) ఓ మెకానిక్ మాట్లాడుకుంటూ ఉండగా, అక్కడికి గౌతమ్ వచ్చి సాయం అడుగుతాడు. అయితే 'కట్టియల్' చాలా ప్రమాదకరమైన ప్రదేశమనీ, అక్కడికి సాయానికి ఎవరూ రారని వాళ్లు చెబుతారు. ఆయన వాళ్లను బ్రతిమలాడి వెంటతీసుకుని వెళ్లేలోగా అక్కడ కారుగానీ .. భార్యాబిడ్డలుగాని కనిపించరు. 

 ఇదిలా ఉండగా, సింగపూర్ లోని శ్రీమంతులలో జీఎస్ ఆర్ ( జయప్రకాశ్) ఒకరు. ఆయన  ఒక్కగానొక్క కొడుకు ప్రకాశ్ (అర్జున్ చిదంబరం). అతను చాలా కాలంగా వీల్ చైర్ కి పరిమితమై ఉంటాడు. చివరిదశలో ఉన్న జీఎస్ ఆర్ కొడుకు దగ్గర గతాన్ని గురించి ప్రస్తావిస్తాడు. అతనిని నడిపించడానికి అవసరమైన ఔషధం కోసం 'కట్టియల్' ప్రాంతంలో తాను ఎన్నో ప్రయోగాలు చేశాననీ, ఆ ప్రయోగాలు వికటించడం వలన అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతాడు. 

ఎలాంటి పరిస్థితుల్లోను అక్కడ తాను నెలకొల్పిన ప్రయోగశాలకు వెళ్లొద్దని చెబుతాడు. అయితే తండ్రి పరిశోధనకి సంబంధించిన శాంపిల్స్ అక్కడ ఉన్నాయని తెలుసుకున్న ప్రకాశ్, ఆ ఔషధం తనని నడిపించగలదని నమ్ముతాడు. ఆ శాంపిల్స్ ను అక్కడి నుంచి తీసుకుని వచ్చే బాధ్యతను ఫర్హాన్ (జాన్ కొక్కెన్)టీమ్ కి అప్పగిస్తాడు. గతంలో తండ్రి దగ్గర పనిచేసిన జగన్ ( తలైవాసల్ విజయ్)ను కూడా వాళ్లతో పంపిస్తాడు. ఆయుధ సామాగ్రితో హెలికాఫ్టర్ లో అక్కడికి వాళ్లు చేరుకుంటారు. 

'కట్టియల్' గత చరిత్ర ఏమిటి? గతంలో అక్కడ ఏం జరిగింది? ఎందుకు అక్కడికి వెళ్లినవారు తిరిగిరావడం లేదు? అక్కడ అసలు ఏం జరుగుతోంది. భార్యా బిడ్డలను వెతకడానికి వెళ్లిన గౌతమ్ కి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? ప్రకాశ్ కి కావలసిన శాంపిల్స్ కోసం వెళ్లిన టీమ్ కి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది ఈ కథలో చోటుచేసుకున్న ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి. 
 
దర్శకుడు మిలింద్ రావుకి హారర్ థ్రిల్లర్ జోనర్ వైపు నుంచి జనాలను భయపెట్టడంలో మంచి అనుభవం ఉంది. ఈ సిరీస్ ద్వారా ఆయన మరోసారి ఆడియన్స్ ను భయపెట్టాడా అంటే భయపెట్టాడు. అయితే అది గతంలో మాదిరిగా టేకింగ్ పరంగా కాదు, వికృతమైన ఆకారాలను క్రియేట్ చేసి .. ఆ ఆకారాలను చూడటానికి భయపడే పరిస్థితిని తీసుకొచ్చాడు. అలాగే కొన్ని జుగుప్స కరమైన సన్నివేశాలను క్లోజప్ లో చూపిస్తూ, స్క్రీన్ వైపు చూడటానికి ఆలోచించేలా చేశాడు. 

నిజానికి ఫస్టు ఎపిసోడ్ లోని మొదటి పది నిమిషాల్లోనే ఆయన షాక్ ఇచ్చాడు. ఇదెక్కడి సిరీస్ బాబోయ్ అనిపించేలా చూపించాడు. ఆ ఎపిసోడ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఒక వైపు నుంచి ప్రకాశ్ టీమ్ .. మరో వైపు నుంచి గౌతమ్ టీమ్ 'కట్టియల్ దిశగా కదులుతుంటే, ఏ క్షణంలో ఏం జరుగుతుందా అంటే ఉత్కంఠ రెండవ ఎపిసోడ్ లోను పెరుగుతూ పోతుంది. 3వ ఎపిసోడ్ లోనే అదే తీరు కొనసాగుతుంది. 

అయితే 4 వ ఎపిసోడ్ నుంచి కథలో పట్టు తగ్గిందని అనిపిస్తుంది .. పక్కకి పోయినట్టుగా కనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా బాగానే ఉంటాయి .. కానీ 'కట్టియల్'లో ఏవుంది? అనే అంశం నుంచే కథలో నుంచి ప్రేక్షకులు జారిపోవడం మొదలవుతుంది. కథాకథనాలు నెమ్మదించడం ... హింస .. రక్తపాతం .. జుగుప్స కలిగించే దృశ్యాలతో ఇబ్బంది పెడుతుంది. కథ అనేక మలుపులు తిరుగుతూ .. అదే తరహా సన్నివేశాలతో సాగదీస్తూ, చివరికి ఒక ట్విస్టుపై సెకండ్ సీజన్ కి కావలసిన లీడ్ ఇచ్చారు. 

ప్లస్ పాయింట్స్:
మొదటి మూడు ఎపిసోడ్స్ .. లొకేషన్స్ ... సెట్స్ .. ఫొటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
4 నుంచి 6 ఎపిసోడ్లు .. హింస .. రక్తపాతం .. జుగుప్స కలిగించే వికృత ఆకారాలు. 

Trailer

More Reviews