'మంగళవారం' - మూవీ రివ్యూ
Movie Name: Mangalavaram
- అజయ్ భూపతి రూపొందించిన 'మంగళవారం'
- ప్రధానమైన పాత్రను పోషించిన పాయల్
- కొన్ని సీన్స్ తో మెప్పించిన డైరెక్టర్
- ప్రధానమైన బలంగా నిలిచే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా వర్క్
- అక్కడక్కడా మిస్సయిన లాజిక్
'మంగళవారం' అనే టైటిల్ తోనే దర్శకుడు అజయ్ భూపతి ఆసక్తిని రేకెత్తించాడు. గ్రామీణ నేపథ్యంలో వివిధ కోణాలను ఆవిష్కరించినట్టుగా ట్రైలర్ ద్వారా చెప్పడంతో, ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. పాయల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్స్ కి వచ్చింది. అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకూ అందుకోగలిగిందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 1986 - 96 మధ్య కాలంలో గోదావరి తీరంలోని 'మహాలక్ష్మి పురం' అనే గ్రామంలో జరుగుతుంది. అక్కడి ప్రజలంతా కూడా గ్రామదేవతగా 'మాలచ్ఛమ్మ' అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. వాళ్లందరికీ కూడా అమ్మవారి పట్ల భయభక్తులు ఉంటాయి. ఆ గ్రామస్థులంతా జమీందారు ప్రకాశం బాబు (కృష్ణ చైతన్య) మాటను జవదాటరు. ఆయన భార్య రాజేశ్వరి (దివ్య పిళ్లై) పట్ల కూడా అందరికీ ఎంతో గౌరవం ఉంటుంది.
అలాంటి ఆ ఊళ్లో శైలు (పాయల్) తల్లిలేని పిల్ల. ఆమె తల్లి చనిపోగానే తండ్రి మరో పెళ్లి చేసుకుంటాడు. శైలు పేరుతో ఉన్న 3 ఎకరాల పొలం తన పేరుపైకి మారిస్తేనే ఆమెను తనతో తీసుకుని వెళతానని తండ్రి అంటాడు. అందుకు శైలు అమ్మమ్మ నిరాకరిస్తుంది. దాంతో తనకి శైలుతో సంబంధం లేదని ఆమెను అమ్మమ్మ ఇంట్లోనే వదిలేసి తండ్రి వెళ్లిపోతాడు. అలా ఆమె తండ్రి ప్రేమకు కూడా దూరమవుతుంది. ఆ ఊళ్లో తనతోటి వాడైన రవితోనే ఆమె ఆనందంగా రోజులు గడుపుతూ ఉంటుంది.
ఒక రోజున రవి ఇల్లు అగ్ని ప్రమాదానికి గురవుతుంది. తండ్రితో పాటు రవి కూడా చనిపోయాడని ఊళ్లో వాళ్లంతా చెప్పుకుంటారు. దాంతో శైలును మరింత ఒంటరితనం అలుముకుంటుంది. శైలు యవ్వనంలోకి అడుగుపెడుతుంది. ఆమె అందచందాలు చూసి ఊళ్లోని చాలామంది కుర్రాళ్లు మనసు పారేసుకుంటూ ఉంటారు. శైలూ మాత్రం తమకి ఇంగ్లిష్ పాఠాలు చెప్పే మాస్టారు 'మదన్' (అజ్మల్) ప్రేమలో పడుతుంది. తన సర్వస్వాన్ని అతనికి అప్పగిస్తుంది.
మదన్ ఆమెను మోసం చేసి వేరే యువతిని వివాహం చేసుకుంటాడు. ఆ బాధను శైలు తట్టుకోలేకపోతుంది. ఆ పరిస్థితుల్లోనే ఆమె అమ్మమ్మ కూడా చనిపోతుంది. ఒంటరితనం .. అదుపుతప్పిన మనసు కారణంగా శైలూ దారితప్పుతుంది. ఈ విషయం ఆ ఊరు జమీందారు ప్రకాశం బాబు (కృష్ణ చైతన్య) దృష్టికి వెళుతుంది. ఆయన తీర్పు ప్రకారం ఊళ్లో వాళ్లంతా ఒక్కటై, శైలూను ఊళ్లో నుంచి తరిమేస్తారు.
శైలూ అలా పొలిమేర దాటిన దగ్గర నుంచి ఆ ఊళ్లో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ ఊళ్లోని అక్రమ సంబంధాలను గురించి ఎవరో గోడలపై రహస్యంగా రాస్తుంటారు. ఆ వెంటనే ఆ గోడలపైకెక్కిన పేర్లు ఉన్నవారు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. ప్రతి మంగళవారం అలాగే జరుగుతూ ఉంటుంది. దాంతో మంగళవారం వస్తుందంటేనే గ్రామస్థులంతా భయపడిపోతుంటారు.
అందుకు కారణం తెలుసుకోవడానికి పోలీస్ ఆఫీసర్ 'మాయ' (నందిత శ్వేత) ఆ ఊరు వస్తుంది. జరుగుతున్నవి హత్యలని భావించిన ఆమె, హంతకులను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతుంది. అప్పుడు ఆమెకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? శైలూ ఏమైపోతుంది? గోడలపై రహస్య రాతలు రాస్తున్నదెవరు? 'మంగళవారానికి .. ఊళ్లోవారి మరణాలకు సంబంధం ఏమిటి? అనేవి కథలోని ఆసక్తికరమైన అంశాలు.
దర్శకుడు అజయ్ భూపతి ఈ కథలో హీరో .. హీరోయిన్ .. విలన్ అనే పాత్రలకు ముడివేసి కథను నడిపించలేదు. కథలో ప్రతి పాత్రను ముఖ్యమైనదిగా నడిపిస్తూ ముందుకు వెళ్లాడు. అందువల్లనే పాయల్ ఎంట్రీ కాస్త ఆలస్యమైనా, ఆడియన్స్ ఆ విషయాన్ని గురించిన ఆలోచన చేయకుండా కథను ఫాలో అవుతుంటారు. సెకండాఫ్ మాత్రం పాయల్ పైనే ఎక్కువగా నడుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ .. హారర్ థ్రిల్లర్ లను తలపిస్తూ, పాయల్ పాత్ర వైపు నుంచి ఒక కొత్త పాయింటును టచ్ చేస్తూ దర్శకుడు ఈ కథను పరిగెత్తించాడు.
కథ మొదలైన దగ్గర నుంచి 'ఔరా' అనిపించే సన్నివేశాలు కనిపించవు. అలాగని చెప్పి బోర్ కూడా కొట్టదు. అందుకు కారణం అజయ్ భూపతి స్క్రీన్ ప్లే .. రాత్రివేళలో తీసిన సీన్స్ .. ప్రీ క్లైమాక్స్ లోను .. క్లైమాక్స్ లోను ఒకదాని తరువాత ఒకటిగా రివీల్ చేసే ట్విస్టులు అని చెప్పచ్చు. ఇక ఫస్టాఫ్ లో ఒక ఫంక్షన్ లో గ్రామస్థుల కొట్లాట ... సెకండాఫ్ లో పాయల్ పాత్రను రాళ్లతో కొడుతూ తరిమేయడం కాస్త అతిగా .. అసహజంగా అనిపిస్తాయి.
అజయ్ భూపతి కథను అల్లుకున్న తీరు బాగుంది. కానీ పాత్రలను డిజైన్ చేసిన తీరు .. వాటిని నడిపించిన విధానం ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేదనిపిస్తుంది. పాయల్ ను కాస్త డీ గ్లామర్ గా చూపించడం వలన, ఆమెను తెరపై గ్లామరస్ గా చూడాలనుకునే ప్రేక్షకులకు నిరాశ కలుగుతుంది. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు కాస్త కన్ఫ్యూజన్ ను కలిగిస్తుంది. ఆ తరువాత క్లారిటీ ఇచ్చారు .. అది వేరే విషయం. అక్కడక్కడా లాజిక్ మిస్ కావడం కూడా మనకి కనిపిస్తుంది.
పోలీస్ ఆఫీసర్ గా నందిత శ్వేత నటన ఆకట్టుకుంటుంది. ఇక అజయ్ ఘోష్ కి మీసాలు అతికించవలసిన అవసరం .. కాలేజ్ లెక్చరర్ పాత్ర కోసం అజ్మల్ ను తీసుకురావడం ఎందుకో అర్థం కాదు. జమీందారు భార్యగా చేసిన దివ్య పిళ్లై కూడా గ్లామర్ పరంగా మెరిసింది. ఇక ఒక స్త్రీ రాత్రివేళలో తలపై .. చేతుల్లో మంటతో కూడిన కుండలను పెట్టుకుని ఒంటరిగా నడిచి వెళ్లడం వంటి సీన్స్ 'అన్వేషణ' సినిమాను గుర్తుకు తెస్తాయి.
అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను చాలా వరకూ నిలబెట్టింది. బాణీల పరంగా ఒకటి రెండు పాటలు బాగున్నాయనిపిస్తుంది. ఇక దాశరథి శివేంద్ర ఫొటోగ్రఫీ హైలైట్ అనే చెప్పాలి. నైట్ లో పొలాల్లో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్ .. వాగులో తీసిన సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. మాధవ్ కుమార్ ఎడిటింగ్ కూడా ఓకే.
ప్లస్ పాయింట్స్: కథ .. చిత్రీకరణ .. ట్విస్టులు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా పనితనం.
మైనస్ పాయింట్స్: పాయల్ పాత్ర విషయంలో కన్ఫ్యూజన్ .. అక్కడక్కడ అతిగా అనిపించే సీన్స్ ..