చాలామంది స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ ల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో కోలీవుడ్ హీరో 'జై' కూడా చేరిపోయాడు. ఆయన హీరోగా 'లేబుల్' అనే వెబ్ సిరీస్ రూపొందింది. క్రైమ్ యాక్షన్ తో కూడిన లీగల్ డ్రామా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను , సీజన్ 1లో భాగంగా 10 ఎపిసోడ్స్ గా రూపొందించారు. ఈ రోజున 3 ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్ చేశారు. కథ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ చెన్నై లో మొదలవుతుంది. చెన్నై 'వాలి నగర్' లో బస్తీ ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. స్లమ్ ఏరియా కావడంతో, సహజంగానే అక్కడి కుర్రాళ్లు చాలా రఫ్ గా ఉంటూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఎక్కడ ఏ దొంగతనం జరిగినా .. హత్యా జరిగినా ఆ స్లమ్ ఏరియా పిల్లల పనిగా అంతా చెప్పుకుంటూ ఉంటారు. ముందుగా వాళ్లనే పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళుతుంటారు. ఎలాంటి నేరం చేయకపోయినా, ఆ ఏరియాకి చెందిన కుర్రాడు కావడం వలన ప్రభాకర్ (జై) పది పన్నెండేళ్ల వయసులోనే జైలుకెళ్లి వస్తాడు.
'వాలి నగర్'లో నేరస్థులు మాత్రమే నివసిస్తారనీ .. అక్కడ నివసించే వారంతా నేరస్థులే అనే ఒక అభిప్రాయాన్ని మార్చాలని ప్రభాకర్ నిర్ణయించుకుంటాడు. ఆ కాలనీకి పేరు తీసుకుని రావడానికీ, స్లమ్ ఏరియా వాసుల జీవితాలను మార్చడం కోసం తాను న్యాయమూర్తిని కావాలనేది అతని ఆశయం. ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టిన ఆయన, లాయర్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు. ప్రభాకర్ ఆలోచనా విధానం నచ్చడం వలన, జర్నలిస్ట్ మహతి (తాన్యా హోప్ ) అతని ప్రేమలో పడుతుంది.
'వాలి నగర్'లోని యువకులను సరైన దారిలో పెట్టి, ఉద్యోగ మార్గాల దిశగా వాళ్లను నడిపించడానికి ప్రభాకర్ ప్రయత్నిస్తూ ఉంటాడు. క్రీడల దిశగా .. చదువుల దిశగా యూత్ ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళుతుంటాడు. ఇదిలా ఉంటే .. ఆ ప్రాంతానికి చెందిన రెండు రౌడీ గ్యాంగుల మధ్య నిరంతరం గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒక వైపున 'సెంగుట్టన్' .. మరో వైపున 'అయ్యా' ఆ ప్రాంతంపై పట్టుకోసం పోటీపడుతుంటారు.
ఈ విషయంలో 'సెంగుట్టన్' దగ్గర ప్రధాన అనుచరుడైన 'పాతాళం' .. 'అయ్య' దగ్గర పనిచేసే బంకు సురేశ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తూ ఉంటారు. ఫలానా రౌడీ తాలూకు మనిషిని అనేది అక్కడ ఒక 'లేబుల్'గా పనిచేస్తూ ఉంటుంది. ఆ లేబుల్ ఉన్న వారికి వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం చెప్పరు. పైగా అలాంటివారికి జైల్లో కూడా రాచ మర్యాదలు జరుగుతూ ఉంటాయి. అలాంటి 'లేబుల్' కోసం శేఖర్ - కుమార్ అనే కుర్రాళ్లు ట్రై చేస్తుంటారు.
పాతాళంను అంతం చేయడం వలన, అలాంటి ఒక లేబుల్ తమకి దక్కుతుందని వాళ్లు బలంగా భావిస్తూ ఉంటారు. వాళ్లను దార్లో పెట్టడానికి ఒక వైపున ప్రభాకర్ ట్రై చేస్తూ ఉండాగానే, మరో వైపున వాళ్లు పాతాళంను చంపడానికి ప్లాన్ చేస్తారు. అదే సమయంలో ప్రభాకర్ కి ఒక అనూహ్యమైన సమస్య ఎదురవుతుంది. అదేంటి? తమ ఏరియాకి మంచి పేరు తీసుకురావడానికి ఆయన చేసే ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ.
ఇంతవరకూ వదిలిన మూడు ఎపిసోడ్స్ లో కూడా హీరో బాల్యం .. ఆయన లాయర్ గా ఎదగడం .. తన వాళ్ల ఎదుగుదల గురించిన ఆలోచన చేయడం చూపించారు. ఒక వ్యక్తి రంగును బట్టి .. పేదరికాన్ని బట్టి .. పెరిగిన ప్రదేశాన్ని బట్టి అతనిపై 'చెడు' ముద్ర వేయడం కరెక్టు కాదు అనే ఉద్దేశం ప్రధానంగా నడిచే కథ ఇది. 'నువ్వు ఎవరన్నది ఎదుటివాడితో చెప్పించుకోవద్దు .. నువ్వెవరన్నది నువ్వే నిరూపించు' అనే సందేశం అంతర్లీనంగా ఉన్న కథ ఇది.
ఈ కథ ఒక మర్డర్ సీన్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. కానీ ఆ తరువాత కథను నడిపించే విషయంలో ఆ స్థాయి స్పీడ్ కనిపించదు. చాలా నిదానంగా .. కాస్త డల్ గానే మిగతా ఎపిసోడ్స్ కనిపిస్తాయి. గ్యాంగ్ వార్ కి సంబంధించిన కథ కావడం వలన, ఫైట్స్ ను కంపోజ్ చేసిన తీరు నచ్చుతుంది. దినేశ్ కృష్ణన్ కెమెరా పనితనం బాగుంది. అలాగే సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సందర్భానికి తగినట్టుగా సాగింది.
ఎడిటింగ్ .. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, ఇంతవరకూ ఓకే. కథలో మలుపులు ఉండే అవకాశం ఎక్కువ కనుక, మున్ముందు మరింత పట్టుగా సాగే అవకాశం లేకపోలేదు. ప్రధానమైన పాత్రలలో కనిపించినవారు సహజంగా చేశారు. మిగతా ఎపిసోడ్స్ ద్వారా మరిన్ని కొత్త పాత్రలు పరిచయమయ్యే అవకాశం కూడా ఉంది. నాలుగో ఎపిసోడ్ నుంచి కథ మరింత స్పీడ్ అందుకుంటుందేమో చూడాలి మరి.
'లేబుల్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ
Label Review
- జై హీరోగా రూపొందిన 'లేబుల్'
- యాక్షన్ తో కూడిన లీగల్ డ్రామా
- 10 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్
- అందుబాటులోకి వచ్చిన 3 ఎపిసోడ్స్
- కథ మరింత చిక్కబడే అవకాశం
Movie Details
Movie Name: Label
Release Date: 2023-11-10
Cast: Jai, Tanya Hope, Sriman, Charan Raj, Ilavarasu, D. R. K. Kiran
Director: Arunraja Kamaraj
Music: Sam C. S.
Banner: Muthamizh
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer