'ఆర్ యు ఓకే బేబీ' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ

Are You Ok Baby

Movie Name: Are You Ok Baby

Release Date: 2023-10-31
Cast: Samuthirakani, Abhirami,Mullai Arasi, Ashok Kumar Balakrishnan, Lakshmy Ramakrishnan, Aadukalam Naren
Director:Lakshmy Ramakrishnan
Producer: Lakshmy Ramakrishnan
Music: Ilaiyaraaja
Banner: Monkey Creative Labs
Rating: 2.50 out of 5
  • తమిళంలో వచ్చిన 'ఆర్ యు ఓకే బేబీ'
  • రీసెంటుగా ఓటీటీ లోకి వచ్చిన సినిమా
  • ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగే కథ
  • సహజత్వానికి పెద్దపీట వేసిన దర్శకురాలు

కన్నతల్లికీ ... పెంపుడు తల్లికి మధ్య జరిగే ఒక మానసిక పరమైన సంఘర్షణ నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. కొన్ని కారణాల వలన తన బిడ్డను వేరొకరికి ఇచ్చేసిన ఒక యువతి, తిరిగి తన బిడ్డ తన దగ్గరే ఉండాలని మనసు మార్చుకుంటుంది. ఫలితంగా చోటు చేసుకునే సంఘటనల సమాహారమే ' ఆర్ యు ఓకే బేబీ' అనే తమిళ సినిమా. ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ 'కేరళ' ప్రాంతంలో నడుస్తుంది. బాలచంద్రన్ (సముద్రఖని) పెద్ద బిజినెస్ మెన్. ఆయన భార్య విద్య (అభిరామి) సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. సంతానం లేకపోవడమే ఆ దంపతులకు ఉన్న పెద్ద అసంతృప్తి. దాంతో ఆడపిల్లనైనా సరే పెంచుకోవాలని వాళ్లు నిర్ణయించుకుంటారు. ఆ సమయంలోనే వివాహానికి ముందే గర్భవతి అయిన శోభ (ముల్లె అరసి) అబార్షన్ చేయించుకోవాలనుకుంటుంది. తాను ప్రేమిస్తున్న త్యాగి (అశోక్ కుమార్)  బాధ్యత కూడా అందుకు ఒక కారణం. 

అలాంటి పరిస్థితుల్లో సుగుణ (వినోదిని విద్యానాథన్) శోభ నిర్ణయానికి అడ్డుపడుతుంది. శోభ సంరక్షణ బాధ్యతను తాను తీసుకుని, డెలివరీ అనంతరం పాపను బాలచంద్రన్ దంపతులకు అందజేస్తుంది. అందుకు కొంత డబ్బును శోభకి బాలచంద్రన్ ముట్టజెబుతాడు. అలా ఏడాది గడిచిపోయిన తరువాత, శోభకి తన బిడ్డ తనకి కావాలని అనిపిస్తుంది. తన బిడ్డను తనకి ఇప్పించమని కోరుతూ, వ్యక్తిగత సమస్యలను చెప్పుకునే ఒక టీవీ కార్యక్రమానికి హాజరవుతుంది.

ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆ కార్యక్రమాన్ని రష్మీ రామకృష్ణన్ (లక్ష్మి రామకృష్ణన్) నిర్వహిస్తూ ఉంటుంది. ఆమె తన షో నుంచి బాలచంద్రన్ కి కాల్ చేసి, తమ దృష్టికి వచ్చిన సమస్యను గురించి చెబుతుంది. 'ఆన్య' ను ఇచ్చినందుకు తాము ఆ పాప తల్లికి డబ్బు ఇచ్చినట్టుగా బాలచంద్రన్ చెబుతాడు. అయినా అది అధికారిక దత్తత క్రిందికి రాదనీ, అనధికారికంగా డబ్బు ఇచ్చి పాపను కొనుక్కోవడం మరింత పెద్ద నేరం అవుతుందని ఆమె అంటుంది. 

బాలచంద్రన్ తన న్యాయవాదిని రంగంలోకి దింపుతాడు. చట్టప్రకారం  దత్తత చేసుకోకుండా, ఇలా డబ్బు ఇచ్చి పాపను ఇంటికి తీసుకుని రావడం సమస్యనే అవుతుందని ఆ లాయర్ చెబుతుంది. ఏడాది తరువాత పాప విషయంలో ఇలాంటి సమస్య తలెత్తడం బాలచంద్రన్ కి అయోమయాన్ని కలిగిస్తుంది. పాప తమకి దూరమైపోతుందేమోనని అతను కంగారు పడుతూ ఉంటాడు. ఇక మరో వైపున తన బిడ్డ కోసం శోభా గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.   

ఇలా ఈ వ్యవహారం టీవీ ఛానల్స్ స్థాయికి దాటి కోర్టుకు వెళుతుంది. తన పాప తనకి కావాలని శోభ .. తన పాప తమకే దక్కాలని బాలచంద్రన్ దంపతులు పట్టుపడతారు. ఇరు పక్షాల వారు వాదనను విన్న న్యాయమూర్తి ఏమని తీర్పు ఇస్తారు? ఎవరికీ తీర్పు అనుకూలంగా వస్తుంది? అక్కడ చోటుచేసుకునే సన్నివేశాలు ఎలాంటివి? అనేవి ఈ కథలోని ఆసక్తికరమైన అంశాలు. 

ఈ కథకి రచయితగా ... దర్శక నిర్మాతగా లక్ష్మి రామకృష్ణన్ వ్యవహరించారు. టీవీలో ఆ మధ్య వచ్చిన ఒక ఫ్యామిలీ షోను ఆధారంగా చేసుకుని అల్లుకున్న కథ ఇది. ప్రధానమైన పాత్రలు కొన్ని మాత్రమే కనిపిస్తాయి. ఆ పాత్రలు అనుభవించే మానసిక సంఘర్షణ చుట్టూనే ఈ కథ నడుస్తూ ఉంటుంది. పేదరికం .. పరిస్థితులు కారణంగా బిడ్డను దూరం చేసుకున్న తల్లి ఒక వైపు, సంపదలున్నా తెచ్చుకున్న బిడ్డ ఎక్కడ దూరమైపోతుందోనని ఆందోళన చెందే పెంపుడు తల్లి ఒక వైపు. 


ఇలా ఈ రెండు వైపుల నుంచి కథ నడుస్తూ ఉంటుంది. చివరికి కోర్టుకు చేరుకున్న ఈ కథ .. అక్కడ ఆడియన్స్ ను కదిలించి వేస్తుంది. సినిమా టిక్ డైలాగ్స్ తో కాకుండా సహజత్వానికి దగ్గరగా అనిపించే సంభాషణలతో ఈ కథను నడిపించారు. ఒక వైపు నుంచి సముద్రఖని .. మరో వైపు నుంచి న్యాయమూర్తిగా 'ఆడుకాలం' నరేన్ కథకి మరింత బలాన్ని చేకూర్చారు. సహజత్వానికి దగ్గరగా అనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు వెంటనే కనెక్టు అవుతాయి. 

ఈ తరహా ఎమోషన్స్ తో కూడిన కథలు తెరపైకి రావడం కొత్తేమీ కాదు. కొత్త కథ కాదుగదా అని ఎమోషన్స్ కి దూరంగా ఉండటం కూడా సాధ్యం కాదు. కన్నతల్లికీ - పెంపుడు తల్లికి మధ్య జరిగే మానసిక సంఘర్షణ, కాలంతో పని లేకుండా కన్నీళ్లు పెట్టిస్తూనే ఉంటుంది. సంగీతం ... కెమెరాల పనితనం .. ఎడిటింగ్ అన్నీ కూడా కథకి తగినట్టుగానే నడుస్తూ వెళ్లాయి. 

Trailer

More Reviews