'ఆపరేషన్ అలమేలమ్మ' - (ఆహా) మూవీ రివ్యూ

Operation Alamelamma

Movie Name: Operation Alamelamma

Release Date: 2023-10-27
Cast: Shraddha Srinath, Rishi, Rajesh Nataranga, Aruna Balraj , Sheelam M Swamy,
Director:Suni
Producer: Amrej Suryavanshi
Music: Judah Sandhy
Banner: Suni Cinemas
Rating: 2.75 out of 5
  • శ్రద్ధా శ్రీనాథ్ ప్రధానమైన పాత్రగా 'ఆపరేషన్ అలమేలమ్మ'
  • క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ 
  • స్క్రీన్ ప్లేపై మరింతగా జరగవలసిన కసరత్తు 
  • తక్కువ పాత్రలతో కొంతవరకు మెప్పించిన దర్శకుడు   

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో శ్రద్ధా శ్రీనాథ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ఆమె చేసిన సినిమాల్లో 'జెర్సీ' మంచి పేరు తీసుకొచ్చింది. త్వరలో రానున్న 'సైంధవ్' సినిమాలో ఆమె కనిపించనుంది. ఈ నేపథ్యంలో కన్నడలో కొంతకాలం క్రితం ఆమె చేసిన 'ఆపరేషన్ అలమేలమ్మ' అనే సినిమా, తెలుగు వెర్షన్ లో ఈ రోజునే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఓటీటీ ద్వారా తెలుగు ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.

ఈ కథ 'బెంగుళూరు'లో జరుగుతూ ఉంటుంది. పరమేశ్ (రిషి) ఓ అనాథ. తనవారంటూ ఎవరూ లేని జీవితాన్ని అతను గడుపుతూ ఉంటాడు. రోజు గడవడం కోసం కూరగాయల మార్కెట్ లో పనిచేస్తూ ఉంటాడు. తనకి ఎవరూ పిల్లను ఇవ్వరనే సంగతి అతనికి తెలుసు .. అందువలన పెళ్లికాని  అమ్మాయిలు కనిపిస్తే చాలు, వాళ్లను పెళ్లి కూతురుగా ఊహించుకుని మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అతనికి ఖరీదైన జీవితాన్ని గడపాలనీ .. బ్రాండెండ్ వస్తువులను వాడాలనే ఒక పిచ్చి ఉంటుంది.

అలాంటి అతనికి ఒక బట్టల షాపులో 'అనన్య' (శ్రద్ధా శ్రీనాథ్) పరిచయమవుతుంది. ఆమెను అదే పనిగా ఫాలో అవుతూ మొత్తానికి తన గురించి ఆమె ఆలోచించేలా చేస్తాడు. ఆమె ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. తండ్రిలేని ఆ కుటుంబానికి ఆమె జీతమే ఆధారం. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి హాస్పిటల్ ఖర్చులతో ఆమె సతమతమవుతూ ఉంటుంది. అనన్య ఆర్ధిక పరమైన ఇబ్బందులను అనుకూలంగా తీర్చుకుని, ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో రాహుల్ ఉంటాడు. 

ఇక ఇదిలా ఉండగా 'అనన్య' స్కూల్ లో చదువుతున్న 'జాన్' .. పెద్ద బిజినెస్ అయిన 'కెనడీ'కి ఒక్కగానొక్క కొడుకు. అతను కిడ్నాప్ కి గురవుతాడు. 25 లక్షలు ఇస్తే 'జాన్'ను వదిలేస్తామని కిడ్నాపర్స్ డిమాండ్ చేస్తారు. దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడం, స్పెషల్ ఆఫీసర్ గా 'అశోక్' రంగంలోకి దిగడం జరిగిపోతాయి. కిడ్నాపర్లు చెప్పిన చోట 'క్యాష్ బ్యాగ్' ను ఉంచుతారు పోలీసులు. ఆ బ్యాగ్ బ్రాండెడ్ కంపెనీది కావడంతో, దాని దగ్గరికి వెళ్లి పట్టుకుంటాడు రిషి.

రిషినే కిడ్నాపర్ గా భావించి పోలీసులు అతణ్ణి అరెస్టు చేస్తారు. జాన్ ఆచూకీ చెప్పమంటూ హింసించడం మొదలుపెడతారు. తనకి ఏమీ తెలియదని ఎంతగా చెప్పినా ఎవరూ వినిపించుకోరు. అప్పుడు అతను ఏం చేస్తాడు? జాన్ ను కిడ్నాప్ చేసిందిదెవరు? అనన్య పెళ్లి ఎవరితో జరుగుతుంది? అనన్య ప్రేమకథకు .. రిషిని జైలుకు తీసుకెళ్లిన  కిడ్నాప్ కథకు ముగింపు ఏమిటి? అనేది ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించే అంశం. 

'సుని' ఈ సినిమాకి రచయితగా .. దర్శకుడిగా వ్యవహరించాడు. విలాసవంతమైన జీవితాన్ని కోరుకునే ఒక యువకుడు .. ఆర్ధికపరమైన ఇబ్బందులతో సతమతమయ్యే ఓ యువతి. ఈ నేపథ్యంలో జరిగే ఓ శ్రీమంతుడి కొడుకు కిడ్నాప్. ఈ మూడు పాయింట్స్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. అటు హీరోపై .. ఇటు హీరోయిన్ పై ప్రేక్షకులకు అనుమానాలు తలెత్తుతూనే ఉంటాయి. ఈ కిడ్నాప్ ప్లాన్ కి అసలు సూత్రధారి ఎవరనేది చివర్లో ప్రేక్షకులకు షాక్ ఇచ్చే ట్విస్ట్.

ఈ కథ కిడ్నాప్ డ్రామాతో మొదలవుతుంది. ఆ తరువాత హీరో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎక్కువగా నడవడం వలన, కిడ్నాప్ కథను గురించి ప్రేక్షకులు మరిచిపోతారు. మధ్య మధ్యలో చూపించే కిడ్నాప్ డ్రామా ట్రాక్ కు అంత గ్యాప్ ఇవ్వకుండా ఉండవలసింది. అలాగే హీరోయిన్ స్క్రీన్ పై కనిపించే సీన్స్ మధ్య కూడా గ్యాప్ వచ్చేసింది. స్క్రీన్ ప్లే పై మరింత కసరత్తు చేస్తే బాగుండేదని అనిపిస్తుంది. 

ఇక కిడ్నాప్ డ్రామాకి సంబంధించిన సన్నివేశాలు కూడా ఆశించినస్థాయిలో ఉత్కంఠను పెంచవు.  ఇలాంటి కథలను గతంలో ఆల్రెడీ చూసేసాం కదా అనే అనిపిస్తుంది. కాకపోతే తక్కువ బడ్జెట్లో .. తక్కువ పాత్రలతో ఈ మాత్రం కథను నడిపించడం సాధారణ ప్రేక్షకులకు పెద్దగా అసంతృప్తిని కలిగించకపోవచ్చు. ప్రధానమైన పాత్రధారులంతా చాలా బాగా చేశారు. ముఖ్యంగా శ్రద్ధా శ్రీనాథ్ - రిషి తమ పాత్రలకు న్యాయం చేశారు. 

శ్రద్ధా శ్రీనాథ్ .. 'సైతాన్' సినిమాతో పరిచయమైన 'రిషి' తెలుగు ప్రేక్షకులకు పరిచయమే కావడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. కథ మొదలైన తరువాత 20 నిమిషాల వరకూ హీరోయిన్ ఇంట్రడక్షన్ లేకపోవడం, క్లైమాక్స్ కి ముందు 20 నిమిషాల పాటు ఆమె తెరపై కనిపించకపోవడం అసహనాన్ని కలిగిస్తుంది. అసలు ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టడం వెనుక రీజన్ మాత్రం, అందరికీ ఆమోదయోగ్యంగా అనిపిస్తుంది. అభిషేక్ కాసర్ గడ్ ఫొటోగ్రఫీ ... జుదాహ్ శాండీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. సచిన్ బి. రవి ఎడిటింగ్ కథను కాపాడుతూ వెళ్లాయనే చెప్పచ్చు.

More Reviews