నానీస్ 'గ్యాంగ్ లీడర్' మూవీ రివ్యూ

Gang Leader

Movie Name: Gang Leader

Release Date: 2019-09-13
Cast: Nani, Priyanka, Lakshmi, Sharanya, Karthikeya, Vennela Kishore, Priayadarshi, Baby Praanya
Director:Vikram K Kumar
Producer: Naveen Yerneni, Ravi, Mohan
Music: Anirudh
Banner: Mythri Movie Makers
Rating: 3.00 out of 5
ఒక వ్యక్తి కారణంగా ఐదుగురి జీవితాల్లో విషాదం చోటుచేసుకుంటుంది. ఆ ఐదుగురు కలిసి ఆ వ్యక్తిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయంలో వాళ్లంతా పెన్సిల్ పార్థసారథి అనే ఒక రైటర్ సాయాన్ని కోరతారు. వాళ్లకి ఆయన ఎలా సాయపడ్డాడనేదే కథ. అక్కడక్కడా కథ కాస్త నెమ్మదించినా, కామెడీని ఆసరా చేసుకుని మళ్లీ పుంజుకుంటూ నడుస్తుంది .. నాని అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవచ్చు.

మొదటి నుంచి కూడా విక్రమ్ కుమార్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, ఆ కథలను ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరిస్తూ వస్తున్నాడు. జయాపజయాల సంగతి అటుంచితే విక్రమ్ కుమార్ కథను అల్లుకునే తీరుకి .. కథనాన్ని నడిపించే విధానానికి ఎప్పుడూ ప్రశంసలు దక్కుతూనే వున్నాయి. తాజాగా ఆయన తెరకెక్కించిన నానీస్ 'గ్యాంగ్ లీడర్' ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో రివేంజ్ డ్రామాను కామెడీతో కలిపి నడిపించే సాహసం చేశారాయన. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలించిందో ఇప్పుడు చూద్దాం.

నాని (పెన్సిల్ పార్థసారథి) ఓ అనాథ. 'పెన్సిల్' అనేది అతని కలం పేరు. రివేంజ్ కి సంబంధించిన సినిమాలు చూస్తూ, ఆ కథలను కాపీ కొట్టేసి నవలలు రాస్తుంటాడు. చిన్నప్పటి నుంచి 'పెన్సిల్' తో వున్న స్నేహం కారణంగా ఆయన రాసిన కథలను రామకృష్ణ (ప్రియదర్శి) పబ్లిష్ చేస్తుంటాడు. ఒక రోజున 'పెన్సిల్' దగ్గరికి వృద్ధురాలైన సరస్వతి (లక్ష్మి) నడి వయస్కురాలైన వరలక్ష్మి (శరణ్య) యువతులైన ప్రియ (ప్రియాంక) స్వాతి (శ్రియా రెడ్డి) బేబీ చిన్నూ (ప్రాణ్య) వస్తారు. వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఐదుగురు, తమ కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తులను ఒక వ్యక్తి పొట్టనబెట్టుకున్నాడని చెబుతారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడంలోను .. పగ తీర్చుకోవడంలోను తమకి సహకరించమని కోరతారు. వాళ్లను అనాథలుగా చేసిన ఆ వ్యక్తి నెంబర్ వన్ రేసర్ దేవా (కార్తికేయ) అని తెలుసుకుని 'పెన్సిల్' షాక్ అవుతాడు. ఆ తరువాత ఆ గ్యాంగ్ కి లీడర్ గా ఆయన ఎలాంటి వ్యూహాలు పన్నుతాడు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.

సాధారణంగా ప్రతీకారం తీర్చుకోవడమనే ఒక అంశాన్ని కామెడీతో కలిపి నడిపించడమనేది అంత తేలికైన విషయం కాదు. ఆ రెండింటిని ఒకే ఒరలో సెట్ చేయడానికి విక్రమ్ కుమార్ చేసిన సాహసంగా 'గ్యాంగ్ లీడర్' కనిపిస్తుంది. ఓ రాత్రివేళ బ్యాంకు నుంచి 300 కోట్ల రూపాయలను కొల్లగొట్టేసే ఫస్టు సీన్ తోనే విక్రమ్ కుమార్ కథలోకి తీసుకెళ్లిపోయాడు. ఒక రేంజ్ సీన్ తో కథకి రిబ్బన్ కట్ చేసిన ఆయన, చాలా తక్కువ సమయంలోనే ప్రధాన పాత్రలన్నింటినీ కలిపే విషయంలో మంచి మార్కులు కొట్టేశాడు. కథలో కామెడీని భాగం చేయడంలో ఆయన తన నైపుణ్యాన్ని కనబరిచాడు. ఫస్టాఫ్ లో టైట్ స్క్రీన్ ప్లే తో సాగిన కథ, సన్నివేశాల్లోని సాగతీత కారణంగా సెకండాఫ్ లో అక్కడక్కడా కాస్త సడలినట్టుగా అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే, సున్నితమైన ప్రేమ .. మనసును భారం చేసే భావోద్వేగం .. సరదాగా సాగే కామెడీ .. అవసరమైన చోట యాక్షన్ ను సమపాళ్లలో సెట్ చేస్తూ ఈ కథను నడిపించడంలో విక్రమ్ కుమార్ చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

'గ్యాంగ్ లీడర్' గా పెన్సిల్ పార్థసారథి పాత్రలో నాని మెప్పించాడు. లవ్ .. కామెడీ .. ఎమోషన్ .. యాక్షన్ సీన్స్ లో ఆయన తన మార్కు చూపించాడు. ఇక కథానాయిక ప్రియాంక కూడా గ్యాంగ్ లో ఒకరిగా కనిపించడం వలన ఆమె నటనకి గల అవకాశం తక్కువ .. ఉన్నంతలో బాగానే చేసింది. అందం - అమాయకత్వం కలగలిసిన ఆకర్షణీయమైన రూపంతో .. మనసును కట్టిపడేసే కళ్లతో కుర్రకారు మనసులను దోచేసే హీరోయిన్ గా ఆమెకి మంచి మార్కులు దక్కుతాయి. ఇక లక్ష్మీ .. శరణ్య ఇద్దరూ కూడా సీనియర్ ఆర్టిస్టులు కావడం వలన తమ పాత్రలను అవలీలగా చేసి పారేశారు. విలన్ గా కార్తికేయ నటన బాగుంది. తన ఆనందం కోసం .. ఆశయం కోసం ఎంతకైనా తెగించే దేవ్ పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇక 'గే' పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించాడు.

ఈ సినిమాకి సంగీతాన్ని .. రీ రికార్డింగ్ ను అనిరుధ్ అందించాడు. పాటలు మనసును పెద్దగా పట్టుకోవుగానీ, సందర్భానికి తగినట్టుగా అనిపిస్తూ అనుభూతిని అందిస్తాయి. ఇక రీ రికార్డింగ్ పట్ల తీసుకున్న శ్రద్ధ ఫస్టు సీన్ తోనే తెలిసిపోతుంది. ప్రతి సన్నివేశం రీ రికార్డింగును ప్రధాన బలంగా చేసుకుంటూ నడుస్తుంది. ఫొటోగ్రఫీ ఫరవాలేదు .. బ్యాంకు దోపిడీ చిత్రీకరణ బాగుంది. ఎడిటింగ్ విషయానికొస్తే, ప్రీ క్లైమాక్స్ లో లక్ష్మీ - నాని కాంబినేషన్లో వచ్చే సీన్ ను ట్రిమ్ చేస్తే బాగుండేది. ఒక వృద్ధురాలు 300 కోట్ల రూపాయలను శరణాలయానికి తీసుకెళ్లడం వంటి సీన్ కాస్త అతిశయోక్తిగా అనిపిస్తుందంతే. సంభాషణల్లోగానీ .. దృశ్యాలలో గానీ .. కామెడీలోగాని అసభ్యతకి చోటు లేకపోవడం వలన, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేదిగా ఈ సినిమా కనిపిస్తుంది.

More Reviews