'మ్యాడ్' - మూవీ రివ్యూ

MAD

Movie Name: MAD

Release Date: 2023-10-06
Cast: Narne Nithin, Sangeeth Sobhan, Ram Nithin, Ananthika, Gouri Priya, Gopika Udayan
Director:Kalyan Shankar
Producer: Suryadevara Nagavamsi
Music: Bheems
Banner: Sithara
Rating: 2.75 out of 5
  • యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా 'మ్యాడ్'
  • కథాకథనాల్లో కనిపించని కొత్తదనం
  • లవ్ లో కనిపించని ఫీల్ .. పెద్దగా పేలని కామెడీ
  • భీమ్స్ సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణ 

ఇంజనీరింగ్ కాలేజ్ లు .. బాయ్స్ హాస్టల్స్ .. ఉమెన్స్  హాస్టల్స్ .. అక్కడి లైఫ్ స్టైల్ కి సంబంధించిన నేపథ్యంలో ఇంతవరకూ చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి కంటెంట్ తో వచ్చిన మరో సినిమానే 'మ్యాడ్'. నార్నె నితిన్ .. సంగీత్ శోభన్ .. రామ్ నితిన్ ఈ సినిమాతోనే హీరోలుగా పరిచయమయ్యారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్స్ కి వచ్చింది. యూత్ కి ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. 

అశోక్ ( నార్నె నితిన్) .. దామోదర్ (సంగీత్ శోభన్) .. మనోజ్ (రామ్ నితిన్) కొత్తగా ఇంజనీరింగ్ కాలేజ్ లో అడుగుపెడతారు. కాలేజ్ క్యాంపస్ .. హాస్టల్ లైఫ్ వాళ్లకి కొత్తగా అనిపిస్తాయి. అశోక్ ఏ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటూ వెళుతుంటాడు. దామోదర్ మాత్రం అన్ని విషయాలలోను చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంటాడు. ఇక మనోజ్ మాత్రం అమ్మాయిలను లైన్లోపెట్టే పనిలోనే ఉంటాడు.

ఆ కాలేజ్ లో వాళ్ల ముగ్గురికీ గణేశ్ (లడ్డూ)తో పరిచయమవుతుంది. అశోక్ ఓ అనాథ అనే విషయం జెన్నీ (ఆనంతిక)కి తెలుస్తుంది. అతని పట్ల ఆమెకి గల సానుభూతి ప్రేమగా మారుతుంది. అప్పటి నుంచి లవ్వంటూ ఆమె అతని వెంటపడుతూ ఉంటుంది. ఇక మనోజ్ ప్రయత్నాలు ఫలించి, అతని ప్రేమలో శృతి (గౌరీ ప్రియ) పడుతుంది. దాంతో తనని మాత్రం ఎవరూ ప్రేమించడం లేదనీ, పలకరిస్తే చాలు బ్లాక్ లిస్టులో పెడుతున్నారని 'లడ్డూ' బాధపడుతూ ఉంటాడు. 

ఇక తాను మాత్రం అమ్మాయిల జోలికి పోననీ, అయినా తనని ఎవరూ లవ్ చేయరని స్నేహితులతో దామోదర్ బలంగా చెబుతాడు. ఆ మరుసటి రోజునే 'వెన్నెల' అనే అమ్మాయి దగ్గర నుంచి అతనికి ఒక లవ్ లెటర్ వస్తుంది. తాను ఎవరనేది తెలుసుకోమంటూ అతనిలో ఒక ఆసక్తిని రేపుతోంది. దాంతో తనని ప్రేమిస్తున్నది ఎవరనేది తెలుసుకునే పనిలో పడతాడతను. ఈ స్నేహితుల ప్రేమ కథలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అనేది మిగతా కథ. 

దర్శకుడు కల్యాణ్ శంకర్ తయారు చేసుకున్న కథ ఇది. 'హ్యాపీడేస్' మొదలు కాస్త అటు ఇటుగా ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తీరు .. అక్కడ జరిగే ర్యాగింగ్ .. స్టూడెంట్స్ మధ్య చోటుచేసుకునే అల్లర్లు .. అలకలు .. ప్రేమలు .. ఈ తరహా కథల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఆయా కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ .. వాళ్ల ధోరణికి కామెడీ టచ్ ఇస్తూ సాగుతూనే ఉంటాయి. అలాంటి సన్నివేశాలన్నీ ఈ కథలోను చోటుచేసుకున్నాయి. 

Manoj .. Ashok .. Damodar ఈ మూడు ప్రధానమైన పాత్రలుగా కనిపిస్తాయి. ఆ పాత్రల పేర్లలో మొదటి అక్షరాలు కలిపితే MAD .. దానినే టైటిల్ గా సెట్ చేశారు. ఫస్టు పార్టులో ముగ్గురు స్నేహితులకు సంబంధించిన లవ్ ట్రాక్ ను ఒక రేంజ్ కి తీసుకొచ్చిన దర్శకుడు, వెన్నెల ఎవరనేది రివీల్ అవుతుందేమోనని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తుండగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి, సెకండ్ పార్టుపై కుతూహలాన్ని పెంచాడు.

వెన్నెల ఎవరనేది తెలుసుకోవడం కోసం ముసుగులు వేసుకుని లేడీస్ హాస్టల్ లోకి వెళ్లడం .. లడ్డూను చూడటానికి హాస్టల్ రూమ్ కి తండ్రి రావడం .. పరీక్షల్లో అంతా చీటీలు పెట్టడం .. ప్రిన్సిపాల్ కి పేరెంట్స్ ఫిర్యాదు చేసే సీన్స్ లో నవ్వించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అయితే వాస్తవానికి దగ్గరగా కొన్ని సన్నివేశాలు ఉండటం వలన యూత్ కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయేగానీ, ఆశించిన స్థాయిలో కామెడీ వర్కౌట్ కాలేదనే చెప్పాలి. 

ఈ కంటెంట్ లో లవ్ ..  కామెడీ ప్రధానంగా ఉండే అంశాలు. రొమాన్స్ గానీ .. ఎమోషన్స్ ను గాని టచ్ చేసే ప్రయత్నం చేయలేదు. లవ్ వైపు నుంచి ఫీల్ వర్కౌట్ కాలేదు .. కామెడీ వైపు నుంచి రాసుకున్న సీన్స్ పండలేదు. దామోదర్ కి వచ్చిన లవ్ లెటర్ అంశాన్ని చాలాసేపు లాగారేమో అనిపిస్తుంది. అలాగే కాలేజ్ లో లెక్చరర్స్ ప్రేమాయణం గురించిన అంశం నాటకీయంగా అనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా ఈ సీన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. 

ప్రధానమైన పాత్రలను పోషించిన వారంతా న్యాయం చేశారు. సితార బ్యానర్ నుంచి రావడం వలన, నిర్మాణపరమైన విలువలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. భీమ్స్ అందించిన బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. 'నువ్వు నవ్వుకుంటూ' పాట హైలైట్ గా అనిపిస్తుంది. మిగతా ట్యూన్స్ కూడా సరదాగా .. సందడిగా అనిపిస్తాయి. కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉంది.  శ్యామ్ దత్ - దినేశ్ కృష్ణన్ ఫొటోగ్రఫీ బాగుంది. 

దర్శకుడు కేవలం స్టూడెంట్స్ పాత్రలనే ప్రధానంగా తీసుకుని వాళ్లపైనే నడిపించాడు. కథాకథనాల పరంగా కొత్తదనం లేకపోయినా .. ఆశించిన స్థాయిలో కామెడీ పేలకపోయినా, కొన్ని అంశాలను ఓన్ చేసుకోవడానికి యూత్ ట్రై చేస్తోంది. ఈ కంటెంట్ కి మిగతా వైపుల నుంచి కూడా వినోదాన్ని అందించే అవకాశం ఉందిగానీ, దర్శకుడు ఆ వైపు వెళ్లలేదు. ఆ దిశగా కథపై కసరత్తు జరిగుంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదేమో!

Trailer

More Reviews