'జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్' (సోనీ లివ్) మూవీ రివ్యూ

Journey of love

Movie Name: Journey of love

Release Date: 2023-09-15
Cast: Naslen K. Gafoor, Mathew Thomas,Meenakshi Dinesh, Nikhila Vimal, Binu Pappu,Rajesh Madhavan
Director:Arun D. Jose
Producer: Anumod Bose
Music: Christo Xavier
Banner: Falooda Entertainments
Rating: 2.75 out of 5
  • టీనేజ్ లవ్ స్టోరీగా 'జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్'
  • విలేజ్ నేపథ్యంలో నడిచే కథ 
  • సింపుల్ లైన్ .. పరిమిత సంఖ్యలో పాత్రలు
  • యూత్ కి కనెక్ట్ అయ్యే సహజత్వం

ఈ మధ్య కాలంలో టీనేజ్ ప్రేమకథలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందువలన ఆ తరహా సినిమాలను తెరకెక్కించడానికి మేకర్స్ ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమకథా చిత్రాలలో 'జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్' ఒకటిగా నిలిచింది. మలయాళంలో రూపొందిన ఈ సినిమా, జులై 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. అక్కడ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ సినిమా, నిన్నటి నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

అది ఒక గ్రామం .. ఆ గ్రామంలో రవీంద్రన్(మనోజ్) పెద్ద మనిషిగా చెలామణి అవుతూ ఉంటాడు. భార్య శోభ .. కొడుకు అర్జున్ (సత్యం మోహన్) కూతురు అథిర (మీనాక్షి దినేశ్) .. ఇది అతని కుటుంబం. రాజకీయాలలోను రవీంద్రన్ చక్రం తిప్పుతూ ఉంటాడు. అలాంటి రవీంద్రన్ కూతురును అఖిల్ (నస్లీన్) ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె కూడా అతణ్ణి గాఢంగానే ప్రేమిస్తూ ఉంటుంది.అయితే కులమతాల కారణంగా .. ఆర్ధిక స్థోమత విషయంలో అంతరాల కారణంగా ఆమె ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతుంది. 

అయితే అఖిల్ - అథిర కలిసి తిరుగుతూ ఉండటాన్ని అర్జున్ చూస్తాడు. దాంతో ఈ విషయం ఆమె తండ్రి దృష్టికి వెళుతుంది. ఇక ఆమెను ఆ ఊళ్లో ఉంచడం మంచిది కాదని భావించి. ఆమె మేనత్త ఊరు అయిన అహ్మదాబాద్ కి పంపించాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయాన్ని గ్రహించిన అథిర రహస్యంగా అఖిల్ కి కాల్ చేస్తుంది. తాము ఆ ఊరొదిలిపోయి పెళ్లి చేసుకుందామని అంటుంది. దాంతో గతంలో ఊళ్లో వాళ్లను ఎదిరించి పెళ్లి చేసుకున్న రాజేశ్ (బినూ పప్పు) సాయాన్ని తీసుకుంటాడు.

తన స్నేహితులతో కలిసి పక్కాగా ప్లాన్ చేసుకున్న అఖిల్, ఓ రాత్రివేళ అథిరతో కలిసి ఆ ఊరు నుంచి బయటపడతాడు. స్నేహితుల సమక్షంలోనే ఓ దేవాలయంలో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఊళ్లో గందరగోళంగా ఉందనీ .. తమ కోసం అర్జున్ వెతుకుతుతున్నాడని తెలిసి, హోటల్లో బస చేస్తారు. అయితే అథిర వాళ్ల నాయనమ్మ చనిపోయిందనే వార్త అఖిల్ కి తెలుస్తుంది. ఏదైనా జరగనీ, అథిర తన నాయనమ్మను చూడటానికి వెళ్లవలసిందేనని అఖిల్ నిర్ణయించుకుంటాడు. 

అథిర తన నాయనమ్మ చనిపోయిందని తెలిసి బాధపడుతుంది. తమ ఊరు వెళ్లవలసిందేనని అంటుంది. దాంతో అఖిల్ .,. అతని స్నేహితులు ఆమెను వెంటబెట్టుకుని తమ ఊరు బయల్దేరతారు. అక్కడికి వెళ్లిన తరువాత ఏం జరుగుతుందా అని వాళ్లంతా టెన్షన్ పడుతూనే ఉంటారు. కంగారు పడవలసిన పనిలేదనీ, ఆల్రెడీ తాను ఒక లాయర్ ను కూడా మాట్లాడి పెట్టానని వాళ్లకి రాజేశ్ ధైర్యం చెబుతాడు. 

అఖిల్ తో కలిసి అథిర తన ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఆమె మనసు మార్చాలనే ఆలోచనలో తండ్రి ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోను ఆమె తన వైపునే నిలబడుతుందనే నమ్మకంతో అఖిల్ ఉంటాడు. లాయర్ రెడీగానే ఉన్నాడు కదా అనే ధైర్యంతో అఖిల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆమె మేజర్ కాదు .. మైనర్ అనే విషయం అప్పుడు బయటికి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత కథలో చోటుచేసుకునే మలుపులు ఎలాంటివి? అనేవి ఆసక్తికర అంశాలు. 

అరుణ్ జోస్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఒక గ్రామం .. ఆ గ్రామంలోని కొన్ని ముఖ్యమైన పాత్రలు .. ప్రేమలో పడే నాయకా నాయికలు .. ఆ ప్రేమను వ్యతిరేకించే పెద్దలు .. తమ ప్రేమను పెళ్లి దిశగా నడిపించడం కోసం ఆ జంట చేసే ప్రయత్నాలు .. ఫలితంగా ఆ జంట ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది అనే విషయాల చుట్టూ ఈ కథ పరిగెడుతుంది.

ఈ కథ ఇంతకుముందు రానిది కాదు .. ఇప్పుడు కొత్తగా కనిపెట్టిందీ కాదు. అలాగే స్క్రీన్ ప్లే పరంగా కూడా పెద్దగా మేజిక్ లు ఏమీ కనిపించవు. ఒక పుస్తకం చదువుతున్నట్టుగా ఈ కథ సాగిపోతూ ఉంటుంది. మరి ఈ ప్రేమకథ ప్రత్యేకత ఏమిటి? అనే ప్రశ్న వేసుకుంటే, సహజత్వం అనేదే సమాధానంగా దొరుకుతుంది. సహజత్వమే ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పుకోవాలి. ఆ బలంతో ఈ కథ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. 

టీనేజ్ లో చదువు మధ్యలోనే ఉంటుంది .. దగ్గర డబ్బులు ఉండవు .. లవ్ మేటర్ అనేది సీక్రెట్ గనుక ఎవరితో సమస్యను చెప్పుకోలేని పరిస్థితి .. ముందుచూపు ఉండదు. అయినా తమ ప్రేమను గెలిపించుకోవడానికి యువతి యువకులు ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి ఒక జంటను యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథలో పాటలు ఉండవు .. ఫీలింగ్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.

సతీశ్ కురుప్ ఫొటోగ్రఫీ .. క్రిష్టో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఛమన్ ఎడిటింగ్ అంతా కూడా కథకి తగినట్టుగా .. సహజత్వానికి దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. తక్కువ బడ్జెట్ .. పరిమితి సంఖ్యలో పాత్రలు .. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సహజత్వానికి దగ్గరగా నడిచే కథ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. పాత కథనే అయినా దానిని సింపుల్ గా చెప్పిన తీరు యూత్ కి కనెక్ట్ అవుతుంది. 

Trailer

More Reviews