'బజావ్' - (జియో సినిమా) వెబ్ సిరీస్ రివ్యూ

Bajao

Movie Name: Bajao

Release Date: 2023-08-25
Cast: Raftaar, Tanuj Virwani, Sahil Vaid, Sahil Khattar, Mahira Sharma, Rajesh Sharma, Nitish Pandey, Monalisa
Director:Shiva Varma - Saptaraj Chakraborty
Producer: Jyoti Deshpande - Pragya Singh,
Music: Saurabh Lokhande - Jarvis Menezes,
Banner: A Solflicks Filmworks Production
Rating: 2.25 out of 5
  • ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న 'బజావ్'
  • ఫస్టు సీజన్ లో భాగంగా వదిలిన 8 ఎపిసోడ్స్  
  • పస లేని కామెడీ .. పట్టులేని సన్నివేశాలు
  • డైలాగ్స్ తోనే కాలయాపన  
  • ర్యాప్ సాంగ్స్ ను అనువదించిన తీరు మరో మైనస్

'జియో సినిమా' ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెబ్ సిరీస్ లను ట్రాక్ పైకి తెచ్చేస్తోంది. అలా తాజాగా 'బజావ్' అనే సిరీస్ ను అందుబాటులోకి తెచ్చింది. సీజన్ 1లో భాగంగా 8 ఎపిసోడ్స్ ను ప్లాన్ చేశారు. ముందుగా 4 ఎపిసోడ్స్ ను వదిలారు. ఈ ఎపిసోడ్స్ ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ నెల 30వ తేదీతో ఫస్టు సీజన్ పూర్తి కానుంది. ముగ్గురు స్నేహితుల ఆశయం .. ఇద్దరు ర్యాపర్స్ మధ్య పోటీ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ ఢిల్లీ నేపథ్యంలో జరుగుతుంది. వేద్ (తనూజ్ విర్వాణి) ధారి (సాహిల్ ఖట్టర్) కుకీ (సాహిల్ సతీశ్) ఈ ముగ్గురూ కూడా మంచి స్నేహితులు. ఎవరికి తెలిసిన పనిని వారు కష్టపడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారుగానీ, ఆఫీసులో నాలుగు గోడల మధ్య ఇమడలేక పోతుంటారు. బాస్ తో చీవాట్లు తింటూ ఉంటారు. ఇక ఈ అవమానాలను భరించడం తమ వలన కాదని భావించి, సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేస్తారు. 

వేద్ కీ .. కుకీకి మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడంలో అవగాహన ఉంటుంది. ఇక 'ధారి'కి మార్కెటింగ్ తెలివి తేటలు బాగా ఉంటాయి. అందువలన ముగ్గురూ కలిసి ర్యాప్ సాంగ్స్ కి సంబంధించిన ఆల్బమ్స్ చేయాలనుకుని రంగంలోకి దిగుతారు. అప్పుడు వాళ్ల దృష్టి ర్యాప్ సింగర్స్ 'ఓజీ' .. 'బబ్బర్'పై పడుతుంది. ఆ ఇద్దరూ స్టార్స్  గనుక, వాళ్లతో ఆల్బమ్స్ చేస్తే బాగుంటుందని భావిస్తారు. అయితే  ఆల్రెడీ 'ఓజీ' తిరుగులేని స్టార్ సింగర్ గా ఉన్నాడు. అందువలన తమ ఆల్బమ్ చేయడనే నిర్ణయానికి వస్తారు.

 'ఓజీ' కారణంగా వెనుకబడి, డిప్రెషన్ లోకి వెళ్లిన 'బబ్బర్'తో ఆల్బమ్ చేయడం వీలవుతుందని భావిస్తారు. అయితే ఈ ముగ్గురూ సామాన్యులు కావడంతో, బబ్బర్ ను కలుసుకోవడం అసాధ్యంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో తమకి తెలియకుండానే, బబ్బర్ తండ్రి ధరమ్ సింగ్ ను ఒక అపాయం నుంచి కాపాడతారు. ఆయన సామాన్యుడు కాదనే విషయం ఆయన లైఫ్ స్టైల్ చూస్తేనే వాళ్లకి అర్థమైపోతుంది. అయినా ఒక రోజున ధరమ్ సింగ్ ను కలుసుకుని, తమ మనసులోని మాటను ఆయన ముందుంచుతారు.  

బబ్బర్ డిప్రెషన్ లో ఉన్నాడు .. మద్యానికీ .. డ్రగ్స్ కి బానిసయ్యాడు. అతనిని అందులో నుంచి  బయటికి తీసుకొస్తే తనకి సంతోషమేనని ధరమ్ సింగ్ అంటాడు. అతనితో ఆల్బం చేయడానికి అవసరమైన 2 కోట్లు తాను ఇస్తానంటూ, వెంటనే ఆ ఎమౌంటును వాళ్ల ముందుంచుతాడు. ఈ విషయంలో తనని మోసం చేయడానికి ట్రై చేస్తే, ఎంతమాత్రం సహించనని మరీ హెచ్చరిస్తాడు. ఇక అప్పటి నుంచి బబ్బర్ ను సాధారణ స్థితికి తీసుకురావడానికి నానా పాట్లు పడుతుంటారు. చివరికి ముగ్గురు మిత్రుల ప్రయత్నం ఫలిస్తుంది. మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాలని బబ్బర్ నిర్ణయించుకుంటాడు.

బబ్బర్ ను మళ్లీ మైక్ ముందుకు తీసుకుని రావడానికి ముగ్గురు యువకులు ట్రై చేస్తున్నారనే విషయం 'ఓజీ'కి తెలుస్తుంది. 'బబ్బర్' రీ ఎంట్రీ ఇస్తే తన స్థానానికి ఎసరు వస్తుందని అతను టెన్షన్ పడతాడు. బబ్బర్ మళ్లీ స్టేజ్ ఎక్కకూడదనే ఉద్దేశంతో, తన అనుచరుడిని రంగంలోకి దింపుతాడు. 'ఓజీ' అనుచరుడు ఫాలో అవుతుండగానే, బబ్బర్ కిడ్నాప్ కి గురవుతాడు. అతనితో పాటు ఆ ముగ్గురు మిత్రుల దగ్గరున్న 2 కోట్లు కూడా పోతాయి. బబ్బర్ ను ఎవరు కిడ్నాప్ చేశారు? ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది మిగతా కథ.

ఇది నిఖిల్ సచన్ తయారు చేసిన కథ .. శివ వర్మ - సప్త రాజ్ చక్రవర్తి ఈ కథకి దృశ్య రూపాన్ని ఇచ్చారు. 'బజావ్' కథలో కామెడీని కలిపి అందించడం దర్శకుల ప్రధానమైన ఉద్దేశం అనేది మనకి  ఫస్టు ఎపిసోడ్ తోనే అర్థమైపోతుంది. మొదటి నాలుగు ఎపిసోడ్స్ ను ఇదే తరహాలో నడిపించుకుంటూ వెళ్లారు. కామెడీ పేరుతో ఈ ముగ్గురు స్నేహితులతో చేయించిన గందరగోళం అంతా ఇంతా కాదు. ముగ్గురి స్నేహితులు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు .. అది కామెడీలో ఒక భాగమన్నమాట. 

సాధారణ డైలాగ్స్ ను డబ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అలాగే కవితలను .. ర్యాప్ సాంగ్స్ ను అనువదించడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఈ సిరీస్ లో ర్యాప్ సాంగ్స్ ను తెలుగులోకి అనువదించి పాడిన తీరు, సహనాన్ని పరీక్షిస్తుంది. డిప్రెషన్ లోకి వెళ్లిన ర్యాపర్ ను ముగ్గురు యువకులు కలిసి ఒప్పించడానికే సమయం మొత్తం సరిపోయింది. ఫస్టు ట్విస్ట్ వచ్చేసరికి నాలుగో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక ఈ ముగ్గురిలో ఒక హీరో వైపు నుంచి పసలేని లవ్ స్టోరీ ఒకటి నడుస్తూ ఉంటుంది. 

ధీరజ్ .. హరవీందర్ .. పరిమిత్ సింగ్ .. గురుదాస్ .. తన్వీ చౌదరి .. ఇలా కథ నడుస్తూ ఉంటే కొత్త పాత్రలు వచ్చి జాయిన్ అవుతూ ఉంటాయి. కానీ ఏ పాత్రకి ప్రత్యేకత లేదు .. ఎంట్రీ  ఇచ్చినంత తేలికగానే ఎగ్జిట్ అవుతూ ఉంటాయి. గందరగోళంలో నుంచి .. హడావిడిలో నుంచి కామెడీని బయటికి తీయడానికి చేసిన విఫల ప్రయత్నంగానే ఇది కనిపిస్తుంది. లవ్ .. ఎమోషన్ ... కామెడీ .. ఇలా ఏ అంశాన్ని పట్టుకున్నా పస లేకుండా నడవడం కనిపిస్తుంది. సౌరభ్ లోఖండే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. దేవనాథ్ ఫొటోగ్రఫీ ఓ మాదిరిగా అనిపిస్తాయి.

ఇక ప్రేమ్ కుమార్ ఎడిటింగ్ విషయానికొస్తే, ఫ్రెండ్స్ మధ్య జరిగే సంభాషణ .. బాస్ తో వాళ్లు చీవాట్లు తినడం .. 'ఓజీ' కాంబినేషన్ సీన్ .. ధరమ్ సింగ్ కి భయపడే సీన్ .. ఇలా కొన్ని సాగతీత సన్నివేశాలు అసహనాన్ని కలిగిస్తాయి. ఇక టోటల్ పాయింటుకే వస్తే, ఇద్దరు .. ముగ్గురు స్నేహితులు కలిసి, జీవితంలో ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో ప్రయత్నించడమనేది కూడా పాత కథనే. ఆ కథ ర్యాప్ సాంగ్స్ .. ర్యాప్ సింగర్స్ తో ముడిపెట్టడం వలన, సాహిత్యంపై సరైన శ్రద్ధ పెట్టకపోవడం వలన తెలుగు భాషా ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది.

Trailer

More Reviews