'ఆఖరి సచ్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ
Movie Name: Aakhri Sach
- తమన్నా ప్రధానమైన పాత్రగా 'ఆఖరి సచ్'
- ఢిల్లీలో జరిగిన వాస్తవ సంఘటనకి దృశ్య రూపం
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- అందుబాటులోకి వచ్చిన రెండు ఎపిసోడ్స్
- ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా తమన్నా నటన ప్రధానమైన ఆకర్షణ
తమన్నా ఇప్పుడు ఇటు సినిమాలతోను .. అటు వెబ్ వెబ్ సిరీస్ లతోను ఫుల్ బిజీగా ఉంది. హిందీలో భారీ వెబ్ సిరీస్ ల నుంచి ఆఫర్లు ఆమెకి క్యూ కడుతున్నాయి. అయితే తాను ప్రధానమైన పాత్రగా సాగే కథలను ఆమె ఎంచుకుంటూ వెళుతోంది. అలా తమన్నా చేసిన మరో వెబ్ సిరీస్ గా ' ఆఖరి సచ్' కనిపిస్తోంది. ఢిల్లీలో కొంతకాలం క్రితం జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సిరీస్ ను నిర్మించారు. నిన్నటి నుంచి 'హాట్ స్టార్' లో రెండు ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ చొప్పున మిగతా ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి.
ఈ కథ ఢిల్లీ నేపథ్యంలో మొదలవుతుంది .. అక్కడి 'కిషన్ నగర్' లో జవహర్ - విజయ దేవి దంపతులు నివసిస్తూ ఉంటారు. వారి పెద్ద కుమారుడు ఆదేశ్ .. ఆయన భార్య కరుణ .. వారికి ముగ్గురు పిల్లలు. రెండో కొడుకు భువన్ (అభిషేక్ బెనర్జీ). ఆయన భార్య పేరు పూనమ్ .. వారి సంతానమే 'పార్థు'. జవహర్ దంపతుల పెద్ద కూతురు బబిత .. రెండో కూతురు కవిత. బబిత కూతురు అన్షితకి, వారం రోజుల క్రితమే 'అమన్' ( శివిన్ నారంగ్) నిశ్చితార్ధం జరుగుతుంది.
అయితే కవిత ఫ్యామిలీ మాత్రమే వేరుగా ఉంటుంది. మిగతా కుటుంబ సభ్యులు కలిసే ఉంటారు. మధ్యతరగతి జీవితాన్ని గడుపుతున్న ఆ కుటుంబ సభ్యులంతా తెల్లవారేసరికి చనిపోతారు. ఎవరికి వారుగా ఉరితాడుకి వ్రేళ్లాడుతూ కనిపిస్తారు. మొత్తం 11 మంది కుటుంబ సభ్యులు .. 3 తరాలకి చెందిన వారు .. 9 ఏళ్ల నుంచి 71 ఏళ్ల వరకూ వయసున్న వారు చనిపోయినవారిలో ఉంటారు. క్రైమ్ బ్రాంచ్ లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న 'అన్య' (తమన్నా)కి ఈ కేసు అప్పగించబడుతుంది.
చనిపోయినవారి కళ్లకు గంతలు కట్టేసి ఉండటం. వారి చేతులు వెనక్కి మడిచి కట్టేసి ఉండటం చూసిన అన్య, అవి ఆత్మహత్యలు కాదనీ, హత్యలేనని అనుమానిస్తుంది. ఆ దిశగానే ఆమె విచారణ మొదలుపెడుతుంది. ఆ కుటుంబానికి యజమాని అయిన జవహర్ కొంతకాలం క్రితమే మరణించాడనీ, తండ్రి మరణానికి తానే కారణమని భావించిన భువన్, మానసికంగా దెబ్బతిన్నాడని అన్యకి తెలుస్తుంది. అతని ప్రవర్తన వింతగా ఉండేదనే విషయం ఆమెకి అర్థమవుతుంది.
అన్షిత చనిపోవడానికి 10 రోజుల ముందు, ఆమెకి కాబోయే భర్త 'అమన్'తో గొడవ జరిగిందనే సంగతి అన్యకి తెలుస్తుంది. ఇక ఆ ఏరియాలో మహిపాల్ - రణదీప్ ముఠాల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయనీ, ఆ రెండు వర్గాలతో కూడా ఆదేశ్ కి సంబంధాలు ఉన్నాయని అర్థమవుతుంది. జవహర్ చనిపోయిన తరువాత అతని స్నేహితుడైన దౌలత్ కీ, భువన్ కి మధ్య గొడవ జరిగిన సమాచారం అన్యకి అందుతుంది.
అన్షితపై దౌలత్ కొండకు జయంత్ మనసు పారేసుకున్నాడనీ, అమన్ తో ఆమె నిశ్చితార్థం జరిగిన దగ్గర నుంచి ఆమెను అతను వేధించడం మొదలుపెట్టాడనే విషయం తెరపైకి వస్తుంది. ఇందులో ఏ కారణం వాళ్లందరి మరణానికి దారితీసిందనేది అన్యకి పజిల్ గా అనిపిస్తుంది. ఇదే సమయంలో హత్యలు జరగడానికిముందు రోజు రాత్రి ఒక ఆగంతుకుడు ఆ ఇంట్లోకి ప్రవేశించడం కొంతవరకూ సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవుతుంది. ఇక హత్యలకు సంబంధించిన దృశ్యాలను కిశోర్ అనే ఒక చిన్న పిల్లాడు చూస్తాడు. అయితే తాను చూసింది చెప్పడానికి భయపడుతూ ఉంటాడు.
జవహర్ కుటుంబ సభ్యులంతా చనిపోవడానికి కారణం ఎవరు? గ్యాంగ్ స్టర్స్ కి సంబంధించినవారా?
అన్షితతో గొడవ పడిన అమన్ కారకుడా? ద్వేషంతో దౌలత్ కొడుకు ఇదంతా చేశాడా? ఆ ఇంట్లోకి చొరబడిన ఆగంతుకుడు ఎవరు? కిశోర్ అనే పిల్లాడు ఏం చూశాడు? అనే సందేహాలను రేకెత్తిస్తూ, ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది.
ఈ వెబ్ సిరీస్ నుంచి ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చింది రెండు ఎపిసోడ్స్ మాత్రమే. ఈ రెండు ఎపిసోడ్స్ లో పాత్రల పరిచయం .. ఎవరితో ఎవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఏ వైపు నుంచి క్రైమ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయనే విషయంలో సందేహాలను రేకెత్తించారు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా తమన్నా తొలి అడుగులు మొదలయ్యాయి అంతే. 3వ ఎపిసోడ్ నుంచే అసలు కథ పుంజుకోనుంది. అప్పటి నుంచి చోటుచేసుకునే సన్నివేశాలు .. ట్విస్టులను బట్టి ఈ సిరీస్ ఏ స్థాయిలో మెప్పించిందనేది చెప్పుకోవచ్చు.
అయితే దర్శకుడు ఎక్కడా ఆలస్యం చేయలేదు. అసలు సంఘటనతోనే కథను మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఆ సంఘటన చుట్టూ ఆసక్తికరమైన సన్నివేశాలను అల్లుకుంటూ .. కొత్త పాత్రలను ప్రవేశపెడుతూ ముందుకు వెళ్లాడు. ఈ రెండు ఎపిసోడ్స్ లో ఎక్కడా కూడా అనవసరమైన సీన్స్ లేవు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా తమన్నా చాలా సహజంగా నటించింది. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతోంది గనుక, ఈ సిరీస్ కి స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలవనుందనే విషయం అర్థమవుతోంది.
నిర్వికార్ ఫిలిమ్స్ సంస్థ నుంచి ఈ సిరీస్ వచ్చింది .. నిర్మాణ విలువలు బాగున్నాయి. రాబీ గ్రేవెల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, సహజత్వాన్ని కనెక్ట్ చేస్తూ వెళుతోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ బాగున్నాయి. తమన్నాతో పాటు ఆర్టిస్టులంతా కూడా, పాత్రలలో నుంచి బయటికి రాకుండా చేశారు. అసలైన ఆధారాలు .. మలుపులు .. ట్విస్టులు మున్ముందే తగులుతూ ఉంటాయి గనుక, ఈ సిరీస్ మంచి రేటింగునే అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.