మొదటి నుంచి కూడా ప్రవీణ్ సత్తారు తన కథల్లో యాక్షన్ పాళ్లు ఎక్కువగా కలుపుతూ వస్తున్నాడు. 'గరుడ వేగ' .. 'ఘోస్ట్' లతో పూర్తిగా యాక్షన్ కంటెంట్ పైనే దృష్టి పెట్టిన ఆయన, ఈ సారి కూడా అదే పద్ధతిలో 'గాండీవధారి అర్జున' సినిమాను తెరకెక్కించాడు. తన సినిమా టైటిల్స్ విషయంలో సెంటిమెంటును ఫాలో అవుతూ వస్తున్న ఆయన, అదే విధానాన్ని అనుసరించాడు. వరుణ్ తేజ్ హీరోగా చేసిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా కంటెంట్ ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ ఆంధ్రలోని 'లంబసింగి'కీ .. 'లండన్'కి మధ్య జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పేరుకు పోతున్న చెత్త వలన, వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఈ విషయంలో తగిన చర్యలను చేపట్టడం కోసం వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు లండన్ లో జరిగే ఒక సమ్మిట్ కి బయలుదేరతారు. అలా ఇండియా నుంచి సెంట్రల్ మినిస్టర్ ఆదిత్య రాజ్ (నాజర్) లండన్ కి చేరుకుంటాడు. అయితే కొంతమంది వ్యక్తుల కారణంగా ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అందువలన ఆయనకి రక్షణగా .. ప్రైవేట్ బాడీ గార్డుగా అర్జున్ వర్మ ( వరుణ్ తేజ్)ను నియమిస్తారు.
అయితే అర్జున్ వర్మ అప్పటికే లండన్ లో ఉంటాడు. చిత్రమైన వ్యాధితో తన తల్లి బాధపడుతూ ఉండటంతో, ఆమె ట్రీట్మెంట్ కోసం లండన్ తీసుకెళతాడు. తన తల్లి వైద్యానికి అవసరమైన డబ్బు కోసం ఆయన ఆలోచన చేస్తుండగా, ఆదిత్య రాజ్ రక్షణ బాధ్యతను తీసుకోవలసి వస్తుంది. ఆదిత్య రాజ్ దగ్గర పనిచేస్తున్న 'ఐరా' (సాక్షి వైద్య)కి ఎదురుపడటం ఇష్టం లేక, ఆదిత్య రాజ్ రక్షణ బాధ్యత తీసుకోవడానికి అతను సందేహిస్తాడు. అందుకు కారణం గతంలో అర్జున్ వర్మను ప్రేమించిన ఐరా, అతణ్ణి అపార్థం చేసుకుని దూరమవడమే.
ఇక ఆదిత్య రాజ్ సెంట్రల్ మినిస్టర్ అయినప్పటికీ, ఆయన కూతురు ప్రియా (విమలా రామన్) ను ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. తన కూతురు 'రియా' భద్రత విషయంలో ఆందోళన చెందుతూ ఉంటుంది. ఇదే సమయంలో శృతి అనే మరో పాత్ర తెరపైకి వస్తుంది. ఇతర దేశాల్లోని కెమికల్ వేస్టేజ్ ను ఇండియాలో 'డంప్' చేయడంలో రణ్ వీర్ (వినయ్ రాయ్) ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు శృతి చేతిలో ఉంటాయి.
ఆధారాలకు సంబంధించిన 'పెన్ డ్రైవ్'ను ఆమె ఆదిత్య రాజ్ కి అందేలా చేస్తుంది. తన తల్లి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ ఉండటానికి కారణం రణ్ వీర్ అనే విషయం ఆ పెన్ డ్రైవ్ ద్వారా అర్జున్ వర్మకి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? రణవీర్ ఎవరు? అతనితో ఆదిత్య రాజ్ కి ఉన్న సంబంధం ఏమిటి? అర్జున్ ను ఐరా అపార్థం చేసుకోవడానికి కారణం ఏమిటి? అందుకు దారితీసిన పరిస్థితులు ఎలాంటివి? అనేవి కథలో చోటుచేసుకునే ఆసక్తికరమైన అంశాలు.
ఈ కథ .. ఆరంభంలోనే 'లండన్'కి చేరుకుని, అక్కడ వారం రోజుల పాటు నడుస్తుంది. అలా వారం రోజుల పాటు లండన్ లో సాగే కథ ఇది. ప్రవీణ్ సత్తారు సినిమాలు అనగానే ఒక రేంజ్ యాక్షన్ సీన్స్ ను ప్రేక్షకులు ఆశిస్తారు. ఆయన మార్కు స్టైలీష్ మేకింగును ఊహిస్తారు. అందుకు తగిన విధంగానే ప్రవీణ్ సత్తారు యాక్షన్ సీన్స్ ను ఆవిష్కరించాడు. లండన్ వీధుల్లో ఆయన ఈ కథను పరిగెత్తించిన తీరును చూస్తుంటే, హాలీవుడ్ సినిమాను చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. విజువల్స్ పరంగా ఆయన అంతటి రిచ్ నెస్ ను తీసుకొచ్చాడు.
అయితే యాక్షన్ సీన్స్ ను కనెక్ట్ చేసినట్టుగా ఎమోషనల్ సీన్స్ ను కనెక్ట్ చేయలేకపోయాడని చెప్పాలి. కథా పరంగా చూసుకుంటే ఒక వైపున దేశభక్తి .. మరో వైపున తల్లి పట్ల ప్రేమ .. ఇంకో వైపున సమాజ శ్రేయస్సును కోరే ఒక మంత్రి రక్షణ కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి వెనుకాడకపోవడం వంటి అంశాలు ఉన్నాయి. అయినా ఆ వైపు నుంచి ఎలాంటి ఎమోషన్స్ మనసుకు పట్టవు. కథ మొదలు కావడమే సీరియస్ టాపిక్ తో మొదలవుతుంది గనుక, కామెడీకి చోటు లేదు. ఇక రొమాన్స్ కి చోటు ఉన్నా దర్శకుడు దారి ఇవ్వలేదు.
కథలో విలన్ ఎంట్రీకి దర్శకుడు చాలానే సమయం తీసుకున్నాడు. అలాంటి విలన్ ఎంట్రీ ఇస్తే, ఇక అప్పటి నుంచి ప్రేక్షకుల టెన్షన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలి. కానీ ఎంట్రీ ఇచ్చిన కాసేపటికే విలన్ రోల్ గ్రాఫ్ పడిపోతూ వెళ్లింది. విలన్ రోల్ ను డిఫరెంట్ గా డిజైన్ చేయకపోవడం కూడా మరో లోపంగా అనిపిస్తుంది. కథ చాలా ఆర్భాటంగా మొదలవుతుంది .. ఒక వైపున విలన్ గ్యాంగ్ .. మరో వైపున హీరో ఎటాక్ చేస్తూ వెళుతుంటారు. ఎందుకు? ఏమిటి? అనేది సాధారణ ప్రేక్షకులకు అర్థం కావడానికి అరగంటకి పైగానే పడుతుంది.
దర్శకుడు ఎంచుకున్న లొకేషన్స్ .. వాటిని తన కెమెరాతో తెరపై ముఖేశ్ ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చాలా బాగా సపోర్ట్ చేసింది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది. వరుణ్ తేజ్ హైటూ .. పర్సనాలిటీ ఈ పాత్రకి ప్లస్ అయ్యాయి. నాజర్ నటన గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. ఇక విలన్ గా వినయ్ రాయ్ పాత్రను డిజైన్ చేసిన తీరు వలన, ఆ పాత్ర తేలిపోయింది.
'భూమికి పట్టిన అతి పెద్ద కేన్సర్ మనిషేనేమో' అనే డైలాగ్ సినిమా మొత్తానికి హైలైట్. కంటెంట్ మొత్తాన్ని కవర్ చేస్తూ పేలే డైలాగ్ ఇది. అయితే ఈ పాయింటును అర్థమయ్యేలా చెప్పడానికి దర్శకుడు కొంత సమయం తీసుకున్నాడు. ఆ గ్యాపులో కొంత అయోమయం చోటు చేసుకుంటుంది. యాక్షన్ పరంగానే తప్ప, ఎమోషన్స్ పరంగా ఈ సినిమా ఆశించిన స్టాయిలో కనెక్ట్ కాలేకపోయిందని చెప్పచ్చు.
ప్లస్ పాయింట్స్ : కథ .. కథనం .. వరుణ్ తేజ్ యాక్టింగ్ .. యాక్షన్ సీన్స్ .. లొకేషన్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ.
మైనస్ పాయింట్స్: ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం .. కామెడీకి గానీ, రొమాన్స్ కి గాని చోటు ఇవ్వకపోవడం .. విలన్ రోల్ ను పవర్ఫుల్ గా డిజైన్ చేయలేకపోవడం.
'గాండీవధారి అర్జున' - మూవీ రివ్యూ
Gandeevadhari Arjuna Review
- 'గాండీవధారి అర్జున'గా వరుణ్ తేజ్
- ప్రవీణ్ సత్తారు మార్కు మూవీనే
- లొకేషన్స్ .. యాక్షన్ సీన్స్ .. ప్రత్యేక ఆకర్షణ
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ హైలైట్
- కనెక్ట్ కాలేకపోయిన ఎమోషనల్ సీన్స్
- సరిగా డిజైన్ చేయని విలన్ క్యారెక్టరైజేషన్
Movie Details
Movie Name: Gandeevadhari Arjuna
Release Date: 2023-08-25
Cast: Varun Tej, Sakshi Vaidya, Nassar, Vinay Rai, Narain, Vimala Raman
Director: Praveen Sattaru
Music: Mickey J. Meyer
Banner: Sri Venkateswara Cine Chitra
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer