'మథగం' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

Mathagam

Movie Name: Mathagam

Release Date: 2023-08-18
Cast: Atharvaa, Manikandan, Gautham Menon, Nikhila Vimal, Ilavarsu, Rishikanth, Dulzani Irani
Director:Prashanth Murugeshan
Producer: Screen Scene
Music: Darbuka Siva
Banner: Screen Scene
Rating: 2.50 out of 5
  • అథర్వ మురళి ప్రధాన పాత్రగా 'మథగం'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ ఇది  
  • పాత్రల సంఖ్య ఎక్కువైపోవడం ప్రధానమైన సమస్య  
  • ఏ పాత్రను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయకపోవడం మైనస్

కోలీవుడ్ హీరోల్లో అథర్వ మురళికి మంచి క్రేజ్ ఉంది. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్న ఆయన, ఆ మధ్య వచ్చిన 'గద్దలకొండ గణేశ్' తో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఆయన ఒక వెబ్ సిరీస్ చేశాడు. ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన తమిళ వెబ్ సిరీస్ పేరే 'మథగం'. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ .. బెంగాలీ .. మరాఠీ భాషల్లో ఈ రోజు నుంచే 'హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్టు సీజన్ లో భాగంగా ఐదు ఎపిసోడ్స్ ను రిలీజ్ చేశారు. 'మథగం' ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ 'చెన్నై' నేపథ్యంలో మొదలవుతుంది. అశ్వథ్ (అధర్వ మురళి) వైదేహి (నిఖిల విమల్) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వారి సంతానమే 'రోహిణి'. అశ్వథ్ డీసీపీగా పనిచేస్తూ ఉంటాడు. వైదేహి కూడానా జాబ్ చేస్తూ ఉండేది .. కానీ ఆమె నెల రోజుల పసికందుకు తల్లి. అందువలన సెలవులో ఉంటుంది. ఆ సమయంలో కూడా డ్యూటీ అంటూ అశ్వథ్ ఇంటిపట్టున లేకుండా తిరుగుతూ ఉండటం పట్ల వైదేహి అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అశ్వథ్ దృష్టి మాత్రం 'పడాలం శేఖర్' ( మణికందన్)పై ఉంటుంది. 

శేఖర్ పై హత్యలతో సహా అనేక కేసులు ఉంటాయి. ఒక ప్రమాదంలో అతను చనిపోయాడనుకుని పోలీసులు భావిస్తారు .. కానీ అతను బ్రతికే ఉంటాడు. చట్టం కళ్లుగప్పి తన అరాచకాలను కొనసాగిస్తూ ఉంటాడు. అంతేకాదు 'సఫీ' అనే యువతితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. శేఖర్ తో 'గుణ' అనే ప్రధానమైన అనుచరుడికీ, నాథన్ (రిషికాంత్) అనే స్నేహితుడికి మాత్రమే నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది.

గుణను పట్టుకుంటే తప్ప, శేఖర్ పట్టుబడటం కష్టమనే విషయం అశ్వథ్ కి అర్థమైపోతుంది. దాంతో అతను పకడ్బందీగా ప్లాన్ చేసి 'గుణ'ను పట్టుకుంటాడు. గతంలో శేఖర్ కారణంగానే తన అన్నయ్యను పోగొట్టుకున్న 'గుణ' ఎప్పటికప్పుడు శేఖర్ కదలికలను గురించిన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడానికి అంగీకరిస్తాడు. అతనికీ .. శేఖర్ కి మధ్య జరుగుతున్న సంభాషణలను అశ్వథ్ టీమ్ రహస్యంగా వింటూ ఉంటుంది.

శేఖర్ కొనసాగిస్తున్న అరాచకాల వెనుక ఒక మినిస్టర్ ఉన్నాడనే విషయం అశ్వథ్ కి అర్థమైపోతుంది. అంతే కాకుండా శేఖర్ పైన 'జంబుక్ సేఠ్' అనే మరో అజ్ఞాత వ్యక్తి ఉన్నాడనే సంగతి తెలుస్తుంది. తన క్రింద పనిచేస్తున్న అనుచరులందరికీ శేఖర్ ఒక పార్టీ ఇవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని తెలుస్తుంది. పార్టీ వెనుక ఏదో మతలబు ఉందనే విషయాన్ని ఆయన గ్రహిస్తాడు. శేఖర్ వెనుక మినిస్టర్ ఉన్నాడనే విషయాన్ని కమిషనర్ కి చెప్పిన అశ్వథ్, అతని ఆటకట్టించడానికి రంగంలోకి దిగుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేదే కథ. 

స్క్రీన్ సీన్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సిరీస్ కి ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వం వహించాడు. నేర సామ్రాజ్యానికీ .. దానితో సంబంధం ఉన్న రాజకీయనాయకులకు .. పోలీస్ అధికారులకు మధ్య జరిగే కథ ఇది. గణేశ్ మూర్తి అనే ఒక లోకల్ గ్యాంగ్ లీడర్ ఒక రాత్రి వేళ తన అనుచరులతో కలిసి జీపులో వెళుతూ, అశ్వథ్ కి దొరికిపోవడంతో కథ మొదలవుతుంది. అతని నోటనే మొదటిసారిగా 'పడాలం శేఖర్' పేరు వినిపిస్తుంది. అక్కడి నుంచి ఇక తీగలాగడం మొదలవుతుంది. 

కథ ఎత్తుకున్న తీరును చూస్తేనే దర్శకుడు మనకి ఈ కథను విస్తృతంగా చెప్పడానికి సిద్ధమయ్యాడనే విషయం అర్థమవుతుంది. లోకల్ రౌడీలు .. శేఖర్ తో వాళ్లకి గల సంబంధాలను గుర్తిస్తూ, అతనితో అశ్వథ్ ముఖాముఖి తలపడే సమయానికి 5వ ఎపిసోడ్ పూర్తవుతుంది. శేఖర్ తన అనుచరులకు పార్టీ ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి? జంబూక్ సేఠ్ ఎవరు? ఆయనతో మినిస్టర్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం ఆ తరువాత ఎపిసోడ్స్ లోనే దొరకనుంది. 

చాలా తక్కువ నిడివిలో దర్శకుడు ఎక్కువ పాత్రలను పరిచయం చేశాడు. ప్రధానమైన నేరస్థులు .. వాళ్ల నేర చరిత్ర గురించిన వివరాలను మాత్రమే కాకుండా, ప్రతి నేరస్థుడి బ్యాక్ గ్రౌండ్ ను గురించి చెప్పే పని పెట్టుకున్నాడు. ఆ చెప్పడం కూడా పోలీస్ ఫైల్లో పేజీలను తిప్పేసే పద్ధతిలో ఉండటంతో, ఆ పాత్రలను గుర్తుపెట్టుకోవడం ప్రేక్షకుడికి ఒక పజిల్ లా మారుతుంది. పాత్రలన్నిటినీ ఒకేసారి ఎక్కించే ప్రయత్నం చేయడంతో ప్రేక్షకులు అసహనానికి లోనవుతారు. 

హీరో పాత్రను .. విలన్ పాత్రను చాలా సాదా సీదాగా కథలోకి ప్రవేశపెట్టారు. అసలు విలన్ పేరు వినిపిస్తూ ఉంటుందిగానీ ఆయన కనిపించడు. ఇటు పోలీస్ ఆఫీసర్స్ గానీ .. అటు విలన్ తాలూకు మనుషులు గానీ యాక్టివ్ గా లేకపోవడం మరో మైనస్. ఒక వైపున హీరో .. మరో వైపున విలన్ హడావిడి చేస్తుంటారుగానీ, మధ్యలో కథ తాపీగానే నడుస్తూ ఉంటుంది. ఎక్కడ టెన్షన్ ను బిల్డప్ చేయలేదు .. అందువలన ఏం జరుగుతుందోనన్న కంగారు మనలో కనిపించదు. 

 ఏ పాత్రనూ సరిగ్గా డిజైన్ చేయకపోవడం .. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తోనో .. డైలాగ్ డెలివరీతోనో  రిజిస్టర్ చేయకపోవడమే ప్రధానమైన సమస్యగా అనిపిస్తుంది. ప్రధానమైన పాత్రధారులంతా బాగానే చేశారుగానీ, వాళ్ల పాత్రలను .. సన్నివేశాలను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయకపోవడం వలన ఆడియన్స్ కి ఏమీ అనిపించదు. నేరస్థుల చిట్టా చదువారుగానీ, ఒకరి ద్వారా మరొకరి లింక్ లాగే సీన్స్ వీక్ గా ఉన్నాయి.  ఈ ఐదు ఎపిసోడ్స్ లో గౌతమ్ మీనన్ పాత్రను నామమాత్రం చేయడం ఆశ్చర్యం. దుర్బుక శివ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ ..  ఎడిటింగ్ ఫరవాలేదని చెప్పచ్చు.

Trailer

More Reviews