'తాలి' - (జియో) వెబ్ సిరీస్ రివ్యూ

Taali

Movie Name: Taali

Release Date: 2023-08-15
Cast: Sushmita Sen, Ankur Bhatia, Aishwarya Narkar, Hemangi Kavi,Suvrat Joshi, Krutika Deo,
Director:Ravi Jadhav
Producer: Arjun Sunggh Baram- Karthik Nishandar
Music: -
Banner: Gseams Production
Rating: 3.00 out of 5
  • సుస్మితా సేన్ ప్రధానమైన పాత్రగా 'తాలి'
  • 'హిజ్రా'ల హక్కుల నేపథ్యంలో సాగే కథ
  • గౌరీ సావంత్ సాగించిన నిజజీవిత పోరాటం ఇది
  •  సహజత్వానికి పెద్దపీట వేసిన దర్శకుడు 
  • ఒక మంచి ప్రయత్నం అనిపించే వెబ్ సిరీస్

ఇంతవరకూ బయోపిక్ లు అనేవి వెండితెరపైకి మాత్రమే వచ్చాయి. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ ల దిశగా చురుకుగా కదులుతున్నాయి. అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన వెబ్ సిరీస్ 'తాలి'. సుస్మితా సేన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ వెబ్ సిరీస్, ట్రాన్స్ జెండర్స్ హక్కుల కోసం పోరాడిన మరో ట్రాన్స్ జెండర్ 'గౌరీ సావంత్' జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ రోజు నుంచే ఈ వెబ్ సిరీస్ 'జియో సినిమా'లో స్ట్రీమింగ్ అవుతోంది. రవి జాదవ్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథలో ఎక్కువ భాగం ముంబై నేపథ్యంలో నడుస్తుంది. దినకర్ ( నందు మాధవ్) ఓ పోలీస్ ఆఫీసర్. భార్య (ఐశ్వర్య నార్కర్), కూతురు స్వాతి ( హేమాంగి కవి), కొడుకు గణేశ్ (కృతిక డియో) ఇది అతని కుటుంబం. గణేశ్ కి 10 .. 12 ఏళ్లు వచ్చేసరికి అతని ఆలోచనా విధానంలో .. ప్రవర్తనలో మార్పు వస్తుంది. అతను స్త్రీ వస్త్రధారణ పట్ల ఆసక్తిని చూపడం .. వారు వాడే అలంకరణ సామాగ్రి పట్ల ఇష్టాన్ని చూపడం మొదలుపెడతాడు.పెద్దయిన తరువాత తనకి తల్లిని కావాలని ఉందంటూ క్లాస్ లో చెప్పి, ఫ్రెండ్స్ దగ్గర నవ్వుల పాలవుతాడు. 

గణేశ్ లో వస్తున్న అసహజమైన మార్పును తల్లి గమనిస్తుంది. ఒక రోజున అతను అమ్మాయిలా అలంకరించుకోవడం చూసి మరింత ఆందోళన చెందుతుంది.స్టేజ్ పై అమ్మాయిలా గణేశ్ నటిస్తేనే సహించని అతని తండ్రికి ఆ నిజం చెప్పలేక, ఆ మానసిక ఒత్తిడిని భరించలేక చనిపోతుంది. ఆ తరువాత స్వాతికి వివాహమై వెళ్లిపోతుంది. అమ్మాయిగానే ఉండాలనే ఒక బలమైన ఆలోచనను తండ్రి దగ్గర దాచలేక గణేశ్ ఇల్లొదిలి వెళ్లిపోతాడు. 

అలా ముంబై చేరుకున్న గణేశ్ అక్కడి ట్రాన్ జెండర్స్ జీవితాల్లో ఒక భాగమవుతాడు. వాళ్ల సమస్యలను అర్థం చేసుకోవడం కోసం లింగమార్పిడి చేయించుకుని 'గౌరి' (సుస్మితా సేన్) గా  మారతాడు. 'హిజ్రా'లకు కుటుంబ సభ్యుల నుంచే ఆదరణ లభించడం లేదు. సమాజం వాళ్లను  చిన్న చూపు చూస్తోంది. వాళ్లకి ఒక ఐడెంటిటీ అనేది లేకుండా పోతోంది. వాళ్లకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్లనే వారు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడి డబ్బులు అడుగుతున్నారనే విషయం గౌరికి బాధను కలిగిస్తుంది.

'హిజ్రా'లు కూడా మనుషులే .. వాళ్లకి కూడా గౌరవంగా జీవించే హక్కు ఉండాలి. స్త్రీ పురుషుల మాదిరిగానే వాళ్లకి కూడా సమానమైన హక్కులు దక్కాలి. వాళ్లకి విద్యా ఉద్యోగాల్లోను ప్రభుత్వం సమానమైన అవకాశాలను కల్పించాలని భావిస్తుంది. అందుకోసం గౌరి ఏం చేస్తుంది? ఫలితంగా ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఆ అవాంతరాలను ఆమె ఎలా అధిగమిస్తుంది? అనేది మిగతా కథ. 

ఇది గౌరీ సావంత్ బయోపిక్ కావడం వలన, కంటెంట్ విషయంలో దర్శకుడు రవి జాదవ్ పూర్తి క్లారిటీతో కనిపిస్తాడు. గౌరి చిన్నప్పటి నుంచి, ఆమె ఆశయ సాధనవరకూ చాలా నీట్ గా తాను  చెప్పదలచుకున్న విషయాన్ని చెబుతూ వచ్చాడు. 'హిజ్రా'ల జీవితం ఎలా ఉంటుంది? ట్రాన్స్ జెండర్స్ గా మారడానికి ఎలాంటి అవస్థలు పడతారు? వాళ్లు ఎదుర్కునే ఇబ్బందులు .. సమస్యలు .. అవమానాలు ఎలా ఉంటాయి? అనే విషయాలను ఆవిష్కరిస్తూనే, వాళ్లలో గ్రూపులు .. ఆ గ్రూపుల మధ్య గొడవలు వంటి అంశాలను కూడా దర్శకుడు చాలా సహజంగా టచ్ చేశాడు.

ఇది బయోపిక్ .. ప్రధానమైన పాత్రను చిన్నప్పటి నుంచి చూపించాలి. కథను అక్కడి నుంచే ఎత్తుకుంటే, సుస్మితా సేన్ ఎంట్రీకి చాలా సమయం పడుతుంది. అందువలన సుస్మితా సేన్ తన గతాన్ని గురించి చెబుతూ ఉంటే, ఆమె బాల్యంలోకి తీసుకుని వెళతారు. ఈ రకమైన క్షితిజ్  స్క్రీన్ ప్లే కారణంగా ఈ వెబ్ సిరీస్ ఎక్కడా బోర్ కొట్టకుండా నడుస్తుంది. ఇది బయోపిక్ కనుక, ఇతర వినోదపరమైన అంశాలను ఆశించకుండా చూడవలసిందే. ఎమోషన్స్ ప్రధానంగా మాత్రమే ఈ కథ నడుస్తూ ఉంటుంది. 

ఒక 'హిజ్రా'ను పోలీసులు హింసిస్తూ ఉంటే గౌరీ నేరుగా వచ్చి పోలీసులను ఎదిరించి ఆమెను బయటికి తీసుకుని వెళ్లే సీన్, ఒక వేశ్య చనిపోతే ఆమె కూతురును అక్కడి నుంచి తీసుకుపోవాలనుకున్న రౌడీలను ఎదిరించి ఆ పాపకు ఆశ్రయం ఇచ్చే సీన్ .. తోటి హిజ్రా చనిపోతే హాస్పిటల్ సిబ్బంది అవమానకరంగా వ్యవహరిస్తే, డీన్ తో క్షమాపణ చెప్పించే సీన్ .. హిజ్రాలకు జరుగుతున్న అన్యాయాలను గురించిన చర్చా వేదిక సీన్ ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తాయి. 

"నేను చప్పట్లు కొట్టను .. నన్ను చూసి నలుగురూ చప్పట్లు కొట్టేలా చేస్తాను" అనే డైలాగ్ ను ప్రధానమైన పాత్రతో చెప్పించి, అందుకు తగినట్టుగానే ఆమె పాత్రను దర్శకుడు నడిపిస్తూ వెళ్లాడు. ప్రధానమైన పాత్రలో సుస్మితా సేన్ గొప్పగా చేసింది. ఫ్యామిలీ పరమైన సున్నితమైన భావోద్వేగాలను .. హిజ్రాలకు జరుగుతున్న అన్యాయాల పట్ల ఆక్రోశాన్ని వ్యక్తం చేసే సీన్స్ లోను చాలా సహజంగా నటించింది. మిగతా వాళ్లంతా కూడా తమ పాత్రలలో నుంచి బయటికి రాకుండా పాత్రలు మాత్రమే కనిపించేలా నటించారు. 

ఈ వెబ్ సిరీస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకి .. సన్నివేశాలకు తగినట్టుగానే సాగుతుంది. సన్నివేశాలలో ఆ పరిసరాలకు ప్రాధాన్యతనిస్తూ, సహజత్వాన్ని ఆవిష్కరించడంలో రాఘవ రామదాస్  కెమెరా పనితనం ప్రత్యేకమైన పాత్రను పోషించింది. కథ వాస్తవ సంఘటనలకు సంబంధించినది కావడం వలన, ఫైసల్ ఎడిటింగ్ కూడా ఓకే.  వినోదపరమైన అంశాలను గురించిన ఆలోచన చేయకుండా, 'హిజ్రా'ల హక్కుల కోసం గౌరీ సావంత్ చేసిన పోరాటం గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది. మేకర్స్ చేసిన ఒక మంచి ప్రయత్నంగా అనిపిస్తుంది.

Trailer

More Reviews