'నెయిమర్' - ( హాట్ స్టార్) మూవీ రివ్యూ

Neymar

Movie Name: Neymar

Release Date: 2023-08-08
Cast: Mathew Thomas, Naslen K. Gafoor, Johny Antony, Shammi Thilakan, Vijayaraghavan, Reshmi Boban
Director:Sudhi Maddison
Producer: Padma Uday
Music: Shan Rahman
Banner: V Cinemas International
Rating: 3.00 out of 5
  • మలయాళంలో మే 12న విడుదలైన 'నెయిమర్'
  • ఈ రోజు నుంచే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 
  • కుక్క పాత్రను ప్రధానంగా చేసుకుని నడిచే కథ 
  • అక్కడ సూపర్ హిట్ అనిపించుకున్న సినిమా 
  • ఇక్కడ ఓటీటీ వైపు నుంచి మాత్రమే చూడగలిగే కంటెంట్
  • పిల్లలను ఎక్కువగా ఆకట్టుకునే సినిమా  

ఒక సింపుల్ లైన్ ను తీసుకుని దానిని సహజంగా తెరకెక్కించడం .. ఎమోషన్స్ పరంగా ఆ కథను ఆడియన్స్ కి కనెక్ట్ చేయడం మలయాళ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి సినిమాలకు ఓటీటీల వైపు నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఒక కంటెంట్ తో రూపొందిన మలయాళ సినిమానే 'నెయిమర్'. ఈ ఏడాది మే 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, అక్కడ 50 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచే 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథలోకి వెళితే .. అది ఒక ప్రశాంతమైన పల్లెటూరు. ఆ గ్రామంలో సహదేవ్ (షమ్మీ తిలకన్) .. చాకో (విజయ రాఘవన్) .. థామస్ (జాన్ ఆంటోని) అనే ముగ్గురు స్నేహితులు తమ కుటుంబాలతో కలిసి నివసిస్తూ ఉంటారు. అందరూ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారే. సహదేవ్ - చాకో మధ్య మనస్పర్థలు వచ్చినప్పటికీ, ఒకరిపై ఒకరికి అభిమానం అలాగే ఉంటుంది. తండ్రుల మధ్య కోపంతో సంబంధం లేకుండా సహదేవ్ కొడుకు కుంజవ (మాథ్యు) .. చాకో కొడుకు షింటో (నెల్సన్) మంచి స్నేహితులుగా ఉంటారు.

ఈ స్నేహితులిద్దరూ కూడా ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేయాలని కలలు కంటూ ఉంటారు. అదే సమయంలో ఆ గ్రామానికి చెందిన 'డోనా' అనే అమ్మాయిపై 'కుంజవ' మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మాయికి కుక్కపిల్లలంటే ఇష్టమని గ్రహిస్తాడు. తాను కూడా ఒక కుక్కను పెంచుకుంటే, ఆమెతో కలిసి వాకింగ్ చేస్తూ మాటలు కలపొచ్చని అనుకుంటాడు. కుక్కను పెంచడం తండ్రికి ఇష్టం లేదని తెలిసికూడా, తల్లిని ఒప్పించి ఒక వీధికుక్కను ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ కుక్క పేరే 'నెయిమర్'.

'నెయిమర్' చాలా చురుకైన కుక్క. అది వచ్చిన దగ్గర నుంచి కుంజవ జీవితంలో ఒంటరితనం అనేది లేకుండా పోతుంది. అతని జీవితం ఆనందంగా మారుతుంది. 'డోనా' ప్రేమ కోసం ఆ కుక్కను తెచ్చిన కుంజవ, ఆమెను గురించి కాకుండా ఆ కుక్కను గురించే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాడు. అది చేసే పనుల వలన చుట్టుపక్కల వాళ్లతో సహదేవ్ గొడవలు పడవలసి వస్తుంది. అది ఏకంగా ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకునే కరవడం పెద్ద గొడవకి దారి తీస్తుంది.

ఈ నేపథ్యంలో ఒక రోజు రాత్రి కుంజవకి తెలియకుండా, అతని తండ్రి ఆ కుక్కను వేరే ప్రాంతానికి తరలిస్తాడు. ఉదయాన్నే ఈ విషయం తెలిసి కుంజవ కన్నీళ్లు పెట్టుకుంటాడు. 'నెయిమర్' ఫలానా ప్రాంతంలో ఉందని తెలుసుకుని, తన స్నేహితుడు షింటోను తీసుకుని ఆ ప్రాంతానికి బయల్దేరతాడు. ఆ ప్రాంతానికి చెందిన డాన్ తరహా వ్యక్తి 'గాబ్రియల్' అధీనంలో ఆ కుక్క ఉందని తెలుసుకుంటారు. ఆ కుక్కను తీసుకుని అక్కడి నుంచి పారిపోవాలనే ఉద్దేశంతో ఆయన బంగ్లాలో అడుగుపెడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్లు ఎలాంటి సంఘటనలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. 

టీనేజ్ లో ఉన్న అబ్బాయిలు .. అమ్మాయిలతో ఈ కథ మొదలవుతుంది. దాంతో ఇది ఒక లవ్ స్టోరీ అని ప్రేక్షకులు అనుకుంటారు. కథలోకి కుక్క ఎంట్రీ ఇవ్వడంతో లవ్ స్టోరీ మరింత రసవత్తరంగా మారుతుందని ఆడియన్స్ భావిస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ కథ అంతా కూడా ఒక 'వీధి కుక్క' చుట్టూనే తిరుగుతుంది. ఆ కుక్క చేసే పనులు .. వాటి పర్యవసానాలు వినోదాన్ని అందిస్తూ ఉంటాయి. అదే సమయంలో అది తన చేష్టలతో ఆడియన్స్ ను ఎమోషన్స్ కి కూడా గురిచేస్తుంది.

ఫస్టాఫ్ అంతా కూడా కుంజవ - షింటో, కుక్కతో ముడిపడిన వారి జీవితాలకు సంబంధించిన ట్రాక్ వినోద భరితంగా నడుస్తుంది. సెకండాఫ్ అంతా గాబ్రియల్ ఏరియాలో అతనికి వెంకట్ అనే వ్యక్తితో ఉన్న శత్రుత్వం .. ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి చేసే ప్రయత్నాలు .. ఆ ఇద్దరి పరువు ప్రతిష్ఠలు 'నెయిమర్' అనే కుక్కతో ముడిపడి ఉండటం మరో ట్రాక్. ఈ ట్రాక్ కాస్త సస్పెన్స్ తో కూడిన యాక్షన్ తో నడుస్తుంది. కుక్కల పోటీ ఎపిసోడ్ కాస్త నిడివి ఎక్కువగా అనిపించినా, దాని వెనుక ఒక బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉండటం వలన సర్దుకుపోవచ్చు. 
          
పద్మ ఉదయ్ నిర్మించిన ఈ సినిమాకి సుధీ మాడిసన్ దర్శకత్వం వహించాడు. కుక్కను ప్రధాన పాత్రగా చేసిన ఆయన, ఆ కుక్క చుట్టూ లవ్ .. కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ ను అల్లుకున్న తీరు ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమాటిక్ గా అనిపించే హడావిడి ఎక్కడా కనిపించదు. చాలా సహజంగా మన కాలనీలో జరిగే కథ మాదిరిగా అనిపిస్తుంది. ఒక వీధి కుక్కతో దర్శకుడు చేయించిన విన్యాసాలు పిల్లల నుంచి పెద్దల వరకూ కనెక్ట్ అవుతాయి.

ఇది కంటెంట్ ప్రధానమైన కథ .. ఖర్చు పెద్దగా కనిపించకపోయినా, దాని గురించి ఆలోచన రానీయని కథ. ఆర్భాటాలకు కాకుండా సహజత్వానికి పెద్దపీట వేసిన సినిమా ఇది. ప్రతి పాత్ర కథకి కట్టుబడే కదులుతూ ఉంటుంది. స్నేహం .. ప్రేమ .. త్యాగం ఈ కథలో ప్రధానంగా కనిపిస్తాయి. సినిమా చివరిలో దర్శకుడు సున్నితమైన భావోద్వేగాలతో కూడిన అంశాలను టచ్ చేశాడు. ఆ సన్నివేశాలు సందేశాన్ని ఇస్తాయి .. ఆలోచింపజేస్తాయి .. కన్నీళ్లు పెట్టిస్తాయి. 

 కథ .. స్క్రీన్ ప్లేతో పాటు గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా కనిపిస్తాయి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎడిటింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది.  కుక్కల పోటీనీ .. ప్రధానమైన కుక్క ఎక్స్ ప్రెషన్స్ ను క్యాచ్ చేయడం కెమెరా పనితనానికి పెద్ద పరీక్షనే. టీనేజ్ జంటలు మినహా మిగతా వాళ్లంతా సీనియర్ ఆర్టిస్టులే. అందువల్లనే సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. మలయాళంలో ఈ సినిమా పెద్ద హిట్ కొట్టినప్పటికీ, తెలుగు విషయానికి వచ్చేసరికి, ఓటీటీ వైపు నుంచి మాత్రమే చూడదగిన సినిమాగా అనిపిస్తుంది. 

Trailer

More Reviews