'బవాల్' - (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ

Bawaal

Movie Name: Bawaal

Release Date: 2023-07-21
Cast: Varun Dhavan, Janhvi Kapoor, Manoj Pahwa, Anjuman Saxena, Mukesh Tiwari
Director:Nitesh Tiwari
Producer: Sajid Nadiadwala
Music: Mithoon - Tanishk
Banner: Nadiadwala Grandson Entertainmets
Rating: 2.75 out of 5
  • భార్యాభర్తల నేపథ్యంలో నడిచే 'బవాల్'
  • క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న జాన్వీ కపూర్ 
  • నిదానంగా నడిచే కథాకథనాలు 
  • ఓటీటీ కోసమే రూపొందించిన సినిమా 
  • రొమాన్స్ వైపు వెళ్లని హీరో - హీరోయిన్స్ 

సాధారణంగా ఏ సినిమాలైనా థియేటర్స్ కి వెళ్లిన ఒక నెల రోజుల తరువాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలను థియేటర్స్ లో కాకుండా ఓటీటీ సెంటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఉత్సాహాన్ని చూపుతున్నారు. మరికొందరు మేకర్స్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై వదలాలనే ఉద్దేశంతోనే సినిమాలను నిర్మిస్తున్నారు. అలాంటి సినిమాగా 'అమెజాన్ ప్రైమ్' ఫ్లాట్ ఫామ్ పైకి నేరుగా 'బవాల్' వచ్చింది. ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
 
ఈ కథ 'లక్నో'లో మొదలవుతుంది. అజయ్ దీక్షిత్ (వరుణ్ ధావన్) తండ్రి ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. అజయ్ ఒక కార్పొరేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. జీవితంలో అనుకున్న స్థాయిలో ఎదగలేకపోయిన అసంతృప్తి అతనికి ఉంటుంది. ఎలాంటి ప్రత్యేకత లేని వారిని ఎవరూ పట్టించుకోరు. ఎలాంటి ఇమేజ్ లేకుండా బ్రతకడం అతనికి ఇష్టం లేదు. అందువలన మంచి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ .. బుల్లెట్ పై రాయల్ గా తిరుగుతూ .. అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేయడానికి నానా తంటాలు పడుతుంటాడు.

 ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నిషా (జాన్వీ కపూర్)తో అతనికి పెళ్లి జరుగుతుంది. తనకి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయనీ, అయితే పదేళ్లుగా రావడం లేదని పెళ్లికి ముందే అజయ్ తో నిషా చెబుతుంది. దాంతో ఇకపై కూడా ఫిట్స్ రాకపోవచ్చనే ఉద్దేశంతో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ రోజు రాత్రే నిషాకి ఫిట్స్ రావడంతో అజయ్ ఆలోచనలో పడతాడు. నలుగురిలో తన భార్యకి ఫిట్స్ వస్తే, తన ఇమేజ్ పడిపోతుందని భావించి, తొమ్మిది నెలలుగా ఆమెను నాలుగు గోడల మధ్యలోనే ఉంచేస్తాడు. 

తన పట్ల భర్తకి ప్రేమగా లేకపోవడాన్ని నిషా గ్రహిస్తుంది .. ఆవేదనతో నిలదీస్తుంది. తనకి ఫిట్స్ ఉన్న కారణంగా దూరం పెడుతున్నాడని భావించి, విడాకులు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అయితే కొన్ని రోజుల పాటు వెయిట్ చేయాలనీ నిర్ణయించుకుంటుంది. ఇదే సమయంలో స్కూల్లో ఎమ్మెల్యే కొడుకును అజయ్ కొడతాడు. ఎమ్మెల్యే మాట కాదనలేక అజయ్ ను స్కూల్ యాజమాన్యం నెల రోజుల పాటు సస్పెండ్ చేస్తుంది. ఆ సమయంలో పిల్లలకి అతను రెండో ప్రపంచ యుద్ధం గురించిన పాఠం చెప్పవలసి ఉంటుంది.

యూరప్ వెళ్లి .. రెండో ప్రపంచయుద్ధానికి సంబంధించిన సంఘటనలను .. వాటి ఆనవాళ్లను వీడియోస్ గా పిల్లలకు పంపించాలని అజయ్ నిర్ణయించుకుంటాడు. అలా చేయడం వలన ఎమ్మెల్యే శాంతిస్తాడని భావిస్తాడు. భార్యను కూడా తీసుకుని వెళతానంటేనే తండ్రి డబ్బు ఏర్బాటు చేస్తాడని భావించి, నిషాను కూడా బయల్దేరదీస్తాడు. అతని ఉద్దేశం అర్థమైనప్పటికీ, నిషా మొండిగా వెంట వెళుతుంది. యూరప్ దేశాల్లో ఆ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? భర్త నుంచి ఆశించిన ప్రేమ నిషాకి దొరుకుతుందా? ఆ ట్రిప్ వలన అజయ్ కి తిరిగి తన జాబ్ దక్కుతుందా?  అనేది కథ.

అశ్వనీ అయ్యర్ అందించిన కథ ఇది. నితేశ్ తివారి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. లోకంలో చాలా మంది భర్తలు .. తమ భార్యను బయటికి తీసుకుని వెళ్లడానికి వెనుకాడుతుంటారు. ఆమె తనకి తగిన ఇల్లాలు కాదనే ఒక అభిప్రాయం వారిలో బలంగా ఉంటుంది. ఆమెను ఎవరైనా చూస్తే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని వాళ్లు భావిస్తూ ఉంటారు. భార్యకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, ఆమెకి తోడుగా నిలబడకపోగా, మానసికంగా మరింత దెబ్బతీస్తుంటారు. అలాంటి ఒక భర్త కథ ఇది .. ఆయన తీరును ఎదుర్కొన్న భార్య కథ ఇది. 

భార్య గుమ్మం దాటి వెళితే తన ఇమేజ్ పోతుంది .. తనని ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఇమేజ్ పోతుంది. అందువలన ఇమేజ్ కాపాడుకోవడమే ప్రధానంగా భావించే భర్త ఒక వైపు. భర్త తీరును భరించలేక విడాకుల నోటీస్ ను రెడీగా పెట్టుకుని, చివరిగా అతణ్ణి మార్చడానికి ప్రయత్నించే భార్య ఒక వైపు. తన జాబ్ ను కాపాడుకోవడానికి అతను యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తే, తమ బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆమె అతని వెంట వెళుతుంది. ఈ పాయింటును దర్శకుడు కరెక్టుగా కన్వీన్స్ చేయగలిగాడు. 

ఒక వైపున భార్య భర్తలకి సంబంధించిన ట్రాక్ నడిపిస్తూనే, రెండో ప్రపంచయుద్ధం తాలూకు విషయాలను జోడిస్తూ వెళ్లిన తీరు బాగుంది. ప్యారిస్ అందాలను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.  మొదటి నుంచి చివరివరకూ కూడా రొమాంటిక్ టచ్ తో కూడిన డైలాగ్స్ గానీ .. పాటలు గానీ .. సన్నివేశాలు గాని కనిపించవు. ఇక విలన్ అనే వాడు లేకుండానే ఈ కథ నడుస్తుంది. వరుణ్ ధావన్ .. జాన్వీ కపూర్ ఇద్దరి చుట్టూనే కథ ఎక్కువగా తిరుగుతుంది. ఇద్దరూ చాలా నేచురల్ గా చేశారు.  మిగతా పాత్రలు నామమాత్రంగా కనిపిస్తాయంతే.

తెచ్చిపెట్టుకున్న అలంకారాలు ఎక్కువ కాలం నిలవవు .. ఒరిజినాలిటీ మాత్రమే చివరి వరకూ నిలబడుతుంది. లేని దానిని ఆశిస్తే అసంతృప్తి పెరుగుతూ పోతుంది .. ఉన్నదానితో సంతృప్తి చెందితే  జీవితం అందంగా .. ఆనందంగా సాగిపోతుందనే సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది. డేనియల్ బి.జార్జ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మితేశ్ ఫొటోగ్రఫీకి ఎక్కువ మార్కులు పడతాయి. విదేశాలలోని లొకేషన్స్ ను ఆయన గొప్పగా ఆవిష్కరించాడు. చారుశ్రీ ఎడిటింగ్ ఓకే. 

థియేటర్లకు ఈ సినిమా రావలసిందనీ, భారీ ఆఫర్ రావడంతో ఓటీటీకి ఇచ్చేశారనే ప్రచారం జరిగింది. ఈ సినిమా చూస్తే అది నిజం కాదని తెలుస్తుంది. ఎందుకంటే థియేటర్స్ కి వెళ్లే సినిమాలలో ఉండవలసిన అంశాలు .. లక్షణాలు ఈ కథలో మనకి కనిపించవు. ఎక్కడా స్క్రీన్ ప్లే మేజిక్కులు .. ఎలాంటి ట్విస్టులు లేకుండా కథ చాలా నిదానంగా .. సాఫీగా సాగుతూ ఉంటుంది. అక్కడక్కడా కాస్త కామెడీ టచ్ కనిపిస్తుందంతే. అందువలన ఇది ఓటీటీ కోసమే చేశారనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. 

ప్లస్ పాయింట్స్: నిర్మాణ విలువలు .. జాన్వీకపూర్ నటన .. విదేశీ లొకేషన్స్ .. సింపుల్ గా ఇచ్చిన సందేశం .. ఫొటోగ్రఫీ. 

మైనస్ పాయింట్స్: ఎలాంటి ట్విస్టులు లేకపోవడం .. కథనం నిదానంగా సాగడం .. రొమాన్స్ ను ఎంతమాత్రం టచ్ చేయకపోవడం .. ఓటీటీ ఫ్రేమ్ లోనే కథను చూపించడం.

Trailer

More Reviews