'ది ట్రయల్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

The Trial

Movie Name: The Trial

Release Date: 2023-07-14
Cast: Kajol,Jisshu Sengupta, Kubbra Sait, Sheeba Chaddha, Alyy Khan, Gaurav Pandey,Shruti Bhist, Suhani Juneja
Director:Suparn Verma
Producer: Ajay Devgan - Deepak Dhar
Music: Sangeet-Siddharth
Banner: Banijay Asia - Ajay Devgan Films
Rating: 3.00 out of 5
  • కాజోల్ ప్రధానమైన పాత్రగా 'ది ట్రయల్'
  • కోర్టు రూమ్ డ్రామాగా సాగే వెబ్ సిరీస్ 
  • 40 నిమిషాల నిడివి కలిగిన 8 ఎపిసోడ్స్ 
  • ఆసక్తికరమైన కథాకథనాలు 
  • అక్కడక్కడా ఆకట్టుకోని అంశాల ప్రస్తావన 
  • హైలైట్ గా నిలిచే కాజోల్ నటన

కాజోల్ ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లపై తన ఫోకస్ ను పెంచినట్టుగా కనిపిస్తోంది. ఆ మధ్య వచ్చిన 'లస్ట్ స్టోరీస్ 2'లో ఆమె పాత్రకి సంబంధించిన ట్రాక్ మరింత ఆసక్తికరంగా నడుస్తుంది. తాజాగా ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన మరో వెబ్ సిరీస్ గా 'ది ట్రయల్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' ద్వారా ఈ నెల 14 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 7 భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ముంబైలో ఈ కథ మొదలవుతుంది .. రాజీవ్ సేన్ గుప్తా (జిషు సేన్ గుప్తా) లాయర్ నుంచి అడిషినల్ జడ్జిగా ఎదుగుతాడు. ఆయన భార్య నొయోనిక (కాజోల్) కూడా అంతకుముందు లాయర్ గా పనిచేసి ఉంటుంది. ఆ తరువాత తమ పిల్లలు అనన్య - అనైరా ఆలనా పాలన చూసుకోవడానికి గాను ఆమె ఇంటిపట్టునే ఉంటుంది. రాజీవ్ సేన్ గుప్తా తల్లి అదే నగరంలో వేరుగా ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆమె కొడుకు ఇంటికి వచ్చి వెళుతూ ఉంటుంది. 

రాజీవ్ సేన్ గుప్తా వృత్తి కారణంగా .. ఆ వృత్తికి సంబంధం లేకుండా అతను సాగించే కొన్ని అక్రమ  కార్యకలాపాల వలన ఆయనకి పెద్ద పెద్ద వ్యక్తులతోనే శత్రుత్వం ఏర్పడుతుంది. గతంలో తనకి ఫీజు ఇచ్చుకోలేనివారి నుంచి ఆయన సెక్సువల్ ఫేవర్ ను పొందుతాడు. ఇలా ఒక వైపున అవినీతి .. మరో వైపున లైంగిక ఆరోపణలతో ఆయన లైఫ్ కొనసాగుతూ ఉంటుంది. ఒక రోజున ఆయన వీడియో ఆధారాలతో సహా దొరికిపోతాడు. దాంతో ఆయన అరెస్టు కావడం .. జైలుకు వెళ్లడం జరిగిపోతాయి. మీడియాలో ఎక్కడ చూసినా రాజీవ్ గురించిన వార్తలే వస్తుండటంతో, నొయోనికకి అవమానంగా అనిపిస్తుంది. 

తన భర్త అలాంటి పనులు చేసే ఉంటాడనే విషయాన్ని ఆమె నమ్ముతుంది. జైలు నుంచి అతను ఎప్పుడు తిరిగొస్తాడనే విషయం తెలియదు. ఆస్తులు సీజ్ చేసిన కారణంగా, ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి.  టీనేజ్ కి దగ్గరలో ఉన్న ఇద్దరు పిల్లలను సంరక్షించుకుంటూ, కుటుంబ పోషణను నొయోనిక చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తరువాత భర్తను బయటికి తీసుకురావడానికి అవసరమైన మార్గాలను గురించి ఆలోచించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. 

గతంలో తాను పక్కన పెట్టిన నల్లకోటును తిరిగి వేసుకోవాలనీ, మళ్లీ తన వృత్తిని కొనసాగించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. తండ్రిపై పిల్లలకు చెడు అభిప్రాయం కలగకుండా చూసుకుంటూ, తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. గతంలో తన స్నేహితుడైన లాయర్ విశాల్ (అలీ ఖాన్) సాయం తీసుకుంటుంది. ఆయన టీమ్ లో జూనియర్ లాయర్ గా చేరుతుంది. అడుగడునా అవమానాలు ఎదురవుతున్నా .. వృత్తిపరంగా కొత్త సవాళ్లు ఎదురవుతున్నా తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె ఎలా ముందుకు వెళ్లిందనేదే కథ.

ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడిగా ముందుకు నడిపించింది సుపర్ణ్  వర్మ. సాధారణంగా ఇలాంటి కథల్లో, ఒక అంశం చుట్టూ మాత్రమే కథ తిరుగుతూ ఉంటుంది. అలా చేస్తే కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ బోర్ కొట్టేదే. అలా కాకుండా ఇతర కీలకమైన కేసులను నొయోనిక వాదిస్తున్నట్టుగా చూపిస్తూ, ఎప్పటికప్పుడు కథపై ఆసక్తి తగ్గకుండా చూసుకున్నాడు. అలా ఓ మూడు నాలుగు కేసులు .. ప్రధానమైన ట్రాక్ తో కలిసి నడుస్తూ ఉంటాయి. ఒక్కో కేసును నొయోనిక ఎలా పరిష్కరించింది అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

మొత్తం 8 ఎపిసోడ్స్ లో టోనీ డెకోస్టా ఆస్తిపాస్తులకి సంబంధించిన కేసు .. ఒక పేషంట్ కి ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించే కేసుకి సంబంధించిన అంశాలు మాత్రం అంత ఆసక్తికరంగా అనిపించవు. ఇక మిగతా కేసులను పరిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. కోర్టు రూమ్ సీన్స్ కూడా చాలా సహజంగా అనిపిస్తాయి. సినిమా ఫక్కీ డైలాగ్స్ ... ఆర్గ్యుమెంట్స్ ఉండవు. అలాగే న్యాయవాదుల వైపు నుంచి ఉండే సమస్యలు ..  దానిని బట్టి వాళ్లు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి?  మీడియా అత్యుత్సాహం బాధితులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది తేలికగా అర్థమయ్యేలా చూపించారు. 

ఈ వెబ్ సిరీస్ లో కాజోల్ .. జిషు సేన్ గుప్తా .. అలీ ఖాన్ .. షీబా చద్దా ... కుబ్రా సైత్ .. గౌరవ్ పాండే .. శృతి .. సుహాని ప్రధానమైన పాత్రలను పోషించారు. ప్రతి ఒక్కరూ పాత్ర మాత్రమే కనిపించేలా చేశారు. కాజోల్ నటన ఈ వెబ్ సిరీస్ కి హైలైట్. తప్పు చేసి జైలుకి వెళ్లిన భర్త .. కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి తాను కష్టపడుతుంటే, తానే తప్పు చేస్తున్నానని నిందించే భర్త. అయినా పిల్లల కోసం అతనిని బయటికి తీసుకురావడానికి నానా తిప్పలు పడే భార్యగా కాజోల్ తన పాత్రలో జీవించింది. 

నైతికంగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దిగజారితే, ఈ సమాజంలో ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? తండ్రి నిజంగానే తప్పు చేశాడని పిల్లలు భావిస్తే, వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా టీనేజ్ పిల్లలను కాపాడుకోవడం ఎంత కష్టం? డబ్బు సంపాదనలో పడి పిల్లలను పట్టించుకోకపోతే ఆ వైపు నుంచే తలెత్తే సమస్యలు  ఎలా ఉంటాయి? అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. 

కథ నిదానంగానే సాగుతూ వెళుతూ ఉంటుంది. కొత్త కేసులు .. కొత్త పాత్రలు .. కొత్త తీర్పులతో అల్లుకున్న స్క్రీన్ ప్లే కథను కాపాడుతూ వచ్చింది. అయితే టోని డెకోస్టా -  ఓ ఇన్సూరెన్స్ సంస్థ నిర్వాకం ఎపిసోడ్స్ లేపేస్తే మరింత బాగుండేది. ఇక రాజీవ్ పై లైంగిక ఆరోపణలు అంటూ ఒక సెక్స్ వీడియో టీవీల్లో ప్లే అవుతున్నట్టుగా పదే పదే చూపించడం ఇబ్బందిని కలిగిస్తుంది. అలా చేయకపోతే ఈ కంటెంట్ మరింత డీసెంట్ గా అనిపించేది. సిద్ధార్థ్ - సంగీత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ వెబ్ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. మనోజ్ సోని ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నినద్ ఎడిటింగ్ ఫరవాలేదు.

ప్లస్ పాయింట్స్: కథ .. స్క్రీన్ ప్లే .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కాజోల్ నటన. 

మైనస్ పాయింట్స్ : అంతగా విషయంలేని రెండు అంశాలపై వాదనలు .. అందువలన పెరిగిన నిడివి, ఒకసారి పిలిచిన పేరును మరిచిపోయి, మరోసారి మరో పేరును పిలవడం వంటి డబ్బింగ్ పరమైన పొరపాట్లు. 

Trailer

More Reviews