'మాయాబజార్ - ఫర్ సేల్' (జీ 5) వెబ్ సిరీస్ రివ్యూ!
Movie Name: Maya Bazaar
- 7 ఎపిసోడ్స్ గా వచ్చిన 'మాయా బజార్'
- గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ తిరిగే కథ
- స్క్రీన్ ప్లే లో కనిపించని స్పీడ్
- అతకని సన్నివేశాలు .. ఆకట్టుకోని పాత్రలు
- హడావిడి తప్ప కనిపించని కామెడీ
మొదటి నుంచి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి అవసరమైన ఎంటర్టయిన్ మెంట్ ను అందిస్తూ వచ్చే జీ 5 వారు, మరోసారి అదే జోనర్లో 'మాయాబజార్' అనే వెబ్ సిరీస్ ను వదిలారు. సినిమాల్లోను .. సీరియల్స్ లోను కాస్త పేరున్న ఆర్టిస్టులనే తీసుకొచ్చారు. రానా దగ్గుబాటి .. ప్రణవ్ .. రాజీవ్ రంజన్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి, గౌతమి చల్లగుల్ల దర్శకత్వం వహించారు. వినోదమే ప్రధానంగా సాగే ఈ వెబ్ సిరీస్, ఏడు ఎపిసోడ్లుగా నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది చూద్దాం.
పద్మనాభశాస్త్రి (నరేశ్) అతని భార్య కుసుమ (ఝాన్సీ), వారి సంతానమే వల్లీ ( ఈషా రెబ్బా). హైదరాబాద్ లోని 'మాయా బజార్' అనే గేటెడ్ కమ్యూనిటీలో వాళ్లు ఒక విల్లా కొంటారు. హీరో అభిజిత్ (నవదీప్) విల్లా ఉన్న చోటునే తాము కూడా విల్లా తీసుకోవడం ఒక ప్రత్యేకతగా భావిస్తారు. ఒక శుభముహూర్తాన కొత్త విల్లాలోకి మారిపోతారు. ఆ గేటెడ్ కమ్యూనిటీ వ్యవహారాలను చూసుకునే వ్యక్తిగా గాంధీ (రవివర్మ) ఉంటాడు. ఆయన భార్య సరిత (హరితేజ)కి కాస్త డాబు ఎక్కువ. ఎంతసేపు తన గొప్ప చూపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది.
అదే కమ్యూనిటీలో డైరెక్టర్ దీపు (రవిరాజ్) విజ్జి (అదితి) నివసిస్తూ ఉంటారు. సంతానం లేదనే ఒక వెలితి వారిలో ఉంటుంది. ఇక అక్కడే వైభవ్ (రాజా) ప్రియాంక (హారిక) కూడా ఉంటారు. ఇక తెలుగువాడు కాకపోయినా, అందరినీ కలుపుకుపోయే సుదీమ్ (మియాంగ్ ఛాంగ్) కూడా అదే కమ్యూనిటీలో నివసిస్తూ ఉంటాడు. అందరూ కొత్తగా గృహ ప్రవేశాలు చేసినవారే కావడంతో, ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ వెళుతుంటారు. ముఖ్యంగా హీరో అభిజిత్ ను కలుసుకోవడానికి అందరూ ఉత్సాహాన్ని చూపిస్తుంటారు.
అయితే ఊహించని విధంగా 'మాయాబజార్' క్లబ్ హౌస్ పై నుంచి పడిపోయి అభిజిత్ చనిపోతాడు. దాంతో పోలీసులు ఎంటర్ కావడం .. విచారణ పేరుతో అందరినీ కలుస్తూ ఉండటంతో ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే తనకి అబద్ధం చెప్పి వెళ్లిన తన భర్త వైభవ్, 'మాయా బజార్'లో ప్రియాంక అనే మరో యువతితో కలిసి ఉంటున్నాడనే సంగతి సుధ( సునైన)కి తెలుస్తుంది. దాంతో ఆమె తన భర్తతో తాడో పేడో తేల్చుకోవడం కోసం అక్కడికి వచ్చేస్తుంది.
ఈ కథలోని హీరోయిన్ కి, సుదీమ్ ధోరణి నచ్చుతుంది. దాంతో ఆమె అతని ప్రేమలో పడుతుంది. అతనినే పెళ్లి చేసుకోవాలని బలంగా నిర్ణయించుకుంటుంది. ఈ నేపథ్యంలోనే అక్రమ లే అవుట్ లో ఈ గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం జరిగిందంటూ నోటీసులు వస్తాయి. రూల్స్ ప్రకారం విల్లాలను తొలగించడం ఖాయమని ఆ నోటీసులో పేర్కొంటారు. అప్పుడు విల్లాదారులంతా కలిసి ఏం చేస్తారు? వైభవ్ - సుధ గొడవ ఏమవుతుంది? సుదీమ్ తో వల్లీ ప్రేమ ఫలిస్తుందా లేదా? అనే మలుపులతో ఈ కథ నడుస్తుంది.
గతంలో జంధ్యాల ఒక టీవీ ఛానల్ కోసం 'పోపులపెట్టె' అనే సీరియల్ చేశారు. ఒక కాలనీ .. ఆ కాలనీలోని రకరకాల మనుషులు .. వాళ్ల స్వభావాలు .. బలహీనతలు .. మేనరిజమ్స్ .. ఇలా అన్నిటినీ కవర్ చేస్తూ కామెడీని పరిగెత్తించారు. అలాగే ఈ కథ 'మాయాబజార్' అనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో నడుస్తుంది. విల్లాల్లోకి దిగిన కుటుంబాలు .. వారి నేపథ్యం .. వ్యక్తుల ధోరణి .. వారి లైఫ్ స్టైల్ ... బలహీనతలు .. ప్రేమలు .. ఇలా కొన్ని అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది.
ఈ కథకి కావలసింది .. ఒక అందమైన .. ఆహ్లాదకరమైన .. ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ. కథకి తగిన లొకేషన్ ను ఎంచుకోవడంలో దర్శకురాలు సక్సెస్ అయింది. పాత్రలకి తగినట్టుగానే నరేశ్ .. నవదీప్ ... ఈషా రెబ్బా .. ఝాన్సీ .. హరితేజ .. సునైన .. రవివర్మ .. అనంత్ .. రాజా .. శివన్నారాయణ .. మియాంగ్ ఛాంగ్ ... అతిథి పాత్రలో కోట శ్రీనివాసరావు కనిపించారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్యామిలీలు .. అక్కడి విల్లాల్లో జరిగే విశేషాలతో సరదాగా .. సందడిగా ఈ కథను నడిపించడానికి ప్రయత్నించారు.
ఈ గేటెడ్ కమ్యూనిటీ చాలా విశాలంగా ఉంది .. చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. కథను ఈ కమ్యూనిటీ మొత్తం పరుగులు పెట్టించవచ్చు. కానీ పరుగులు పెట్టడానికి అవసరమైన కథనే ఇక్కడ కనిపించదు. ప్రేమలో పడిన జంట .. పెళ్లి చేసుకుని సంతానం లేని జంట .. అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న జంట .. మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి .. కమ్యూనిజమంటూ హడావిడి చేసే వ్యక్తి .. 'గే' సంబంధాన్ని కొనసాగించే వ్యక్తి. ఇలా కొన్ని పాత్రలను అనుకున్నారుగానీ, ఆ పాత్రలను రసవత్తరంగా మలచలేకపోయారు .. వినోదభరితంగా నడిపించలేకపోయారు.
ఆడియన్స్ ను ముందుకు తీసుకుని వెళ్లవలసిన ఫస్టు ఎపిసోడ్, పేలవంగా ముగుస్తుంది. రెండో ఎపిసోడ్ కూడా అదే దారిలో నడుస్తుంది. గృహప్రవేశం కోసం తీసుకొచ్చిన ఆవు తప్పిపోవడం .. వల్లీ ఓ 'గే' ప్రేమలో పడటం .. పిల్లల ఎపిసోడ్ .. తాగేసి గౌతమ్ రాజు చేసే హడావిడి .. ఇవన్నీ కూడా కామెడీ పండకపోవడంతో, అనవసరమైన హడావిడిగా అనిపిస్తాయి. కామెడీ పాళ్లు చాలడం లేదని భావించే గెటప్ శీను - ఆటో రామ్ ప్రసాద్ లను కూడా రంగంలోకి దింపారు. కానీ వాళ్లు కూడా ఏమీ చేయలేకపోయారు పాపం.
టైటిల్ కి తగిన స్థాయిలో పాత్రలు .. సన్నివేశాలు పండలేదు. కథనంలో ఎక్కడా వేగం కనిపించదు .. నానుతూ నత్త నడక నడుస్తూ ఉంటుంది. ఏ అంశాన్ని తీసుకున్నా ఎంటర్టయిన్ మెంట్ కి దగ్గరగా వెళ్లలేకపోయారు. చివరిలో సుదీమ్ పాత్ర వైపు నుంచి ఒక చిన్నపాటి సందేశం మాత్రం ఇచ్చారు. కథకి ఎక్కడా అతకని ఆ ఒంటరి పాత్రను ఎందుకు టచ్ చేస్తూ వచ్చారా అనే విషయంలో అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. నిర్మాణ విలువలకు .. సీనియర్ ఆర్టిస్టులకు .. మంచి కంటెంట్ కూడా తోడై ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్: నిర్మాణ విలువలు .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. గేటెడ్ కమ్యూనిటీ లొకేషన్.
మైనస్ పాయింట్స్: పట్టులేని కథ .. పడ్బందీగా లేని స్క్రీన్ ప్లే .. పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం .. పేలని కామెడీ .. నానుతూ సాగే సన్నివేశాలు.