'అధూర'(అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ

Adhura

Movie Name: Adhura

Release Date: 2023-07-07
Cast: Sherenik Arora, Ishwak Singh, Rasika Dugal, Rahul Dev, Pooja Chaabra, Zoa Morani, Jaimini Pathak
Director:Gaurav Chawla - Ananya Banerjee
Producer: Nikhil Adwani - Manisha Adwani
Music: John Stewart Eduri
Banner: Emmay Entertainment
Rating: 3.25 out of 5
  • భారీ వెబ్ సిరీస్ గా వచ్చిన 'అధూర'
  • హారర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • ఆసక్తిని పెంచే అనూహ్యమైన మలుపులు
  • నిదానంగా ప్రేక్షకుల్లో భయాన్ని పెంచుతూ వెళ్లిన సిరీస్ 
  •  కథ .. స్క్రీన్ ప్లే .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా వర్క్ హైలైట్

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఎక్కువగా హారర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు వస్తుంటాయి. బలమైన కంటెంట్ ను .. క్వాలిటీతో అందించిన వెబ్ సిరీస్ లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాంటి ఒక హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన వెబ్ సిరీస్ గా 'అధూర' కనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో నిన్నటి నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1లో భాగంగా 7 ఎపిసోడ్స్ ను వదిలారు. ఈ వెబ్ సిరీస్ ఏ స్థాయిలో ఆసక్తిని రేకెత్తించిందో .. ఏ స్థాయిలో భయపెట్టేసిందో ఇప్పుడు చూద్దాం.

'ఊటీ'లోని 'నీలగిరి వ్యాలీ'లో ... ఫారెస్టు ఏరియాకు ఆనుకుని ఉన్న స్కూల్లో వేదాంత్ (షెర్నిక్ అరోరా)ను పేరెంట్స్ జాయిన్ చేస్తారు. ఆ దంపతులు ఇద్దరూ కూడా అమెరికాలో ఉంటూ ఉంటారు. వేదాంత్ ను అతని క్లాస్ లోని సార్ధక్ .. ధృవ్ మరికొందరు కుర్రాళ్లు కలిసి ఏడిపిస్తూ ఉంటారు. ఒక రోజున అతనిని భయపెట్టడం కోసం ఒక చోట లాక్ చేస్తారు. ఆ రాత్రి ఒక దెయ్యం వచ్చి ఆ లాక్ ను ఓపెన్ చేస్తుంది. ఆ లాక్ ను ఎవరు ఓపెన్ చేశారా అని మిగతా ఆకతాయిలంతా ఆలోచనలో పడతారు. 

అయితే ఆ రోజు నుంచి వేదాంత్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. వేదాంత్ లో మరో మనిషి ఉన్నాడనీ .. తాను చూశానని సార్థక్ చెబుతున్నా అక్కడెవరూ అతని మాటలను పట్టించుకోరు. వేదాంత్ ను కనిపెట్టుకుని ఉండవలసిన బాధ్యతను సుప్రియ (రాశిక దుగల్) కు డీన్ అప్పగిస్తాడు. ఇక ఇదే  సమయంలో ఆ స్కూల్  నుంచి 2007వ సంవత్సరంలో వీడ్కోలు తీసుకున్న స్టూడెంట్స్ తో, రీ యూనియన్ ఫంక్షన్ ను ఏర్పాటు చేస్తారు. ఆ ఫంక్షన్ కి అధిరాజ్ .. దేవ్ .. మాల్విక .. రజత్ .. సూయాంశ్ ఇలా చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ వస్తారు. 

15 ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థులంతా కలుసుకోవడం వలన, అక్కడ వాతావరణం అంతా కూడా సందడిగా మారిపోతుంది. తన స్నేహితుడు నినాద్ కోసం ఎదురుచూసిన అధీరాజ్ కి నిరాశే మిగులుతుంది. గతంలో స్కూల్ లో వీడ్కోలు పార్టీ రోజున తమ మధ్య జరిగిన గొడవ కారణంగానే నినాద్ రాలేదని అధిరాజ్ భావిస్తాడు. అదే సమయంలో అధిరాజ్ దగ్గరికి వేదాంత్ వెళ్లి, అతనిని నినాద్ మాదిరిగా పలకరిస్తాడు.

ఒక చిన్న పిల్లాడు .. తన స్నేహితుడు నినాద్ మాదిరిగా పలకరించడం అధిరాజ్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .. ఆలోచనలో పడేస్తుంది. వేదాంత్ గురించి ఆరా తీసిన అతనికి, ఆ కుర్రాడి గురించి మిగతా పిల్లలంతా రకరకాలుగా చెబుతుంటారని సుప్రియ సమాధానం ఇస్తుంది. అప్పటి నుంచి అధిరాజ్ కి కొన్ని అనూహ్యమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ కూడా నినాద్ విషయంలో అనుమానాలను పెంచుతూ ఉంటాయి. 

ఈ నేపథ్యంలోనే రీ యూనియన్ ను సరదాగా గడపడం కోసం వచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ ఒకరి తరువాత ఒకరుగా అనుమానాస్పద స్థితిలో చనిపోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో నినాద్ ఎందుకు ఈ ఫంక్షన్ కి రాలేదో తెలుసుకోవాలని భావించిన అధిరాజ్, సుప్రియ ద్వారా అతని అడ్రెస్ సంపాదించి అతని ఇంటికి వెళతాడు. నినాద్ గురించి అక్కడ అతనికి ఎలాంటి నిజం తెలుస్తుంది? అప్పుడు అతను ఏం చేస్తాడు? ఓల్డ్ స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఎందుకు చనిపోతుంటారు? వేదాంత్ చిత్రమైన ప్రవర్తనకు కారణం ఏమిటి? అనేవి ఉత్కంఠను రేకెత్తించే అంశాలు.

 ఈ కథ అంతా కూడా 'ఊటి'లోని స్కూల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక వైపున ఊటి అందాలు .. మరో వైపున స్కూల్ బిల్డింగ్ లో దెయ్యం భయం .. ఓల్డ్ స్టూడెంట్స్ వరుస మరణాలు .. పోలీసుల విచారణ .. ఆ సందర్భంలో కూడా ఆగని మరణాలు .. హీరో ఛేదిస్తూ వెళుతున్న అనుమానాస్పద అంశాలు ఇలా ఈ వెబ్ సిరీస్ ముందు కదలకుండా కూర్చోబెట్టేస్తాయి. గౌరవ్ చావ్లా - అనన్య బెనర్జీ దర్శక ప్రతిభకు మంచి మార్కులు పడిపోతూ ఉంటాయి. 

అనన్య బెనర్జీ - ఆనంద్ జైన్ అందించిన కథ ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణమైన ప్రేక్షకుల ఊహకు అందకుండా స్క్రీన్ ప్లే సాగుతూ ఉంటుంది. ఒక వైపున ప్రస్తుతం ఆ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు .. మరో వైపున ఫంక్షన్ కోసం వచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ .. ఇంకో వైపున కాలేజ్ స్టాఫ్ .. కాలేజ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు. ఇలా ఒకే స్కూల్ బిల్డింగ్ లో నాలుగు వైపుల నుంచి కథ నడుస్తూ ఉంటుంది. 

 తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉండలేని ఒక చిన్న పిల్లాడు .. అతనిని ఆటపట్టించే మరికొంతమంది ఆకతాయిలతో మొదలయ్యే ఈ కథ, క్రమక్రమంగా చిక్కబడుతూ .. ఒంటరిగా ఈ వెబ్ సిరీస్ ను చూడటానికి భయపడే స్థాయికి తీసుకుని వెళ్లారు. దెయ్యం సిరీస్ కదా అని మొదటి నుంచే భయపెట్టే ప్రయత్నం చేయలేదు. మూడో ఎపిసోడ్ లో దెయ్యం రూపాన్ని రివీల్ చేశారు. 'చేసింది తప్పయినప్పుడు, శిక్ష పడాల్సిందే' అనే కాన్సెప్ట్ తోనే దెయ్యం ముందుకు వెళ్లడం కనిపిస్తుంది. 

 కథాకథనాల తరువాత ఈ వెబ్ సిరీస్ కి ప్రాణంగా నిలిచింది, జాన్ స్టీవర్ట్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఇక శ్రీజన్ చౌరాసియా కెమెరా పనితనం మరింతగా టెన్షన్ పెడుతుంది. ఇటు ఊటి .. అటు ఫారెస్టు పరిధిలోని సన్నివేశాలను ఆయన చిత్రీకరించిన తీరు గొప్పగా ఉంది. మాహిర్ జవేరి ఎడిటింగ్ కూడా ఓకే. కొన్ని చోట్ల కాస్త డీటైల్డ్ గా చూపించడానికి ప్రయత్నించారు .. అంతే తప్ప అనవసరమైన సన్నివేశాలు కనిపించవు. ఆర్టిస్టులంతా కూడా చాలా సహజంగా నటించారు. 


ఇది భారీ వెబ్ సిరీస్ .. పాత్రల సంఖ్య ఎక్కువ. అయినా ఆడియన్స్ ఎక్కడా కన్ఫ్యూజ్ కారు. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుంది. నిర్మాణ విలువల పరంగా ఇది మంచి మార్కులను కొట్టేస్తుంది. సీజన్ 2 ఏ పాయింట్ నుంచి మొదలవుతుందనే విషయంపై ఇచ్చిన హింట్ కూడా ఉత్కంఠను పెంచేదిగానే ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ హారర్ థ్రిల్లర్ సిరీస్ లలో ఇది ఒకటి. కథ .. కథనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. లొకేషన్స్ ఈ వెబ్ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయని చెప్పుకోవచ్చు.

Trailer

More Reviews