'రంగబలి' - మూవీ రివ్యూ

Rangabali

Movie Name: Rangabali

Release Date: 2023-07-07
Cast: Naga Shaurya, Yukthi Thareja, Murali Sharma, Sharath Kumar, Shine Tom Chako, Sathya, Subhalekha Sudhakar, Goparaju Ramana
Director:Pavan Basamshetty
Producer: Sudhakar Cherukuri
Music: Pavan CH
Banner: Sri lakshmi Venkateshwara Cinemas
Rating: 2.75 out of 5
  • నాగశౌర్య నుంచి వచ్చిన 'రంగబలి'
  • యాక్షన్ కి .. ఎమోషన్స్ కి మధ్య నడిచే కథ 
  • నాగశౌర్యకి పెర్ఫెక్ట్ గా సెట్ అయిన పాత్ర
  • ఫ్రెష్ ఫేస్ తో ఆకట్టుకున్న హీరోయిన్ 
  • సత్య కామెడీ ఈ సినిమాకి హైలైట్
  • ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమానే  

టాలీవుడ్ లో మంచి కటౌట్ ఉన్న హీరో నాగశౌర్య. మంచి ఒడ్డూ పొడుగూ ఉండే నాగశౌర్యకి చాలా తేలికగా లవర్ బాయ్ ఇమేజ్ లభించింది. అయితే అప్పటి నుంచి కూడా ఆయన యాక్షన్ కంటెంట్ కూడా తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటూ, మంచి మార్కులు కొట్టేశాడు. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన, తన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు ఈ రోజున 'రంగబలి'ని తీసుకొచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

శౌర్య (నాగశౌర్య) రాజవరంలో పెరిగి పెద్దవాడవుతాడు. వాళ్లది మధ్య తరగతి కుటుంబం. తండ్రి విశ్వం మెడికల్ షాపు నడుపుతూ ఉంటాడు. ఆ టౌన్లో ఆ షాపుకు మంచి పేరు ఉంటుంది. తన తరువాత ఆ షాపు బాధ్యతలను శౌర్య చూసుకోవాలనేది ఆయన ఆలోచన. మెడిసిన్స్ పై ఒక అవగాహన కోసం,  మెడికల్ కాలేజ్ లో పనిచేసే తన ఫ్రెండ్ దగ్గరికి శౌర్యను పంపిస్తాడు. అలా మెడికల్ కాలేజ్ లో మూడో ఏడాది చదువుకుంటున్న సహజ (యుక్తి తరేజా) దగ్గర వచ్చిపడతాడు శౌర్య. 

ఆ కాలేజ్ తో తనని అవమాన పరచడానికి ట్రై చేసిన సీనియర్స్ కి తనదైన స్టైల్లో బుద్ధి చెప్పిన శౌర్య, సహజ మనసు దోచుకుంటాడు. తమ ప్రేమను గురించి తండ్రి (మురళీశర్మ)కి చెబుతుంది. ఆయన శౌర్యను తన ఇంటికి పిలిపించి వివరాలు అడుగుతాడు. శౌర్య 'రాజవరం' కుర్రాడని తెలిసి షాక్ అవుతాడు. ఆ ఊళ్లోని 'రంగబలి' సెంటర్ కి ఆ పేరు ఎలా వచ్చిందనేది సహజ తండ్రి చెబుతాడు. రంగను బలి తీసుకున్న సెంటర్ కావడం వలన, ఆ సెంటర్ కి ఆ పేరు వచ్చిందని అంటాడు. ఆ రంగారెడ్డి (శరత్ కుమార్) ఎవరో కాదు, తన తండ్రి అని చెబుతాడు.

తన తండ్రి ఉన్నప్పుడు తాము ఆ ఊళ్లోనే ఉండేవారమనీ, ఆయనను అక్కడ హత్య చేసిన తరువాత తాము వైజాగ్ వచ్చేశామని సహజ తండ్రి చెబుతాడు. ఆ సెంటర్ పేరు వినడం కూడా తనకి ఇష్టం లేదనీ, ఆ ఊరు వదిలేసి వస్తే తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానని అంటాడు. తన తండ్రి మాటకి కట్టుబడి తాను అదే ఊళ్లో ఉండాలనీ, సహజను పెళ్లి చేసుకోవడం కోసం ఆ సెంటర్ పేరు మారుస్తానని శౌర్య చెబుతాడు.

'రంగబలి' సెంటర్ పేరు మార్చడం కోసం శౌర్య ఏం చేస్తాడు?  ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? రంగారెడ్డిని ఎవరు హత్య చేశారు? అందుకు గల కారణం ఏమిటి? సహజ తండ్రికిచ్చిన మాటను శౌర్య నిలబెట్టుకుంటాడా? అనేవి ఈ కథలో కనిపించే ఆసక్తికరమైన మలుపులు.

పవన్ బాసంశెట్టి కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు అందించిన సినిమా ఇది. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఇది. 'నా ఊరే నా బలం .. నా భవిష్యత్తు' అని నమ్మిన ఒక యువకుడి కథ ఇది. ఈ కథ ఫస్టాఫ్ అంతా కూడా కామెడీ టచ్ తో సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ అంతా కూడా యాక్షన్ .. ఎమోషన్స్ తో నిండిపోతుంది. దర్శకుడు ఫస్టాఫ్ లో హీరో తండ్రి వైపు నుంచి .. సెకండాఫ్ లో హీరోయిన్ తండ్రి వైపు నుంచి కథను బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు. 

ఇక దర్శకుడు ఫస్టాఫ్ లో విలన్ పాత్ర వైపుకు వెళ్లకుండా కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ ఫస్టు సీన్ లోనే విలన్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి కథ మరింత రసవత్తరంగా మారుతుంది. అయితే సెకండాఫ్ లో రొమాంటిక్ సాంగ్ తరువాత హీరో .. హీరోయిన్ మధ్య గ్యాప్ వచ్చేస్తుంది. అందువలన రొమాన్స్ పరంగా కాస్త 'డ్రై' గా అనిపిస్తుందంతే. యాక్షన్ కీ .. ఎమోషన్ కి మధ్యలో కామెడీ తనపని కానిచ్చేస్తూనే ఉంటుంది. 

'రంగబలి' అని ఆ సెంటర్ కి పేరు రావడానికి ముందు ఏం జరిగింది? హీరో ఆ సెంటర్ పేరు మార్చాలనుకున్నప్పుడు ఏం జరిగింది? అనేదే ఈ కథలో ప్రధానమైన అంశాలుగా కనిపిస్తాయి. క్లైమాక్స్ కి ముందొచ్చే ట్విస్ట్ ను కూడా ఆడియన్స్ గెస్ చేయలేరు. క్లైమాక్స్ ను డిజైన్ చేసిన తీరు కూడా ఆడియన్స్ కి నచ్చుతుంది. 'చెడు చూడటానికి వందమంది వస్తారు .. మంచి మాట వినడానికి మాత్రం ఒక్కడూ రాడు .. ఇకనైనా మారదాం' అంటూ ఇచ్చిన సందేశం కూడా కనెక్ట్ అవుతుంది.

నాగశౌర్య ఇంతకుముందు చేసిన యాక్షన్ సినిమాలకు .. ఈ సినిమాకి తేడా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే అంశాలు ఈ కథలో ఉన్నాయి. ఈ పాత్రకి ఆయన కరెక్టుగా సెట్ అయ్యాడు .. గతంలో కంటే మంచి ఈజ్ తో చేశాడు కూడా. ఇక కథానాయికగా పరిచయమైన యుక్తి తరేజా చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఒక వైపున డీసెంట్ గా కనిపించడమే కాదు .. రొమాంటిక్ సాంగ్ లో అందాలను కూడా ఒక రేంజ్ లో ఆరబోసింది. 

ఇక ఈ సినిమాకి సత్య కామెడీ హైలైట్ అనే చెప్పాలి.  తన చుట్టూ ఉన్నవారు ఆనందపడితే తాను బాధపడుతూ .. వాళ్లు బాధపడితే తాను ఆనందపడే పాత్రలో నవ్వులు పూయించాడు. హీరో తండ్రిగా  గోపరాజు రమణ పాత్ర గుర్తుండిపోతుంది. శరత్ కుమార్ .. మురళీ శర్మ .. షైన్ టామ్ చాకో తెరపై ఎక్కువ సేపు కనిపించకపోయినా, తమదైన మార్క్ చూపించారు. పవన్ సీహెచ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. దివాకర్ మణి కెమెరా పనితనం బాగున్నాయి. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ విషయానికొస్తే, ఫస్టు సాంగ్ లేపేయవలసింది. సాహిత్యం అర్థంకాకపోగా, తమిళ హీరోల ఇంట్రడక్షన్ సాంగ్స్ ను గుర్తు చేస్తుంది.  

ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. మాటలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. కామెడీ .. యాక్షన్ .. నిర్మాణ విలువలు.   

మైనస్ పాయింట్స్: నాగశౌర్య పై వచ్చే ఫస్టు సాంగ్, తమిళ హీరోల ఇంట్రడక్షన్ సాంగ్ లా అనిపించడం .. పాటల వైపు నుంచి తూకం తగ్గడం .. సెకండాఫ్ లో చాలా తక్కువసేపు మాత్రమే హీరోయిన్ కనిపించడం. హీరో - హీరోయిన్ వైపు నుంచి రొమాన్స్ పాళ్లు తగ్గడం. 

ఇక ఈ సినిమాకి  'రంగబలి' అనే టైటిల్ కూడా మైనస్ అయిందేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైటిల్ ను బట్టి రక్తపాతం ఎక్కువగా ఉంటుందని అనుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ నిజానికి ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమానే.

Trailer

More Reviews