'సార్జెంట్' - (జియో) మూవీ రివ్యూ

Sergeant

Movie Name: Sergeant

Release Date: 2023-06-30
Cast: Ranadeep Huda, Arun Govil, Adil Hussain, Louise Cole, Daphne Alexander, Lana pavlova
Director:Prawaal Raman
Producer: Jyothi Deshpande
Music: Aman Panth
Banner: Jar Picture Productons
Rating: 2.50 out of 5
  • రణదీప్ హుడా హీరోగా రూపొందిన 'సార్జెంట్'
  • లండన్ నేపథ్యంలో సాగే కథ 
  • నిదానంగా సాగే కథనం
  •  సహనాన్ని పరీక్షించే ఎమోషన్స్ 
  • హీరోతో సహా ఇతరులకి డబ్ వాయిస్ సెట్ కాకపోవడమే మైనస్ 

బాలీవుడ్ హీరోల్లో రణదీప్ హుడా స్థానం ప్రత్యేకం. అందుకు కారణం ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు అనే చెప్పాలి. రణదీప్ హుడా పోషించిన పాత్రలపై ఆయన మార్క్ కనిపిస్తూ ఉంటుంది. అదే ఆయనకి పెద్ద సంఖ్యలో అభిమానులను తెచ్చిపెట్టింది. అదే ఆయనను బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి కూడా పరిచయం చేసింది. అలాంటి రణదీప్ హుడా నటించిన సినిమానే 'సార్జెంట్'. 'జియో సినిమా'లో ఈ రోజునే ఈ సినిమా స్ట్రీమింగ్ అయింది. లండన్ లోని మెట్రో పోలీస్ ఆఫీసర్ గా ఆయన నటించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

నిఖిల్ శర్మ (రణదీప్ హుడా) లండన్ కి చెందిన పోలీస్ ఆఫీసర్. డిపార్టుమెంట్ చేత శభాష్ అనిపించుకుని, ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్'గా రికార్డులలో చోటు సంపాదించుకున్న సిన్సియర్. అలాంటి వ్యక్తి ఒక హత్యా నేరం విషయంలో కోర్టు ముందు నిలబడతాడు. అయితే కోర్టు అతణ్ణి నిర్దోషిగా ప్రకటిస్తూ, తిరిగి డ్యూటీలో జాయిన్ కావొచ్చునని తీర్పునిస్తుంది. గతంలో జరిగిన సంఘటన కారణంగా అతను ఒక కాలును కోల్పోతాడు. అయినా అలాగే పోలీస్ డిపార్టుమెంటులో పని చేయడానికి అతను అంగీకరిస్తాడు.

నిఖిల్ శర్మ చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంటాడు. అందుకు కారకుడు తన తండ్రి అనే ఒక ద్వేష భావం అతనిలో ఉంటుంది. తన తల్లిని తన తండ్రి రవి (అరుణ్ గోవిల్) చంపేసి తెలివిగా తప్పించుకుని తిరుగుతున్నాడనే ఒక ఆలోచన అతనిలో బలంగా ఉంటుంది. ఆ కేసును తిరగదోడించి తండ్రికి తగిన శిక్ష పడేలా చేయాలనే ఒక పట్టుదలతో అతను ఉంటాడు. అతని తల్లిని తాను చంపలేదని రవి ఎన్ని రకాలుగా చెబుతూ వస్తున్నా అతను నమ్మడు. 

అంతవరకూ తనని ప్రేమిస్తూ వచ్చిన క్రిస్టినా కూడా, తాను కాలును కోల్పోగానే తన జీవితంలో నుంచి తప్పుకోవడం అతనికి బాధను కలిగిస్తుంది. తన కాలును కోల్పోవడానికి ముందు అతను కత్రినా అనే యువతి గురించిన కేసుపై విచారణ జరుపుతుంటాడు. 'లేక' ఫౌండేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఒక సంస్థ. వాళ్లు ప్రపంచవ్యాప్తంగా పేద ఆడపిల్లలను గుర్తించి .. చేరదీసి, ఉచితంగా చదివిస్తూ ఉంటారు. ఆ సంస్థ ముసుగులో యువతుల అమ్మకం జరుగుతుందనే అనుమానం నిఖిల్ శర్మకి కలుగుతుంది.  కత్రినా మరణానికి కూడా ఆ సంస్థనే కారణమనే ఉద్దేశంతో నిఖిల్ శర్మ ఉంటాడు.

అయితే 'లేక' అనే సంస్థను నడుపుతున్న వ్యక్తి సామాన్యుడు కాదు. చట్టపరంగా అతణ్ణి ఎదుర్కోవడం కూడా అసాధారణమైన విషయం. అలాంటి ఒక పర్వతాన్ని తాను ఒంటికాలుతో ఢీ కొట్టాలి. 'లేక' సంస్థ ఆగడాలకు అడ్డుకట్టవేయాలి. అమాయకమైన పేద ఆడపిల్లలను ఆ సంస్థ బారిన పడకుండా చేయాలనే పట్టుదలతో నిఖిల్ శర్మ  ఉంటాడు. అయితే ఒక కాలును కోల్పోయిన కారణంగా తన నిస్సహాయతను నిందించుకుంటూ ఆవేదన చెందుతుంటాడు. ఎలాగైనా ఆ సంస్థ అరాచకాలను బయటపెట్టాలనే కసితో రగిలిపోతుంటాడు. 

తన తల్లి తనకి ఇచ్చిన  ధైర్యాన్ని గుర్తుచేసుకుని, ప్రాణాలకు తెగించి ఒంటి కాలుతోనే ఆ సంస్థకి సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా సేకరించడం మొదలుపెడతాడు. ఈ విషయంగా అతను ఎవరినైతే కలుస్తూ ఉంటాడో .. వాళ్లంతా హత్యలకు గురవుతూ ఉంటారు. తన అన్వేషణలో భాగంగా,  కత్రినా రూమ్మేట్స్ గా ఉండే మీరా - ఇవా అనే యువతులను కలుకుంటాడు.

పేద యువతులను ఉన్నత చదువుల కోసం విదేశాలకి రప్పించి వ్యభిచారంలోకి దింపుతున్నారనీ, నిరాకరించినవారిని చంపేస్తున్నారని నిఖిల్ శర్మతో మీరా చెబుతుంది. ఆ వెంటనే ఆ యువతి కూడా హత్యకి గురవుతుంది. అప్పుడు నిఖిల్ శర్మ ఏం చేస్తాడు? 'లేక' ఫౌండేషన్ ఆగడాలకు ఎలా ఫుల్ స్టాప్ పెడతాడు? తన తండ్రి విషయంలో అతని అభిప్రాయం మారుతుందా? అనే మలుపులతో ఈ కథ నడుస్తుంది.

ప్రవాల్ రామన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కథ అంతా కూడా లండన్ నేపథ్యంలోనే జరుగుతుంది. సాధారణంగా పోలీస్ కథలు తెరపై చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి. అందునా ఫారిన్ పోలీస్ వ్యవస్థ .. వాళ్ల పనితీరు అనూహ్యంగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో హీరో తన కాలును కోల్పోవడం .. తనవారు అనుకున్నవారు దూరమవుతూ ఉండటంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు.  అందువలన అందుకు సంబంధించిన ఎమోషనల్ డ్రామా ఎక్కువగా నడుస్తుంది. 

ఈ కథ అంతా కూడా హీరో చుట్టూనే ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఒక వైపున వ్యక్తిగత జీవితం .. మరో వైపున తాను సాధించాలనుకున్న లక్ష్యానికి మధ్య నలిగిపోతున్నవాడిగా రణదీప్ హుడా నటన ఆకట్టుకుంటుంది. అయితే కథనం నిదానంగా కొనసాగడానికి ఈ అంశమే కారణమైంది. జరిగినదాని గురించి విచారాన్ని పొందుతూ .. అతను ఎమోషన్స్ కి గురవుతూ ఉండటమనేది ప్రేక్షకుల సహనం సన్నగిల్లేలా చేస్తుంది. క్లైమాక్స్ లో ఆయన ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటాడు. అప్పటివరకూ ఆడియన్స్ వెయిట్ చేయవలసిందే అన్నట్టుగా కథనం స్లోగా సాగుతుంది. 
 
ఇది ఒక సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ మాదిరిగా నిదానంగా సాగుతుంది. స్క్రీన్ ప్లే కూడా అంత బలంగా ఏమీ అనిపించదు. తెలుగు డబ్బింగ్ విషయంలో అంతగా శ్రద్ధపెట్టలేదని తెలుస్తూనే ఉంటుంది.  అమన్ పంత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..  జిమ్ ఎడ్గర్ ఫొటోగ్రఫీ .. ప్రవీణ్ అంగ్రే ఎడిటింగ్ ఫరవాలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్ లోని ఎమోషనల్ యాంగిల్ ను ఎక్కువగా ఆవిష్కరించిన ఈ సినిమాను చూడాలంటే కాస్త ఓపిక .. తీరిక ఉండవలసిందే.     

ప్లస్ పాయింట్స్: రణదీప్ హుడా నటన .. మదర్ సెంటిమెంట్ వైపు నుంచి అతను ఆవిష్కరించిన ఎమోషన్స్. 

మైనస్ పాయింట్స్: నిదానంగా సాగే కథనం .. హీరో చుట్టూ ఉండే పాత్రలు బలమైనవిగా కనిపించకపోవడం .. తెలుగు వెర్షన్ కి సంబంధించి, కొన్ని పాత్రలకు డబ్ వాయిస్ సెట్ కాకపోవడం.

Trailer

More Reviews