'స్పై' - మూవీ రివ్యూ

Spy

Movie Name: Spy

Release Date: 2023-06-29
Cast: Nikhil, Ishwarya Menon, Sanya Thakur, Jushusen Guptha, Makarand Desh Pandey, Abhinav Gomatham, Rana
Director:Garry BH
Producer: Rajasekhar Reddy
Music: Sricharan Pakala
Banner: ED Entertainment
Rating: 2.50 out of 5
  • నిఖిల్ హీరోగా వచ్చిన 'స్పై'
  • కథలో లోపించిన స్పష్టత 
  • కథనంలో గందరగోళం 
  • నాటకీయంగా అనిపించే సన్నివేశాలు 
  • సరిగ్గా డిజైన్ చేయని పాత్రలు 
  • నిర్మాణ విలువల పరంగా మంచి మార్కులు

'స్పై' యాక్షన్ తో కూడిన జోనర్లో తెలుగు ప్రేక్షకులను ఒకప్పుడు మెప్పించినంత తేలికగా ఇప్పుడు మెప్పించడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ జోనర్లో వచ్చిన సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. అందువలన ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గినా ఇప్పుడు ప్రేక్షకుడు అంగీకరించని పరిస్థితి ఉంది. అలాంటి ఒక జోనర్లో ఈ రోజున థియేటర్లకు వచ్చిన సినిమానే 'స్పై'. ఇంతవరకూ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వచ్చిన నిఖిల్, ఈ భారీ యాక్షన్ సినిమాతో ఎన్ని మార్కులు కొట్టేశాడనేది చూద్దాం.
 
ఖాదిర్ (నితిన్ మెహతా)  తీవ్రవాదులకు ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తూ, ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతాడు. ప్రపంచదేశాల శాంతిభద్రతలను సవాల్ చేసే స్థాయికి చేరుకుంటాడు. 'రా' ఏజెంటుగా పనిచేస్తున్న సుభాశ్ (ఆర్యన్ రాజేశ్) టీమ్ అతణ్ణి పట్టుకోవడానికి వెళుతుంది. ఆ ప్రయత్నంలోనే సుభాశ్ చనిపోతాడు. ఆ సందర్భంలోనే ఖాదిర్ చనిపోయినట్టుగా 'రా' వారికి సమాచారం అందుతుంది. వాళ్లంతా తేలికగా ఊపిరి పీల్చుకునేలోగా, తాను బ్రతికే ఉన్నానంటూ అతను ఒక వీడియో వదులుతాడు. 

ఊహించని ఈ సంఘటనతో 'రా' విస్తుపోతుంది. సుభాశ్ తమ్ముడు విజయ్ (నిఖిల్) కూడా 'రా' ఏజెంట్ గానే పనిచేస్తూ ఉంటాడు. శ్రీలంకలో ఒక ఆపరేషన్ నిమిత్తం ఉన్న ఆయన , వెంటనే హైదరాబాద్ చేరుకుంటాడు. తన తల్లిదండ్రులను ఓదార్చుతాడు.  ఆ తరువాత పై అధికారి శాస్త్రి (మకరంద్ దేశ్ పాండే)ను కలుసుకుంటాడు. ఖాదిర్ ను బంధించి ఇండియాకి అప్పగించడం .. లేదంటే అతణ్ణి అంతం చేయడం అనే ఆపరేషన్ ను అతను విజయ్ టీమ్ కి అప్పగిస్తాడు.  

అతని టీమ్ లో కమల్ (అభినవ్ గోమఠం) వైష్ణవి (ఐశ్వర్య మీనన్) .. సరస్వతి (సాన్యా ఠాకూర్) ఉంటారు. శాస్త్రి ఆదేశం మేరకు వాళ్లంతా రంగంలోకి దిగుతారు. ఒక వైపున వాళ్లు ఖాదిర్ ను పట్టుకునే ప్రయత్నంలో ఉండగానే, 'రా' అధీనంలో ఉన్న నేతాజీ సుభాశ్ చంద్రబోస్ కి సంబంధించిన ఫైల్ మాయమవుతుంది. అది కూడా ఖాదిర్ ప్లాన్ అనే విషయం శాస్త్రికి అర్థమవుతుంది. దాంతో ఆ ఫైల్ ను తిరిగి తీసుకొచ్చే పనిని కూడా ఆయన విజయ్ కి అప్పగిస్తాడు.

అంటే .. ఖాదిర్ ను అంతమొందించడం .. లేదా ప్రాణాలతో అతనిని అప్పగించడం .. అతని అధీనంలో ఉన్న సుభాశ్ చంద్రబోస్ ఫైల్ ను తీసుకుని రావడమనే బాధ్యతలు విజయ్ పై ఉన్నాయి. ఇక తన అన్నయ్యను ఎవరు చంపారనే విషయాన్ని తెలుసుకోవడం కూడా అతని ముందున్న మరో లక్ష్యం. చనిపోయిన ఖాదిర్ .. బ్రతికే ఉన్నానని వీడియో చేయడం ఏమిటి? అతనికి సుభాశ్ చంద్రబోస్ ఫైల్ తో పనేంటి? విజయ్ అన్నయ్యను ఎవరు చంపారు? అనే సందేహాలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.

గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కాస్త గ్రాండ్ గా ... హడావిడిగానే మొదలవుతుంది. తెరపై చకచకా దేశాల పేర్లు మారిపోతూ ఉంటాయి. విలన్ ను పట్టుకోవడానికి అవసరమైన వ్యూహాలతో 'రా' అధికారులు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. శ్రీలంకలోని ఒక ఆపరేషన్ లో పాల్గొంటూ తుపాకులు .. తూటాల మధ్యలో హీరో ఎంట్రీ ఇస్తాడు. ఈ హడావిడి కాస్త అయిన తరువాత అసలు కథ మొదలవుతుందని ప్రేక్షకులు అనుకుంటారు. 

కానీ సినిమా చివరి వరకూ కథలో ఇదే హడావిడి ఉంటుంది .. కథ లేకుండానే హడావిడి నడుస్తూ ఉంటుంది .. కథ లేదు కాబట్టే హడావిడి చేశారేమోనని అనిపిస్తూ ఉంటుంది. హీరో ముందు రెండు టార్గెట్ లు ఉంటాయి. ఆ రెండు టార్గెట్ ల ఎదురుగా ఉన్న విలన్ ఒక్కడే. కానీ అవతల వైపు నుంచి చూస్తే అక్కడ ఉండే ట్విస్ట్ వేరు. అది కొరుకుడు పడదు .. మింగుడుపడదు. తీవ్రవాదుల మధ్యలోకి ఒక ఆపరేషన్ నిమిత్తం వెళ్లిన ఒక 'రా' ఏజెంట్ చనిపోతే, అతనిని ఎవరు చంపారు? అనే ప్రశ్నే తలెత్తదు. ఆ లాజిక్ కి దూరంగా ఈ కథ నడుస్తుంది. 

కథ మొదలైన దగ్గర నుంచి ఫైటింగులు .. ఛేజింగులు .. కాల్పుల మోతలు ఉంటాయి. కానీ 'రా' ఏజెంట్లు ఎవరి వెంట ఎందుకు పడుతున్నారు? అనేది సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాదు. బైక్ ల దగ్గర నుంచి హెలికాఫ్టర్ వరకూ వాడారు .. తూటాల దగ్గర నుంచి మిస్సైల్స్ వరకూ వెళ్లారు. అయినా ప్రేక్షకుడు 'ఔరా' అని ఆశ్చర్యపోడు. ఎందుకంటే ఈ మొత్తంలో ఎక్కడా కథ అనేది కనిపించదు. ఇక సుభాశ్ చంద్రబోస్ ను ఎందుకు ఈ కథలోకి తీసుకు వచ్చారనేది, థియేటర్లో ఉండగానే కాదు, బయటికి వచ్చిన తరువాత ఆలోచించినా అర్థం కాదు. 

కథలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఇద్దరి ఎంట్రీ కూడా కెమెరా వెనక నుంచి ముందుకు వచ్చినట్టుగానే ఉంటుంది తప్ప, సరైన సమయం .. సందర్భం కనిపించవు. ఇక వాళ్లు ఎంట్రీ ఇవ్వడం వలన అటు హీరోకిగానీ, ఇటు థియేటర్లో ఉన్న ఆడియన్స్ కి గాని ఒరిగిందేమీ లేదు. ఎందుకంటే వాళ్లతో పాటలు పాడుకునే తీరిక హీరోకి లేదని అర్థం చేసుకోవాలి. రానా ఓ ఐదు నిమిషాల పాటు తెరపై కనిపిస్తాడు .. కాకపోతే ఆ పాత్రను కూడా అంత ఎఫెక్టివ్ గా డిజైన్ చేయలేకపోయారు. హీరోపైనే పంచ్ లు వేస్తూ అభినవ్ గోమఠం మాత్రం కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు.

నిఖిల్ యాక్టింగ్ కి వంక బెట్టడానికి లేదు. కానీ ఆయన స్థాయికి మించిన కథ ఇది .. పాత్ర ఇది. ఇక విలన్ పాత్రల్లో కనిపించిన నితిన్ మెహతాకీ .. జిషు సేన్ గుప్తాకి పెద్దగా పనిలేదు. సచిన్ ఖేడేకర్ .. పోసాని .. సీనియర్ హీరో సురేశ్ పాత్రలు డమ్మీగా కనిపిస్తాయి అంతే. ఖర్చు విషయంలో .. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. కానీ కథగా చెప్పుకునేది ఏదైతే ఉందో, అదే ఇష్టానుసారం పరిగెత్తడమే అసహనాన్ని .. అసంతృప్తిని కలిగిస్తుంది. శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. వంశీ పచ్చిపులుసు ఫొటోగ్రఫీ అదనపు బలంగా అనిపిస్తాయి. 

ప్లస్ పాయింట్స్: నిర్మాణ విలువలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా పనితనం 
మైనస్ పాయింట్స్: కథాకథనాలు .. నిఖిల్ కి సెట్ కాని పాత్ర .. సన్నివేశాల్లో క్లారిటీ లోపించడం .. చాలా పాత్రలు డమ్మీలుగా కనిపించడం .. ఎంటర్టయిన్మెంట్ కి దూరంగా వెళ్లడం. 

Trailer

More Reviews