'అశ్విన్స్' - మూవీ రివ్యూ

Asvins

Movie Name: Asvins

Release Date: 2023-06-23
Cast: Vasanth Ravi, Vilama Raman, Muralidharan, Uday Deep, Simran Parekh
Director:Tarun Teja
Producer: BVSN Prasad
Music: Vijay Siddharth
Banner: Sri Venkateshwara Cine Cithra
Rating: 2.50 out of 5
  • తరుణ్ తేజ నుంచి వచ్చిన 'అశ్విన్స్ '
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే సినిమా
  • ఫస్టాఫ్ లో భయపెట్టేసిన దర్శకుడు   
  • పొంతనలేని అంశాల అల్లికగా అనిపించే కథ 
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ హైలైట్

హారర్ థ్రిల్లర్ చిత్రాల పట్ల యూత్ ఎక్కువ ఆసక్తిని చూపుతూ ఉంటుంది. యూత్ లో కొంతమందికి భయం ఉన్నప్పటికీ, భయపడుతూనే చూడటానికి వాళ్లు సిద్ధమవుతుంటారు. అందువలన ఈ తరహా జోనర్లో రూపొందిన సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ను రాబడుతుంటాయి. అలాంటి జోనర్లో ఈ రోజున తెలుగు .. తమిళ భాషల్లో థియేటర్లకు వచ్చిన సినిమానే 'అశ్విన్స్'. A సర్టిఫికెట్ తో వచ్చిన ఈ సినిమా, ఏ రేంజ్ లో ప్రేక్షకులను భయపెట్టిందనేది ఇప్పుడు చూద్దాం. 

సాధారణంగా టైటిల్ వినగానే ఇది డబ్బింగ్ సినిమానేమో అనే ఒక డౌట్ రావడం సహజం. కానీ ఇది తెలుగు సినిమానే. ఇక్కడ 'అశ్విన్స్' అంటే అశ్వనీదేవతలు అని అర్థం. అశ్వనీ దేవతలు .. దేవతా వైద్యులు. వాళ్లతో ఈ కథకి లింక్ ఉంది .. వాళ్లతోనే ఈ కథ మొదలవుతుంది. అందువలన ఈ సినిమాకి ఈ టైటిల్ ను సెట్ చేసుకున్నారు. అర్థం లేనట్టుగా .. అర్థం కానట్టుగా అనిపించినా, సినిమాపై కుతూహలాన్ని పెంచడానికి టైటిల్ కారణమైందనే చెప్పాలి.

ఒక రైతు తన ఇద్దరు కొడుకులు చనిపోవడంతో, వాళ్లని బ్రతికించమని కోరుతూ అశ్వనీ దేవతలను ప్రార్ధిస్తాడు. వారు ఒక పిల్లవాడినే బ్రతికించి .. తమ ప్రతి రూపాలుగా రెండు బొమ్మలను ఇస్తారు. ఆ రెండు బొమ్మలను కలిపే ఉంచాలనీ .. విడదీయడానికి ప్రయత్నిస్తే అనర్థం జరుగుతుందని హెచ్చరిస్తారు. తమ ఆశీస్సుల కారణంగా ఆ రైతు కొడుక్కి సహజ మరణం సంభవిస్తుందనీ, అతని ప్రాణాలకు ఎవరి వలన ఎలాంటి ప్రమాదం ఉండదని సెలవిస్తారు. 

ఈ మాటలను ఒక దుష్టశక్తి వింటుంది. మారు వేషంలో ఆ పిల్లవాడిని మంచి చేసుకుంటుంది. తనకి ఒక బొమ్మ ఇస్తే, అతనికి సోదరుడిని తాను తీసుకొస్తానని అంటుంది. అలా ఆ పిల్లవాడి దగ్గర నుంచి తీసుకున్న బొమ్మ సాయంతో, పాతాళంలో ఉన్న మరో దుష్ట శక్తిని భూలోకానికి తీసుకొస్తుంది.  ఆ దుష్ట శక్తి ఆ పిల్లవాడి సోదరుడి రూపంలో ఆ గ్రామంలోకి అడుగుపెడుతుంది. అప్పటి నుంచి ఆ ఊళ్లో అన్నీ అనర్థాలు  జరగడం మొదలవుతుంది.  

 
ఇదిలా ఉండగా .. ఈ రోజుల్లో కొంతమంది యూ ట్యూబర్లు ప్రాచీన కాలం నాటి కోటలను .. భయంకరమైన గుహలను కవర్ చేస్తూ ఈ రంగంలో ఉన్న పోటీని తట్టుకుంటున్నారు. అలా ఓ ఐదుగురు స్నేహితులు కలిసి 'బ్లాక్ టూరిజం' కోసం లండన్ లోని ఓ దీవిలో గల పాడుబడిన బంగ్లాకు వెళతారు. ప్యాలెస్ ను తలపించే ఆ బంగ్లాను విక్రమ్ రాజగోపాల్ కొనుగోలు చేస్తాడు. ఆ తరువాత ఆ బంగ్లా ఆయన కూతురు ఆర్తి రాజగోపాల్ (విమల రామన్) సొంతమవుతుంది.

ఆర్కియాలజీ డిపార్టుమెంటులో పనిచేసే ఆర్తి రాజగోపాల్, అశ్వనీదేవతల బొమ్మల గురించిన సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. అలాంటి ఆమె ఆ బంగ్లాలో ఆత్మహత్య చేసుకుందనీ, ఆమె సిబ్బంది అంతా మరణించారనే సమాచారం ఉంటుంది. అయితే ఒక్క ఆమె శవం మాత్రం లభ్యం కాకపోవడం ఒక మిస్టరీగా మిగిలిపోతుంది. ఆమె ఏమైంది? ఆ బంగ్లాలో ఏం జరుగుతోంది? అక్కడికి వెళ్లిన యూ ట్యూబర్స్ కి ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయి? అనేది మిగతా కథ. 

ఇప్పుడు ఈ కథలో ఒక వైపున అశ్వనీ దేవతల నుంచి వరాన్ని అందుకున్న కుర్రాడు .. మాయచేసి అతని దగ్గర నుంచి ఒక అశ్వనీ దేవత ప్రతిమను కాజేసిన దుష్టశక్తి .. మరో వైపున లైఫ్ లో సెటిలైపోవాలనే ఉద్దేశంతో రిస్క్ చేయడానికి సిద్ధపడిన యూ ట్యూబర్లు .. లండన్ భవంతిలో ఆత్మగా  తిరుగుతున్న ఆర్తి రాజగోపాల్ ట్రాకులు ప్రధానంగా నడుస్తూ ఉంటాయి. ఈ నాలుగు ట్రాకులు ఈ బంగ్లాకు చేరుకుని దాని కేంద్రంగానే కథను ముందుకు తీసుకుని వెళతాయి. 

నిజానికి ఇది కాస్త 'చందమామ' కథలా .. మరి కాస్త హాలీవుడ్ హారర్ మూవీలా అనిపిస్తుంది. దర్శకుడు అశ్వనీ దేవతలకి సంబంధించిన లీడ్ అంతా కూడా వాయిస్ ఓవర్ తో .. పెయింటింగ్స్ తో లాగించేశాడు. ఆ తరువాత నుంచి దెయ్యాల బంగ్లాకి సంబంధించిన కథ మొదలవుతుంది. రైతు కొడుకులు .. అశ్వనీదేవతలు ..  రైతుకు తమ ప్రతిమలు ఇవ్వడం .. ఆ బొమ్మలు ఒకదానితో ఒకటి కట్టి ఉండాలనే నియమం .. ఇవన్నీ ఈ కథకి అవసరమా? అనిపించకమానదు.


పొంతనలేని రెండు అంశాలను తీసుకుని .. ఆ రెండింటిని కలపడానికి దర్శకుడు చాలా కష్టపడవలసి వచ్చింది. పాపం ఆయన ఎంత కష్టపడినా అవి మాత్రం అతకలేదు. ఒక కొడుకును బ్రతికించిన అశ్వనీ దేవతలకు .. రెండో కొడుకును బ్రతికించే శక్తి లేదా? అనే చిన్న డౌట్, ఈ పాయింట్ కి ప్రేక్షకులను కనెక్ట్ కాకుండా చేస్తుంది. ఇక మరణం గురించి .. ఆత్మల గురించి హీరో చెప్పే మాటలు వింటే ఇది డబ్బింగ్ సినిమానేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్కం .. ఆ లాజిక్ సామాన్య ప్రేక్షకులకు అర్థం కాదు.  

ఇక దర్శకుడిని ఒక విషయంలో మాత్రం అభినందించవచ్చు. సినిమా మొదలైన పావు గంటవరకూ తెరపై ఆర్టిస్టులు ఎవరూ కనిపించకుండా, కేవలం అరుపులు .. కేకలు .. సౌండ్ ఎఫెక్ట్స్ తో భయపెట్టేశాడు. దర్శకుడు ఎంచుకున్న బంగ్లా .. లొకేషన్స్ కథకి తగినట్టుగా ఉన్నాయి. ఆయన టేకింగ్ కూడా బాగుంది. కాకపోతే ఫస్టాఫ్ స్థాయిలో సెకండాఫ్ ను డిజైన్ చేసుకోలేకపోయాడు. విజయ్ సిద్ధార్థ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఎడ్విన్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ఒక్కో సందర్భంలో తల పైకెత్తి తెర వైపు చూడాలంటే ఆలోచించుకునేలా వాళ్లు తమ టాలెంట్ చూపించారు. వెంకట రాజన్ ఎడిటింగ్ కూడా మంచి మార్కులు తెచ్చుకుంటుంది. 

ప్లస్ పాయింట్స్: టేకింగ్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. లొకేషన్స్ .. ఫస్టాఫ్.  

మైనస్ పాయింట్స్: కథకి అతకని అశ్వనీ దేవతల అంశం .. ఆత్మల విషయంలో అర్థంకాని హీరో థియరీ .. సెకండాఫ్ లో తిరిగి కథ మొదలైన కాసేపటికే ప్రేక్షకులను గందరగోళంలోకి తీసుకెళ్లే అంశాలు. ప్రేక్షకుల ఆలోచనలకు అందని సంభాషణలు.

*చాలా తక్కువ పాత్రలతో .. ఒక బంగ్లాకి పరిమితమైన కథ ఇది. ఫస్టాఫ్ లో భయపెడుతుంది .. సెకండాఫ్ లో గందరగోళంలోకి నెడుతుంది. 

Trailer

More Reviews