'టక్కర్' - సినిమా రివ్యూ

Takkar

Movie Name: Takkar

Release Date: 2023-06-09
Cast: Siddharth, Divyansha Koushik, Abhimanyu Singh, Yogibabu
Director:Karthik G Krish
Producer: Abhishek Agarwal
Music: Nivas K Prasanna
Banner: People Media Factory
Rating: 2.25 out of 5
  • సిద్ధార్థ్ హీరోగా రూపొందిన 'టక్కర్'
  • కొత్తదనం లేని కథ .. బలహీనమైన స్క్రీన్ ప్లే 
  • పసలేని ట్రాకులు .. పేలని కామెడీ 
  • గ్లామర్ తో అలరించిన దివ్యాన్ష కౌశిక్

ఒకప్పుడు కుర్రహీరోగా టాలీవుడ్ లోని యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇచ్చినవాడిగా సిద్ధార్థ్ కనిపిస్తాడు. ఆయన చేసిన లవ్ స్టోరీస్ వరుసగా హిట్ కొట్టడంతో యూత్ లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉండేది. అలాంటి సిద్ధార్థను ఆ తరువాత ఫ్లాపులు వెంటాడుతూ వచ్చాయి. దాంతో ఆయన తమిళ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ, తెలుగు తెరపై అడపాదడపా మాత్రమే కనిపిస్తూ వస్తున్నాడు. అలాంటి సిద్ధార్థ్ హీరోగా రూపొందిన 'టక్కర్', తమిళంతో పాటు తెలుగులోనూ ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

గుణశేఖర్ (సిద్ధార్థ్) మధ్యతరగతి జీవితం పట్ల విసుగుతో ఉంటాడు. పేదరికంలో పుట్టడం తన తప్పు కాకపోయినా, పేదరికంలో చనిపోతే తన తప్పే అని నమ్మే యువకుడు. ఎలాగైనా డబ్బు బాగా సంపాదించాలనే ఉద్దేశంతో వైజాగ్ చేరుకుంటాడు. అక్కడ ఒక చైనా బిజినెస్ మెన్ దగ్గర కారు రెంట్ కి తీసుకుని టాక్సీ నడుపుతుంటాడు. ఆ బిజినెస్ మేన్ ఒక మాఫియా డాన్ స్థాయిలో అనుచరులను కలిగి ఉంటాడు. గుణ తన ఎమోషన్స్ ను తన స్నేహితుడైన ఆర్ జేతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. 

ఇక రాజు (అభిమన్యు సింగ్) అమ్మాయిలను కిడ్నాప్ చేసి, విదేశాలకు అమ్మేస్తుంటాడు. అతని గ్యాంగ్ కన్ను లక్కీ (దివ్యాన్ష కౌశిక్) పై పడుతుంది. శ్రీమంతుడైన శ్రీనివాస్ కి ఆమెనిచ్చి పెళ్లి చేయాలని తండ్రి భావిస్తుంటాడు. అతను ఓ పెద్ద బిజినెస్ మెన్. తన బిజినెస్ ను మరింత పెంచుకోవడం కోసం ఆయన ఆ నిర్ణయం తీసుకుంటాడు. అయితే శ్రీనివాస్ ఎలాంటివాడనేది తెలిసిన లక్కీ, అందుకు నిరాకరిస్తుంది. 

ఈ నేపథ్యంలోనే రాజు అనుచరులు లక్కీని కిడ్నాప్ చేస్తారు. కోటి రూపాయలు ఇస్తే ఆమెను వదిలేస్తామని ఆమె తండ్రిని బెదిరిస్తూ ఉంటారు. ఇక కారును డామేజ్ చేసిన కారణంగా ఆ కారు యజమాని అనుచరులు గుణను వెంటాడుతుంటారు. ఈ సమయంలోనే తనకి తెలియకుండానే రాజు కారులో గుణశేఖర్ పారిపోతాడు. రాజు కిడ్నాప్ చేసిన లక్కీ, ఆ కారు డిక్కీలో ఉంటుంది. అప్పటి నుంచి లక్కీ - గుణ మధ్య పరిచయం పెరుగుతుంది .. అది కాస్త ప్రేమగా మారుతుంది. 

ఒక వైపున విలన్ మనుషులు .. మరో వైపున కారు ఓనర్ మనుషులు గుణ కోసం వెదుకుతుంటారు. వాళ్ల బారి నుంచి గుణ ఎలా తప్పించుకుంటాడు? తన కూతురు గుణ ప్రేమలో ఉందని తెలిసిన లక్కీ తండ్రి ఎలా స్పందిస్తాడు? అప్పటి నుంచి ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయి? అనేది కథ.

కార్తీక్ జి. క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ ఈ సినిమాకి కథను అందించాడు. కథాపరంగా చూసుకుంటే, ఎక్కడా కొత్తదనమనేది కనిపించదు. ఒక కోటీశ్వరుడి కూతురు తానంటే ఇష్టపడుతున్న మరో కోటీశ్వరుడిని వదిలేసి, ఒక టాక్సీ డ్రైవర్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటం ఈ కథలో హీరోయిన్ వైపు నుంచి కనిపించే లైన్. ఇక డబ్బు బాగా సంపాదిస్తానని ఇంట్లో చెప్పి వచ్చేసిన హీరో, అద్దెకి కారు తీసుకుని టాక్సీ నడుపుకోవడం హీరో వైపు నుంచి నడిచే లైన్. 

ఈ రెండు అంశాలు కూడా బలహీనమైనవిగానే కనిపిస్తాయి. ఇక అమ్మాయిలను కిడ్నాప్ చేసి అమ్మేసే విలన్ .. అతనితో ఉంటూ టార్చర్ పెట్టే యోగిబాబు పాత్ర కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తాయి. ఒక సందర్భంలో తాను ప్రేమిస్తున్న విషయాన్ని హీరోయిన్ కి చెబుతాడు హీరో. ప్రేమకి ముగింపు సెక్స్ అంటుంది హీరోయిన్. ఈ విషయంలో ఎవరి మాట నిజమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో లాడ్జ్ లో రూమ్ తీసుకుంటారు. 

నీ గోల్డ్ చైన్ అమ్మేసిన డబ్బులు అయిపోయాయని హీరో అంటే, ఫరవాలేదులే .. ఇంకా మొలతాడు ఉంది గదా అంటుంది హీరోయిన్. క్లైమాక్స్ లో హీరో మిడిల్ ఫింగర్ చూపిస్తే, దానితో కలుపుకునే నేను చెబుతున్నది అంటుంది ఆమె.  ఈ కథ ఏ స్థాయిలో నడుస్తుందని చెప్పడానికి ఇవి సరిపోతాయి. టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అయితే అవన్నీ కూడా గుంపు గొడవల మాదిరిగా కనిపిస్తాయి. ఛేజింగ్ సీన్స్ వరకూ బాగున్నాయనిపిస్తుంది. 

ఈ సినిమా ఎందుకు చూడాలి? అనే ప్రశ్న ఎవరినైనా అడిగితే, దివ్యాన్ష కౌశిక్ గ్లామర్ కోసం చూడొచ్చు అనే వాళ్లు ఎక్కువమంది ఉంటారేమో. అంత ఫ్రెష్ గా .. గ్లామరస్ గా ఆమె కనిపించింది. మంచి హైటూ .,. అందుకు తగిన ఫిజిక్ .. మంచి స్కిన్ టోన్ ఉన్న దివ్యాన్ష ఈ స్థాయిలో అందాలు ఆరబోయడం ఇదే మొదటిసారేమో. క్లోజప్ షాట్స్ లోను ఆమె చాలా అందంగా మెరిసింది. ఇక సిద్ధార్థ్ ఫిజిక్ పరంగా బాగానే కనిపించినప్పటికీ, ఫేస్ లో గ్లో కనిపించలేదు. యోగిబాబు వైపు నుంచి కామెడీ కూడా పేలలేదు. ఇక హీరోకి .. అతని ఫ్రెండ్ కి మధ్య నడిచినవి సీన్స్ కూడా తలనొప్పి తెచ్చేవే.  

నిర్మాణ విలువలు బాగున్నాయి. నివాస్ కె ప్రసన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. వాంచినాథన్ మురుగేశన్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఛేజింగ్ సీన్స్ ను .. రొమాంటిక్ సీన్స్ ను బాగా తీశాడు. గౌతమ్ ఎడిటింగ్ విషయానికొస్తే, హీరో ఫ్రెండ్ సీన్స్ ను కుదించవలసింది. అలాగే విలన్ .. ఆయన అనుచరుల కాంబినేషన్లోని సీన్స్ ను ట్రిమ్ చేయవలసింది. 

ప్లస్ పాయింట్స్: నిర్మాణ విలువలు .. ఛేజింగ్ సీన్స్ .. దివ్యాన్ష గ్లామర్ ... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
మైనస్ పాయింట్స్:  కథాకథనాలు .. కామెడీ .. బలహీనమైన ట్రాకులు .. బాణీలు

Trailer

More Reviews