'విమానం' - సినిమా రివ్యూ

Vimanam

Movie Name: Vimanam

Release Date: 2023-06-09
Cast: Samudrakhani, Rahul Ramakrishna, Aanasuya, Dhan Raj, Master Dhruvan
Director:Shiva Prasad Yanala
Producer: Kiran Korrapati
Music: Charan Arjun
Banner: Kiran Korrapati Creative Works
Rating: 2.75 out of 5
  • ఎమోషన్స్ ప్రధానంగా సాగే 'విమానం'
  • తండ్రీ కొడుకుల అనుబంధం చుట్టూ అల్లుకున్న కథ 
  • సముద్రఖని నటన హైలైట్
  • అతకని అనసూయ పాత్ర 
  • వేగం లోపించిన స్క్రీన్ ప్లే    

కొన్ని కథలు జీవితాలకు దగ్గరగా ఉంటాయి .. మరికొన్ని కథలు జీవితాల్లోనుంచే పుడతాయి. అలా కొన్ని జీవితాలను కలుపుకుంటూ వెళ్లిన కథనే 'విమానం'. కొన్ని సినిమాల్లో హీరో ఉండడు .. కథనే హీరో అవుతుంది. అలాంటి సినిమాల జాబితాలో ఇది నిలుస్తుంది. జీ స్టూడియోస్ - కిరణ్ కొర్రపాటి కలిసి నిర్మించిన ఈ సినిమాకి, శివప్రసాద్ యానాల దర్శకత్వం వహించాడు. ఈ రోజునే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎమోషన్స్ ప్రధానంగా నడిచే ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ హైదరాబాద్ లోని ఒక స్లమ్ ఏరియాలో 2008 ప్రాంతంలో నడుస్తుంది. కొడుకు ముచ్చట తీర్చడం కోసం పరిస్థితులతో ఓ తండ్రి చేసిన పోరాటమే ఈ సినిమా. వీరయ్య (సముద్రఖని) అంగవైకల్యం కలిగిన వ్యక్తి. హైదరాబాదులోని ఒక మురికివాడలో తన పదేళ్ల కొడుకుతో కలిసి అతను నివసిస్తూ ఉంటాడు. ఒక్క కాలుతోనే తన పనులను చక్కబెడుతూ ఉంటాడు. తల్లిని కోల్పోయిన తన కొడుకు రాజు (మాస్టర్ ధృవన్)ను గారాబంగా చూసుకుంటూ ఉంటాడు. అదే బస్తీలో కోటి (రాహుల్ రామకృష్ణ) డేనియల్ (ధనరాజ్) ఆయనకి ఎంతో సపోర్టుగా ఉంటారు.

ఆ బస్తీలో సుమతి (అనసూయ) వేశ్యగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. చెప్పులు కుట్టుకునే 'కోటి' ఆమెను ఎంతగానో ఆరాధిస్తూ ఉంటాడు. ఇక డేనియల్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని వెళ్ల దీస్తుంటాడు. వీరయ్య కొడుకు ధృవన్ మంచి తెలివైనవాడు. ఊహ తెలిసిన దగ్గర నుంచి అతనికి విమానమంటే ఎంతో ఇష్టం. తనని విమానం ఎక్కించమని తండ్రిని ఒకటే పోరుతుంటాడు. అది తన శక్తికి మించిన పని అనే విషయం వీరయ్యకి తెలుసు. 

రాజుకి మంచి పేరున్న స్కూల్లో ఉచితంగా చదువుకునే అవకాశం వస్తుంది. కానీ అదే సమయంలో అతని గురించిన ఒక భయంకరమైన నిజం వీరయ్యకి తెలుస్తుంది. అదేమిటి? అప్పుడు వీరయ్య ఏం చేస్తాడు? ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? విమానం ఎక్కాలనే రాజు కోరిక నెరవేరుతుందా? సుమతిని సొంతం చేసుకోవాలనే కోటి కల నిజమవుతుందా? అనేది మిగతా కథ. 

దర్శకుడు శివ ప్రసాద్ యానాల, వీరయ్య - కోటి - డేనియల్ - సుమతి అనే ఒక నలుగురు వ్యక్తుల జీవితాలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ప్రధానంగా వీరయ్య కథ నడుస్తూ ఉండగా ... అదే బస్తీకి చెందిన మిగతావారి జీవితాలను కూడా టచ్ చేస్తూ ఈ కథ  కొనసాగుతుంది. ఆయన ఈ కథను ఎత్తుకున్న తీరు .. ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ .. సంతృప్తికరంగా అనిపిస్తాయి. కీలకమైన ఈ మూడు అంశాల విషయంలో అసంతృప్తి ఉండదు. 

కానీ దర్శకుడు కథనాన్ని నడిపించిన విధానం చాలా స్లోగా ఉంటుంది. ఇక సెకండాఫ్ నుంచి ఎమోషన్స్ డోస్ పెంచుతూ వెళ్లాడు. సముద్రఖని .. రాహుల్ రామకృష్ణ .. ధన్ రాజ్ తమ పాత్రలలో కరెక్టుగా సెట్ అయ్యారు. స్లమ్ ఏరియాలోని వేశ్య పాత్రలో అనసూయ మాత్రం సెట్ కాలేదు. ఆ స్లమ్ ఏరియాలో ఉండే వాళ్లందరికీ ఆమె డిఫరెంట్ గా కనిపిస్తూ, ఆమె ఆ పాత్రకి అతకలేదేమోనని అనిపిస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాత్రకి ఆమె గ్లామర్ మైనస్ అయిందనే అనాలి. 

ఇక రాజేంద్రన్ కోలీవుడ్ లో స్టార్ ఆర్టిస్ట్. ఆయనను కేవలం ఒక ఫొటోగ్రాఫర్ గా మాత్రమే వాడుకోవడం కూడా అంత కరెక్టుగా అనిపించదు. ఆ పాత్రకి ఆ స్థాయి ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ అవసరం లేదనే చెప్పాలి. ఇక వీరయ్య పై దొంగతనం కేసు మోపడం .. ఎగ్జిబిషన్ లో జోకర్ గా నటించే అవకాశాన్ని దక్కించుకోవడం వంటి సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువగా కనిపిస్తుంది. సముద్రఖనిని స్టేజ్ పై జోకర్ గా చూపించడం దర్శకుడు చేసిన మరో పొరపాటుగా అనిపిస్తుంది.

సాధారణంగా యాక్సిడెంట్ సీన్స్ ను .. మర్డర్ సీన్స్ ను .. అంబులెన్స్ సైరన్ తో కూడిన హాస్పిటల్ సీన్స్ ను .. చిన్నపిల్లలు జబ్బుతో బాధపడే సీన్స్ తో కూడిన సినిమాలను చూడటానికి చాలామంది ఇష్టపడరు. తెలియకుండానే అది అలజడిని సృష్టిస్తుంది. అందువలన ఆడియన్స్ థియేటర్ లో ఉన్నప్పటికీ, ఆ సీన్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సినిమా విషయంలోను అదే జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.   

ఈ సినిమా మొత్తానికి సముద్రఖని నటన హైలైట్ అని చెప్పకతప్పదు. ఆయనే ఈ కథకి కేంద్రబిందువు ... ఆయనను ఆధారం చేసుకునే ఆయన పాత్ర చుట్టూనే ఈ కథ అల్లుకుని కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సముద్రఖని సినిమా. చరణ్ అర్జున్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. అప్పటికీ .. ఆ సందర్భానికి పాటలు ఓకే అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది.  వివేక్ కాలెపు కెమెరా పనితనం ఫరవాలేదు. 

మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ విషయానికి వస్తే .. సుమతిని కోటిగాడు ఆరాధించే సీన్స్ .. ఫోటోగ్రాఫర్ గా రాజేంద్ర సీన్స్ .. టింబర్ డిపో ఓనర్ కాంబినేషన్లోని వీరయ్య సీన్స్ ను ట్రిమ్ చేయవలసింది. 'తల్లిదండ్రులుపోతే ఎలా బతకాలి అనిపిస్తుంది .. బిడ్డలు పోతే ఎందుకు బతకాలనిపిస్తుంది' అనే డైలాగ్ ఈ సినిమా మొత్తం మీద ప్రభావం చూపించిన డైలాగ్.

ప్లస్ పాయింట్స్: సముద్రఖని నటన .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఎమోషన్స్ .. క్లైమాక్స్. 

మైనస్ పాయింట్స్: నిదానంగా సాగే కథనం .. సహజత్వానికి దూరంగా అనిపించే అనసూయ పాత్ర.

Trailer

More Reviews