'అహింస' - మూవీ రివ్యూ

Ahimsa

Movie Name: Ahimsa

Release Date: 2023-06-02
Cast: Daggubati Abhiram, Geethika, Rajath Bedi, Ravi Kale, Manoj Tiger
Director:Teja
Producer: Kiran
Music: RP Patnaik
Banner: Anandi Arts
Rating: 2.25 out of 5
  • తేజ నుంచి వచ్చిన మరో ప్రేమకథగా 'అహింస'
  • కొత్తదనం లేని కథ .. బలహీనమైన స్క్రీన్ ప్లే 
  • ఏ ట్రాక్  .. ఏ పాత్ర కూడా కనెక్ట్ కాకపోవడం 
  • పెద్దగా ఆకట్టుకొని పాటలు 
  • ఎక్కడా కనిపించని తేజ మార్క్ 
  • మెప్పించలేకపోయిన హీరో .. హీరోయిన్.  

మొదటి నుంచి కూడా తేజ కొత్త కుర్రాళ్లను హీరోలుగా పరిచయం చేస్తూ వచ్చాడు. ఉదయ్ కిరణ్ .. నితిన్ ఆయన దర్శకత్వంలో తెలుగు తెరకి పరిచయమైనవారే. ఇక తేజ తెరకెక్కించినవాటిలో ప్రేమకథల నేపథ్యంలో రూపొందినవే ఎక్కువ. అలాంటి తేజ కొంత గ్యాప్ తరువాత, దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన సినిమానే 'అహింస'. ఈ రోజునే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. ఈ లవ్ స్టోరీ యూత్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 


గ్రామీణ నేపథ్యంలో .. కల్మషం లేని పలకరింపుల మధ్య పెరిగిన యువకుడు రఘు (అభిరామ్). అందరినీ ఆప్యాయంగా పలకరించడం .. అందరితో కలుపుగోలుగా ఉండటం .. హింసకి దూరంగా ఉండటమనేది సహజ లక్షణాలుగా పెరుగుతాడు. అతని మంచితనం చూసి అహల్య (గీతిక) ప్రేమలో పడుతుంది. ఈ ఇద్దరికీ పెళ్లి చేయడానికి పెద్దలు అంగీకరిస్తారు. నిశ్చితార్థం కూడా జరుపుతారు. ఈ నేపథ్యంలోనే పట్టణానికి చెందిన ఇద్దరు శ్రీమంతుల కొడుకులు అహల్య ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారం చేస్తారు.

చావుబతుకుల్లో ఉన్న అహల్యను ఆమె తల్లిదండ్రులు .. రఘు కలిసి హాస్పిటల్లో చేరుస్తారు. రఘుకు పరిచయమున్న లాయర్ 'సదా' రంగంలోకి దిగుతుంది. దాంతో అహల్యను బలాత్కరించిన కుర్రాళ్ల తండ్రి దుష్యంత్ (రజత్ బేడీ) ఆ ఫ్యామిలీకి డబ్బు ఇచ్చి ఆ సమస్య పెద్దది కాకుండా చేయాలని చూస్తాడు. కానీ అందుకు రఘు నిరాకరిస్తాడు. వాళ్లపై పోరాటం చేయడానికి సిద్ధపడతాడు. కానీ రఘు మాత్రం న్యాయపోరాటానికి సిద్ధమవుతాడు.

అహల్య కేసు విషయంలో ఒక వైపున సాక్ష్యాలు దొరక్కుండా చేస్తూనే, మరో వైపున రఘు - అహల్యలను అంతం చేయడానికి దుష్యంత్ రంగంలోకి దిగుతాడు. తనకి తెలిసిన పోలీసులను .. ఛటర్జీ అనే లాయర్ ను రంగంలోకి దింపుతాడు. ఇక అహింసా సిద్దాంతాన్ని పక్కన పెట్టేసి, తనకి అన్యాయం చేసినవారిని అంతం చేయమని రఘును అహల్య కోరుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? పర్యవసానంగా చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేవి ఆసక్తిని రేకెత్తించే అంశాలు. 

ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా తేజకి మంచి పేరు ఉంది. ప్రేమకథలపై దర్శకుడిగా ఆయన మార్క్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అందువలన చాలా కాలం తరువాత ఆయన నుంచి వస్తున్న లవ్ స్టోరీ కావడంతో, సహజంగానే యూత్ లో ఒక అంచనా ఉంటుంది. అలా గ్రామీణ నేపథ్యంలో సాగే ఆయన మార్క్ లవ్ స్టోరీని చూస్తూ ఎంజాయ్  చేయవచ్చని థియేటర్లకు వెళ్లినవారికి నిరాశ తప్పదు. అసలు ఇది తేజ సినిమాయేనా అనే అనుమానం రాకుండా ఉండదు. 

తేజ 'చిత్రం' .. 'జయం' సినిమాలు తీసినప్పుడు ప్రేమకథల ట్రెండ్ వేరు. ఎంత పల్లెటూరి కథగా చెప్పుకున్నా ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇంకా సిగ్గుపడుతూ .. మొహమాటాలకు పోతూ ... అరచేతుల్లో మొహాన్ని దాచుకుంటూ ప్రేమించుకునే రోజులు చాలా రోజుల క్రితమే మాయమయ్యాయి. శోభన్ బాబు కాలం నాటి బావా మరదళ్ల ప్రేమకథను ఇప్పుడు యూత్ చూసే పరిస్థితి లేదు. అందువలన ఈ కథ కాస్త ఇబ్బంది పెడుతుంది.

అదేదో మూడు ముక్కల మాట చెప్పేసి అదే కృష్ణతత్వం అంటుంది హీరోయిన్. తనది కూడా అదే పాలసీ అన్నట్టుగా మాట్లాడతాడు హీరో. ఈ కథకీ .. కృష్ణతత్వానికి లింక్ ఏమిటనేది సాధారణ ప్రేక్షకుడికి అర్థం కాదు. శ్రీమంతుల కుటుంబాలకి చెందిన కుర్రాళ్లు పేదింటి అమ్మాయిపై అత్యాచారం చేయడం .. ఆ శ్రీమంతుడు తన కొడుకులను కాపాడుకోవడం కోసం ట్రై చేయడమనే ఈ ట్రాక్ పుట్టేసి చాలా కాలమైంది. మరో వైపు నుంచి ఓ రౌడీ గ్యాంగ్ రఘును వెంటాడుతూ ఉంటుంది. కాకపోతే అందుకు గల కారణం మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది సినిమా చూస్తున్నంత సేపు మాత్రమే కాదు .. ఆ తరువాత ఆలోచన చేసినా అర్థం కాదు. దుష్యంత్ విలన్ అనుకుని ప్రేక్షకులు ఫిక్స్ అవుతారు. కానీ ఆయన నియమించిన లాయర్ అంతకంటే ఎక్కువ విలనిజం చూపిస్తుంటాడు. నేనేమైనా తక్కువ తిన్నానా అన్నట్టుగా రౌడీ ముఠా నాయకుడు కూడా ముందుకు ముందుకు వస్తుంటాడు. 'వీళ్లలో విలన్ ఎవరో కనుక్కోండి చూద్దాం' అనే టాస్క్ ను తేజ మనకి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. 

ఈ కథ ఒక ఫ్రేమ్ లో లేకుండా ఎటు పడితే అటు పరిగెత్తడమే ప్రధానమైన సమస్యగా అనిపిస్తుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ఇవేవి ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇక హీరోగా అభిరామ్ కి .. హీరోయిన్ గా గీతికకు ఇద్దరికీ ఇది మొదటి సినిమానే. గీతిక కొంతవరకూ ఫరవాలేదు .. కానీ అభిరామ్ నటన పరంగా ఇంకా ఎంతో నేర్చుకోవలసి ఉంది. బాడీ లాంగ్వేజ్ .. ఎక్స్ ప్రెషన్స్ పై ఆయన ఎంతో కసరత్తు చేయవలసి ఉంది. 

తేజ తనకి ఎటు వీలైతే అటు ఈ కథను పరిగెత్తించాడు. విలన్ పెద్ద కత్తిని పట్టుకుని సదా వెంటపడే సీన్ .. హీరోయిన్ ను హాస్పిటల్ నుంచి హీరో తప్పించి ఆమెను ఓ చిన్న బండిపై తిప్పే సీన్ .. హాస్పిటల్లో పారపాళ్లు వేసుకుని లిప్ కిస్ లిచ్చే పేషంట్  సీన్ చాలా సిల్లీగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలకు వంకబెట్టవలసిన పనిలేదు. ఆర్ఫీ పట్నాయక్ స్వరపరిచిన బాణీల్లో ఒకటి రెండు ఫరవాలేదు. కానీ గతంలో మాదిరిగా కట్టిపడేసే ట్యూన్స్ అయితే లేవు. సమీర్ రెడ్డి కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఫారెస్టు నేపథ్యంలో సీన్స్ ను బాగా కవర్ చేశాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ విషయానికి వస్తే, ట్రిమ్ చేయడం కంటే, కొన్ని సీన్స్ ను పూర్తిగా లేపేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్: నిర్మాణ విలువలు .. ఫొటోగ్రఫీ ..

మైనస్ పాయింట్స్: కథాకథనాలు .. పేలవమైన సన్నివేశాలు .. సరిగ్గా అల్లుకోని ట్రాకులు ..  ఆకట్టుకోని పాటలు .. నటన పరంగా హీరో .. హీరోయిన్ నుంచి ఆశించిన స్థాయిలో రాని అవుట్ పుట్. 'అహింస'లో ఎక్కువైన హింస.

Trailer

More Reviews