'బూ' - మూవీ రివ్యూ ( జియో సినిమా)

Boo

Movie Name: Boo

Release Date: 2023-05-27
Cast: Vishwak Sen, Rakul Preeth, Niveda Peturaj, Megha Akash, Manjima Mohan, Reba Monika John
Director:Vijay
Producer: Ramanjaneyulu - Rajasekhar Reddy
Music: GV Praksh Kumar
Banner: Sarvatnth Ram Creations
Rating: 2.50 out of 5
  • 'జియో సినిమా'లో అందుబాటులోకి వచ్చిన 'బూ'
  • హారర్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే కథ  
  • ఆరంభంలో పసలేని సన్నివేశాలు
  • ఉత్కంఠను పెంచిన నాలుగు కథలు 
  •  ఆకట్టుకునే క్లైమాక్స్ ట్విస్ట్

దెయ్యాలు ఉన్నాయా? .. లేవా? అనే విషయాన్ని తేల్చిచెప్పడం కష్టం. అనుభవంలోకి వచ్చేవరకూ ఎవరూ దేనినీ నమ్మరు. ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి .. ఎవరి అనుభవాలు వారివి. అయితే దెయ్యాలు ఉన్నాయా .. లేవా? అనే విషయాన్ని గురించిన చర్చలు పక్కన పెట్టేసి, ఈ తరహా సినిమాలు చూసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాంటి హారర్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమానే 'బూ'. ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన నేరుగా 'జియో సినిమా'లో స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమా ఎంతవరకూ భయపెట్టగలిగిందనేది చూద్దాం. 

'కైరా' (రకుల్ ప్రీత్) హాలోవీన్ డే సందర్భంగా తన ముగ్గురు స్నేహితురాళ్లను తన ఇంటికి పిలుస్తుంది. తన తల్లి ఇంట్లో లేని సమయం చూసి ఆమె వాళ్లను ఆహ్వానిస్తుంది. సందర్భానికి తగినట్టుగా ఆ ఇంట్లో ఆర్టిఫీషియల్ అస్థిపంజరాలు తగిలిస్తుంది. ముగ్గురు స్నేహితురాళ్లు రాగానే, వారిని ఒక రేంజ్ లో భయపెట్టాలని కైరా ప్లాన్లు చేస్తుంది. నలుగురూ కలిసి దెయ్యాల కథలు చెప్పుకుంటారు. పనిలో పనిగా 'ఓజో బోర్డు' ద్వారా ఆత్మకి ఆహ్వానం పలుకుతారు. అంతేకాదు తాను ఎప్పటి నుంచో దాచిన ఒక పుస్తకాన్ని కైరా బయటికి తీస్తుంది.

ఆ పుస్తకంలో దెయ్యాల కథలు ఉంటాయి .. ఒకసారి మొదలు పెడితే అన్ని కథలు చదివేయాలి .. ఆ పుస్తకం చదివినవారు బ్రతికి ఉండరు అనే ముందుమాట ఉంటుంది. మిగతా వాళ్లు వద్దని చెబుతున్నా వినిపించుకోకుండా కైరా ఆ పుస్తకంలోని నాలుగు కథలను చదవడం మొదలుపెడుతుంది. ఆ నాలుగు కథలు ఏమిటి? ఆ నాలుగు కథలు కైరాకు తెలియకుండానే ఆమెతో ఎలా కనెక్ట్ అయ్యుంటాయి? ఒక్కో కథ తరువాత పరిస్థితులు ఎలా మారిపోతుంటాయి? అనేదే ఈ సినిమా.

మొదటి కథలో .. ఒక లేడీ జర్నలిస్ట్ (నివేద పేతురాజ్) ఒక రాత్రివేళ ఒక అద్దె ఇంట్లో దిగుతుంది.
ఆ రాత్రి ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే ఇంట్రెసింగ్ పాయింట్ తో నడుస్తుంది. 
రెండోకథలో మాళవిక ( మేఘ ఆకాశ్) కి తల్లి ఓ సంబంధం చూస్తుంది. ఆ యువకుడిని ఒక కాఫీ హోటల్లో కలిసి మాట్లాడమని చెబుతుంది. అక్కడికి వెళ్లొచ్చిన ఆమెకి ఎదురయ్యే పరిస్థితులేమిటి? అనేది ఉత్కంఠ భరితంగా సాగుతుంది . 

ఒక యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఉంటుంది. ముందుగా జరగబోయే సంఘటనలకి సంబంధించిన వీడియోలు ఆమె ఫోన్ కి వస్తుంటాయి. ఆ వీడియోలు తన ఇంట్లో నుంచే వస్తున్నాయని తెలుసుకున్న ఆమె ఏం చేస్తుందనేది మూడో కథ. ఇక నాలుగో కథలో పారా  నార్మల్ సైంటిస్ట్ గా విష్వక్ సేన్ కనిపిస్తాడు. దెయ్యాలు ఉన్నాయని నిరూపించడం కోసం , తన లవర్ 'మీరా'ను వెంటబెట్టుకుని ఓ పాడుబడిన బంగ్లాకి తీసుకుని వెళతాడు. అక్కడ ఏం జరుగుతుందనేది మరో మలుపు .. ఈ సినిమా మొత్తానికి ఈ ఎపిసోడ్ నే కీలకం.  

 నాలుగు కథలలోను దెయ్యాల పాత్ర ఉంటుంది. అలాగని చెప్పేసి ఎక్కువగా హారర్ తో కాకుండా సస్పెన్స్ యాంగిల్ లో కథలను ఆవిష్కరించారు. ప్రతి కథ చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ కథలో ముందుగా వచ్చే రకుల్ ప్రీత్ ఎపిసోడ్ కాస్త అల్లరితనంగా .. ఆకతాయితనంగా అనిపించినా, పుస్తకంలోని నాలుగు కథలుగా వచ్చే నాలుగు ఎపిసోడ్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. నాలుగు కథలో ఎంటరయ్యే విష్వక్ సేన్ కి, మిగతా కథలతో ఉన్న సంబంధాన్ని రివీల్ చేసే విధానం కూడా ఉత్కంఠను రేకెత్తిస్తుంది. 

దర్శకుడు విజయ్ ఎంచుకున్న కథ .. కథనాన్ని నడిపించిన విధానం బాగున్నాయి. చాలా సింపుల్ గా తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అయితే ఆరంభంలో రకుల్ .. ఆమె మిత్ర బృందం చేసే కామెడీతో కూడిన అల్లరి నిడివిని కాస్త తగ్గిస్తే బాగుండేది. లేదంటే కాస్త సీరియస్ గానే మొదలుపెట్టవలసింది. ఎందుకంటే సినిమా మొత్తంలో ఈ ఎపిసోడ్ మాత్రమే లూజ్ గా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ ను కాస్త టైట్ గా డిజైన్ చేసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేది. 

ఈ కథ రకుల్ పాత్రతో మొదలై ఆమె పాత్రతోనే ముగుస్తుంది. ఇక పుస్తకంలోని కథల్లో వచ్చే పాత్రల్లో నివేద థామస్ .. మేఘ ఆకాశ్ .. మంజిమా మోహన్ .. రెబా మోనికా జాన్ తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఇక విష్వక్ సేన్ .. పృథ్వీ రాజ్ .. విద్యుల్లేఖ రామన్ తమ పాత్రలకి న్యాయం చేశారు. శర్వంత్ రామ్ క్రియేషన్స్ - శ్రీ శిరిడీ సాయి మూవీస్ వారి నిర్మాణ విలువలు ఫరవాలేదు.
 

జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఫరవాలేదు ...  మధు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సందర్భానికి తగినట్టుగా ప్రేక్షకులను కలుపుకుంటూ వెళుతుంది. ఆంటోని ఎడిటింగ్ కూడా ఓకే .. కాకపోతే ఆరంభంలో రకుల్ ఎపిసోడ్ ను ట్రిమ్ చేయవలసింది. సందీప్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నాలుగు కథలను అతను ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. చాలా తక్కువ పాత్రలతో .. చాలా తక్కువ నిడివిలో ... దర్శకుడు ఈ కథలను డిజైన్ చేసుకున్న తీరును .. క్లైమాక్స్ ట్విస్టు ఇచ్చిన విధానాన్ని మెచ్చుకోవలసిందే. 

ప్లస్ పాయింట్స్ : కథ .. కథనం .. పాత్రలను మలిచిన తీరు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. సస్పెన్స్ .. క్లైమాక్స్ ట్విస్ట్.   

మైనస్ పాయింట్స్ :
మొదట్లో వచ్చే రకుల్ ఎపిసోడ్ ను సాగదీయడం .. ఆ తరువాత వచ్చే ఎపిసోడ్స్ కి తగిన స్థాయిలో ఈ ఎపిసోడ్ లేకపోవడం.

Trailer

More Reviews