'మళ్లీ పెళ్లి' - మూవీ రివ్యూ

Malli Pelli

Movie Name: Malli Pelli

Release Date: 2023-05-26
Cast: Naresh, Pavitra Lokesh, Vanitha VIjay Kumar, Jayasudha, Ananya Nagalla, Ravivarma
Director: MS Raju
Producer: Naresh
Music: Suresh Bobbbili
Banner: Vijaya Krishna
Rating: 2.75 out of 5
  • ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన 'మళ్లీ పెళ్లి'
  • నరేశ్ వైవాహిక జీవితంలోని సంఘటనల సమాహారం
  • సంగీతం ... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి మార్కులు 
  • స్క్రీన్ ప్లే పరంగా నిదానంగా సాగిన కథ 
  • పేలవంగా కనిపించే కొన్ని సీన్స్

నరేశ్ - పవిత్ర లోకేశ్ జంటగా 'మళ్లీ పెళ్లి' సినిమా రూపొందింది. విజయకృష్ణ బ్యానర్ పై నరేశ్ నిర్మించిన సినిమా ఇది. ఎమ్మెస్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇటీవల కాలంలో నరేశ్ - పవిత్ర లోకేశ్ గురించిన వార్తలు మీడియాలో ఒక రేంజ్ లో షికారు చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి నటించడం ప్రత్యేకతను సంతరించుకుంది. వారి నిజజీవితంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ట్రైలర్ లో చోటుచేసుకోవడంతో, సహజంగానే అందరిలో ఆసక్తి పెరుగుతూ వెళ్లింది.

ఈ సినిమా తన రియల్ లైఫ్ కి సంబంధించినదని నరేశ్ చెప్పలేదు. అలాంటి ప్రశ్నలు తనని అడగొద్దని పవిత్ర లోకేశ్ ఇంటర్వ్యూలలో చెబుతూ వచ్చారు. దాంతో తమ కథనే ఈ సినిమా ద్వారా చెబుతున్నారా? లేదంటే ఆ తరహా సన్నివేలను అక్కడక్కడా ప్రస్తావిస్తారా? అనే సందేహం రిలీజ్  డేట్ చాలా దగ్గరగా వచ్చేవరకూ ఉంది. అలాంటి ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా యొక్క ఉద్దేశం ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. 

నరేంద్ర (నరేశ్) సినిమా ఆర్టిస్ట్ .. మంచి శ్రీమంతుడు. వందల కోట్ల ఆస్తులు .. విలాసవంతమైన జీవితం ఆయన సొంతం. ఆయనకి ఆల్రెడీ రెండు పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే కొన్ని కారణాల వలన ఆ వివాహ సంబంధాలు విఫలమవుతాయి. ఆ అసంతృప్తితో ఆయన రోజులు గడుపుతూ ఉండగా, సౌమ్య సేతుపతి ( వనిత విజయ్ కుమార్)తో పరిచయం కలుగుతుంది. ఆమె నరేంద్ర తల్లి (జయసుధ) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. 

నరేంద్ర - సౌమ్య సేతుపతి ఇద్దరి మధ్య పరిచయం బెడ్ రూమ్ వరకూ వెళుతుంది. ఆయన పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరిస్తోంది. ఒక రోజున సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కుటుంబం పట్ల బాధ్యత లేకుండా ఆమె ప్రవర్తించడం .. అప్పులు చేసి అవి తీర్చమని నరేంద్రను ఒత్తిడి చేయడం .. తన తల్లిని పట్టించుకోకపోవడం నరేంద్రకు బాధ కలిగిస్తుంది.

అలాంటి పరిస్థితుల్లోనే ఆయనకి ఒక సినిమా షూటింగులో పార్వతి (పవిత్ర లోకేశ్)తో పరిచయమవుతుంది. ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన బాధలన్నీ మరిచిపోతుండటం ఆయన గమనిస్తాడు. ఆరాధనా భావం ఉన్నప్పటికీ, ఫ్యామిలీ పరంగా ఆమె హ్యాపీగా ఉందనుకుని సైలెంట్ గా ఉండిపోతాడు. అలాంటి పరిస్థితుల్లోనే పార్వతిని గురించిన ఒక నిజం ఆయనకి తెలుస్తుంది. అదేమిటి? అప్పుడు నరేంద్ర ఏం చేస్తాడు? ఈ ఇద్దరూ సాన్నిహిత్యంగా ఉండటం పట్ల సౌమ్య సేతుపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది కథ. 

నరేంద్ర - పార్వతి బెంగుళూర్ నుంచి కారులో హైదరాబాద్ వస్తుండగా ఈ కథ మొదలవుతుంది. కథ అందరికీ అర్థమయ్యేలా దర్శకుడు ఎమ్మెస్ రాజు అక్కడి నుంచి ఎత్తుకున్నాడు. అక్కడి నుంచి కథ వెనక్కి వెళ్లి .. అనేక సంఘటనల తరువాత తిరిగి అక్కడికి చేరుకుంటుంది. ఈ సినిమా మిగతా సినిమాల మాదిరిగా కల్పిత కథతో వచ్చిందా? లేదంటే వాళ్ల లైఫ్ లో జరిగిన సంఘటనల నుంచి అల్లుకున్నారా? అనే ఒక డౌట్ తో సీట్లో కూర్చున్న ప్రేక్షకులకు, ఇది కల్పిత కథ కాదు అనే సంగతి అర్థమైపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. 

దర్శకుడు ఈ కథను మూడు ప్రధానమైన అంశాల చుట్టూ అల్లుకున్నాడు. నరేంద్ర ట్రాక్ .. పార్వతి ట్రాక్ .. ఆ ఇద్దరితో ముడిపడిన సౌమ్య సేతుపతి ట్రాక్. ఈ మూడు ట్రాక్స్ లో పార్వతి ఫ్యామిలీకి సంబంధించిన ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. సహజత్వానికి కూడా చాలా దూరంగా అనిపిస్తుంది. ఒక అందమైన భార్య పట్ల ఏ భర్త అయినా ఈ రూట్లో ఆలోచన చేస్తాడా? అనే సందేహం కలగకమానదు. 
 
ఈ మొత్తం సినిమాలో నరేంద్ర .. అతని మూడో భార్య సౌమ్య సేతుపతి .. ఆయన ప్రేమించిన పార్వతి పాత్రలు ప్రధానమైనవిగా కనిపిస్తాయి. నరేంద్రగా నరేశ్ .. పార్వతిగా పవిత్ర లోకేశ్ తమ పాత్రలలో నటించడం అంతకష్టమైన పనేం కాదు. కానీ సౌమ్య సేతుపతిగా వనిత విజయ్ కుమార్ మాత్రం నటనలో తన మార్క్ చూపించింది. జరిగింది ఇది ... అన్నట్టుగా ఎమ్మెస్ రాజు ఈ కథను చెబుతూ వెళ్లాడు గనుక, అనూహ్యమైన మలుపులు .. ట్విస్టులు వంటివి ఆశించడానికి లేదు. 

సురేశ్ బొబ్బిలి - అరుళ్ దేవ్ అందించిన సంగీతం బాగుంది. పవిత్ర లోకేశ్ యంగ్ గా ఉన్నప్పటి పాత్రను అనన్య నాగళ్ల పోషించింది. ఆమె పాత్రపై చిత్రీకరించిన పాట ఆకట్టుకుంటుంది. బాల్ రెడ్డి కెమెరా పనితనం మెప్పిస్తుంది. జునైద్ ఎడిటింగ్ విషయానికి వస్తే, కొన్ని బిట్స్ లేపేయవచ్చు .. ఫ్లాష్ బ్యాక్ తాలూకు కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేయవచ్చు. నిర్మాణ పరమైన విలువల విషయంలో నరేశ్ రాజీ పడలేదు. ఇది నరేశ్ తన లైఫ్ గురించి తన వైపు నుంచి చెప్పిన కథ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చూడవలసిన సినిమా. 

ప్లస్ పాయింట్స్: ఎమ్మెస్ రాజు టేకింగ్ .. నిర్మాణ విలువలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ. 

మైనస్ పాయింట్స్ : నరేశ్ చిన్నప్పటి సీన్స్ ... విజయ నిర్మల పాత్రలో జయసుధను పెట్టడం .. నిడివి తక్కువగా ఉన్నప్పటికీ లూజ్ సీన్స్ ఉండటం .. పవిత్ర లోకేశ్ ఫ్లాష్ బ్యాక్ సహజత్వానికి దగ్గరగా లేకపోవడం.

Trailer

More Articles