'డెడ్ పిక్సెల్స్' - ఓటీటీ రివ్యూ

Dead Pixels

Movie Name: Dead Pixels

Release Date: 2023-05-19
Cast: Niharika, Akshay, Sai Ronak, Harsha, Bhavana Sagi
Director:Adiythya Mandala
Producer: Sameer- Rahul- Saideep
Music: Sidharth Sadashivuni
Banner: Tamada Media Prodution
Rating: 2.00 out of 5
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'డెడ్ పిక్సెల్స్'
  • వీడియో గేమ్స్ ప్రధానంగా సాగే వెబ్ సిరీస్
  • ప్రధాన పాత్రల్లో కనిపించే బద్ధకం .. ఎమోషన్స్ లేకపోవడం  
  • విషయం లేని కథ .. అతకని సన్నివేశాలు 
  • ఎలాంటి సందేశం లేని ప్రయత్నం 

తెలుగు ప్రేక్షకులు వెబ్ సిరీస్ లకు అలవాటు పడుతున్న సమయంలోనే సొంత బ్యానర్లో వెబ్ సిరీస్ లను నిర్మించి అందించిన అనుభవం నిహారికకు ఉంది. అలాంటి ఆమె నుంచి ఒక వెబ్ సిరీస్ వస్తుందంటే, తప్పకుండా ఎంతో కొంత విషయం అందులో ఉంటుందని అంతా భావిస్తారు. అలా ఆమె నుంచి వచ్చిన మరో వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సెల్స్'. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, నిన్నటి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది.


బ్రిటన్ టెలివిజన్ సిరీస్ కి రీమేక్ గా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. సమీర్ .. రాహుల్ .. సాయిదీప్ రెడ్డి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ లో నిహారికతో పాటు అక్షయ్ ..  వైవా హర్ష .. సాయి రోనక్ .. భావన సాగి .. రాజీవ్ కనకాల ముఖ్యమైన పాత్రలను పోషించారు. వీడియో గేమ్ ను ప్రధానంగా చేసుకుని నడిచే ఈ కథను 6 ఎపిసోడ్స్ గా అందించారు. అలాంటి ఈ వెబ్ సిరీస్ ఏ స్థాయిలో కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

గాయత్రి ( నిహారిక), భార్గవ్ (అక్షయ్), ఆనంద్ ( హర్ష) 'బ్యాటిల్ ఆఫ్ థ్రోన్' అనే వీడియో గేమ్ ఆడుతుంటారు. గాయత్రి .. భార్గవ్ ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఒకే ఫ్లాట్ లో ఉంటూ ఉంటారు. పైలెట్ గా పనిచేస్తున్న ఆనంద్ మాత్రం తన భార్య బిడ్డలతో వేరే ఫ్లాట్ లో ఉంటూ ఉంటాడు. ఎప్పుడు చూసినా ఈ ముగ్గురూ ఆన్ లైన్ గేమ్ లోనే ఉంటారు. గాయత్రి - భార్గవ్ ఆఫీసులో కూడా గేమ్ లోనే ఉంటారు. ఇక ఆనంద్ కూడా డ్యూటీలో ఉండగానే గేమ్ ఆడుతూ ఉంటాడు. డ్యూటీ లేని రోజున అతను గేమ్ ను తప్ప భార్యాబిడ్డలను పట్టించుకోడు. 

అంతగా వీడియో గేమ్స్ కి అలవాటు పడొద్దని గాయత్రికి స్నేహితురాలైన ఐశ్వర్య (భావన సాగి ) చెబుతూనే ఉంటుంది. అయినవారు వినిపించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లోనే గాయత్రి ఆఫీసులో రోషన్ (సాయి రోనక్) కొత్తగా జాయిన్ అవుతాడు. తొలి చూపులోనే ఆమె అతణ్ణి ఇష్టపడుతుంది. ఆమె కోసం అతను కూడా ఆ గేమ్ లోకి ఎంటరవుతాడు. వాళ్లిద్దరూ చనువుగా ఉండటం భార్గవ్ కి నచ్చదు. ఇద్దరిలో తన స్నేహితుడు ఎవరు? లవర్ ఎవరు? అనేది గాయత్రి తేల్చుకోలేక పోతుంటుంది. గేమ్ లో ఒకరి కేరక్టర్ ను ఒకరు చంపుకునే స్థాయికి వాళ్లు వచ్చేస్తారు. అప్పుడు గాయత్రి ఏం చేస్తుంది? భార్గవ్ ఎలా స్పందిస్తాడు? ఆనంద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది మిగతా కథ. 

ఒక సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావలసిన అంశాలు ఉన్నప్పుడే అవి విజయాన్ని సాధిస్తూ ఉంటాయి. అలా కాకుండా హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ వంటి సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులను టార్గెట్ చేసుకునే రూపొందిస్తుంటారు. ఎందుకంటే అలాంటి కథలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడరు. అలాగే ఈ వెబ్ సిరీస్ ను యూత్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే డిజైన్ చేశారు. వాళ్లలో కూడా వీడియో గేమ్స్ కి అడిక్ట్ అయినవారికి మాత్రమే ఈ కంటెంట్ కనెక్ట్ అవుతుంది. 

నాలుగు ప్రధానమైన పాత్రలు ఇంట్లో ఉన్నా .. ఆఫీసులో ఉన్నా సిస్టమ్ ముందు నుంచి కదలకుండా గేమ్ ఆడేవాళ్లను ప్రేక్షకులు ఎంతసేపు చూడగలరు? ఆ కథను ఎంతసేపు ఫాలో కాగలరు? ఒక కథ అనేది లేకుండా .. ఆ కథకి ఒక గమ్యం అనేది లేకుండా ఎంతసేపు అల్లర చిల్లర మాటలతో నడుపుతారు?  నిద్రమొహాలతో ... బ్రష్ చేసుకుంటూ చెప్పే డైలాగ్స్ ను ఎంతసేపు చూడగలరు. చివరికి బాత్రూమ్ సీన్ కి కూడా పెద్ద ప్రహసనమే. 

ప్రధానమైన పాత్రలు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపించడం .. తమకి ఎలాంటి ఫీలింగ్స్ లేవని గొప్పగా చెప్పుకోవడం .. గేమ్ లో కేరక్టర్స్ ను క్రియేట్ చేయడం .. అవి నచ్చకపోతే వాటి తలలు తీసేయడం .. తమకి నచ్చని కేరక్టర్ పై మిగతావారు గేమ్ లో భాగంగా దాడి చేసి చంపేయడం .. గేమ్ లో తమ కేరక్టర్స్ ద్వారా లిప్ కిస్ లు చేస్తూ .. అదోరకమైన ఆనందాన్ని పొందడం. గేమ్ కోసం పెళ్లి చేసుకోవడం. అక్కడక్కడా అసభ్యకరమైన మాటలు .. ఇదంతా చూస్తుంటే అసలు ఈ వెబ్ సిరీస్ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు? అనేది అర్థం కాదు. 

ఇలాంటి వీడియో గేమ్స్ కి యూత్ ఎలా అడిక్ట్ అవుతోంది? అందువలన వాళ్లు ఎలాంటి  పరిణామాలను ఎదుర్కోవలసి వస్తోంది? గేమ్స్ మోజులో పడి జాబ్స్ పోగొట్టుకుంటున్న యువత పరిస్థితి ఏమిటి? అనేది ఏ పాత్ర ద్వారా కూడా చూపించలేకపోయారు .. ఏ పాత్రతోను చెప్పించలేకపోయారు. అసలు ఒక కథ అనేది లేకుండా పైపైన అల్లేసిన సన్నివేశాలతో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ వలన, ఖర్చు దండగ తప్ప మరో ప్రయోజనం కనిపించదు.

Trailer

More Reviews