మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'పొన్నియిన్ సెల్వన్ 2' ఈ రోజునే ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో థియేటర్లకు వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, మణిరత్నం కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. 'కల్కి కృష్ణమూర్తి' రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. చోళరాజులు - పాండ్య రాజుల మధ్య జరిగే వ్యూహ ప్రతి వ్యూహాలతో ఈ కథ నడుస్తుంది. ఫస్టు పార్టుకు తమిళనాట మాత్రమే విశేషమైన ఆదరణ లభించింది. ఇక ఈ రోజున విడుదలైన పార్టు 2 ఎలా ఉందనేది చూద్దాం.
ఈ కథ నందిని (ఐశ్వర్య రాయ్) .. చోళ యువరాజు ఆదిత్య కరికాలన్ (విక్రమ్) టీనేజ్ లవ్ స్టోరీతో మొదలవుతుంది. అయితే ఆదిత్య కరికాలన్ కుటుంబ సభ్యులు, అతనికి తెలియకుండా ఆమెను అంతఃపురం నుంచి గెంటేస్తారు. అలాంటి పరిస్థితుల్లో వీరపాండ్య మహారాజు ఆమెను చేరదీసి కూతురిలా చూస్తాడు. ఆమె కళ్ల ఎదుటనే అతనిని ఆదిత్య కరికాలుడు అంతం చేస్తాడు. తన కుమారుడైన అమరభుజంగుడికి సింహాసనం దక్కేలా చేయమని వీరపాండ్యుడు నందిని దగ్గర మాట తీసుకుని చనిపోతాడు.
తండ్రిలాంటి ఆయనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం, చోళరాజ్యాన్ని .. ఆ రాజ్యానికి రక్షక కవచంలా ఉన్న తన మాజీ ప్రేమికుడు ఆదిత్య కరికాలుడిని అంతం చేయడానికి నందిని సిద్ధపడుతుంది. సముద్రంలో మునిగిపోయాడనుకున్న అరుళ్ మొళి ( జయం రవి), అతని సన్నిహితుడైన వల్లభ దేవన్ ( కార్తి) బ్రతికి బయటపడతారు. ఈ విషయం తెలిసి, అతని తండ్రి సుందర చోళుడు (ప్రకాశ్ రాజ్) అతని తోబొట్టువులైన ఆదిత్య కరికాలన్ .. కుందవై (త్రిష) సంతోష పడతారు.
పాండ్య రాజులకు ఇచ్చిన మాట కోసం చోళ రాజ్యాన్ని దెబ్బతీయడానికి ఒక వైపున రవిదాసతో కలిసి నందిని ప్రయత్నిస్తూ ఉంటుంది. మరో వైపున చోళ సింహాసనం ధర్మం ప్రకారం తనకి దక్కాలని భావించిన ఆదిత్య కరికాలన్ పినతండ్రి మధురాంతకుడు (రెహ్మాన్) రాష్ట్ర కూటులతోను .. కాలాముఖులతోను చేతులు కలుపుతాడు. ఇలా రెండు వైపుల నుంచి చోళ రాజ్యాన్ని ప్రమాదం చుట్టుముడుతూ ఉంటుంది.
చోళ రాజులైన సుందరచోళుడు .. ఆదిత్య కరికాలుడు .. అరుళ్ మొళి ఈ ముగ్గురిని ఒకే రోజున అంతం చేయాలని నందిని ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరు తప్పించుకున్నా పాండ్యులను బ్రతకనీయరని ఆమెకి తెలుసు. ఓ పౌర్ణమి రోజున ఆ ముగ్గురు చావుకు ఆమె ముహూర్తం పెడుతుంది. తన మాట కాదనడనే ఉద్దేశంతో, తనని కలవడానికి రమ్మని చెప్పి ఆదిత్య కరికాలన్ కి కబురు పంపుతుంది. ఆమె పథకం ఫలిస్తుందా? చోళ రాజ్యంపై పాండ్యులు పట్టుసాధిస్తారా? అనేదే కథ.
మణిరత్నం నుంచి వచ్చిన భారీ చారిత్రక చిత్రం ఇది. సినిమా టిక్ గా ఆయన ఈ కథను తయారు చేసుకున్న విధానం .. తెరపై దానిని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. అటు చోళ .. ఇటు పాండ్య రాజులకు సంబంధించిన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతి విషయంపై దృష్టిపెట్టడం .. ప్రతి పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేయడం అంత ఆషా మాషీ విషయమేం కాదు. ఇక ఆ కాలం నాటి సెట్టింగులు .. సామజిక వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేయడం అంత తేలిక కాదు. ఈ విషయంలో మణిరత్నం పూర్తిగా సక్సెస్ అయ్యారు.
ఇక ప్రతి సన్నివేశం విజువల్ పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కథ జరిగే కాలంలోకి మనలను తీసుకుని వెళుతుంది. లొకేషన్స్ ను ఎంచుకోవడంలోను .. లైటింగ్ విషయంలోను మణిరత్నానికి గల ప్రత్యేకతను గురించి అందరికీ తెలుసు. అదే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. ఈ కథను ఆయన ఒక అందమైన టీనేజ్ లవ్ స్టోరీతో మొదలుపెట్టిన తీరు .. ఆ లవ్ స్టోరీని అలా నడిపిస్తూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. అసలు ఆయన ఫస్టు షాట్ తోనే ప్రేక్షకులను పడగొట్టేశారు.
ఈ సినిమాలో ఒకే ఫ్రేమ్ లో కాకపోయినా ఐశ్వర్య రాయ్ తల్లీ కూతుళ్లుగా రెండు పాత్రలలో కనిపిస్తుంది. తల్లి పాత్రకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ .. అందులో ఉన్న ట్విస్ట్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అయితే ఫస్టు పార్టు మాదిరిగానే ఈ పార్టులో కూడా ఆయన రొమాన్స్ వైపు వెళ్లలేదు. విక్రమ్ - త్రిష ఫ్లాష్ బ్యాక్ లో నుంచి ఒక పాట తీయవచ్చు. ఇక కార్తి - త్రిష పాత్రల మధ్య పాటలకి అవకాశం ఉన్నప్పటికీ ఆయన పట్టించుకోలేదు. అందువలన నవలను చదువుతున్నట్టుగానే కథ ముందుకు వెళుతూ ఉంటుంది.
టీనేజ్ లవ్ స్టోరీ తరువాత నిదానంగా నడుస్తూ వచ్చిన కథ, ఇంటర్వెల్ కి ముందు ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు వచ్చే విక్రమ్ సీన్ .. ఐశ్వర్య రాయ్ సీన్ .. బౌద్ధ విహారంలో అరుళ్ మొళిని శత్రువులు చుట్టుముట్టే సీన్ హైలైట్ గా నిలుస్తాయి. సెకాండాఫ్ లో సుందర చోళుడిని మందాకిని కాపాడే సీన్ .. కడంబూర్ కోటలో తనని చంపడానికి నందిని ప్లాన్ చేసిందని తెలిసి కూడా ఆదిత్య కరికాలన్ అక్కడికి వెళ్లే సీన్ హైలైట్.
ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం విషయానికొస్తే బాణీల పరంగా అంతగా ఆకట్టుకునేవేమీ లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం గొప్పగా ఉంది. రవి వర్మన్ ఫొటోగ్రఫీ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా చెప్పుకోవలసిందే .. ఒప్పుకోవలసిందే. ఇది కొంచెం క్లిష్టమైన స్క్రీన్ ప్లే తో కూడినదే. అయినా ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనితీరు నీట్ గా అనిపిస్తుంది. తనికెళ్ల భరణి డైలాగ్స్ సందర్భానికి తగినట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్: కథ .. పాత్రలను మలచిన విధానం .. టేకింగ్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. ప్రత్యేకమైన సెట్స్ .. లొకేషన్స్.
మైనస్ పాయింట్స్: నిదానంగా నడిచే కథనం .. రొమాన్స్ కి అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం. కీలకమైన పాత్రలు పక్కకి తప్పుకున్న తరువాత కూడా ఒక భారీ యుద్ధం ఎపిసోడ్ ను నడిపించడం.
'పొన్నియిన్ సెల్వన్ 2' - మూవీ రివ్యూ
- భారీ చారిత్రక చిత్రంగా వచ్చిన 'పీ ఎస్ -2'
- బలమైన కథ .. నిదానంగా సాగిన కథనం
- అద్భుతమైన విజువల్స్ ను ఆవిష్కరించిన మణిరత్నం
- రొమాన్స్ వైపు నుంచి తగ్గిన మార్కులు
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - ఫొటోగ్రఫీ హైలైట్
Movie Details
Movie Name: Ponniyin Selvan2
Release Date: 2023-04-28
Cast: Vikram, Karthi, Jayam Ravi, Aishwarya Rai, Trisha, Praksh Raj, Sarath Kumar, Prabhu, Rehman
Director: Manirathnam
Music: AR Rehman
Banner: Lyca Productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer