'సేవ్ ది టైగర్స్' - ఓటీటీ రివ్యూ

Save The Tigers

Movie Name: Save The Tigers

Release Date: 2023-04-27
Cast: Priyadarshi, Abhinav Gomatham, Krishna Chaitanya, Harshavardhan, Sunayana, Jordar Sujatha, Rohini
Director:Teja Kakumanu
Producer: Mahi V Raghav
Music: Ajay Arasada
Banner: Disney Hotstar
Rating: 3.00 out of 5
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'సేవ్ ది టైగర్స్'
  • సరదాగా .. సందడిగా సాగిపోయే కథాకథనాలు 
  • స్క్రీన్ ప్లే .. పాత్రలను మలిచిన విధానం హైలైట్ 
  • అక్కడక్కడా కనెక్ట్ అయిన ఎమోషన్స్ 
  • ఆసక్తికరమైన మలుపుతో మొదలయ్యే నెక్స్ట్ ఎపిసోడ్స్

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లు చాలా వరకూ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లోగానీ,  హారర్ థ్రిల్లర్ జోనర్లో గాని ఉంటున్నాయి. లేదంటే యాక్షన్ థ్రిల్లర్లు పలకరిస్తున్నాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను పట్టుకునే దిశగా వచ్చిన వెబ్ సిరీస్ లు చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి వెబ్ సిరీస్ లలో ఒకటిగా 'సేవ్ ది టైగర్స్' కనిపిస్తుంది. ఈ రోజునే ఈ వెబ్ సిరీస్ 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అయింది. ఈ తెలుగు వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ప్రధానంగా ఈ కథ హైదరాబాదులో నివసిస్తూ ఉండే ఒక మూడు కుటుంబాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హైదరాబాదులోని ఒక స్లమ్ ఏరియాలో గంటా రవి (ప్రియదర్శిని) పాల వ్యాపారం చేస్తుంటాడు. ఆయన భార్య ( జోర్దార్ సుజాత) బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ల సంతానంగా ఒక బాబు - పాప ఉంటారు. ఆ స్లమ్ ఏరియాలో నుంచి గేటెడ్ కమ్యూనిటీకి మారాలని ఆమె తన భర్తను పోరుతూ ఉంటుంది. 

ఇక రాహుల్ (అభినవ్ గోమఠం) తాను చేస్తున్న సాఫ్ట్ వేర్ జాబ్ సంతృప్తికరంగా లేకపోవడంతో, రైటర్ గా మారతాడు. కుటుంబం భారమంతా భార్య మాధురిపై పడుతుంది. ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ పనిచేస్తూ ఉంటుంది. రాహుల్ రైటర్ గా సిన్సియర్ గా ట్రై చేయకపోవడం..   ఉన్న ఒక్క పాపను సరిగ్గా పట్టించుకోకపోవడం పట్ల ఆమె అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. చివరికి అతను ఆ ఇంట్లో పనిచేసే లక్ష్మి (రోహిణి)కి కూడా లోకువైపోతాడు.

ఇక విక్రమ్ (కృషఛైతన్య) ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు. అతని భార్య సురేఖ ఓ లాయర్ ..  ప్రతిదీ ఒక పద్ధతిగా ఉండాలని కోరుకునే మనిషి. విక్రమ్ తల్లికీ .. ఆమెకి అస్సలు పడదు. అత్తగారి గారాబం తన కూతురును చెడగొడుతుందని భావిస్తూ .. తరచూ ఆ విషయంపై గొడవలు పడుతుంటుంది. మరో వైపు నుంచి ఆఫీసులో అతనికి ఒత్తిడి ఎక్కువవుతూ వస్తుంది. ఇలా ఈ ముగ్గురు భార్యల అసంతృప్తి .. ఈ ముగ్గురు భర్తల అసహనానికి కారణమవుతుంది. వాళ్ల ముగ్గురిని మంచి స్నేహితులను చేస్తుంది.

టీనేజ్ లో ఉన్న తన కూతురు ధోరణి రవికి బాధను కలిగిస్తుంది. అప్పుడు అతను ఏం  చేస్తాడు?  తన భార్య నవీన్ అనే డాక్టర్ తో చనువుగా ఉండటం రాహుల్ కి అనుమానాన్నికలిగిస్తుంది.  అప్పుడతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? విక్రమ్ చేసిన ఒక యాడ్ వివాదస్పదమవుతుంది. అప్పుడు అతను ఎలా స్పందిస్తాడు? అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. 

ఈ వెబ్ సిరీస్ కి  సంబంధించి 6 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ 6 ఎపిసోడ్స్ ను దర్శకుడు తేజ కాకుమాను నడిపించిన తీరు బాగుంది. ఫస్టు ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకూ ఈ సిరీస్ సరదాగా .. సందడిగా సాగుతుంది. కామెడీని పరుగులు తీయిస్తూనే, అక్కడక్కడా ఎమోషన్స్ ను టచ్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రధానమైన ఆరు పాత్రలతో పాటు .. హర్షవర్ధన్ .. సునయన .. రోహిణి పాత్రలు కనెక్ట్ అవుతాయి. రోహిణి కామెడీ ఈ సిరీస్ కి హైలైట్ అని చెప్పాలి.

దర్శకుడు అల్లుకున్న కథ .. అందరి ఇళ్లలో కనిపించే కథనే .. అందరి చుట్టూ తిరిగే కథనే. అందువల్లనే వెంటనే కనెక్ట్ అవుతుంది. ఇక స్క్రీన్ ప్లే చేసిన విధానం కూడా బాగుంది. ప్రతి ఎపిసోడ్ లోను ప్రధానమైన పాత్రలన్నీ కవరయ్యేలా చూసుకున్నారు. బార్ లో 'బాహుబలి' తరహా డైలాగ్ సీన్ ... బ్యూటీ పార్లర్ సీన్ ... హాస్పిటల్ బిల్ కౌంటర్లో రోహిణి తన బంగారు గాజులు తీసిచ్చే సీన్ హాయిగా నవ్విస్తాయి. బోరింగ్ గా అనిపించే సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. 

తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రియదర్శి .. బద్ధకస్తుడైన భర్తగా అభినవ్, తల్లికి .. భార్యకి మధ్య నలిగిపోయే పాత్రలో కృష్ణ చైతన్య తమ పాత్రలకు న్యాయం చేశారు. తను పనిచేసే ఇంటి ఓనర్ కే అప్పు ఇచ్చే పాత్రలో రోహిణి నవ్వులు పూయించింది. కొన్ని సీన్సే అయినప్పటికీ హర్షవర్ధన్ త్తనదైన మార్క్ చూపించాడు. శ్రవణ్ ఎడిటింగ్ .. అజయ్ అరసాడ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. విశ్వేశ్వర్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. 

భార్యల వల్ల టార్చర్ కి గురవుతున్నామని భావించే ఈ ముగ్గురూ, 'హంసలేఖ' అనే ఒక హీరోయిన్ మిస్సింగ్ కేసులో చిక్కుకుంటారు. ఆ హీరోయిన్ తో వీరికి సంబంధం ఏంటి? ఆ కేసు నుంచి బయటపడటానికి వాళ్లు ఏంచేస్తారు? అనేది మిగతా ఎపిసోడ్స్ లో చూపించనున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ వెబ్ సిరీస్ ను ఎక్కడివరకూ తీసుకెళుతుందనేది చూడాలి. 

Trailer

More Reviews