రవితేజ సినిమా అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. రవితేజ ఎనర్జీ .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ,  సరదా .. సందడిని కలుపుకుంటూ సాగే యాక్షన్ .. పవర్ఫుల్ మాస్ డైలాగ్స్  ఇవన్నీ కూడా ఆ సినిమాలో పుష్కలంగా ఉంటాయి. తెరపై విలనిజానికి తన హీరోయిజంతో విరుగుడు వేస్తూ వచ్చిన రవితేజ, మొదటిసారిగా 'రావణాసుర' సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేశాడు. తన ఇమేజ్ కి భిన్నంగా ఆయన చేసిన ఈ సినిమా, ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.

రవీంద్ర (రవితేజ) కనకమహాలక్ష్మి (ఫరియా) దగ్గర జూనియర్ లాయర్ గా పనిచేస్తూ ఉంటాడు. కాలేజ్ రోజుల నుంచి ఉన్న సాన్నిహిత్యం కారణంగా, ఇద్దరూ కలిసే పనిచేస్తుంటారు .. కేసులను పరిష్కరిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే బిజినెస్ మేన్ గా మంచి పేరున్న విజయ్ తల్వార్ ( సంపత్ రాజ్) తన సన్నిహితుడిని హత్య చేస్తాడు. అతని కూతురైన హారిక (మేఘ ఆకాశ్) ఈ కేసును వాదించవలసిందిగా కనకమహాలక్ష్మి - రవీంద్రలను కోరుతుంది. 

 మొదటి చూపులోనే హారికఫై మనసు పారేసుకున్న రవీంద్ర, ఆమెతో కలర్ ఫుల్ లైఫ్ ను ఊహించుకుంటూ ఉంటాడు. హాస్పిటల్లో ఉన్న తండ్రి బాగోగులు చూసుకుంటూనే, మరో వైపున తాను టార్గెట్ చేసినవారిని అంతం చేస్తుంటాడు. ఇతరుల ఫేస్ లతో మాస్కులు తయారు చేయించి .. ఆ మాస్కులను ధరించి .. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆయన ఈ పనులను చక్కబెడుతూ ఉంటాడు. కథానాయకుడు ఎవరి కోసం రావణుడిగా మారాడు? ఎందుకోసం ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు? అనేదే కథ.

అభిషేక్ నామాతో కలిసి రవితేజ నిర్మించిన ఈ సినిమాకి, సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. నిజానికి ఈ కథ ఫస్టు సీన్ తోనే చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. కానీ అది తేలిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు.  దర్శకుడు ఒక వైపున లాయర్ గా రవితేజను సరదా మనిషిగా చూపిస్తూ .. ఆయన తండ్రిని హాస్పిటల్లో చూపిస్తూ .. హీరోతో అరాచకాలు చేయి స్తూనే ఉంటాడు. దాంతో హీరో ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగి ఉంటుందనే ఒక ఉత్కంఠ ఆడియన్స్ లో పెరిగిపోతుంది. కానీ అందుకు తగిన స్థాయిలో మాత్రం కథ ముందుకు వెళ్లదు. 

ఈ కథలో ఎలాంటి కొత్తదనం లేదు .. కథనంలో ఆడియన్స్ ను కట్టిపడేసేంత దమ్మూ లేదు. కథ అంతా కూడా ఒక్క రవితేజకి తప్ప మిగతా పాత్రలకి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. అసలు పాత్రలు ఆకట్టుకునేలా డిజైన్ చేయలేదు. రావు రమేశ్ ..  జయప్రకాశ్ .. మురళీశర్మ .. సంపత్ రాజ్ .. శ్రీరామ్ .. సుశాంత్ వంటి మంచి ఆర్టిస్టులనైతే తీసుకున్నారుగానీ, వారిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. కీలకమైన పాత్రలను సైతం టేక్ ఇట్ ఈజీగా చంపేయడం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

'రావణాసుర'లో రవితేజ యాక్షన్ కి వంక బెట్టలేం .. కానీ ఇది ఆయన బాడీ లాంగ్వేజ్ కి గానీ, క్రేజ్ కి గాని మ్యాచ్ కాని కథ .. పాత్ర కూడా. ఆయన లుక్ ను డైరెక్టర్ సరిగ్గా సెట్ చేయకపోవడం మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా హెయిర్ స్టైల్ కూడా దెబ్బకొట్టేసింది. దాంతో రవితేజను టైట్ క్లోజప్ షాట్స్ లో చూడటానికి కాస్త ఇబ్బంది పడవలసి వస్తుంది. ఫైట్స్ లోను .. డాన్స్ లోను రవితేజ దుమ్మురేపేశాడు. కానీ సన్నివేశాల్లో ఆయన డల్ గానే కనిపించాడు. 

ఇక ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉన్నారు. ఐదుగురు హీరోయిన్స్ గ్లామర్ పరంగా ఒక రేంజ్ లో సందడి చేయవచ్చని ఏదో ఊహించుకుని వెళితే మాత్రం నిరాశ తప్పదు. హైపర్ ఆది కామెడీ ఫరవాలేదు. రావు రమేశ్ .. సంపత్ రాజ్ .. మురళీ శర్మ .. జయప్రకాశ్ .. శ్రీరామ్ ఈ సినిమాలో ఉన్నారు అంటే ఉన్నారంతే. ఆ మాత్రం పాత్రలకి అంత పేరున్న ఆర్టిస్టులు ఎందుకబ్బా? అనే ప్రశ్నకి సమాధానం దొరకదు. 

ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ బాణీలను సమకూర్చారు. 'నేను ప్యారులోన పాగలే' .. 'డిక్కా డిక్కా' పాటలు హుషారుగా సాగాయి. 'వెయ్యినొక్క జిల్లాల వరకూ వింటున్నాము నీ కీర్తినే' పాటను రీమిక్స్ చేశారు .. కాకపోతే ఒరిజినాలిటీ నుంచి తప్పించుకోబోయి తడబడింది. భ్యాక్ గ్రౌండ్ స్కోర్ తెరపై దృశ్యాల స్థాయిని దాటేసి వెళ్లిపోయింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ .. విజయ్ కార్తీక్ కన్నన్ ఫొటోగ్రఫీ పాటలకి అదనపు బలంగా నిలిచాయి.

ప్లస్ పాయింట్స్ : నిర్మాణ విలువల పరంగా ఈ సినిమాకి మంచి మార్కులు ఇవ్వొచ్చు.  ఖర్చు విషయంలో వెనుకాడలేదనే విషయం మనకి తెలుస్తూనే ఉంటుంది. రవితేజ ఫైట్లు .. డాన్సులు .. ఆయన ఎనర్జీ లెవెల్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. అలాగే ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీ కూడా మంచి ఫీల్ ను కలిగిస్తాయి.

మైనస్ పాయింట్స్: రవితేజ లుక్ .. ఆయన హెయిర్ స్టైల్ ..  కథాకథనాలు .. ఆసక్తిని రేకెత్తించని సన్నివేశాలు. ఏ హీరోయిన్ పాత్ర కూడా సంతృప్తికరంగా లేకపోవడం. ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే ఇది రవితేజ సినిమానేనా? అనే డౌట్ వస్తుంది. అసలు ఈ కథను ఆయన ఎలా ఒప్పుకున్నాడా అనే ఆశ్చర్యం కలుగుతుంది. రవితేజ సినిమాలో ఆయన మార్క్ లోపిస్తే ఎలా ఉంటుందో .. ఈ సినిమా అలాగే అనిపిస్తుంది.