'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' - మూవీ రివ్యూ

Movie Name: Phalana Abbayi Phalana Ammayi
- రొమాంటిక్ లవ్ స్టోరీ జోనర్లో 'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి'
- ఎంత మాత్రం కొత్తదనం లేని కథాకథనాలు
- హీరో .. హీరోయిన్ చుట్టూ బలమైన పాత్రలు లేకపోవడం
- పాటల పరంగా దక్కే మంచి మార్కులు
- హైలైట్ గా నిలిచే మాళవిక నటన
నాగశౌర్య - అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' .. 'జ్యో అచ్యుతానంద' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించాయి. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమాగా 'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' రూపొందింది. నాగశౌర్య జోడీగా మాళవిక నాయర్ నటించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్స్ కి వచ్చింది.
కథలోకి వెళితే .. సంజయ్ (నాగశౌర్య) అనుపమ (మాళవిక నాయర్) కాలేజ్ రోజుల నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. ఉన్నత చదువుల కోసం ఫారిన్ వెళతారు. అక్కడ కూడా వారి మధ్య ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే అనుపమకి ఒక సర్జరీ జరుగుతుంది. ఆ సమయంలో తన దగ్గర సంజయ్ లేకపోవడం .. ఎన్నిసార్లు కాల్ చేసినా అతను రాకపోవడం అనుపమకు బాధను కలిగిస్తుంది.
ఆ సంఘటన ఆ ఇద్దరి మధ్య దూరం పెంచుతూ వెళుతుంది. అదే సమయంలో సంజయ్ కి పూజ (మేఘ చౌదరి) పరిచయమవుతుంది. అలాగే గిరి (అవసరాల)తో అనుపమకు సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అనుపమ బావ తన బిజినెస్ సజావుగా సాగిపోవడానికి గాను, అందుకు సహకరించే ఫ్యామిలీకి తన మరదలిని కోడలుగా పంపించడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు సంజయ్ ఏం చేస్తాడు? అనుపమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేదే కథ.
అవసరాల అల్లుకునే కథలు .. ఆయన టేకింగ్ చాలా నీట్ గా ఉంటాయి. అటు యూత్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఆయన సినిమాలు ఉంటాయి. ఎక్కడా ఎలాంటి అభ్యంతరకరమైన సంభాషణలుగానీ .. సన్నివేశాలుగాని ఆయన సినిమాల్లో కనిపించవు. అదే పద్ధతిలో ఈ కథ కూడా నడుస్తుంది. అయితే కథలో వైవిధ్యం లేకపోవడం .. కథనం మందగించడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.
ఈ సారి అయన రాసుకున్న కథనం సగటు ప్రేక్షకుడికి అయోమయాన్ని కలిగిస్తుంది కూడా. ఈ కథ అంతా కూడా ఫారిన్ లోనే ఎక్కువగా జరుగుతుంది. అక్కడి లైఫ్ స్టైల్ ను అనుసరిస్తూ వెళుతుంది. ప్రేమించుకోవడం .. సహజీవనం సాగించడం .. అపార్థాలు .. అలకలు .. ఇలా ఈ ఫార్మేట్ అంతా గత సినిమాల బాటలోనే కొనసాగుతుంది. స్క్రీన్ ప్లే పరమైన మేజిక్ గానీ .. ట్విస్టులుగాని కనిపించవు. కథలో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే కుతూహలం ఎంతమాత్రం కలగదు. ప్రేక్షకులు తమ సీట్లలో అసహనంగా కదలడం చూస్తాము.
చాప్టర్ 1 .. చాప్టర్ 2 అంటూ .. సంవత్సరాలకు సంబంధించిన అంకెలను తెరపై చూపిస్తూ కొత్తగా ఏదో ట్రై చేయబోయారుగానీ ఎంత మాత్రం ప్రయోజనం లేకపోయింది. నాగశౌర్య మీసాలు లేకుండా .. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో .. గుబురు గెడ్డంతో కనిపిస్తాడు. సంజయ్ పాత్రలో తన మార్కు నటనను కనబరిచాడు. ఇక మాళవిక నాయర్ కళ్లతోనే అద్భుతమైన హావభావాలను పలికించింది. ఆమె కళ్లు చేసే విన్యాసాల కోసం ఈ సినిమాకి వెళ్లొచ్చు.
ఇక ఈ ఇద్దరి తరువాత మరో పాత్రను చెప్పుకుందామంటే ఎవరూ కనిపించరు. మిగతా పాత్రలు అంత పేలవంగా అనిపిస్తాయి. హీరో .. హీరోయిన్ మినహా మరో అరడజను పాత్రలు మాత్రమే స్క్రీన్ పై అప్పుడప్పుడు కనిపిస్తాయి. కథాకథనాల పరంగా చెప్పుకోవడానికేమీ లేదు. లవ్ .. రొమాన్స్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఫీల్ కనిపిస్తుంది. సంభాషణలు కూడా చప్పగానే అనిపిస్తాయి.
కల్యాణి మాలిక్ స్వరపరిచిన బాణీలు బాగున్నాయి. 'నీతో ఈ గడిచిన కాలం' .. 'కనుల చాటు మేఘమా' అనే రెండు మెలోడీ గీతాలు చెవులకు హాయిగా వినిపిస్తాయి .. మౌనంగా మనసుకు హత్తుకుపోతాయి. సునీల్ కుమార్ నామా ఫొటోగ్రఫీ బాగుంది. 'నీతో ఈ గడచిన కాలం' పాటలోని ఫీల్ ను తన చిత్రీకరణతో అద్భుతంగా ఆవిష్కరించాడు. కిరణ్ గంటి ఎడిటింగ్ ఫరవాలేదు.
ప్లస్ పాయింట్స్: మాళవిక నాయర్ నటన .. కళ్లతోనే ఆమె పలికించిన ఎమోషన్స్ .. కల్యాణి మాలిక్ స్వరపరిచిన బాణీలు .. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.
మైనస్ పాయింట్స్: కొత్తదనం లేని కథ .. నీరసంగా నడిచిన కథనం .. హీరో - హీరోయిన్ చుట్టూ మాత్రమే తిరిగిన కథ .. తేలిపోయిన మిగతా పాత్రలు .. ఎక్కడా ఎలాంటి ట్విస్టులు లేకపోవడం.