65 - మూవీ రివ్యూ
Movie Name: 65
- కొలంబియా పిక్చర్స్ రూపొందించిన '65'
- యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే సినిమా
- రెండే రెండు పాత్రలతో కథను నడిపించిన దర్శకులు
- అడుగడుగునా ఉత్కంఠను పెంచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- ప్రధానమైన బలంగా నిలిచిన విజువల్ ఎఫెక్ట్స్
'జురాసిక్ పార్క్' మొదలు రాకాసి బల్లుల నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. ఏదో ఒక ఆపరేషన్ నిమిత్తం బయల్దేరిన హీరో బృందం అడవిలో డైనోసర్స్ మధ్య చిక్కుకోవడంతో నడిచిన కథలు కొన్నయితే, ఉద్దేశపూర్వకంగా వాటి మధ్యలోకి వెళ్లి, కొన ప్రాణాలతో బయటపడిన కథలుగా మరికొన్ని కనిపిస్తాయి. అలా రాకాసి బల్లులతో గుండెల్లో దడ పుట్టించే కథతో వచ్చిన సినిమానే '65'.
రాకాసి బల్లులు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. భారీ స్థాయిలో ఉల్కలు భూమిని తాకడం వల్లనే అవి అంతరించాయని అంటారు. అలా ఉల్కలు ఈ భూమిని తాకడానికి ముందు జరిగిన ఒక సంఘటనగా ఈ కథ కనిపిస్తుంది. అంటే రాకాసి బల్లులు అటవీ ప్రాంతాల్లో విపరీతంగా తిరిగే రోజుల్లో .. 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమిపై కథ నడుస్తూ ఉంటుంది.
మిల్స్ (ఆడమ్ డ్రైవర్) ఒక స్పేస్ షిప్ లో పైలెట్ గా వర్క్ చేస్తుంటాడు. అతనికి పదేళ్ల వయసున్న కూతురు ఉంటుంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. తాను తిరిగి వచ్చేసరికి రెండేళ్లు పట్టొచ్చనీ, తన కూతురు ట్రీట్మెంట్ కి అవసరమైన డబ్బుతో వస్తానని అతను భార్యతో చెబుతాడు. కొంతమంది ప్యాసింజర్స్ తో కలిసి ఆ స్పేస్ షిప్ 'సోమారిస్' అనే ప్లానెట్ నుంచి బయల్దేరుతుంది. అయితే ఊహించని విధంగా ఉల్కలు విరుచుకు పడటంతో, స్పేస్ షిప్ దెబ్బతింటుంది.
అలా దెబ్బతిన్న స్పేస్ షిప్ భూమిపై ఒక దట్టమైన అడవిలో కూలిపోతుంది. మిల్స్ తో పాటు పదేళ్ల వయసున్న 'కోవా' (అరియనా గ్రీన్ బ్లాట్) అనే పాప బ్రతుకుతారు. స్పేస్ షిప్ రెండు భాగాలైపోగా .. ఒక భాగం ఓ పర్వతంపై పడుతుంది. తాము తిరిగి భూమిపై నుంచి తమ గ్రహానికి బయల్దేరాలంటే, దూరంగా ఉన్న ఆ పర్వతం పైకి చేరుకోవాలని 'కోవా'తో మిల్స్ చెబుతాడు. తమతో వచ్చిన ఆమె పేరెంట్స్ అక్కడ ఉండొచ్చని అంటాడు.
ఆ అటవీ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన రాకాసి బల్లులు తిరుగుతుండటం మిల్స్ గమనిస్తాడు. తను ఎలాగైనా బ్రతకాలి .. అక్కడి నుంచి బైటపడాలి .. అప్పుడే తన కూతురును కాపాడుకోగలడు. ఇక తన కూతురు వయసున్న 'కోవా'ను కూడా కాపాడుకోవాలి. కాకపోతే తన భాష ఆమెకి తెలియదు .. ఆమె భాష తనకి అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి బయటపడటానికి వాళ్లిద్దరూ ఏం చేస్తారు? ఎలాంటి సంఘటనలను ఎదుర్కొంటారు? అనేదే కథ.
ఈ సినిమాకి కథను అందించినది .. దర్శకత్వం వహించింది స్కాట్ బెక్ - బ్రయన్ ఉడ్. ఈ కథను రెండే పాత్రలతో మొదటి నుంచి చివరి వరకూ ఉత్కంఠ భరితంగా నడిపించారు. హీరో వైపు నుంచి కూతురు తాలూకు ఎమోషన్ ఉంటుంది. హీరోతో పాటు కనిపించే అమ్మాయి వైపు నుంచి ఆమె పేరెంట్స్ కి సంబంధించిన ఎమోషన్ ఉంటుంది. ఈ మధ్యలో .. తమ వాళ్ల కోసం ప్రాణాలకి తెగించి, ముందుకు వెళ్లే సాహస కృత్యాలు కనిపిస్తాయి.
మిల్స్ .. కోవా అడవిలో అడుగడుగునా ప్రమాదాలను ఎదుర్కుంటూ సాగించే ప్రయాణం .. గుహలో తలదాచుకున్న సమయంలో రాకాసి బల్లులు దాడి చేయడం .. కోవా నోట్లోకి వెళ్లిన కీటకాన్ని మిల్స్ బయటికి తీయడం .. గుహ కూలిపోయి చెరో వైపు ఒంటరిగా మిగిలిపోవడం .. మిల్స్ ఊబిలో పడిపోతే కోవా రక్షించడం వంటి సీన్స్ ఈ సినిమాలో హైలైట్ గా అనిపిస్తాయి. కథాకథనాలకు వీఎఫ్ ఎక్స్ ను జోడించి అందించిన దృశ్యాలు అబ్బురపరుస్తాయి.
ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన బలంగా నిలిచింది. ఏ క్షణం ఏ జరుగుతుందో అనే టెన్షన్ ను అద్భుతంగా క్రియేట్ చేసింది. అలాగే ఫొటోగ్రఫీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఫారెస్టు నేపథ్యంలోని సీన్స్ ను .. ముఖ్యంగా జలపాతాలు .. నైట్ ఎఫెక్ట్ సీన్స్ ను గొప్పగా ఆవిష్కరించారు. ఎడిటింగ్ వర్క్ కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది. వీఎఫెక్స్ వర్క్ అబ్బురపరిచేలానే ఉంది.
రెండే రెండు పాత్రలతో మొదటి నుంచి చివరివరకూ ఉత్కంఠ భరితంగా నడిచిన ఈ సినిమా, ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. కథాకథనాల విషయంలో క్లారిటీతో నడుస్తూ మెప్పిస్తుంది. ఎమోషన్స్ తో ముడిపడి సాగే యాక్షన్ ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుంది. రాకాసి బల్లుల నేపథ్యంలో ఇంతవరకూ వచ్చిన సక్సెస్ ఫుల్ సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని చెప్పుకోవచ్చు.