మూవీ రివ్యూ : 'శ్రీదేవి శోభన్ బాబు'

Sridevi Sobhan Babu

Movie Name: Sridevi Sobhan Babu

Release Date: 2023-02-18
Cast: Santhosh Sobhan, Gowry Kishan, Naagababu, Rohini
Director: Prashanth Kumar Dimmala
Producer: Susmitha
Music: Kamran
Banner: Gold Box Entertainments
Rating: 2.25 out of 5
  • గోల్డ్ బాక్స్ ఎంటర్టయిన్ మెంట్స్ నుంచి 'శ్రీదేవి శోభన్ బాబు'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • సాదా సీదాగా అల్లుకున్న సన్నివేశాలు 
  • పేలని హాస్యం .. కనెక్ట్ కాని ఎమోషన్
  • అనవసరమైన సీన్స్ ఎక్కువ

శ్రీదేవి - శోభన్ బాబు జోడీ ఒకప్పుడు వెండితెరపై చేసిన సందడి అంతా ఇంతా కాదు. అప్పట్లో పల్లెల్లో అమ్మాయిలు కాస్త అందంగా ముస్తాబైతే శ్రీదేవితో .. అబ్బాయిలు కాస్త సోగ్గా తయారైతే శోభన్ బాబుతో పోల్చేవారు .. ఆటపట్టించేవారు. ఆ జోడీ అంతగా జనంలోకి వెళ్లింది. అలాంటి ఆ ఇద్దరి పేర్లను టైటిల్ గా పెట్టుకుని జనంలోకి వచ్చిన సినిమానే శ్రీదేవి - శోభన్ బాబు. సంతోష్ శోభన్ - గౌరీ కిషన్ జంటగా నటించిన ఈ సినిమా, ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

కథలోకి వెళితే ..
హీరో వైపు నుంచి 'అనకాపల్లి'లో .. హీరోయిన్ వైపు నుంచి 'హైదరాబాదు'లో ఈ కథ మొదలవుతుంది. చంద్రశేఖర్ (నాగబాబు) ఒక్కగానొక్క గారాల కూతురు శ్రీదేవి (గౌరీ కిషన్). సంప్రదాయ నృత్య రీతులపై పరిశీలన కోసం ఆమె అరకు వెళ్లాలని అనుకుంటుంది. అయితే ఆమె మేనత్త కమల (రోహిణి) వాళ్లు ఉండేది అక్కడేననీ, వాళ్లకీ .. తమకి మధ్య మాటలు లేవని చంద్రశేఖర్ తన కూతురుకు చెబుతాడు. 

అరకులో తన తండ్రి కాలం నాటి పెద్ద ఇల్లు ఉందనీ, తన కూతురుకు .. కమల కొడుక్కు వివాహమైతేనే ఆ ఇల్లు వారికి చెందుతుందని శ్రీదేవికి చెబుతాడు. ఆమె అక్కడికి వెళితే  ఇంటిపై ఆశతో కమల కొడుక్కిచ్చి ఆమె పెళ్లి జరిపిస్తారని అంటాడు. అందువలన అటు వైపు వెళ్లొద్దని వారిస్తాడు. అరకు వెళ్లి .. తాతగారి ఇంట్లో మకాం పెట్టి .. మేనత్తకి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని శ్రీదేవి అనుకుంటుంది.   

తాను 'కూర్గ్' వెళుతున్నట్టుగా తండ్రితో ఆమె అబద్ధం చెప్పి, తన స్నేహితురాలైన 'హంస'ను తీసుకుని అరకు వెళుతుంది. తన తాతగారి ఇంటిని అద్దెకి ఇస్తున్న సుబ్బూ అనే వ్యక్తినే తన మేనత్త కొడుకు అనుకుంటుంది. అతని తల్లి పెళ్లికి వెళ్లడంతో ఆమె తిరిగొస్తే తనకి ఒక క్లారిటీ వస్తుందని భావిస్తుంది. అనకాపల్లిలో ఉంటున్న కమల కొడుకు శోభన్ బాబు (సంతోష్ శోభన్) ఒక ముఖ్యమైన పనిపై అరకు వస్తాడు. శ్రీదేవి బస చేసిన ఇంట్లోనే అతను కూడా బస చేస్తాడు. 

కొన్ని రోజుల పాటు ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు నడిచిన తరువాత, అతను తన మేనత్త కొడుకేననే విషయం ఆమెకి తెలుస్తుంది. అయినా శ్రీదేవి తాను ఎవరనే విషయాన్ని బయటపెట్టకుండా అతని తల్లి దగ్గరికి వెళదామని అంటుంది. దాంతో శ్రీదేవిని వెంటబెట్టుకుని శోభన్ బాబు 'అనకాపల్లి' తీసుకుని వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది?  ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి అనేది కథ. 

దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మలకి ఇది ఫస్టు మూవీ. ఫస్టు సీన్ తోనే ఈ కథ బలహీనంగా మొదలవుతుంది. దర్శకుడికి ఇది ఫస్టు సినిమా అనే విషయం ఈ ఫస్టు సీన్ చెప్పేస్తుంది. అంత కృతకంగా కథ మొదలవుతుంది. హీరో పాత్రకి గానీ .. హీరోయిన్ పాత్రకిగాని ఒక లక్ష్యం  .. ఆశయమనేవి కనిపించవు. గాలివాటుగా ఆ పాత్రలు నడుస్తూ ఉంటాయి. ఇక ఈ రెండు పాత్రలు అగ్రిమెంటు పేపర్లు దగ్గర పెట్టుకుని తిరుగుతూ ఉంటాయి. చీకట్లో కూడా ఒకరి అగ్రిమెంట్ పేపర్స్ పై మరొకరు సంతకాలు చేసేస్తూ ఉంటారు. 

కథలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ను రెండు కోణాల్లో చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లలో ఎవరు ఎందుకు అలా ప్రవర్తించారు అనే విషయంలో క్లారిటీ ఉండదు. ఈ కథకి ప్రత్యేకించి విలన్ అంటూ ఎవరూ ఉండరు. కథలో సరోజ అనే యువతితో హీరో నడిపిన లవ్ ట్రాక్ .. హీరోయిన్ ను తన తాత ఇంట్లో నుంచి వెళ్లగొట్టడానికి హీరో మిత్ర బృందం దెయ్యాల వేషాలు వేసి భయపెట్టే సీన్స్ శుద్ధ అనవసరంగా అనిపిస్తాయి. 

కథ అనకాపల్లికి చేరిన తరువాత అక్కడి పాత్రలు ఎక్కువైపోయి చిరాకు పుట్టిస్తాయి. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ఇలా అన్నీ అంశాలకు చెందిన సన్నివేశాలు ఎక్కడికక్కడ తేలిపోతూ వచ్చాయి. సంతోష్ శోభన్ .. గౌరీ కిషన్ .. నాగబాబు .. రోహిణి పాత్ర పరిధిలో నటించారు. కమ్రాన్ స్వరపరిచిన బాణీల్లో 'రేతిరి రేతిరి జాతరలో' పాటకి ఎక్కువ మార్కులు పడతాయి. సిద్ధార్థ్ రామస్వామి కెమెరా పనితనం .. శశిధర్ రెడ్డి ఎడిటింగ్ ఓకే. 

కథలో వైవిధ్యం లేకపోవడం .. కథనంలో బలం లేకపోవడం .. సాదా సీదా సన్నివేశాలతో నింపేయడం .. ఆకతాయివేషాలు .. అర్థంలేని నిర్ణయాలు .. క్లారిటీ లేని ఫ్లాష్ బ్యాక్ లు .. పేలని కామెడీ సన్నివేశాలు .. కనెక్ట్ కానీ ఎమోషన్స్ ఇలా చాలానే కనిపిస్తాయి. అసలు ఈ సినిమాను ఓటీటీకి అనుకుని, ఆ తరువాత మనసు మార్చుకుని థియేటర్ కి వదిలారా? అనే  సందేహం కూడా రాకమానదు.  

Trailer

More Articles