మూవీ రివ్యూ: వినరో భాగ్యము విష్ణుకథ'

Movie Name: Vinaro Bhagyamu Vishnu katha
- గీతా ఆర్ట్స్ 2 నుంచి వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ'
- సరదాగా సాగిపోయిన ఫస్టాఫ్
- సెకండాఫ్ లో తగ్గిన కథనంలో వేగం
- అదనపు బలంగా నిలిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- ప్రీ క్లైమాక్స్ నుంచి బలం తగ్గుతూ వచ్చిన సన్నివేశాలు
గతంలో తిరుపతి నేపథ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి. సినిమాకి సంబంధించిన ఏ సన్నివేశం తెరపై వస్తున్నా, దూరంగా తిరుమల కొండలు కనిపిస్తూ ప్రేక్షకులను ఆ కథకు కనెక్ట్ చేసేవి. అలా తిరుపతి నేపథ్యంలో హీరోగా కిరణ్ అబ్బవరం చేసిన సినిమానే 'వినరో భాగ్యము విష్ణుకథ'. గీతా ఆర్ట్స్ 2 పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి, మురళీ కిశోర్ దర్శకత్వం వహించాడు. ఈ రోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందనేది చూద్దాం.
విష్ణు (కిరణ్ అబ్బవరం) తిరుపతిలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అతని పదేళ్ల వయసులో, తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. అతనికి ఉన్న ఒకే అండ అతని తాతయ్య శ్రీనివాసులు (శుభలేఖ సుధాకర్). ఇతరులకు సాయపడటంలోనే అసలైన ఆనందం ఉందని ఆయన చెప్పిన మాటలను ఆచరణలో పెడుతూ ఎదుగుతాడు. లైబ్రరీలో ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు.
ఓ రోజున అతనికి 'దర్శన' అనే యువతి నుంచి కాల్ వస్తుంది. తన ఫోన్ నెంబర్ కి అతను నైబర్ అని చెబుతుంది. అతణ్ణి కలుసుకోవాలనే కుతూహలాన్ని వ్యక్తం చేస్తుంది. అలాగే తన ఫోన్ నెంబర్ కి ముందు ఉన్న నెంబర్ కి కాల్ చేస్తుంది. అది మార్కండేయ శర్మ (మురళీ శర్మ) నెంబర్. ముందుగా విష్ణును కలుసుకున్న దర్శన .. అతనితో కలిసి మార్కండేయ శర్మను కూడా పరిచయం చేసుకుంటుంది.
దర్శన యూ ట్యూబర్ గా పాప్యులర్ కావాలని ఆరాటపడుతుంటుంది. మార్కండేయ శర్మతో కలిసి వీడియోస్ చేస్తుంటుంది. ఇదే సమయంలో మార్కండేయ శర్మను అంతం చేయమని ఎమ్మెల్యే సీఆర్ .. సుపారీ ఇచ్చి ఒక క్రిమినల్ ను రంగంలోకి దింపుతాడు. మార్కండేయ శర్మను తాను షూట్ చేస్తున్నట్టుగా లైవ్ వీడియో చేయాలని దర్శన అనుకుంటుంది. అయితే ఆ ప్రాంక్ వీడియో వలన మార్కండేయ శర్మ ప్రాణాలు కోల్పోతాడు. దాంతో దర్శనకి శిక్ష పడుతుంది.
ఈ హత్య కేసు నుంచి ఎలాగైనా దర్శనను బైటపడేయాలని విష్ణు నిర్ణయించుకుంటాడు. ఆ తరువాత అతను తన నెంబర్ నైబర్ అంటూ రాజన్ (శరత్ లోహితస్య) అనే వ్యక్తికి కాల్ చేసి వెళ్లి కలుస్తాడు. అతను ఎన్ ఐఎ బృందాలు గాలిస్తున్న పేరు మోసిన క్రిమినల్. ఒక ఆపరేషన్ నిమిత్తం అతను తిరుపతి వస్తాడు. ఆ విషయం ఎన్ ఐఎ బృందాలకు తెలిసిపోతుంది.
తిరుపతి కుర్రాడైన విష్ణు .. రాజన్ ను ఎందుకు కలుసుకున్నాడనే విషయమే ఎన్ ఐ ఏ బృందాలకు అర్ధం కాదు. మార్కండేయ శర్మను ఎమ్మెల్యే ఎందుకు చంపించాలనుకున్నాడు? ఆమెను కాపాడాలనుకున్న విష్ణు, రాజన్ గ్యాంగ్ నుంచి బయటపడతాడా? దర్శనను నిర్దోషిగా బయటికి తీసుకురావాలనే అతని ప్రయత్నం ఫలిస్తుందా?
మార్కండేయ శర్మ మర్డర్ తో ముడిపడిన ఆసక్తికరమైన అంశాలు ఏమిటి? అనేదే కథ.
దర్శకుడు మురళీ కిశోర్ రెడీ చేసుకున్న కథ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఈ కథలో ప్రధానమైనవిగా కనిపించే కిరణ్ .. కశ్మీర .. మురళీ శర్మ .. శరత్ లోహితస్య పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుంది. ప్రధానమైన పాత్రలను పరిచయం చేయడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోలేదు. యూ ట్యూబ్ వీడియోస్ కోసం హీరోయిన్ తో కలిసి మురళీ శర్మ చేసిన డాన్సులు .. ఒక క్రిమినల్ కి హీరో తన ఫ్లాష్ బ్యాక్ చెప్పే తీరు ఫస్టాఫ్ సరదాగా సాగిపోవడానికి హెల్ప్ అయ్యాయి.
ఇంటర్వెల్ బ్యాంగ్ తోనే సెకండాఫ్ పై ఒక్కసారిగా ఆసక్తి .. అంచనాలు పెరిగిపోతాయి. ఆ తరువాత కథ ప్రీ క్లైమాక్స్ దగ్గరికి వెళ్లేవరకూ ఎంటర్టయిన్ మెంట్ తగ్గకుండా చూసుకున్నారు. అయితే సెకండాఫ్ లో కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లలేకపోయారు. కథనం కాస్త మందగిస్తుంది. సన్నివేశాలు కాస్త కృతకంగా ... నాటకీయంగా అనిపిస్తాయి.
కిరణ్ అబ్బవరం డాన్సుల పరంగా .. ఫైట్ల పరంగా మంచి ఈజ్ చూపించాడు. తనలోని కొత్త కోణాన్ని చూపించడంలో మురళీశర్మ సక్సెస్ అయ్యాడు. ఇక శరత్ లోహితస్య మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా కొత్తగా అనిపించడానికి అతను ఒక కారణంగా చెప్పుకోవచ్చు. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను కశ్మీర పరదేశి ఆడియన్స్ దృష్టిని తనవైపుకు తిప్పుకోలేకపోయింది.
చైతన్ భరద్వాజ్ సమకూర్చిన బాణీల్లో ' ఓ బంగారం' .. 'దర్శన .. దర్శన' అనే పాటలు బాగున్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లిందనే చెప్పాలి. పాటలు .. ఫైట్లతో పాటు కీలక సన్నివేశాలను డేనియల్ విశ్వాస్ చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ కి వంక బెట్టవలసిన పనిలేదు. డైలాగ్స్ కూడా చాలా నేచురల్ గా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని హింట్ ఇవ్వడం గమనించవలసిన విషయం.
నెంబర్ నైబర్ అనే కొత్త కాన్సెప్ట్ .. ఫస్టు పార్టు .. కిరణ్ అబ్బవరం నటన .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. రియల్ సతీశ్ స్టంట్స్ ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తాయి. సెకండాఫ్ లో కథనంలో వేగం తగ్గడం .. కృతకంగా కనిపించే నాటకీయత .. ఏమీ చేయకుండానే ఎన్ఐఎ చేసే హడావిడి .. ఆమని, ఎల్బీ శ్రీరామ్ వంటి సీనియర్ ఆర్టిస్టులను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం మైనస్ పాయింట్స్ గా అనిపిస్తాయి.