'రాక్షసుడు' మూవీ రివ్యూ

02-08-2019 Fri 16:14
Movie Name: Rakshasudu
Release Date: 2019-08-02
Cast: Bellamkonda Srinivas, Anupama Parameshvaran, Rajiv kanakala, Surya, Radha ravi
Director: Ramesh Varma
Producer: Satyanarayana Koneru
Music: Ghibran
Banner: A Studios

వరుసగా .. ఒకే విధంగా జరిగే టీనేజ్ అమ్మాయిల కిడ్నాప్ లు .. హత్యలు, హంతకుడు ఎవరనేది కనుక్కోవడానికి పోలీసులు చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కామెడీని రొమాన్స్ ను పూర్తిగా పక్కన పెట్టేసిన ఈ సినిమా, యాక్షన్ ను ఎమోషన్ ను కలుపుకుని వెళుతూ సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడేవారిని మాత్రమే ఆకట్టుకోవచ్చు.

ఏదైనా ఒక సంఘటన కారణంగా మనసు గాయపడినప్పుడు, ఆ అవమానాన్ని జీర్ణించుకోలేని కొంతమంది 'సైకో'లుగా మారిపోతుంటారు. సమాజంపై ద్వేషాన్ని పెంచుకుని హత్యలతో తమ ద్వేషాన్ని చల్లార్చుకుంటూ వుంటారు. తాము హత్య చేసిన ప్రదేశంలో ఏదో ఒక వస్తువును వదిలేసి, అంతా ఆ విషయాన్ని గురించే భయంతో మాట్లాడుకుంటుంటే సంతోషంతో పొంగిపోతుంటారు. ఇలాంటి సైకోలను పట్టుకోవడానికి పోలీసులు నానా తంటాలు పడుతుంటారు. అలాంటి ఒక సైకో కథతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'రాక్షసుడు'.

అరుణ్ (బెల్లంకొండ శ్రీనివాస్)కి సినిమా డైరెక్టర్ కావాలని ఉంటుంది. అయితే కొన్ని కారణాల వలన ఆయన పోలీస్ డిపార్టుమెంటులో జాయిన్ కావలసి వస్తుంది. ఆయన బావ ప్రసాద్ (రాజీవ్ కనకాల) కూడా పోలీస్ డిపార్టుమెంటులోనే పనిచేస్తుంటాడు. ప్రసాద్ కూతురు 'సిరి' (అభిరామి) ఓ స్కూల్లో పదో తరగతి చదువుతుంటుంది. ఆ స్కూల్ టీచర్ గా కృష్ణవేణి (అనుపమా పరమేశ్వరన్) పనిచేస్తూ ఉంటుంది. తన అక్కయ్య చనిపోవడంతో మూగదైన ఆమె కూతురు 'కావ్య' ఆలనా పాలన కృష్ణవేణి చూస్తుంటుంది.

 ఆ సిటీలో వరుసగా టీనేజ్ అమ్మాయిల కిడ్నాపులు .. హత్యలు జరుగుతుంటాయి. శవాన్ని పారేసిన ప్రతి చోటున ఆ సైకో రబ్బరు బొమ్మ తల కలిగిన ఒక గిఫ్ట్ ప్యాక్ ను ఉంచుతుంటాడు. హంతకుడిని పట్టుకునే ప్రయత్నాలను ఇన్ స్పెక్టర్ అరుణ్ ముమ్మరం చేస్తాడు. అదే సమయంలో ఆయన అక్క కూతురు 'సిరి' కిడ్నాప్ కి గురవుతుంది. మేనకోడలిని కాపాడుకోవడానికి అరుణ్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా? అసలు ఈ సీరియల్ కిల్లర్ ఎవరు? టీనేజ్ అమ్మాయిలనే హత్య చేయడానికి గల కారణం ఏమిటి? అనే అనూహ్యమైన మలుపులతో కథ ముందుకెళుతుంది.

సైకో చేసే వరుస హత్యల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అయితే కంటెంట్ ను టైట్ గా చెప్పిన కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్' తెలుగు రీమేక్ గా 'రాక్షసుడు'ను దర్శకుడు రమేశ్ వర్మ తెరపై చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశాడు. టీనేజ్ అమ్మాయిల హత్యలకు ఎవరు .. ఎందుకు పాల్పడుతున్నారనే విషయాన్ని హీరో కనుక్కునే నేపథ్యంలోని సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచాడు. హంతకుడు ఎవరనే విషయంలోని ట్విస్టులతో కథను పట్టుగా నడిపించాడు. అయితే సీరియల్ కిల్లర్ ఎవరనేది తెలిసిన తరువాత వచ్చే ఎపిసోడ్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెస్తాయి. కామెడీని దగ్గరికి కూడా రానీయకుండా పూర్తి సీరియస్ గా ఈ కథను రాసుకోవడం .. అందులో హీరోహీరోయిన్ల రొమాంటిక్ సాంగ్స్ కి అసలు చోటేలేకపోవడం దర్శకుడి వైపు నుంచి లోపంగా కనిపిస్తాయి.

ఇంతవరకూ మాస్ యాక్షన్ హీరోగా చేస్తూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రకి పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. పాత్ర పరంగా ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి. యాక్షన్ .. ఎమోషన్ .. టెన్షన్ ను బిల్డప్ చేసే సీన్స్ లో బాగా చేశాడు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలతో పోలిస్తే, నటన పరంగా ఈ సినిమాలో ఆయనకి ఎక్కువ మార్కులు దక్కుతాయి. ఇక టీచర్ గా అనుపమా పరమేశ్వరన్ పాత్ర పరిథిలో చేసింది. లవ్ .. రొమాంటిక్ ట్రాక్ లేకపోవడం వలన ఆమెను హీరోయిన్ అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఇక కిడ్నాప్ కి గురైన కూతురి కోసం తల్లడిల్లిపోయే తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల జీవించాడు .. కన్నీళ్లు పెట్టించాడు.

జిబ్రాన్ సంగీతం .. రీ రికార్డింగ్ ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. ఉత్కంఠభరితమైన, ఉద్వేగపూరితమైన సన్నివేశాల్లో ప్రేక్షకులు ఇన్వాల్వ్ కావడంలో రీ రికార్డింగ్ ప్రధానమైన పాత్రను పోషించింది. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, స్కూల్ మాస్టారు లైంగిక వేధింపులకి సంబంధించిన సీన్స్ ను .. సైకో కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ను ఇంకా ట్రిమ్ చేస్తే బాగుండుననిపిస్తుంది. ఫొటోగ్రఫీ పరంగా చూసుకుంటే ఫరవాలేదనిపిస్తుంది.

సైకో .. వరుస హత్యలు అనే కాన్సెప్ట్ ముఖ్యంగా అమ్మాయిలను, ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి దూరం చేస్తుంది. కంటెంట్ ఏమిటనే విషయం తెలియక థియేటర్ కి వచ్చిన ఈ వర్గం ప్రేక్షకులు, తెరపై టీనేజ్ అమ్మాయిల వరస హత్యలను చూడటం కష్టమే. ఆ హత్యలు అత్యంత దారుణంగా ఉండటం మరింత ఇబ్బందిని కలిగించే విషయం. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ స్థానంలో కనిపించకపోవడం మరింత అసంతృప్తిని కలిగించే విషయం. ఇక కథ క్లైమాక్స్ కి చేరుకునే సరికి తెరపై తమిళ ముఖాలు ఎక్కువగా కనిపించడం .. హాలీవుడ్లో హారర్ టచ్ వున్న సినిమాను చూస్తున్నట్టుగా అనిపించడం కూడా తెలుగు నేటివిటీకి ప్రేక్షకుడిని కొంత దూరం చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకు పై విషయాలు లోపాలుగా కనిపిస్తే, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారిని మాత్రం ఆకట్టుకుంటుంది.          


More Articles