తమిళంలో రూపొందిన సినిమానే '4వ అధ్యాయం'. తాజాగా ఈ సినిమా 'ఆహా' ఓటీటీ ట్రాక్ పైకి వచ్చేసింది. వెట్రి .. సాక్షి అగర్వాల్ .. అమ్ము అభిరామి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, కామరాజ్ వేల్ దర్శకత్వం వహించాడు.

ఇది నాలుగు కథల కలయిక. ప్రతీకారం .. తొందరపాటు .. శిక్ష .. క్షమాపణ .. అనే నాలుగు కథలు నాలుగు భాగాలుగా కనిపిస్తాయి. మొదటి కథ నందిని (అమ్ము అభిరామి) అనే నర్స్ చుట్టూ తిరుగుతుంది. జగన్నాథం అనే ఒక లోకల్ రౌడీ ముఠా నాయకుడిపై ప్రత్యర్థి ముఠా మనుషులు దాడి చేస్తారు. గాయపడిన అతను నందిని పనిచేసే హాస్పిటల్లో చేరతాడు. అతనిని చంపేయమని ప్రత్యర్థి వర్గంవారు నందినిని బెదిరిస్తారు. 

రెండో కథ .. శివ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. 'శివ' .. 'ప్రియ' ప్రేమించుకుంటారు. తన పేరెంట్స్ ను ఎదిరించి ప్రియ పెళ్లి చేసుకుంటుంది. ఒక బిడ్డకి తల్లి అవుతుంది. అయితే ఆన్ లైన్ జూదానికి అలవాటుపడిన శివ, అప్పులపాలవుతాడు. ప్రియను ఒక ఫంక్షన్ కి పంపించి, డబ్బు కోసం ఒక పాపను కిడ్నాప్ చేస్తాడు. అనుకోకుండా వెనక్కి వచ్చిన ప్రియకి అసలు విషయం అర్థమవుతుంది. అప్పుడామె ఏం చేస్తుంది? అనేది కథ. 

ఇక మూడో కథలో .. ముగ్గురు ఆకతాయి రౌడీలు, బీచ్ లో తాగేసి తిరుగుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు. అలాంటి ఆ ఆకతాయిలలో రోజుకి ఒకరు హత్య చేయబడుతూ ఉంటారు. హంతకుడు ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? అనేది కథ. ఇక నాలుగో కథ 'దివ్య' అనే యువతి చుట్టూ తిరుగుతుంది. తండ్రి ఆపరేషన్ కోసం అద్దె గర్భానికి సిద్ధపడిన ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనే మలుపులతో ఈ కథ కదులుతుంది. 

దర్శకుడు కామరాజ్ వేల్ .. నాలుగు కథలతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. ఒక్కో కథలో ఒక్కో కోణాన్ని ఆవిష్కరిస్తూ .. ఆలోచింపజేస్తూ వెళ్లాడు. ప్రతి కథ ముగింపుకి ప్రేక్షకుల మద్దతు లభించేలా చూసుకున్నాడు. మొదటి కథ చివర్లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. రెండో కథ, ఆన్ లైన్ జూదం జీవితాలతో ఆడుకుంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. మూడో కథ, ముగింపు సరైనదిగా అనిపిస్తుంది. ఇక నాలుగో కథ కాస్త ఎక్కువ నిడివితో కనిపిస్తుంది. జీవితంలో కొన్ని అవసరాలు .. కొన్ని ఆపదలకు సిద్ధపడేలా చేస్తాయి. మంచి మనసున్నవారికి కాలం అనుకూలంగా మారుతుంది. మోసం చేయాలనుకున్నవారే మోసపోయేలా చూస్తుంది.

ఈ కథలన్నీ కూడా మనకి ఏ కథకి ఆ కథగానే కనిపిస్తాయి. ఒక కథకి మరో కథకి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ నాలుగు కథలలో కూడా అనూహ్యమైన ట్విస్టులేమీ ఉండవు. ఆడియన్స్ గెస్ చేసినట్టుగానే అవి మలుపులు తీసుకుంటూ ఉంటాయి. చివరి కథ మినహా మిగతా మూడు కథలు కాస్త చప్పగానే అనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇది చాలా సాదాసీదా కంటెంట్. 

భరణి ఫొటోగ్రఫీ .. రిహానా నేపథ్య సంగీతం .. రామచంద్ర ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఆర్టిస్టులంతా ఎవరి పాత్రలో వారు బాగానే చేశారు. '4వ అధ్యాయం' అనే టైటిల్ కి తగినట్టుగా, నాల్గొవ కథ మాత్రమే కాస్త ఆకట్టుకుంటుంది. మిగతా కథలు చాలా పేలవంగా అనిపిస్తాయి. ఎమోషన్స్ పరంగా ఎక్కడా కనెక్ట్ కాకుండా వెళతాయి.