శశికుమార్ పేరు వినగానే ఈ మధ్య కాలంలో ఆయన చేసిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో ఆయన నటన కళ్లముందు కదలాడుతుంది. ఆయన కథానాయకుడిగా నటించిన మరో తమిళ సినిమానే 'మై లార్డ్'. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. మార్చి 20వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంటుగా తెలుగుతో పాటు ఇతర భాషలలోను అందుబాటులోకి వచ్చింది.
సెంట్రల్ మినిష్టర్ సుజాత మోహన్ (ఆషా శరత్)కి పదవీ వ్యామోహం ఎక్కువ. డబ్బుతో ఏదైనా కొనగలం .. అధికారంతో దేనినైనా మార్చగలం అనే స్వభావం ఆమెది. అలాంటి ఆమెకి రెండు వారాలలో కిడ్నీ మార్పిడి చేయవలసి వస్తుంది. సుజాత మోహన్ స్వార్థానికి తగినట్టుగానే పెరిగిన కొడుకు మాధవ్ .. కూతురు గాయత్రి ఇద్దరూ కూడా 'కిడ్నీ' ఇవ్వడానికి ముందుకు రారు. దాంతో ఆమె బయటివారిపై ఆధారపడుతుంది. తనకి సరిగ్గా సరిపోయే కిడ్నీ కోసం డోనర్ ముత్తు సిర్పి ( శశికుమార్) దగ్గరికి తన టీమ్ ను పంపిస్తుంది.
ముత్తు 'కోవిల్ పట్టి'లో ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అనాథ అయిన సుశీల (చైత్ర ఆచార్) అక్కడి అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే అప్పటి నుంచి సుశీల అనారోగ్య కారణాల వలన ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఆమెను వెంటబెట్టుకుని అతను హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతూ ఉంటాడు. దాంతో నరసింహన్ అనే వడ్డీ వ్యాపారి దగ్గర చేసిన అప్పు భారీగా పెరిగిపోతుంది. ముత్తు ఆ అప్పు తీర్చలేక భార్యతో కలిసి ఆ ఊరు నుంచి పారిపోతాడు.
ముత్తు .. అతని భార్య అగ్నిప్రమాదంలో చనిపోయరనే నకిలీ పత్రాలు సృష్టించి, ఆ నష్టపరిహారాన్ని నరసింహన్ తీసుకుంటాడు. దాంతో ఆ ఊరికి తిరిగొచ్చిన ముత్తు, తాము బ్రతికే ఉన్నామని నిరూపించుకోవడం కోసం నానా పాట్లు పడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితులలోనే సుజాత మోహన్ టీమ్, ముత్తును కలుస్తుంది. కిడ్నీ విషయంలో అతణ్ణి ఒప్పించి తీసుకుని వెళతారు. అక్కడ ఏం జరుగుతుంది? ముత్తు దంపతులకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది కథ.
రాజు మురుగన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. డబ్బు .. పలుకుబడి .. అధికారం ఉన్న కేంద్రమంత్రి సుజాత మోహన్. ఆపదల్లో .. అవసరాలలో ఉన్నవారిని ఎంతమాత్రం ఆదుకోకుండా వాళ్ల కర్మ అనుకుని వదిలివేయడం ఆమె స్వభావం. చేసేది కూలి పనే అయినా, ఇతరులకు సాయం చేయడంలో సంతోషాన్ని పొందే వ్యక్తి ముత్తు సిర్పి. ప్రధానమైన ఈ రెండు పాత్రల చుట్టూ అల్లుకున్న కథ ఇది.
దర్శకుడు ఈ కథను సిద్ధం చేసుకున్న తీరు .. స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా పరిగెత్తించిన విధానం మెప్పిస్తుంది. ఒక వైపున ముత్తు కిడ్నీ కోసం సెంట్రల్ మినిష్టర్ తన బలగాన్ని రంగంలోకి దింపితే, మరో వైపున రేషన్ కార్డును సంపాదించుకోవడం కోసం అతను నానా అవస్థలు పడుతూ ఉండటాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.
స్వార్థ రాజకీయాలు .. అవినీతి అధికారులు .. హాస్పిటల్స్ అడ్డాగా జరుగుతున్న కిడ్నీ రాకెట్ .. అనే అంశాలను టచ్ చేస్తూ దర్శకుడు ఈ కథను నడిపించాడు. పేదవాళ్లు ఒక రేషన్ కార్డును సంపాదించడం కన్నా, డబ్బున్న వాళ్లు కిడ్నీని సంపాదించడమనేది చాలా తేలికగా జరిగిపోతోందనే విషయాన్ని చూపించిన తీరు ఆలోచింపజేస్తుంది. ఎంతోమంది అమాయకులు .. చదువులేనివాళ్లకి తమ కిడ్నీ కోల్పోయిన విషయం కూడా తెలియదని చెప్పే సన్నివేశాలు మనసును భారం చేస్తాయి.
ఈ సమాజంలో ఆపదలు .. అవసరాలు అందరికీ వస్తూనే ఉంటాయి. అయితే ఆ అవకాశాన్ని తమకి అనుకూలంగా మార్చుకునే స్వార్థపరులే ఈ రోజులలో ఎక్కువగా కనిపిస్తారు. ఇక నిస్సహాయులకు అండగా నిలబడేవారు కూడా ఈ రోజులలో ఇంకా మిగిలే ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సినిమా స్పష్టం చేస్తుంది.
కథాకథనాలు చాలా నీట్ గా .. అర్థవంతంగా కదులుతాయి. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. శశి కుమార్ నటన హైలైట్ అనే చెప్పాలి. భార్య ట్రీట్మెంట్ కోసం తన కిడ్నీ ఇవ్వాలనుకున్న అతను, భార్యకి తెలియకుండా ఆమె కిడ్నీని కాజేశారని తెలిసిప్పుడు పడే ఆవేదన కదిలిస్తుంది. చైత్ర ఆచార్ .. ఆషా శరత్ నటన కూడా సహజత్వంతో ఆకట్టుకుంటుంది.
కథకి తగినట్టుగా దర్శకుడు ఎంచుకున్న లొకేషన్స్ బాగున్నాయి. విలేజ్ నేపథ్యంతో కూడిన లొకేషన్స్ కథలోకి తీసుకుని వెళతాయి. నీరవ్ షా ఫొటోగ్రఫీ .. సీన్ రోల్డన్ నేపథ్య సంగీతం .. సత్యరాజ్ నటరాజన్ ఎడిటింగ్ కంటెంట్ కి మరింత బలాన్ని చేకూర్చాయని చెప్పాలి. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది.
మానవత్వం కలిగినవాడే మనిషి. అది ఎప్పటికీ గెలిపిస్తుంది .. ఎదుటివారిని బ్రతికిస్తుంది .. నలుగురిలో దేవుణ్ణి చేస్తుంది. అలాంటి మానవత్వం కలిగిన మనుషులను గుర్తించడమనేది, అహంభావమనే అద్దాన్ని పగలగొట్టినపుడే సాధ్యమవుతుందనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది.
'మై లార్డ్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
My Lord Review
Movie Details
Movie Name: My Lord
Release Date: 2026-03-31
Cast: Sasikumar, Chaitra Achar, Asha Sharath, Guru Somasndaram, Jayaprakash
Director: Raju Murugan
Music: Sean Roldan
Banner: Olympia Movies
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer