మలయాళంలో రూపొందిన వెబ్ సిరీస్ 'కాసరగోడ్ ఎంబసీ'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సిరీస్ కీ, అతీష్ నాయర్ దర్శకత్వం వహించాడు. కబీర్ దుహాన్ సింగ్ .. అబూ సలీమ్ .. గోవింద్ పాయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 20వ తేదీ నుంచి 7 ఎపిసోడ్స్ గా 'జీ 5'లో మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి, తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 

మంగుళూరులో ఆసిఫ్ - చెమ్ము అనే ఇద్దరు టీనేజ్ కుర్రాళ్లు ఉంటారు. ఆసిఫ్ కి తండ్రి లేకపోవడం వలన, అతని ఆలనా పాలన మేనమామ రజాక్ చూసుకుంటాడు. అనాథ అయిన చెమ్ము, ఆసిఫ్ తో కలిసి పెరుగుతాడు. ఆసిఫ్ తో పాటు అతని మేనమామ షాపులో చెమ్ము పనిచేస్తూ ఉంటాడు. రజాక్ ఈ ఇద్దరితో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయిస్తూ, తక్కువ మొత్తం ఇస్తూ ఉంటాడు. తాము జైలుకు వెళ్లినా అతను పట్టించుకోకపోవడం వాళ్లను ఆలోచనలో పడేస్తుంది. ఆ సమయంలో వాళ్లను బెయిల్ పై రాయ్ థామస్ బయటికి తీసుకుని వస్తాడు. 

రాయ్ థామస్ ఎవరనేది అప్పుడే ఆసిఫ్ కీ .. చెమ్ముకి తెలుస్తుంది. అతను వాళ్లచే నకిలీ పాస్ పోర్టులు .. స్టాంప్ పేపర్స్ .. తయారుచేయిస్తూ, ఆనందకరమైన జీవితాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు. ఈ కుర్రాళ్ల పనితీరు గురించి కాసరగోడ్ లోని దామోదరరావు ( కబీర్ దుహాన్ సింగ్)కి తెలుస్తుంది. అతను వాళ్లని రప్పించి ఆశ్రయమిస్తాడు. దేశం విడిచి పారిపోవానుకుంటున్న రాజకీయనాయకులకు .. తీవ్రవాదులకు నకిలీ  పాస్ పోర్టులు తయారు చేయించడం అతని అక్రమ వ్యాపారాలలో ఒకటి. 

దామోదరరావును అందరూ 'దాము' అని పిలుస్తుంటారు. అతని ప్రధానమైన అనుచరులుగా 'పింటో' - 'రాజా' ఉంటారు. విమాన ప్రమాదం వలన బయటపడిన ఉగ్రవాదులను వెతుకుతూ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ వివేక్ (దీపక్ పరంబోల్) కాసరగోడ్ చేరుకుంటాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఆసిఫ్ - చెమ్ము జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి? అనేక అక్రమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న 'దాము' పట్టుబడతాడా? అనేది మిగతా కథ.

'కాసరగోడ్' ను ప్రధానమైన కేద్రంగా చేసుకుని, నకిలీ పాస్ పోర్టులు ఎలా తయారవుతున్నాయనే అంశం చుట్టూ అల్లుకుంటూ వెళ్లిన కథ ఇది. ఇక్కడి నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ .. అక్రమ ఆయుధాల రవాణా జరుగుతున్నాయనేది డైలాగ్స్ పరంగానే చెప్పించారు. నకిలీ పాస్ పోర్టులు తయారు చేయడం అనే అంశాన్నే ప్రధానంగా తీసుకున్నారు. కథ అంతా కూడా ఈ విషయం చుట్టూనే తిరుగుతుంది. 

నకిలీ పాస్ పోర్టులకు సంబంధించిన వ్యవహారం ఎలా జరుగుతుంది? ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరితో ఎలాంటి లింకులు ఉంటాయి? ఈ మాఫియాలో ఆధిపత్య పోరు ఎలా ఉంటుంది? మాఫియా ముఠాలోకి అడుగుపెట్టిన వాళ్లలో ఎవరి జీవితాలు ఎక్కువగా బలి అవుతుంటాయి? ఇలాంటి ఒక మాఫియా గ్యాంగ్ ను కట్టడి చేయడానికి రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్లకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనే అంశాలను ఆవిష్కరిస్తూ వెళ్లారు.                  

 చాలామంది కుర్రాళ్లకు టీనేజ్ లోకి అడుగుపెట్టేసరికి కుటుంబ బాధ్యతలు మీదపడుతుంటాయి. వాళ్లకి డబ్బు అవసరమవుతుంది. కుటుంబానికి అండగా నిలబడుతూనే వాళ్లు చిన్నచిన్న ఆనందాలను వెతుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అలా తమకి తెలియకుండానే వాళ్లు మాఫియా ఉచ్చులో ఎలా చిక్కుంటారనేది ఈ కథలో ఎమోషన్స్ వైపు నుంచి నడుస్తుంది. 

ఒక వైపున రాజకీయ నాయకులు .. పోలీసులు .. లోకల్ రౌడీలు .. మాఫియా ముఠా నాయకులు .. ఇలా అన్ని వైపుల నుంచి దర్శకుడు ఈ కథను టచ్ చేస్తూ వెళ్లాడు. అయితే ఏ ట్రాక్ ను కూడా ఇంట్రెస్టింగ్ గా చెప్పలేకపోయారని అనిపిస్తుంది. టీనేజ్ కుర్రాళ్ల జీవితాలు .. వాళ్ల కలలు .. కష్టాలు .. కన్నీళ్లు ఇవేవీ మనసుకు హత్తుకునేలా చూపించలేకపోయారు. 

సాధారణంగా పోలీస్ ల ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన కంటెంట్ ను మలయాళ దర్శకులు చాలా ఆసక్తికరంగా ఆవిష్కరిస్తారు. కానీ ఈ సిరీస్ విషయంలో ఆడియన్స్ కి ఏమీ అనిపించదు. ఒక వైపు నుంచి పోలీస్ లు .. మరో వైపు నుంచి విలన్ హడావిడి చేస్తుంటారే తప్ప, అక్కడ ఏమీ ఉండదు. ఏదో జరగబోతుందనేట్టుగా బిల్డప్ లు ఉంటాయి .. కానీ ఎక్కడికక్కడ సన్నివేశాలు తేలిపోతూ ఉంటాయి. 

విలన్ గా కబీర్ దుహాన్ సింగ్ ను ఒక రేంజ్ లో చూపించారు. కానీ ఆయన పాత్రను పవర్ఫుల్ గా డిజైన్ చేయడకపోవడం వలన, పేలవంగా అనిపిస్తుంది. ఈ మాత్రం దానికి కబీర్ దుహాన్ సింగ్ అవసరమా? అని కూడా అనిపిస్తుంది. ప్రధానమైన కథాంశాన్ని బలంగా చెప్పలేకపోవడం .. చుట్టూ ఉన్న పాత్రలను ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోవడం మైనస్ గా అనిపిస్తుంది. 

రాజేశ్ రామన్ ఫొటోగ్రఫీ .. రతీష్ వేగ నేపథ్య సంగీతం .. జిలిన్ జోసెఫ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. టీనేజ్ కుర్రాళ్లతో పాటు సీనియర్ ఆర్టిస్టులు తమ పాత్రల పరిధిలో నటించారు. కథాకథనాల పరంగా ఈ సిరీస్ చాలా వీక్ గా కనిపిస్తుంది. పాత్రను డిజైన్ చేసిన విధానం .. సన్నివేశాలను ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోయింది. ఓ మాదిరి కంటెంట్ గా చెప్పుకోవచ్చు అంతే.