'కోర్ట్‌' చిత్రంతో అలరించిన జంట హర్ష రోషన్‌, శ్రీదేవి ముఖ్యతారలుగా నటించిన తాజా చిత్రం 'బ్యాండ్‌ మేళం'. పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన కోన వెంకట్‌ తన నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించాడు. 'కోర్ట్‌' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ జంటకు 'బ్యాండ్‌ మేళం' మూవీ సక్సెస్‌ను అందించందా? సినిమాలో ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? లేదా అనేది చిత్ర సమీక్షలో తెలుసుకుందాం.. 

గిరి (హర్ష రోషన్‌) తనకు చదువు  సరిపడదని చదువును మధ్యలోనే మానేసి సంగీత దర్శకుడు అవ్వాలనే కోరికతో ఫ్రెండ్స్‌తో కలిసి ఓ బ్యాండ్‌ బ్యాచ్‌ను రన్‌ చేస్తుంటాడు. గిరి మరదలు రాజీ (శ్రీదేవి) చదువులో టాపర్‌గా ఉంటుంది. ఈ ఇద్దరికి పెద్దయ్యాక పెళ్లి చేయాలని ఇరువురి తల్లిదండ్రులు చిన్నప్పుడే నిర్ణయించుకుంటారు. కానీ పరిస్థితులు మారిపోవడం. దీనికి తోడు గిరి చదువుకోకుండా, ఎటువంటి లక్ష్యం లేకుండా ఉండటంతో రాజీ కూడా గిరిని దూరం పెడుతుంది. 

కానీ గిరి మాత్రం రాజీ తనకు కాబోయే భార్య అని అందరికి చెప్పుకొంటుంటాడు. కానీ రాజీ తండ్రి, సాయన్న (సాయికుమార్‌)  ఓ పెళ్లి సంబంధం చూసి రాజీకి పెళ్లి చేయాలని అనుకుంటాడు. ఈ సమయంలో రాజీ ఏం చేసింది? రాజీ, గిరిల పెళ్లి జరిగిందా? గిరి తన మరదలు మనసు గెలిచాడా? లేదా? సంగీత దర్శకుడిగా ఎదగాలనే అతని కల ఫలించిందా? లేదా తదితర విషయాల్ని వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. 

బావ మరదళ్ల ప్రేమకథతో  ఇప్పటి వరకు తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. ఆ నేపథ్య కథతో వచ్చిన ఈ సినిమా చూస్తుంటే ప్రతి సన్నివేశంలో ఆ పాత సినిమాలే గుర్గొస్తాయి. ఏ మాత్రం కొత్తదనం లేని రోటిన్‌ కథతో, బలహీనమైన సన్నివేశాలతో, అలరించని పాత్రలతో రూపొందించిన సినిమా ఇది. కథ, కథనాలు ఎంతో రోటిన్‌గా బోరింగ్‌గా అనిపిస్తాయి. సినిమా ప్రారంభం నుంచే అందరిలో ఈ పీల్‌ కలుగుతుంది. ఓ కొత్త తరహా కథతో, ఓ కొత్త సన్నివేశంతో ప్రేక్షకులను అలరించాలనే తపన మచ్చుకు కూడా సినిమాలో కనిపించదు. 

హీరో, హీరోయిన్‌ మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు ప్రతి సీన్‌ భారంగా నడుస్తుండటంతో సినిమా ఆద్యంతం ఎక్కడా కూడా ఆసక్తిని కలిగించదు. తొలిభాగం సహనానికి పరీక్షగా నిలిస్తే.. రెండో భాగం చూడాలని ఓపికగా థియేటర్‌లోనే ఉన్నవాళ్లకు  ఇంటర్వెల్‌ తరువాత వచ్చే సన్నివేశాలు కూడా  అంతకు మించిన పరీక్షగా మారిపోతాయి.  ఈ చిత్రంలో పాత్రలు కూడా సరైన రీతిలో దర్శకుడు తీర్చిదిద్దలేదు. హీరో, హీరోయిన్లు, ఇతర పాత్రలు మాట్లాడే తెలంగాణ యాస సహజంగా అనిపించదు. 'కోర్ట్‌' ద్వారా రోషన్‌, శ్రీదేవిల జంటకు వచ్చిన క్రేజ్‌తో ఇమ్మీడియట్‌ మరో  సినిమా తీసేయాలనే హడావుడే తప్ప, ఓ మంచి  సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశం మేకర్స్‌లో ఉన్నట్లుగా కనిపించలేదు. 

'కోర్ట్‌' సినిమాలో టీనేజ్‌ జంటగా అలరించిన ఈ జంట పాత్రలు ఈ సినిమాలో సరైన రీతిలో తీర్చిదిద్దకపోవడంతో రెండూ పాత్రలు ఆకట్టుకునేల లేవు. గిరిగా హర్ష్‌ రోషన్‌ నటన పరిధి మించిన విధంగా కనిపిస్తుంది. చాలా చోట్ల ఆయన డైలాగ్‌ డెలివరీ, నటన, హావాభావాలు   శ్రుతి మించినట్లుగా అనిపిస్తుంటాయి.శ్రీదేవి పాత్ర కూడా అంతగా ఆకట్టుకోదు. కథ, కథనంలో బలం లేకపోవడంతో ఏ పాత్ర కూడా  అలరించే విధంగా లేదు. 

విజయ్‌ బుల్గానిస్‌ సంగీతం ఆయన మార్క్‌లో లేదు, రచయితగా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథను అందించిన కోన వెంకట్‌ ఇలాంటి నాసిరకం కథతో, నీరసమైన సన్నివేశాలతో ఇలాంటి సినమా తీయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దర్శకుడు సతీష్‌ జవ్వాజి ఏ విషయంలో కూడా తన ప్రతిభను చూపలేకపోయాడు. సినిమాలో కొత్తదనం కోసం రచన బృందం కనీసం ప్రయత్నించినట్లుగా అనిపించదు.

బలహీనమైన కథ, కథనాలతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన 'బ్యాండ్‌ మేళం' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.