ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సిరీస్ లు హిందీ నుంచి ఎక్కువగానే వస్తుంటాయి. అలాంటి కథలకు ఓటీటీ ఆడియన్స్ వైపు నుంచి మంచి ఆదరణ లభిస్తూనే ఉంది. అయితే ఈ సారి 'మారిటల్ రేప్' అనే ఒక కాన్సెప్ట్ తో వచ్చిన సిరీస్ గా 'చిరైయా' కనిపిస్తుంది. బెంగాలి సిరీస్ 'సంపూర్ణ'కి రీమేక్ గా ఈ సిరీస్ ను నిర్మించారు. శశాంత్ షా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ తో రూపొందింది. ఈ నెల 20వ తేదీ నుంచి, 'జియో హాట్ స్టార్' లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది.12 భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

నగరంలో ఓ పేరు మోసిన వ్యక్తిగా సుకుమార్ భ్రమర్ ( సంజయ్ మిశ్రా) ఉంటారు. సహజంగా ఆయన మంచి కవి. స్త్రీ స్వేచ్ఛ పై ఆయన రాసిన కవితలు ప్రశంసలు అందుకుంటాయి. ఆయనకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు భార్యనే కమలేశ్ ( దివ్య దత్తా) వారి సంతానమే 'పింకీ'. ఆ ఇంట్లో పెత్తనమంతా కమలేశ్ దే. భ్రమర్ తో పాటు ఆయన భార్య .. ఆయన తల్లి కూడా కమలేశ్ అభిప్రాయాలకి విలువనిస్తూ ఉంటారు. భ్రమర్ చిన్నకొడుకు అరుణ్ (సిద్ధార్థ్ షా)కి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు. 

కమలేశ్ కి మగపిల్లలు లేకపోవడం వలన అరుణ్ ను తన కొడుకుగా భావించి పెంచుతుంది. వదిన అంటే అతనికి చాలా గౌరవం. అనిల్ - గాయత్రి దంపతుల కూతురైన పూజ (ప్రసన్న)తో అరుణ్ కి పెళ్లి జరుగుతుంది. ఫస్టు నైట్ కి ఏర్పాట్లు జరుగుతాయి. తనకి ఒంట్లో బాగోలేదనీ .. ఫస్టు నైట్ కి తాను సిద్ధంగా లేనని అరుణ్ తో పూజ చెబుతుంది. అయినా అతను పట్టించుకోడు. భార్య ఇష్టం లేకుండా జరిపే శృంగారం, రేప్ లాంటిదేనని పూజ అంటుంది. ఆ మాటను కూడా అతను లైట్ తీసుకుంటాడు. 

ఇక శృంగారం పేరుతో అతను పూజను టార్చర్ చేయడం మొదలవుతుంది. అయితే ఈ విషయాన్ని గురించి ఆమె కమలేశ్ తో చెప్పినా .. తల్లితో చెప్పినా ప్రయోజనం లేకుండా పోతుంది. భర్తను చూసినా .. రాత్రి అవుతుందన్నా పూజ భయపడిపోయే స్థితికి చేరుకుంటుంది. ఆ సమయంలోనే ఆ కుటుంబ సభ్యులు, అరుణ్ - పూజలను హనీమూన్ కి పంపిస్తారు. ఆ కొత్త జంట మధ్య అక్కడ ఏం జరుగుతుంది? ఆ సంఘటన ఆ కుటుంబ సభ్యుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అనేదే కథ. 

'చిరైయా' అంటే 'పక్షి' అనే అర్థం ఉంది. బంగారు పంజరమే కదా అని అందులో ఉండటానికి పక్షి ఇష్టపడదు. ఆనందంగా .. హాయిగా ఎగరాలని అనుకుంటుంది. అలాగే కట్టుబాట్ల పేరుతో బందీలుగా .. బానిసలుగా మార్చుతున్న కుటుంబం నుంచి, స్వేచ్ఛ కోసం - న్యాయం కోసం ఒక యువతి చేసే పోరాటంగా ఈ సిరీస్ కనిపిస్తుంది. 

పరువు - ప్రతిష్ఠలను ప్రాణంగా భావించే ఒక కుటుంబం అది.  స్త్రీలు నాలుగు గోడల మధ్యనే ఉంటూ, ఇతర కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తూ ఉండటమే చేయవలసిందనే ఒక భావజాలంతో ఆ కుటుంబం ఉంటుంది. అలాంటి ఆ కుటుంబానికి పెద్దగా చదువుకోని యువతి పెద్ద కోడలుగా వస్తుంది. బాగా చదువుకున్న ఈ కాలం అమ్మాయి చిన్నకోడలిగా వస్తుంది. ఈ ఇద్దరి ఆలోచనా విధానంలోని అంతరమే ఈ కథలోని ప్రధానమైన అంశం.

వివాహమైన తరువాత భర్తతో శృంగారానికి భార్య అడ్డుచెప్పకూడదనే వాతావరణంలో పెరిగిన పెద్దకోడలు. తమకి ఇష్టం లేదనే విషయాన్ని భర్తతో చెప్పచ్చు. అయినా అతను బలవంతం చేస్తే అది రేప్ క్రిందకి వస్తుందని తెలిసిన చిన్నకోడలికి మధ్య ఈ కథ ఎక్కువగా నడుస్తుంది. ఈ రెండు పాత్రలే ఈ కథలో ప్రధానమైనవిగా .. బలమైనవిగా కనిపిస్తాయి.  ప్రతి విషయంలోను అత్తగారి కుటుంబాన్ని సపోర్ట్ చేస్తూ వెళ్లిన కమలేశ్, తన తోటి కోడలు ఫేస్ చేస్తున్న సమస్యను గురించి తెలుసుకున్న తరువాత ఆమెకి అండగా నిలబడుతుందా .. లేదా? అనేది ఆసక్తిని రేకెత్తించే విషయం.

ఉమ్మడి కుటుంబంలోని సభ్యులే ఈ కథలోని ప్రధానమైన పాత్రలు. ప్రతి పాత్రను తీర్చిదిద్దిన తీరు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. కుటుంబంలోని ఒక సమస్యను సమాజం వైపు నుంచి చూపిస్తూ పరిష్కార మార్గాన్ని సూచించిన విధానం ఆలోచన రేకెత్తిస్తుంది. పెద్ద కోడలిగా దివ్య దత్తా .. చిన్న కోడలిగా ప్రసన్న .. మామగారిగా సంజయ్ మిశ్రా నటన ఈ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకు మరింత బలాన్ని చేకూర్చాయి.        

స్త్రీకి స్త్రీనే ప్రధానమైన శత్రువు అనే మాట కరెక్టు కాదు, ఒక స్త్రీ ఆవేదనను మరో స్త్రీ మాత్రమే అర్థం చేసుకోగలదనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన విధానం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అలాగే ఏ యజమాని అయినా, సమాజంలో ఏం జరుగుతుందో కాదు .. తన ఇంట్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. తప్పు చేసింది తనవాళ్లే కదా అని కప్పిపుచ్చడం కాదు, ఆ విషయాన్ని ధైర్యంగా ఒప్పుకోగలగాలి .. సరైన న్యాయం చేయగలగాలి అనే సందేశాన్ని ఇచ్చిన సిరీస్ ఇది.

కథాపరంగా చూసుకుంటే ఇది ఆలోచింపజేసేదే .. కథలో చూపించిన పరిష్కారం సరైనదే అనిపించేదే. అయితే దృశ్యపరంగా వచ్చేసరికి కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి. అందువలన ఈ సిరీస్ కుటుంబ సభ్యులతో కలిసి చూసేది కాదు.