కోలీవుడ్ సీనియర్ హీరోలలో జీవాకి మంచి క్రేజ్ ఉంది. ఈ మధ్య కాలంలో ఆయన విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను మాత్రమే అంగీకరిస్తూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'తలైవర్ తంబి తలై మైయిల్'. మలయాళ సినిమా 'ఫెలిమి'తో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న సతీశ్ ఈ సినిమాకి దర్శకుడు. సంక్రాంతి కానుకగా, జనవరి 15వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులోకి వచ్చింది. 

అది ఒక మారుమూల పల్లెటూరు. ఆ గ్రామానికి 'జీవా' (జీవా) సర్పంచ్ గా ఉంటాడు. ఒక మంచి సర్పంచ్ గా పేరు తెచ్చుకోవాలనేది ఆయన కోరిక. అందువలన ఆ గ్రామంలోని అన్ని వర్గాలవారితో ఆయన ఎంతో సాన్నిహిత్యంతో ఉంటూ ఉంటాడు. ఆ విలేజ్ లో ఏ ఇంట్లో శుభాకార్యం జరిగినా .. అశుభకార్యం జరిగినా దగ్గరే ఉంటూ అన్నిరకాల వ్యవహారాలను చూసుకుంటూ ఉంటాడు. 

ఒక రోజున ఇళవరుసు (ఇళవరుసు) తన కూతురు సౌమ్య (ప్రార్థన) వివాహానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటాడు. మగపెళ్లివారు ఊరు నుంచి తరలి వస్తుంటారు. తెల్లారితే 10:30 గంటలకు ముహూర్తం. దాంతో ఎవరి పనుల్లో వాళ్లు హడావిడిగా ఉంటారు. పెళ్లికొడుకు కన్నియన్ (సుభాశ్) కాస్త బరువు ఎక్కువ. తనలాంటి వాడిని సౌమ్య అంగీకరించడమే అదృష్టమని ఆతను మనసులోనే పొంగిపోతూ ఉంటాడు. బస్సు ఎప్పుడు సౌమ్య ఊరు చేరుకుంటుందా అని వెయిట్ చేస్తుంటాడు.

అదే సమయంలో ఇళవరుసు ఇంటిపక్కనే ఉన్న మణియన్ (తంబి రామయ్య) తండ్రి 'చెల్లప్ప' చనిపోతాడు. వయసైపోయిన కారణంగా అనారోగ్యంతో ఆయన చనిపోతాడు. శవాన్ని పక్కనే ఇంట్లో పెట్టుకుని పెళ్లి ఎలా చేస్తారు? అందువలన, శవాన్ని త్వరగా తీస్తే  బాగుంటుందని మణియన్ కి జీవా చెబుతాడు. గతంలో ఇళవరుసుతో ఉన్న గొడవల కారణంగా అందుకు మణియన్ ఒప్పుకోడు. మరునాడు ఉదయం 10:30 గంటలకు అంత్యక్రియలు చేస్తామని తేల్చి చెబుతాడు. 

ఒక వైపున సౌమ్య పెళ్లి .. మరో వాబున పక్కింట్లో చావు. రెండూ కార్యక్రమాలు జరిగేది ఒకే సమయానికి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని జీవా ఆలోచనలో పడతాడు. ఈ విషయంలో అతను హీరో కాకూడదని భావించిన రాజకీయ శత్రువులు ఒక పథకం వేస్తారు. అదేమిటి? ఫలితంగా జీవా ఎలాంటి చిక్కుల్లో పడతాడు? అనుకున్న ముహూర్తానికి సౌమ్య పెళ్లి జరుగుగుతుందా లేదా అనేది కథ. 

ఒక ఊరు .. ఒక పెళ్లి .. ఒక చావు .. స్థానికంగా ఉండే రాజకీయాల చుట్టూ తిరిగే కథ ఇది. ఒక ఇంట్లో పెళ్లి పెట్టుకున్నప్పుడు .. అనుకోకుండా ఆ పక్కింట్లో ఎవరో ఒకరు చనిపోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం ఉంటే, ఇలాంటి సందర్భాలలో ఏం జరుగుతుందనే కథను దర్శకుడు అల్లుకున్న తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. 

ఇక ఎదురింటివారికి సంబంధించినంత వరకూ, చావైనా ..పెళ్లైనా మానవరకూ మందు వచ్చిందా లేదా అనుకునే కొందరు ఒక వైపు. ఎవరు ఏమైపోయినా ఫరవాలేదు, మనం చేసే రాజకీయాలు మనం చేయవలసిందే అనుకునేవారు మరొక వైపు. కంటితో చూసిందే నిజం .. దానిని ప్రచారం చేయడంలోని సంతోషం .. పరాయివారి పరువు ప్రతిష్ఠలతో ఆటలాడటం .. ఇలా ఒక గ్రామానికి సంబంధించిన అనేకమంది స్వభావాలను ఆవిష్కరించిన తీరు సహజత్వానికి అద్దం పడుతుంది.              

సాధారణంగా విలేజ్ నేపథ్యంలో కథలలో గ్రామంలోని కొన్ని పాత్రలు కథలో భాగమవుతూ ఉంటాయి. అయితే ఈ కథలో విలేజ్ మొత్తం భాగమవుతుంది. ప్రతి పాత్రకి ప్రత్యేకత ఉంటుంది .. ప్రయోజనం ఉంటుంది. విలేజ్ లలో సహజంగా కనిపించే మూఢ నమ్మకళను సైతం టచ్ చేస్తూ దర్శకుడు ఈ సినిమాను  తీసుకొచ్చిన విధానం మెప్పిస్తుంది. 

ఎవరూ కూడా నటిస్తున్నట్టుగా అనిపించదు. మనం కూడా సినిమా చూస్తున్నట్టుగా కాకుండా, అరుగుపై కూర్చుని జరుగుతున్న తతంగాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తాయి. శుభకార్యమైనా .. అశుభకార్యమైనా ఒకరికి ఒకరు సాయపడాలి. మనిషి మనిషిగా బ్రతకడంలోనే అసలైన ఆనందం ఉంది అనే సందేశాన్ని చాట్ ఈ సినిమా, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.