బాలీవుడ్ లోకి హీరోలుగా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ అక్కడ కొత్త రికార్డులను క్రియేట్ చేయాలనే అనుకుంటారు. తమ సినిమా గురించి .. తమ పాత్ర గురించి అందరూ గొప్పగా చెప్పాలనే ఆశిస్తారు. అయితే అలాంటి అవకాశాలు చాలా తక్కువ మందికి అరుదుగా మాత్రమే దక్కుతూ ఉంటాయి. అలాంటి హీరోల జాబితాలోకి రణ్ వీర్ సింగ్ ను కూడా చేర్చిన సినిమానే 'ధురంధర్'. డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా, 1400 కోట్లను వసూలు చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి, 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
ఇండియాపై ఎప్పటికప్పుడు ఉగ్రదాడులు చేయించడంలో పాకిస్థాన్ ఉత్సాహాన్ని చూపిస్తూనే ఉంటుంది. గతంలో జరిగిన విమానం హైజాక్ .. పార్లమెంట్ పై దాడి .. ఇండియన్స్ ను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇండియా సహనాన్ని పాకిస్థాన్ అసమర్థతగా భావిస్తుంది. మరింత ప్రమాదకరమైన పరిస్థితులలోకి ఇండియాను నెట్టడానికిగాను, ఉగ్ర సంస్థలు అక్కడి రాజకీయ నాయకుల అండదండలను తీసుకుంటూ ఉంటాయి.
మాఫియా సంస్థలకు నాయకులుగా ఉన్న 'రెహ్మాన్' (అక్షయ్ ఖన్నా) అర్షద్ పప్పు (అశ్విన్ ధార్) .. ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) మధ్య గట్టిపోటీ నడుస్తూ ఉంటుంది. అయితే ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ పరంగా లబ్ది పొందాలని 'జమీల్'(రాకేశ్ బేడీ) .. వ్యాపార పరంగా ఎదగడానికి 'ఖనాని బ్రదర్స్' ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్లందరి కారణంగా, అక్రమ ఆయుధాలు విచ్చలవిడిగా ఉగ్రవాద శిబిరాలకు చేరుకుంటూ ఉంటాయి. నకిలీ కరెన్సీ విరివిగా అందుబాటులోకి వస్తుంటుంది. జరుగుతున్న పరిణామాల పట్ల ఏ నిర్ణయం తీసుకోవాలనే దిశగా, భారతీయ ఇంటెలిజెన్స్ విభాగంలో తర్జనభర్జనలు జరుగుతూ ఉంటాయి.
మితిమీరిన మంచితనం అమాయకత్వం క్రిందికి వస్తుందని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) భావిస్తాడు. పాకిస్థాన్ కి తగిన విధంగా బుద్ధి చెప్పడం కోసం 'ఆపరేషన్ ధురంధర్' పేరుతో ఒక సీక్రెట్ మిషన్ ను వెంటనే మొదలుపెట్టవలసిన అవసరాన్ని ఆయన వ్యక్తం చేస్తాడు. పాకిస్థాన్ నేరసామ్రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకుని, అక్కడే ఉగ్రవాదానికి 'ఉరి' వేసే ఒక సమర్ధుడిని ఎంపిక చేస్తాడు. పంజాబ్ లో జైలు జీవితం గడుపుతున్న ఒక యువకుడిని, హమ్జా (రణ్ వీర్ సింగ్) పేరుతో పాకిస్థాన్ కి పంపిస్తాడు. పాకిస్థాన్ లో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా అధిగమిస్తాడు? అనేది కథ.
పాకిస్థాన్ ఉగ్రవాదం .. ఇండియాపై వాళ్లు జరుపుతూ వచ్చిన దాడుల నేపథ్యంలో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఒక్కో సంఘటనని ప్రధానమైన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ తరహా కథల్లో దేశభక్తి కలిగిన పవర్ఫుల్ ఆర్మీ అధికారులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ల త్యాగాలు హైలైట్ అవుతూ ఉంటాయి. అయితే అందుకు భిన్నంగా, జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఒక ఖైదీ చేత అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ ను మొదలు పెట్టడం ఈ కథ వైపు నుంచి కాస్త కొత్తగా అనిపిస్తుంది.
ఆదిత్య ధర్ రచన - దర్శక ప్రతిభకు నిదర్శనంగా ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాకిస్థాన్ లో పరిస్థితులు ఎలా ఉంటాయి .. అక్కడి మాఫియా, ఉగ్రవాద సంస్థల కదలిక ఎలా ఉంటుంది? ఆధిపత్యం కోసం ఆ సంస్థల మధ్య సాగే పోరాటం ఎలా ఉంటుంది? అక్కడి రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు ఎలా మారిపోతూ ఉంటాయి? అనే విషయాలపై దర్శకుడు విస్తృతమైన అధ్యయనం చేసినట్టుగా కనిపిస్తుంది. అందువల్లనే అక్కడ జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది.
ప్రధానమైన పాత్రలే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయినా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా కథను పరిగెత్తించిన తీరు మెప్పిస్తుంది. ఇంత గందరగోళంలోను సున్నితమైన ప్రేమకథను ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులకు రిలీఫ్ ను ఇస్తుంది. అలాగే తన దేశంలో జరిగిన హింసకు తాను కారణమైనందుకు హమ్జా ఎమోషనల్ కావడం కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కథాకథనాలను భుజానికి ఎత్తుకున్న ఆదిత్య ధర్ ను కూడా ఒక హీరోగా ఒప్పుకోవలసిందే. మిగతా మూడు వైపుల నుంచి రణ్ వీర్ సింగ్ .. అక్షయ్ ఖన్నా .. ఎస్పీ అస్లామ్ గా సంజయ్ దత్ పిల్లర్స్ గా కనిపిస్తారు.
రెహ్మాన్ కొడుకు నయీమ్ పై దాడి .. రెహ్మాన్ ను ఎస్పీ అస్లామ్ అదుపులోకి తీసుకునే సీన్ .. ఎలీనాతో కలిసి బైక్ పై హమ్జా తప్పించుకునే సీన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే స్పీడ్ గా లేకపోయినా, యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేసిన తీరుతోనే దర్శకుడు సగం మార్కులు కొట్టేశాడు. హీరో .. విలన్ .. సంజయ్ దత్ పాత్రలను డిజైన్ చేసిన విధానం .. కథకి తగిన లొకేషన్స్ ను ఎంపిక చేసుకోవడం దగ్గరే మిగతా మార్కులు దక్కించుకున్నాడు.
భారీతనం నుంచి ఏ మాత్రం బయటికి రాని ఈ కంటెంట్ కి, వికాష్ ఫొటోగ్రఫీ ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. దేశాలు .. స్థావరాలు .. ఛేజింగులు వంటి సన్నివేశాలలో ఆయన తన పనితనం చూపించారు. లొకేషన్స్ ను గొప్పగా కవర్ చేయడం కనిపిస్తుంది. శాశ్వత్ సచ్ దేవ్ నేపథ్య సంగీతం ఈ కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. సినిమాకి మరింత భారీతనం తీసుకొచ్చింది. శివకుమార్ పణికర్ ఎడిటింగ్ ఓకే. నిడివి ఎక్కువగా అనిపిస్తుంది కానీ, వాళ్లు అలా డీటేల్డ్ గా చెప్పాలనే అనుకున్నారు.
విస్తృతమైన పరిధిలో కథ ఉంది. కానీ కథనంలో మనకి వేగం కనిపించదు. కథలో భారీతనం ఉంది. అయితే ఆ భారీతనంలో కొత్తదనం ఆశించిన స్థాయిలో లేదు. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాయి. అయితే తెరపై చూడలేక తల పక్కకి తిప్పుకునే స్థాయిలో హింస - రక్తపాతం చోటుచేసుకున్నాయి. పాత్రలు .. బంధాలకి సంబంధించిన ఎమోషన్స్ ఓకే. కానీ కథ మొత్తం వైపు నుంచి ఎమోషన్ అనేది అంత బలంగా కనెక్ట్ కాకపోవడం కనిపిస్తుంది.
పాకిస్థాన్ లోని సామాజిక పరిస్థితులు .. రాజకీయ పరిణామాలు .. మాఫియా, ఉగ్రవాదం తాలూకు సన్నివేశాలను సహజత్వానికి చాలా దగ్గరగా ఆవిష్కరించడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.
'ధురంధర్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Dhurandhar Review
Movie Details
Movie Name: Dhurandhar
Release Date: 2026-01-30
Cast: Ranveer Singh,Akshaye Khanna ,Sanjay Dutt ,Arjun Rampal ,Madhavan,Sara Arjun
Director: Aditya Dhar
Music: Shashwat Sachdev
Banner: Jio Studios B62 Studios
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer