మలయాళంలో దిలీప్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'భ భ బ'. ధనుంజయ్ శంకర్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. మోహన్ లాల్ అతిథి పాత్రను పోషించిన ఈ సినిమా, క్రితం ఏడాది డిసెంబర్ 18వ తేదీన థియేటర్లకు వచ్చింది. 36 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 50 కోట్ల వరకూ వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 16వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఈ రోజు నుంచే అందుబాటులోకి వచ్చింది.
కేరళలో చకచకా రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉంటాయి. ముఖ్యమంత్రిగా జోసెఫ్ (బైజు సంతోష్) విజయాన్ని సాధిస్తాడు. తొలిసారిగా అతని ప్రసంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఆయన ఆ వేదికపై మాట్లాడుతూ ఉంటే, కుటుంబ సభ్యులు టీవీల ముందుకు కూర్చుని మురిసిపోతూ ఉంటారు. కార్యకర్తలు సంబరాలు జరుపుతూ ఉంటారు. అదే సమయంలో సభలో ఒక గందరగోళ వాతావరణం నెలకొంటుంది. ఆ గందరగోళం నుంచి అంతా తేరుకునేలోగా ముఖ్యమంత్రి కిడ్నాప్ కి గురవుతాడు.
ముఖ్యమంత్రిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకోసం చేశారు? అనేది రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఒక వైపున పోలీసులు .. మరో వైపున పార్టీ కార్యకర్తలు .. ఇంకొక వైపున మీడియా నానా హడావిడి చేస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి కొడుకు నోబుల్ (వినీత్ శ్రీనివాసన్) ఎన్ ఐ ఏ ఏజెంటుగా పనిచేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని తేల్చడానికి అతనే నేరుగా రంగంలోకి దిగుతాడు. తనతో కలిసి పనిచేయడానికి ఒక పవర్ఫుల్ టీమ్ ను సెట్ చేసుకుంటాడు.
తన తండ్రి జోసెఫ్ ను కిడ్నాప్ చేసింది 'రాడార్' (దిలీప్) అనే విషయం నోబుల్ కి తెలుస్తుంది. జోసెఫ్ తో పగతోనే అతణ్ణి రాడార్ కిడ్నాప్ చేశాడనే విషయం నోబుల్ కి అర్థమవుతుంది. రాడార్ కి ఘిల్లీ బాల (మోహన్ లాల్) తో సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా తెలుస్తుంది. అప్పుడు నోబుల్ ఏం చేస్తాడు? రాడార్ కీ జోసెఫ్ తో ఉన్న పాత పగ ఏమిటి? ఘిల్లీ బాలతో రాడార్ కి గల సంబంధం ఎలాంటిది? జోసెఫ్ ను నోబుల్ రక్షించుకోగలిగాడా? అనేది మిగతా కథ.
'భ భ బ' అనే టైటిల్ వినగానే, కథ సంగతి తరువాత, ముందు 'భ భ బ' అంటే ఏమిటో తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెరిగిపోతుంది. 'భ భ బ' అంటే మలయాళంలో 'భయం .. భక్తి .. బహుమానం' అనే అర్థం ఉంది. ఇక ఎవరి పట్ల ఎవరికి భయం ఉంది .. భక్తి ఉంది .. ఎవరికి ఎవరిచ్చే బహుమానం ఏమిటి? అనేది సస్పెన్స్. బాగా ఓపిక పట్టి ఆడియన్స్ తెలుసుకోవలసిన విషయం ఇది.
ముఖ్యమంత్రి కిడ్నాప్ చుట్టూ తిరిగే కథ ఇది. కిడ్నాప్ ఎవరు చేశారనేది ఆరంభంలోనే ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఇక ఎందుకు చేశారు? ముఖ్యమంత్రి ప్రాణాలతో బయటపడ్డాడా లేదా? అనే విషయం తెలుసుకోవడం కోసమే ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. అయితే అంత ఆసక్తికరమైన ఆవిష్కరణ ఇక్కడ జరగలేదు. 1990 కాలానికి చెందిన కథను మరోసారి గుర్తుచేసిన సినిమా ఇది.
ఒకప్పుడు ఒక మంచి కథను రెడీ చేసుకుని, అందుకే తగిన ఆర్టిస్టులను ఎంచుకునేవారు. ఇక ఇప్పుడు కాంబినేషన్ ను సెట్ చేసుకుని, కథలను అల్లేస్తున్నారు. మంచి కాంబినేషన్ కుదరలేగానీ, కథ అవసరమే లేదు అనుకునేవారు కూడా ఉన్నారు. హీరో .. ఇతర స్టార్స్ ఇమేజ్ కి తగినట్టుగా .. వాళ్ల నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే కొన్ని సీన్లు అనుకుంటే చాలు, కావాల్సినన్ని విజిల్స్ పడతాయి అనుకోవడం కూడా మొదలైపోయింది. అలాంటి కేటగిరిలోని కంటెంట్ ఇది.
యాక్షన్ కామెడీ జోనర్ అంటే యాక్షన్ తో పాటు కామెడీ కూడా ఉంటుందని అనుకోవడం సహజం. కానీ యాక్షన్ లోనే కామెడీ ఉంటుందని నిరూపించిన కథ ఇది. తెరపై కామెడీ చేస్తుంటారు .. యాక్షన్ చేస్తుంటారు .. ఛేజింగ్స్ జరుగుతుంటాయి. ఒక రేంజ్ లో గందరగోళం నడుస్తూ ఉంటుంది. కనెక్ట్ కాని సన్నివేశాలు కంగారు పెడుతుంటే, ఇలాంటి ఒక కథను దిలీప్ - మోహన్ లాల్ ఎలా ఒప్పుకున్నారనేది మనకి ఒక పట్టాన అర్థం కాదు.
దిలీప్ .. మోహన్ లాల్ గొప్పగా చేశారని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కాకపోతే సరైన కంటెంట్ తో రాలేదని మాత్రం అనిపిస్తుంది. దర్శకుడికి ఇది తొలి సినిమా. అందువలన అనుభవలేమి మనకి తెలిసిపోతూనే ఉంటుంది. కొత్త కొత్త పాత్రలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఎవరి పాత్రలోను విషయం ఉండదు. ప్రతి పాత్రకి ఎలివేషన్స్ .. ఇది కూడా కామెడీలో భాగమేనా? అనే ప్రశ్న మనలను వెంటాడుతూనే ఉంటుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఎడిటింగ్ వైపు నుంచి చూసుకుంటే ట్రిమ్ చేయవల్సిన సీన్స్ కొన్ని కనిపిస్తాయి.
సినిమాకి భారీతనాన్ని తీసుకొచ్చే స్టార్స్ అవసరమే. ఆ స్టార్స్ కి తగిన బడ్జెట్ లో తీయడం కూడా అవసరమే. మాస్ ఆడియన్స్ ను అలరించే ఎలివేషన్స్ అవసరమే. అయితే వీటన్నిటితో కథ అనేది ఒక ముడిపడి ఉంటుంది. ఆ కథ బలంగా ఉండాలి .. అందులో కొత్తదనం ఉండాలి. సరైన కథ లేకుండా ఆడియన్స్ ను అలరించాలనుకోవడం, సాహసమో .. ప్రయోగమో అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో.
'భ భ బ' (జీ 5) మూవీ రివ్యూ!
Bha Bha Ba Review
-
Movie Details
Movie Name: Bha Bha Ba
Release Date: 2026-01-27
Cast: Dileep, Mohanlal, Vineeth Srinivsan, Dhyan Srinivasan, Baiju Santhosh, Sandy
Director: Dhananjay Shankar
Music: Gopi Sundar
Banner: Sree Gokulam Movies
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer